భూమిక ఆధ్వర్యంలో జూన్ 19న ”ఐపిసి సెక్షన్ 498ఎ పై సెమినార్ నిర్వహించాం. ఇటీవల సుప్రీమ్‌కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత, పోలీస్ స్టేషన్లో 498ఎ కేసుల్లో ఎప్.ఐ.ఆర్ చేయకుండా పోలీసులు భార్యా భర్తలకు కౌన్సిలింగ్ నిర్వహించడం, లాంటివి గమనించి అసలు సెక్షన్ 498ఎకి ఏం జరుగుతోంది అనే విషయమై చర్చించి మహిళా సంఘాలుగా ఈ సెక్షన్ మెరుగ్గా అమలు జరిగేందుకు ఏమి చెయ్యాలి, ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడానికి మనం ఎలాంటి సూచనలు చేయవచ్చు అని చర్చించాలనుకున్నాం.
ఈ సెమినార్‌లో దాదాపు 50 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో మహిళా సంఘాలవారు, ఆక్టివిస్ట్‌లు, రచయిత్రులు, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు. సెమినార్‌లో మొదటి సెషన్‌లో ‘సెక్షన్ 498ఎ ఆవిర్భావం – ప్రస్తుత పరిస్థితుల్లో అమలు తీరు’ గురించి చర్చ జరిగింది. ఈ సెషన్‌కు యాక్టివిస్తు దేవి అధ్యక్షత వహించగా పి.ఓ.డబ్ల్యు ఝాన్సీ, హెచ్.ఆర్.ఎల్.ఎన్ నుండి షకీల్ మాట్లాడారు. జ్యుడిషియల్ అకాడెమీ సంచాలకులు శ్రీ రాజేందర్ ఈ సెషన్‌కి విచ్చేసి ప్రస్తుతం పోలీస్ స్టేషన్లు, కోర్టుల పనితీరును, మరియు కేసులు వాయిదా పడటానికి గల కారణాలను, అక్కడ వ్యక్తుల దృక్పధాల గురించి వివరించారు.
రెండవ సెషన్‌లో నిర్ణయ సంస్థ నుంచి గిరిజ అధ్యక్షతన సెక్షన్ 498ఎ అమలులో ఎదురవుతున్న సవాళ్ళు మరియు గ్యాప్స్ – అంశంపై సెంట్రల్ యూనివర్సిటీ ఇంగ్లీషు ప్రొఫెసర్ సునితా రాణి, పి.ఓ.డబ్ల్యు సంధ్య వారి అనుభవాలను వివరించారు.
మధ్యాహ్న సెషన్‌లో 498ఎ కి సంబంధించి తమ అనుభవాలను చాలా మంది ప్రతినిధులు పంచుకున్నారు. 498ఎ సెక్షన్‌ని మెరుగ్గా అమలు చేయడానికి ప్రతినిధులు కొన్ని సూచనలు చేశారు.
(మొత్తం రిపోర్టును త్వరలో భూమికలో ప్రచురించగలం)