”వెంకటాపురంలో ఇళ్ళు కట్టుకొన్నాము గృహప్రవేశానికి రండి” అని పిలుపు వచ్చింది. ”పిచ్చమ్మత్త వస్తుందా?” వెంటనే అడిగాను. ”మీ పిచ్చమ్మత్త రాకుండానా!” ఆ ఇంటి కోడలు నవ్వింది.
వెంకటాపురం రోడ్డు పట్టగానే నలభైఏళ్ళనాటి
ఆనవాళ్ళుకోసం వెదకటం మొదలుపెట్టాను. పిచ్చమత్త ఆధ్వర్యంలో మేము కార్తీకదీపాలు పెట్టిన చెరువు ఎండిపోయి ఉంది. ఖాళీగా నడిచిన ఊరి దార్లో చాలా ఇళ్ళు వచ్చాయి. పల్లె ముందుకు వచ్చినట్లుంది. అంబేడ్కర్ బొమ్మ కనబడింది. నాకు చిన్నప్పుడు చుట్టాలు అంటే పిచ్చమ్మత్త వాళ్ళే అనుకొనేదాన్ని. కొరిశపాడు క్వార్టర్స్‌లో మేము ఉన్నపుడు రామ్ములక్కాయలు (టమోటాలు), వంకాయలు, ఆకుకూరలు సంచితో పిచ్చమ్మత్త ఒక పక్కకు వంగిపోయి మా యింటికి నడుస్తూ వచ్చే దృశ్యం నాకింకా కళ్ళకు కట్టినట్లే ఉంది. ఐదుగురు పిల్లలతో, పదిహేను ఎకరాల పొలంతో ఆడపని, మొగపని నెత్తిన వేసుకొని ఉక్కిరిబిక్కిరి అవుతుండేది.
వెంకటాపురం పక్కనే జాగర్లమూడిపాలెం. పిచ్చమ్మత్త పుట్టినూరు. పొలాల్లో పడి నడిచి వెళ్ళేవాళ్ళం. అక్కడ పిచ్చమ్మత్త చెల్లెలు వెంకమ్మత్త ఉండేది. వాళ్ళు పొగాకు వేసేవాళ్ళు. ఇంటినానుకొని బార్నీలు ఉండేవి. వాళ్ళ కొష్టాల్లోనే పొయ్యి పెట్టి ఒకరోజు అరిసెలు వండారు. నేను అక్కడ నుండి వచ్చేసే ముందురోజు, కోమటికొట్లో నాకు పువ్వుల గౌను గుడ్డ కొని గౌను కుట్టించి వేసింది. కృష్ణుడి జడ వేసి దాంట్లో మందారపువ్వు పెట్టి ముస్తాబు చేసింది. ఆ వెంకమ్మత్త నేను ఇంటర్‌లో ఉండగా పురుగుల మందు తాగి చనిపోయింది. ”పోయే కాలం వచ్చి మందు తాగింది ముండ. బంగారంలాంటి కాపురం” అని తిట్టిపోసింది పిచ్చమ్మత్త చచ్చిపోయిన చెల్లెల్ని. ఆ కోపంలో ”అట్టా చావాలనుకొంటే నేనెన్నిసార్లు చావాలో” అనే ఆక్రోశం కనబడుతుంది ఇప్పుడు నాకు. వెంకమ్మత్త ఎందుకు చనిపోయిందో? ఆ రోజుల్లో జరిగిన రైతుల ఆత్మహత్యల్లో అది ఒకటా? ఆడరైతు కాబట్టి ఇంట్లో కారణాలు అనుకొన్నారేమో! మెనోపాజ్ దశలో ఆ వత్తిడులు భరించలేకపోయిందేమో. తరువాత మేము గుంటూరులో ఉండగా వెంకమ్మత్త కూతురు లీల కళ్ళు చూపించుకోవడానికి వచ్చింది. కళ్ళల్లో పిగ్మెంటేషన్. ‘పత్తి పొలాన మందు కొట్టాను’ అని చెప్పింది.
చాలా కష్టాలు పడి పిల్లల్ని పెద్ద చేసింది పిచ్చమ్మత్త. ఇక్కడ పొలాలు భారం అయ్యాక కొడుకులు ఇద్దరూ బళ్ళారి వెళ్ళి వ్యవసాయం చేసి తరువాత సీడ్స్ వ్యాపారం చేసి బాగా గడించారు. ఆడపిల్లలు కూడా మెల్లిగా అక్కడికే చేరారు. అందరూ ‘బాగున్నారని’ విన్నాను.
ఊర్లోకి రాగానే కొత్తగా కట్టిన ఇల్లు కనబడింది. హోమం వేసి ఏవో పూజలు చేస్తున్నారు. ఇంతకుముందు ఇన్ని పూజలు వుండేవా? సంధ్యవేళ దీపం పెట్టుకొని పిచ్చమ్మత్త నోరు కదుపుతూ చెంపలు వేసుకోవటం గుర్తు. తెల్లటి జుట్టు ముడివేసుకొని పిచ్చమ్మత్త కూర్చొని ఉంది. ”అత్తా నన్ను గుర్తు పట్టావా?” అడిగాను. నా బుగ్గలు పట్టి దగ్గరకు లాక్కొని ”అత్త ముసలిదైపోయింది బంగారు. నువ్వెవరో చెప్పు” అడిగింది. చెప్పాను. ‘నువ్వా తల్లీ’ అంటూ అందరి కుశలం అడిగింది.
”ఏ వయసులో నీకు పెళ్లైంది అత్త?” అడిగాను.
”అయిదేళ్ళకమ్మ. తలంబ్రాలు కూడా ఎత్తి పోయించారు. పదిహేనేళ్ళకు పెద్దమనిషినయ్యాను. ముప్ఫైఏళ్ళదాకా పిల్లలు పుట్టలేదు. మళ్ళీ పెళ్ళి చేసుకొంటానని మీ మావయ్య ఊగాడు. అప్పుడు ఒక సాములోరు చెయ్యి చూసి సంతానయోగ్యం ఉందని చెప్పారు. మొదట ఐదుగురు బతకలా. పాలు తాగకుండా ‘యే యే యే’ అని ఎనక్కి ఇరుచుకొని పడిపోయి చచ్చిపోయేవాళ్ళు. అప్పుడు మా ఊరికి కొత్తగా వచ్చిన నర్సమ్మ చెప్పింది. ‘కొడవలితో బొడ్డు కోయవాకండి. బ్లేడు వాడండి’ అని. తర్వాత ఈ ఐదుగురు నాకు మిగిలారు. కొటి సావి కాన్పుకి నాకు ముప్ఫై ఆరేళ్ళు.”
”అయితే అత్త నీకిప్పుడు 94” అన్నాను. ”ఆ దేవుడు నన్నింకా ఉంచాడమ్మ.” సంజాయిషీ.
ఇంతలో హోమం నుండి పిచ్చమ్మత్త కొడుకులు లేసి వచ్చారు. పలకరింపులు అయ్యాక వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ బూమ్ గురించి మాట్లాడారు. కొత్త రాజధాని ప్రాంతంలో స్థలం కొనాలనుకొంటు న్నామని పిచ్చమ్మత్త మనవడు చెప్పాడు. పాకేజీ ఇంకొద్దిగా ఇస్తే రైతులందరూ పొలాలివ్వటానికి రెడీగా ఉన్నారన్నాడు.
సూటిగా అతడి కళ్ళల్లోకి చూశాను. అతడూ చూశాడు.
”నా పొలం ఇవ్వటం నాకు ఇష్టం లేదు” టీవీలో చెప్పిన రైతుని ఆ ఛానల్ అధినేత చూసిన చూపు ఇతగాడిది.
భూమితో పేగుబంధం తెగిపోయి చానాళ్ళయింది ఇతనికి. బహుశ ఒక తరం అయ్యిందేమో.
”నేనిక్కడ పరాయి.” అప్పటికి నాకు అర్థం అయ్యింది. ఈ ఊరిని నన్ను కలిపి ఉంచిన పిచ్చమ్మత్త దగ్గరకు వెళ్ళి ”నువ్వు
వందేళ్ళు బతకాలత్త” అని చెప్పేసి వచ్చేశాను.