నిజం చెప్తున్నా – ఒక హిజ్రా ఆత్మకథ- రేవతి- ఉమా నూతక్కి

కులం పేరుతో మనల్ని ఎవరైనా కించపరిస్తే కళ్ళెర్ర చేస్తాం. ప్రాంతం పేరుతో అపహాస్యం చేస్తే తిరగబడతాం. మతం పేరుతో అవమానిస్తే అగ్గిలా మండుతాం. కానీ మనలోనే.. మనతోపాటే పుట్టిన కొన్ని జీవితాలు ఇంతకు మించిన అవమానాల్ని పొందుతూ సమాజపు అంచుల్లోకి నెట్టివేయబడుతున్నారు. వాళ్ళూ మనలాంటి మనుష్యులే.. కాకపోతే చిన్నపాటి అసహజత్వం. మనసుకీ శరీరానికీ ఫ్రీక్వెన్సీ కుదరకపోవడం.. సర్దుబాటు చేసుకోలేని మనసు.. అర్థం చేసుకోని సమాజం, అవమానాల్ని దిగమింగుకుంటూ తెచ్చిపెట్టుకున్న ధిక్కారం.. తమ చుట్టూ ఉన్న సమాజంపై ధిక్కారం, శరీరంపై అంతులేని మమకారం..

ఈ జీవితం ఏ ఒక్కరో ఇద్దరిదో కాదు. ఈ ప్రపంచంలో దాదాపు ఒక కోటిన్నర మంది దురదృష్టవంతుల పరిస్థితి ఇది. వాళ్ళని ”ఆమె” అనలేం.. ”అతడు” అనలేం అసలు ఏమీ అనుకోకుండా

ఉండలేం. అలాంటి ఒక మేల్‌ మనిషి… ఫిమేల్‌ మనసూ కలగలిపి…

తన జీవితంతో తనే యుద్ధం చేసి..

తన జీవితంతో తనే ఇన్‌స్పైర్‌ అయ్యి..

తనలాంటివాళ్ళకు ఒక ”గ్రేట్‌ హ్యూమన్‌”గా గుర్తింపు తెస్తున్న రేవతి అలియాస్‌ దొరైస్వామి జీవితం ఈ నెల మీకు పరిచయం చేయబోతున్న ”నిజం చెప్తున్నా – ఒక హిజ్రా ఆత్మకథ”.

ఈ సమాజం స్త్రీలనూ గౌరవిస్తుంది. పురుషులనూ గౌరవిస్తుంది. కానీ పుట్టుకతోనే ఈ రెండు లక్షణాలను కలబోసుకున్నవారిని మాత్రం చీదరించుకుంటుంది. అసాధారణ నిష్పత్తిలో ఎక్స్‌, వై క్రోమోజోములు కలవడం వలన ఏర్పడిన ఒక వైద్యపరమైన విపత్తుపట్ల సమాజం సరయిన రీతిలో స్పందించకపోతే బలైపోతున్న జీవితాలివి. హిజ్రాలకు తల్లి, తండ్రి, కుటుంబసభ్యుల నుంచే జీవితంలో మొదటిసారిగా చీత్కారపు రుచి తెలుస్తుంది. సామాజిక చీత్కారానికి గురయ్యే శరీరం తమ కుటుంబంలో భాగమై ఉంటే మొత్తం తమ కుటుంబమే సమాజ చీత్కారానికి, వేధింపులకు గురవుతుందని భయపడ్డ కుటుంబసభ్యులు వీరిని వదిలించుకోవాలనుకుంటారు. మరోవైపు వీధిలోకి వెళ్ళినా, పనికి వెళ్ళినా, స్కూలుకు వెళ్ళినా సాటిమనుషులనుంచి సాధింపులు. ఒకవైపు కుటుంబం వారిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఈ సమాజంలో స్వేచ్ఛగా, గౌరవంగా తాము జీవించలేమన్న అధైర్యం వారిని తమదైన ప్రపంచంలోకి దారి వెతుక్కునేలా చేస్తుంది.

”నిజం చెప్తున్నా – ఒక హిజ్రా ఆత్మకథ” పుస్తకం మగపిల్లవాడిగా పుట్టి అంతర్గతంగా స్త్రీ లక్షణాలున్న ఒక వ్యక్తి ఆత్మకథ. ఇది వ్యక్తి ఆత్మకథ అనటం కంటే ఆ సమూహం బయట ప్రపంచానికి సమర్పించుకొన్న సంవేదన అనవచ్చు. అవయవ మార్పిడి చేసుకుని హిజ్రాలుగా పిలవబడుతున్నవారు మానసికంగా పడిన సంఘర్షణల స్థాయిలను, సమాజంతో చేసిన యుద్ధాలను సాధారణీకరించి, సంగ్రహిస్తే దాని సారమే ”నిజం చెప్తున్నా – ఒక హిజ్రా ఆత్మకథ”.

తమిళనాడులోని సేలం జిల్లా, నమక్కల్‌ తాలూకా పుట్టిహళ్ళీలోని ఒక సాంప్రదాయ రైతు కుటుంబంలో ముగ్గురు అన్నలు, ఒక అక్క తర్వాత దొరైస్వామి పుట్టారు. పెరుగుతున్నకొద్దీ దొరైస్వామి నడక, నడతా – ఆహార్యాలు అమ్మాయినే పోలి ఉండేవి. అది గమనించిన తల్లిదండ్రులు దొరైస్వామిని తిట్టారు, కొట్టారు. వినకపోయేప్పటికి గదిలో పెట్టి బంధిస్తారు. ”తన మనసు ఎందుకు అమ్మాయిలా ఉండాలని కోరుకుంటోంది? శరీరం ఎందుకు అబ్బాయిలపట్ల ఆకర్షితమవుతోంది?” ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ మొదటా ఢిల్లీ, అక్కడనించి ముంబయి చేరుతాడు దొరైస్వామి.

ముంబైలో తనలాగే ఆలొచించే వర్గంలో ఒకరిగా జీవితాన్ని ప్రారంభిస్తాడు దొరైస్వామి. తననుతాను మార్చుకోవడానికి తన శరీరాన్నే పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదిస్తాడు. ఆ డబ్బుతో శస్త్రచికిత్స చేయించుకుని రేవతిగా మారిపోతాడు. ఆ శస్త్రచికిత్స చేసే పద్ధతి ఆమె మాటల్లో వింటే వళ్ళు గగుర్పొడుస్తుంది. రెండేళ్ళు ముంబైలోని గడిపిన తర్వాత కన్నవారిని చూడాలనే ఆశతో ఇంటికి వచ్చిన రేవతిని కన్నతల్లిదండ్రులతోపాటు తోడబుట్టినవారు కూడా చేరదీయరు. దీనితో రేవతి మళ్ళీ బెంగళూరు చేరుకుంటుంది. జీవనం కోసం పగలు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద భిక్షాటన చేస్తూ రాత్రి సమయాన్ని పడుపువృత్తిలో గడిపేది. ఎన్నోసార్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళింది. ఈ క్రమంలో జరిగిన ఒక సంఘటన రేవతి దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. ఒకరోజు రాత్రి బెంగళూరు కొబ్బన్‌ పార్కు పోలీసులు రేవతిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తారు. స్టేషన్‌లోనే తనను వివస్త్రను చేసి తోటి ఖైదీలతో పాటు పోలీసులూ పైశాచికానందం పొందుతారు. దీంతో ఆమె మనసు పూర్తిగా మారిపోతుంది.. ”జీవితం అంటే ఇంతేనా.. నేను హిజ్రాను అయినంత మాత్రాన ఈ శరీరం మరొకరి కోరికను తీర్చటానికేనా.. నావల్ల ఎటువంటి ప్రయోజనం జరుగదా” అంటూ పరిపరి విధాల ఆలోచించిన రేవతి అంతవరకూ చేస్తున్న వృత్తిని మానేసి సమాజం నుంచి దూరంగా ఉన్న అనాథలు, వేశ్యలు, ముఖ్యంగా హిజ్రాల సంక్షేమంకోసం పనిచేస్తున్న ”సంగమ” అనే సంస్థ కోసం పనిచేయడం మొదలుపెట్టింది.

ఇదే సూక్ష్మంగా రేవతి అలియాస్‌ దొరైస్వామి కథ. మన చుట్టూ ఉన్న సమాజం స్త్రీలకు, దళితులకు, మైనారిటీలకు, బలహీన వర్గాలకు, మొత్తంగా మెజారిటీ జనసందోహానికి బాగాలేదని మనతెలుసు. కానీ సమాజం మొత్తం మీద కులమతవర్గాలకు అతీతంగా స్త్రీపురుషులందరిచేత ఏహ్యానికి, చీదరింపుకు, భయానికి, వెలివేతకు గురవుతున్న హిజ్రాల పట్ల ఈ సమాజం ఎంత క్రూరంగా వ్యవహరి స్తుందో ”నిజం చెప్తున్నా…” చదివితే మనకు అర్థం అవుతుంది.

వర్గ సమాజంలో ఆర్థిక స్థితిగతులు మనిషి బతుకును శాసిస్తాయి. కాని హిజ్రాలు కుటుంబంతో గడపలేని పరిస్థితుల వలన ఎంతో కొంత ఆర్థిక వనరులు ఉన్న కుటుంబంనించి వచ్చినా ఆ వనరులను అనుభవించలేరు. వారి భౌతికరూపం, ఆర్థిక వెనుకబాటు తనం వారిని స్వతంత్రంగా ఉండనివ్వవు. వారికోసం వారు ఏర్పరుచుకున్న సమూహాలలో మాత్రమే వారు బ్రతకగలుగుతారు. అయితే అంతటా విస్తరించిన అవలక్షణాలు వాళ్ళ సమాజాలని కూడా కుదిపేస్తూ ఉంటాయి. కేవలం బ్రతకడం కోసమే అలా సమూహాల్లోంచి ఇంటికీ… ఇంటినుంచి సమూహాల్లోకీ పారిపోతూంటారు వీళ్ళు.

ఇలాంటి దుఃఖసముద్రపు అలల ప్రయాణాన్ని రేవతి నిరాలంకారంగా, ఉన్నది ఉన్నట్లుగా ఈ పుస్తకంలో వర్ణించింది. ఆమె సంతోషాలను, ఘర్షణలను, దుఃఖాలను, బలహీనతలను నిజాయితీగా చెప్పింది. రేవతి ఈ పుస్తకంలో స్రవించిన జీవిత ప్రవాహానికీ, అక్కడక్కడ తోడయ్యే ఆమె వ్యాఖ్యానాలు, ఆపుకోలేక ఆమె చేసిన

ఉద్వేగ ప్రకటనలు మనల్ని కుదిపి దుఃఖంలో ముంచెత్తుతాయి. ఖచ్చితంగా ఈ జీవితకథ ఈ మాత్రం సౌందర్యవంతంగా ఉండదు, ఈ కథ సుఖాంతం అవ్వదని కూడా మనస్సు చెపుతూనే ఉంటుంది. అయినా ఈ రేవతి ప్రయాణంలో ఉండే భిన్నత్వం, ఆమెకు బతుకులో ప్రతీ మలుపూ చూపించే కొత్తకోణం.. చదువుతున్నంతసేపూ మనకి తీవ్రమయిన భావోద్వేగాన్ని కలిగిస్తుంది.

మగవాడిగా పుట్టి స్త్రీ మానసిక ప్రవృత్తి కలిగి ఉండటం చిన్నతనాన్ని కలిగించే గందరగోళాన్ని అర్థం కావాలంటే ఆమె హృదయాన్ని అక్షరాలతో చూడాల్సిందే. రేవతి తన జీవితాన్నే ప్రదర్శనగా చూపిస్తూ చట్టాలను, రాజ్యాంగ యంత్రాంగాలను చాలా ప్రశ్నలు వేసింది. ఆడపిల్లగా కుటుంబంలో కొంత స్థానం ఉంటుంది. మగపిల్లవాడు సహజంగానే కొన్ని హక్కులు పొందుతాడు. హిజ్రాలు ఇటు కుటుంబంలోనూ, అటు న్యాయస్థానాలలోనూ తిరస్కృతులు అవుతుంటారు. చివరకు రేషన్‌ కార్డు కోసం, డ్రైవింగ్‌ లైసెన్సు కోసం కూడా రేవతి ఎంతో పోరాటం చేయాల్సి వస్తుంది. ఒక దశలో అంత పోరాటం చేసే ఆమె విరక్తి చెంది ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది.

రేవతి గడిపిన కొన్నాళ్ళ వైవాహికబంధం… అందులో ఆమె అనుభవాలు కూడా మనలో కొన్ని ప్రశ్నలు లేపుతాయి. స్త్రీ తరహా మానసిక ప్రవృత్తితో వాళ్ళు పురుషులపట్ల ఆకర్షితమవ్వడం… అంతేకాకుండా స్త్రీత్వం అని ఈ సమాజం ఆపాదించిన ప్రతీదీ తాము అనుభవించాలని తాపత్రయపడడం.. అందులో హిజ్రాలు ఎదుర్కొంటున్న మానసిక వత్తిడీ, సంఘర్షణా.. మనల్ని కుదిపేస్తాయి. ప్రేమ, పెళ్ళి విషయంలో రేవతి పొందిన వైఫల్యాన్ని, అందువల్ల కలిగిన దుఃఖాన్ని ఆమె తన మనసునుండి పుస్తకంలోకి, పుస్తకం నుండి మన మనసులోకి బదిలీ చేసిందని చెప్పవచ్చు. హిజ్రాలకు ప్రేమోద్వేగాలు ఉంటాయనే విషయం అర్థం అయ్యాక మనం వారిని చూసే దృష్టి తప్పకుండా మారుతుంది.

మనిషి మనుగడ కోసం ప్రకృతిపై పోరాటం చేయాలి. అది సహజం. అవసరం. కానీ ప్రకృతి ప్రసాదించిన శరీరాకృతిపై పోరాటం వాళ్ళకి సర్వస్వమయిపోవటమే ఒక పెద్ద విషాదం. ”నిజం చెప్తున్నా…” పుస్తకం రాసిన రేవతి ఒక మంచి రచయిత్రిగా పేరు తెచ్చుకుంది. ఈ సమాజం, ప్రభుత్వం కొన్ని రోజులు ఆమె గురించి, ఆమె సమూహాల గురించి కొంత తీరికా, ఓపికా చేసుకుని చర్చించుకున్నాయి. అయితే ఇప్పటికీ ఆమె మళ్ళీ జీవనం కోసం సెక్స్‌ వర్క్‌ చేయవలిసి రావడం ఒక కఠిన వాస్తవం. ప్రభుత్వం నిర్లక్ష్యానికీ, సమాజ నిర్లిప్తతకీ ఒక నిదర్శనం. ఈ గడ్డ మీద ప్రతీ మానవ పుట్టుకా హుందాయైన బ్రతుకుతెరువు, గౌరవనీయమయిన జీవనం అభయంగా పొందాలి. అలా పొందలేనప్పుడు వందల సమూహాల అస్థిత్వాలు వాటి ఉనికి కోసం ఆక్రోశిస్తాయి. ఆ సమూహాల్లో ఒక సమూహం రేవతి మన కళ్ళముందుంచిన ఈ హిజ్రా సమూహం. ఈ పుస్తకం చదివాకయినా ఈ సమూహాల పట్ల వాళ్ళు చేస్తున్న పోరాటాలపట్ల ఒక సానుకూల వైఖరి ఏర్పరుచుకోగలిగితే రేవతి కృషి ఫలించినట్లే.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.