దీపాన్ని తాకితే
భూతం బైటికొచ్చినట్లు
పుస్తకాన్ని తాకితే
ఇస్మత్‌చుగ్తాయ్ బయటికొచ్చింది –
నన్ను కుశల ప్రశ్నలడిగి
వెంటరమ్మన్నది –
అలవాటైన సూటికళ్లలో
మొహల్లాలు దిరిగి
మహిళల వాకబు జేసింది.
తన కథల్లోని పాత్రలు
ఇంకా మానని గాయాలై తిర్గుతుండడం
ఆమెను మరింత కలచివేసింది.
ఆ వెంటనే.. నా చేయిపట్టుకు
ముజఫర్‌నగర్‌కు దారిదీసింది.
వెక్కిరిస్తున్న శూన్యాలు వెంటరాగా
మేం ఊరంతా తిరిగి చూసినాం.
అక్కడ..
పగిలిన గాజుపెంకలమీద
గడ్డగట్టిన రక్తమెవరిదన్నది
చెరుకుకోత మిషన్లలోకి
పిల్లలవిసిరేస్తే
హాహాకారాలు ఆకాశాన్ని చీల్చలేదా.. అంది.
అర్థరాత్రి గడ్డగట్టే చలిలో
ముసలవ్వ ఎదురు చూస్తున్నదెవరికోసమన్నది..
వీధుల్లో, బడుల్లో
అరుగులమీదా, డాబాలమీదా
రాజ్యమేలుతున్న నిశ్శబ్ధమేమిటన్నది..
కళకళలాడుతున్న ఇళ్లు
కలవెలబోతున్నవెందుకన్నది..
శాంతి కళేబరం మీద
ముసురుతున్న ఈగలేమిటన్నది –
ముప్పిరిగొల్పుతున్న ప్రశ్నలకు
నేను మూగనైపోగా…
అలవాటయిన ప్రాణంకొద్దీ..
రాజ్యాంగమూ, ప్రజాస్వామ్యమూ, ప్రభుత్వమూ
కోర్టులూ, చట్టాలూ, శిక్షలూ అంటూ వల్లెవేశాను..
ఇస్మత్ చుగ్తాయ్ ఫక్కున నవ్వింది..
పిచ్చివాడా….
జొన్నచేల వెంబడి
తల్లుల పరుగెత్తించినపుడు
గర్భస్త శిశువును భయపెట్టినప్పుడు…
ఏ కోర్టులే చట్టం
వెన్నెముకను నిలబెట్టిందని పరిహసించింది…
అయినా..
హంతకుడే తీర్పు చెబుతున్నచోట..
మతమూ, రాజ్యమూ మిలాఖతై
కత్తులు దూస్తున్నచోట
హక్కులకు దిక్కెక్కడోయి..
ఎవని రాజ్యమిది, ఎవని స్వతంత్రమిది అంటూ
మబ్బుల్లో గల్సిపోయింది.
ప్రశ్నఒక్కటే
వటవృక్షమై ఎదగసాగింది…
కవిత చాలా బాగుంది.
ప్రస్తుత దేశ పరిస్థితులను కళ్ళకు కట్టించినట్ట్లుగా ఉంది.
ఇస్మత్ చుగ్తాయ్ ని ప్రస్తుత పరిస్తితులని కవితలొ అనుసంధానించిన తీరు చాలా బాగుంది.