”దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్”
కావలసినంత తీరుబడి ఉంది
కానీ
కాలక్షేపం, కాలయాపనయే
దిన దిన నినాదమైపోయింది
కాలం అంతా వెచ్చించి గాలిపోగుచేస్తున్నాం
చేతినిండా డబ్బు ఉండదు
ఆరోగ్యమూ అనుమానమే.
అయినా హాయిగా బ్రతికేస్తున్నాం
గంటల తరబడి ఊసులాట
పనుల్లో మరి ఊగిసలాట
ప్రారబ్ధం పేరుతో సద్దుకుపోతున్నాం
కొంతమంది మంచితో, కొంత సంచితో
మన పబ్బం గడిపేస్తున్నాం
‘అందరం సుఖంగా ఉన్నాం’
అనే ఉన్మాదంలో ఉంటున్నాం
ఇకనైనా కబుర్లతో కడుపు నింపక
ఒళ్ళువిరిచి శ్రమిద్దాం
కడగండ్లు మరచి ముందుకుపోదాం.
మనశక్తి యుక్తులు గంగపాలు చేయక
అన్నిటా జయించి ‘అజేయుల’నిపించుకుందాం
అందరితో ”ఔరా” అనిపించుకుందాం
ఉత్తుత్తి బహుమతులు ఒద్దు
పైపై ప్రశంసలసలే ఒద్దు
బహుముఖ ప్రజ్ఞతో
”దీటైన ప్రజ” అనిపించుకుందాం
దేశదేశాల ఆహ్వానం అందుకుని
అవనిలో అగ్రస్థానం సాధించుకుందాం.