”వ్యవసాయంలో 80% కఠినమైన, నడుములు విరిగే పనిని స్త్రీలే చేసినప్పటికీ వారి పనిని నైపుణ్యం లేని పనిగా తీసిపారేయడం సర్వ సామాన్యం. వేతనాల్లో కూడా ఎంతో వ్యత్యాసముంటుంది. పురుషులకంటే ఎక్కువ పనిచేసే స్త్రీలకి తక్కువ వేతనాలు చెల్లిస్తారు. నాట్లు వేయడం నుంచీ, కోతల వరకు, కుటుంబ ఆహారబాధ్యత, స్త్రీల పని; తర్వాత పంటను అమ్ముకోవడం, వాణిజ్యం-నిర్ణయాధికారం, అజమాయిషీ అంతా మగవారి చేతుల్లో ఉంది. స్త్రీల పనిపట్ల వివక్షేకాక, లైంగిక పని, విభజన స్పష్టంగా వ్యవసాయంలో కనిపిస్తుంది. వీటితోపాటు ఇంటిపని, వంటపని, పశువుల పని సమస్తం స్త్రీలే భరిస్తున్నారనే అంశానికి గుర్తింపు లేదు. వ్యవసాయం అంటే రెండెద్దులు, కాడి పట్టుకున్న రైతు చిత్రం తప్ప వంచిన నడుం ఎత్తకుండా పనిచేసి బంగారు రాశులను సృష్టించే రైతక్కలు స్ఫురణకు రారు. వ్యవసాయంలో నేటివరకు ఉన్న ఈ ప్రతిబింబాన్ని, స్త్రీల దృష్టికోణం నుంచి పరిశీలించి, విశ్లేషించాలనే అవగాహనతో, ముఖ్యంగా ఇప్పుడున్న కరువు/ఆకలి/పేదరికం/ఆహారభద్రత లోపించడం, రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో ఈ ప్రత్యేక సంచికను రూపొందించడం జరిగింది.”
పై పేరా 15 ఏళ్ళ క్రిందట భూమిక వ్యవసాయ సంక్షోభం నేపథ్యంగా వ్యవసాయంపై 2000 సం||లో ప్రచురించిన ప్రత్యేక సంచికలో వ్రాసిన సంపాదకీయంలోనిది. 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ అలాంటి నేపథ్యంలోనే మరోసారి అంతకంటే దిగజారిన పరిస్థితిని ప్రస్తావిస్తూ సంపాదకీయం రాయాల్సి రావడం చాలా బాధాకరం. ఏ ప్రపంచీకరణ నేపథ్యం గురించి ఆనాటి ప్రత్యేక సంచికలో ఒక భయాందోళనలతో ప్రస్థావించామో, వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురౌతాయని భయపడ్డామో అలాంటి స్థితి ప్రస్తుతం కళ్ళముందు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు రోజూ పదులసంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాన్నైనా గుండె దిటవుతో ఎదుర్కొని ఒక పంట పోతో మరో పంట వేయొచ్చని ఆశతో ఉండే రైతుని ప్రపంచీకరణ + కార్పొరేట్ క్రౌర్యం వారి నవనాడుల్ని క్రుంగదీశాయి. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన రైతులు ఆత్మహత్యల దారిపట్టడం వెనక ప్రభుత్వ విధానాల వైఫల్యం, వ్యవసాయం పట్ల అలసత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్నించి అర్థమవుతున్నదేంటంటే రైతు వ్యవసాయం చెయ్యలేక చనిపోవట్లేదు, వ్యవసాయం చేయడానికి పరిపరి విధాల ప్రయత్నం చేసి విఫలమై అప్పుల ఊబిలో కూరుకుపోయి చనిపోతున్నారు. ‘అన్నదాత’, ‘రైతన్న’, ‘దేశానికి వెన్నెముక’ అంటూ ఎంతో ఉద్వేగాన్ని ప్రదర్శిస్తూ ఉపన్యాసాలిచ్చే రాజకీయనాయకులు కాని, ప్రభుత్వాలు కాని అనేక ఆపదల్లో కొట్టుమిట్టాడుతున్న రైతాంగాన్ని ఆదుకోడం దగ్గరకొచ్చేసరికి దరిదాపుల్లో లేకుండా పోతున్నారు. పైపెచ్చు రైతుల ఆత్మహత్యలన్నీ వ్యవసాయ సంబంధమైనవి కావని భార్యాభర్తల గొడవల వల్ల ఆత్మహత్యలకి పాల్పడ్తున్నారన్న వ్యంగ్యపు వ్యాఖ్యానాలను చేయడం ప్రస్తుతం కన్పిస్తున్న దుర్మార్గపు సంస్కృతి.
ఏ సమస్యలనైతే ఎదుర్కోలేక రైతన్నలు ఆత్మహత్యకు పాల్పడ్డారో ఆ సమస్యలన్నీ ఇప్పుడు ఆ కుటుంబాలలోని స్త్రీల మెడలకు చుట్టుకుని వారి పని పెనంపై నుండి పొయ్యిలో పడిన చందాన తయారైంది. ఒకవైపు అప్పులు వెంటాడుతుంటే మరోవైపు కుటుంబ పోషణ, పిల్లల చదువులు వంటి వాటితో ప్రతిరోజూ సతమతమవుతున్నారు. అయినా ఎంతో నిబ్బరంగా వ్యవసాయాన్ని తలకెత్తుకోడానికి సిద్ధమవుతున్నారు. కాని ప్రభుత్వంతో మొదలుపెట్టి, బ్యాంకులు, వడ్డీ వ్యాపారస్థులు, కుటుంబసభ్యులతో సహా ఎవ్వరూ వారిని రైతులుగా గుర్తించకపోవడంతో వ్యవసాయానికి అవసరమైన వెసులుబాట్లు లేక వ్యవసాయాన్ని కొనసాగించలేక ఇక్కట్ల పాలవుతున్నారు. అదే కనుక, ప్రభుత్వం ఈ మహిళలకి వ్యవసాయంలో మెళకువలతోపాటు కొత్త సాంకేతిక సమాచారాన్ని, నూతన వ్యవసాయ పద్ధతులకి సంబంధించిన సామర్ధ్యాలను అందించగలిగితే మహిళారైతులుగా నిలదొక్కుకుని తామెందులోనూ ఎవరికీ తీసిపోమని నిరూపించగలుగుతారు. వ్యవసాయంలో అధికభాగం పని స్త్రీలే చేస్తున్నా ఏ పంట వేయాలనే విషయంలోను, క్రయవిక్రయాలు, పంటను మార్కెట్ యార్డ్‌లకు తరలించడం వంటి వాటికొచ్చేసరికి వారిని వెనక్కి నెట్టేయడంతో స్త్రీలకు వ్యవసాయదారులుగా గుర్తింపు లేదు. పైగా భూమి ఎవరి పేరు మీద ఉంటే వారికే వ్యవసాయ ఋణాలు అందుతాయి కనుక, దాదాపు 22% వ్యవసాయ భూమి మాత్రమే స్త్రీల చేతుల్లో వారి పేరు మీద ఉంది కనుక వారు రికార్డులపరంగా రైతులు కావట్లేదు. మరిక ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళారైతు విధానాలవల్ల లాభపడ్తున్నదెవరు?
ఏ మహిళా రైతూ ఆత్మహత్య చేసుకున్న వార్తలు మనం వినట్లేదే! మహిళలు రైతులైతే వ్యవసాయంలో మార్పొస్తుందా? ఖచ్చితంగా ఔననే చెప్తున్నాయి కొన్ని ప్రయోగాత్మక కార్యక్రమాల అనుభవాలు. ఒకప్పటి వ్యవసాయ సహకార సంఘాల అనుభవాలకు దగ్గర పోలికలున్నా, ‘మహిళా సంఘాలచే మెట్ట వ్యవసాయం’ అనుభవాలు వినూత్నంగా ఉండి వ్యవసాయ ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పాయి.
‘సమత-ధరణి’ పేరు మీదుగా తెలంగాణ రాష్ట్రంలోని 500 గ్రామాలలో మహిళా సమతచే అమలయిన సంఘటిత వ్యవసాయ కార్యక్రమం మరో రెండు సంస్థల ఆధ్వర్యంలో సుమారు 200 సంఘాలు కూడా చేపట్టాయి. అంతేకాక ఒడిశా, ఉత్తరప్రదేశ్,
ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోని మహిళాసంఘాలు కూడా ఈ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని అమలుచేశాయి. మిగతా రాష్ట్రాలలో ఏమోకాని ప్రస్తుతం రైతు ఆత్మహత్యలతో అట్టుడికిపోతున్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 15 ఏళ్ళ క్రితం కేవలం 5 ఏళ్ళపాటు ఒక పైలట్‌గా 500 గ్రామాలలో మహిళాసంఘాలు చేపట్టిన సంఘటిత వ్యవసాయపు అనుభవాలు వేరుగా ఉన్నాయి. ఈ 500 గ్రామాలలోని ఏ రైతు కుటుంబమూ ఆత్మహత్యకు పాల్పడిన దాఖలాల్లేవు. అంతేకాదు, 2005 నాటికే పైలట్ కార్యక్రమం పూర్తయినా ఈనాటికీ సుమారు 250 వరకు సంఘాలు ఇంకా దీనిని స్వతంత్రంగా కొనసాగించుకోడంలోనే ఈ కార్యక్రమ విషయం కనిపిస్తోంది. ఈ గ్రామాలన్నింటిలోనూ ఒకటీ, అర సంఘటనలు తప్ప ఏ రైతూ లేదా రైతు కుటుంబమూ ఆత్మహత్యల జోలికి పోలేదు. ఈ గ్రామాలన్నీ రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న జిల్లాలలోనే ఉన్నా ఈ గ్రామాలు మాత్రం వాటిని ఎదుర్కోవలసి రాలేదు.
ఏం జరిగుంటుంది? కారణమేమయ్యుంటుంది? అధ్యయనాలు అవసరమే! అయితే స్పష్టంగా కనిపిస్తున్న కారణాలు మాత్రం వ్యవసాయంలో మహిళలు ముఖ్యపాత్ర పోషించడం, సంఘటితంగా వ్యవసాయం చేసుకోవడం. భూమి స్త్రీల పేరుమీద ఉన్నా లేకపోయినా భూమిని వినియోగించేదానిపై వారికి నిర్ణయాధికారం ఉంటే, ప్రభుత్వ చేయూత అంతంతమాత్రంగానే ఉన్నా కనీస వ్యవసాయ దిగుబడికి ఢోకా లేదని నిరూపిస్తున్నారు. దీని ద్వారా వారివారి కుటుంబాల ఆహార అవసరాలకు తగిన భద్రత చేకూరుతోంది. పైగా పండిన పంటంతా కళ్ళెం దగ్గరో / చేను దగ్గరో కాపలా కాసి తక్కువ ధరకి కొనుక్కుపోయే విత్తన కంపెనీల బారిన పడకుండా పంట ఇంటికి చేరుతోంది. ప్రాంతీయ విత్తనాలనుపయోగించడం ద్వారా విపరీత వాతావరణ పరిస్థితులనూ తట్టుకుని పంటను కంట చూడగల్గుతున్నారు. చాలా భాగం ఆహారపంటలవైపే మొగ్గుచూపడంతో కుటుంబ ఆహార భద్రతకు దోహదపడుతోంది. మిశ్రమ పంట విధానాలు, సమగ్ర వ్యవసాయ పద్ధతులను పాటించడం వలన పోషక భద్రతా సాధ్యమవుతోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రైతుల ఆత్మహత్యలలో మెదక్ జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉంది. కాని అదే జిల్లాలోని కొన్ని ప్రాంతాలు దీని ప్రభావానికి గురికాలేదు. అందులో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ విస్తృతంగా పనిచేసిన పస్తాపూర్ ప్రాంతం ఒకటి. ఈ ప్రాంతంలోని మహిళాసంఘాలు దాదాపు 30 ఏళ్ళకుపైగా సంప్రదాయ పంటలను పండిస్తూ ఆహార భద్రతతోపాటు విత్తన భద్రతనూ సాధించారు. అప్పట్నుండి వీరు ఏనాడు విత్తనాలు కొనెరగరు… అవసరమై వచ్చినవారికి పంచడమేకాని. దాదాపు 80 రకాల విత్తనాలను అక్కడి మహిళలు సంప్రదాయ పద్ధతుల్లో నిల్వ చేసి వారి అవసరాలకు వాడుకోవడం ద్వారా విత్తన సాధికారతను సాధించారు. దీనివల్ల ప్రస్తుత మార్కెట్లను ఆక్రమించిన నాసిరకం విత్తనాల ప్రభావం వీరిపై ఏమాత్రం పడలేదు. అలాగే మహిళల సంఘటిత వ్యవసాయం వారి కుటుంబాలలో ఆహారభద్రతతోపాటు ఆరోగ్యభద్రతా సాధ్యమైంది. ఇది ప్రపంచ దేశాల దృష్టికెళ్ళినా మరెందుకోగాని పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదన్న చందాన మన పాలకుల దృష్టిలో మాత్రం నిలవలేదు!
ఇటువంటి విజయవంతమైన అనుభవాలనుండి రైతులు, పాలకులు కూడా నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ప్రస్తుత వ్యవసాయ సంక్షోభానికి, ఆహార-పోషక అభద్రతకి వ్యవసాయంలో మహిళారైతులు, సంఘటిత వ్యవసాయం శక్తివంతమైన ప్రత్యామ్నాయాలుగా కనిపిస్తున్నాయి. వీటిని ముందుకు తీసుకువచ్చి సాటి రైతులకు, విధానకర్తలకు, ప్రభుత్వాధికారులకు సహకార వ్యవసాయపు అనుభవాలను గుర్తుచేస్తూ, సంఘటిత వ్యవసాయపు బలాలను, శక్తివంతమైన మహిళాసంఘాల పాత్రను తెలియచేయాలన్నదే ఈ సంచిక ముఖ్య ఉద్దేశ్యం. వ్యవసాయంలోని జెండర్ అసమానతలను తొలగించి మహిళలను కూలీలుగా మిగల్చక రైతులుగా చేయూతనిస్తే రైతు కుటుంబాలను నిలపడమేకాక, వ్యవసాయానికే కొత్త ఊపిరిపోసినట్లౌతుంది. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించి ముందడుగేయాలి. అధ్యయనాలు చేపట్టాలి… ఇందుకు అందరూ కలిసి రావాలి.
మహిళా రైతుల్ని ప్రోత్సహిద్దాం… సంఘటిత వ్యవసాయాన్ని ఆహ్వానిద్దాం… కార్పొరేట్ వ్యవసాయానికి కాక భూమినే నమ్ముకున్న రైతు కుటుంబాలను పునరుజ్జీవింపచేద్దాం…