గౌరవనీయులైన భూమిక సంపాదకులు గౌ. కొండవీటి సత్యవతి గారికి ”నల్లమల అడవుల్లో చెంచుల మౌనఘోష” అనే వ్యాసం నన్ను కదిలించింది. పది సంవత్సరాల క్రితం నేను నల్లమల అడవుల్లో తిరిగాను. ఆయుర్వేదం పై ఉన్న మక్కువతో కొందరు సాధువులు, వైద్యుల వెంట తిరిగాను. కానీ అప్పట్లో చెంచుల జీవన స్థితి గతులను అర్థం చేసుకొనే శక్తి నా మెదడుకు లేకపోవడంతో నల్లమలను అడవిలాగా చెంచులను అడవి మనుషుల్లానే చూశాను. మీ వ్యాసం చదివిన తరువాత గతం ఒక్కసారి నాకళ్ళ ముందు కదలాడింది. ఇప్పుడు నేను నల్లమలకు ఒకసారి వెళ్ళాలి అనే ఆలోచన బలంగా కలుగుతుంది. మీ వ్యాసం మా కార్యాలయానికి వచ్చే అందరూ చదివారు.
– గౌస్‌బాషా (జర్నలిస్ట్) ఉదయగిరి నెల్లూరు.
*****
సంపాదకులు, సత్యవతిగార్కి నమస్కారములు
సెప్టెంబర్ 2015 భూమికలో మీరు రాసిన ‘నల్లమల అడవుల్లో చెంచుల మౌన ఘోష’ చదివాను. మీరు రాసిన విహార యాత్రలు, విషాదయాత్రలు (ఆదివాసి మహిళలపై గ్రేహౌండ్స్ పోలీసుల అత్యాచారం) ప్రకృతి మీద మక్కువతో మీరు చేసిన పుణ్యక్షేత్రాల పర్యటనలు కానీయండి, విపశ్యన కానీయండి దేనికదే ప్రత్యేకతగా వుంటవి. ముఖ్యంగా విహారయాత్రలను గురించి మీరు రాసినది చదవుతుంటే మనసు ఉల్లాసంతో ఊగిపోతుంది. మనసులో ఏవైనా చీకు చింతలు ఉంటే ఉష్… కాకిలాగ ఎగిరిపోతవి. ఎగిరి పోవటమే కాదు. మీ వెంటనంటి ఉండి అవన్ని చూచిన అనుభూతి కల్గుతుంది. వెదికి పట్టుకుందామన్న అర్ధం కాని కఠిన పదాలు కానరావు. సరళ భాష, తేలిక పదాలు పలుమార్లు చదివించేలా చేస్తవి. మొదటినుంచి మీరు రాసిన వాటిని గురించి (కేవలము విహార యాత్రలు, పర్యటనలకు సంబంధించినవి మాత్రమే) ఒక పుస్తకంగా ప్రచురించితే బాగుంటుందన్న అభిలాష కలగింది నాకు.
– వేములపల్లి సత్యవతి, సికింద్రాబాద్.
*****
డియర్ సత్యవతిగారు
సెప్టెంబర్ భూమికలో సంపాదకీయం ”తాగుబోతులకు సంక్షేమ పథకం పెట్టాల్సిందే” మీ బృందం స్వయంగా పరిశీలించిన తెలంగాణా గ్రామాల ప్రజల బ్రతుకులు; పురుషులు, స్త్రీలు, పిల్లలు తాగుడుకు బానిసలయిపోవడం, పాఠశాలలు, టీచర్లు లేక నిర్లక్ష్యానికి గురయిన పిల్లల చదువులు, కరువు నేపధ్యంలో వారి దయనీయ పరిస్థితి చిత్రపటంగా కళ్ళకు కట్టినట్టుంది. 10000 మందికి ఒక మద్యం షాపు అనే కొత్త ఎక్సైజ్ పాలసీ నేపధ్యంలో గ్రామాల భయానక దుస్థితిని ఇప్పిుడే తలపిస్తోంది. ప్రతి ప్రజా ప్రతినిధి చదవాల్సిన సంపాదకీయం.
– డా|| పి. విజయలక్ష్మి పండిట్, హైదరాబాద్.
*****
సెప్టెంబర్ భూమిక సంచికలో ”తెలుగులో విజ్ఞాన కాల్పనిక రచయిత్రులు” శీర్షికలో తన్నీరు కళ్యాణకుమార్ గారు రాసిన వ్యాసం చదివాను. ఆ వ్యాసంలో పోడూరి కృష్ణకుమారి గారు రాసిన నవల ”భూ భ వ” ను ప్రస్థావించకపోవటం ఒక లోటుగా భావించి రాస్తున్నాను. స్వాతి వారపత్రిక నవలల పోటీలో బహుమతి పొంది 16 వారాల పాటు ధారావాహికగా ప్రచురించబడింది. 2012 సం.లో ”భూ భ వ” గ్రంధ రూపంలో కూడా ప్రచురితమైంది. భూత వర్తమాన భవిష్యత్తులలో రోదసి పరిశోధనల నేపధ్యంలో ఈ నవల ఆసాంతమూ నడుస్తుంది.
నవలలో వర్తమానంగా ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్‌గా అన్ని దేశాలూ ఒకటై జాతికులమత విద్వేషాలు లేని అత్యాధునిక ప్రపంచంగా వివరించారు. భూతకాలాన్ని నేటి కాలంగా చెప్పారు. ఈ నవలలో వైజ్ఞానికులు మూడుస్పేస్ నౌకలను ఒకేసారి భూతకాలంలోకి, వర్తమాన కాలంలోకి, భవిష్యత్ కాలంలోకి పంపి పరిశోధన చేయడాన్ని, మంచి ఆసక్తిని పాఠకుడిలో కలిగిస్తూ రాసిన నవల. ఇందులో నవలానుగుణంగా ఇప్పటివరకూ జరిగిన అనేక ఆవిష్కరణల గూర్చి కూడా ప్రస్తావించడం ఒక విశేషం.
మిలియన్ సంవత్సరాల గతాన్నీ వాటి సాక్ష్యాలు భూమ్మీదే వున్నాయనీ వాటిని అధ్యయనం చేసి సిద్ధాంతీకరించే మేధాసంపత్తి భూమ్మీదే వుందని, భూమిగుండ్రని ఆకారం వుృత్తాకారంగా తిరిగే స్వభావం ఇచ్చే సందేశం ఇదేనని, భూగోళం లాగే కాలం కూడా ఆది మధ్యంత రహితం కాని మనిషికి గల ప్రకృతిని శోధించాలనే కుతూహలం కూడా అనంతమైనదిగా చెబుతూ నవలని ముగించారు పోడూరి కృష్ణకుమారిగారు.
ఈ నవల వ్యాసకర్త దృష్టిలో పడకపోవటం ఆశ్చర్యమే. ఒకసారి ఈ నవల సేకరించి వ్యాసకర్త చదువుతారని ఆశిస్తున్నాను.
– శీలా సుభద్రాదేవి, హైదరాబాదు.
*****