మెత్తని అడుగుల శబ్దం కనుమరుగైపోయాక
అందరూ ముందుకే నడకని సాగిస్తున్నప్పుడు
గాజు స్తన్యాలతోనే ఆకలి తీరుస్తున్నప్పుడు
ఊపిరుల రుచిచూడని గదులలో సంసారాలు సాగించేశాక
దుఃఖాన్ని పొందగలగడం కూడా
వరమే అనుకునే మనిషి కావాలి
మనిషి కావాలిప్పుడు
నిజదేహంతో సంచరించే మానవుడు కావాలి
మరణబావి సమీపాన నుల్చుని
దానిలోతుని అంచనా వేయగల్గిన తెలివైనవాడు కావాలి
మనిషంటే రక్తమాంసాల్ని నింపుకుని
అందమైన రంగుతోలు కప్పుకున్నవాడుకాదు
రహదారుల వెంబడి ఆనందంగా సంచరిస్తూ
ఆసుపత్రి గదుల్లో సేదతీర్తున్నవాడు కాదు
అంతా అనుభవించేశాక ఇక్కడ ఏమీలేదన్నట్లు నటించి
చివరాఖరున సన్యాసపు తొడుగు ధరించి
చస్తూ బతుకుతూ బతకడం నేర్చిన నటుడు కాదు
మృత్యుపురాణ పుట్టుకని
ఆపాదమస్తకం స్మరించినవాడు కావాలి
ధ్యానంతో స్మృతిగర్భంలోని రూపాంతరాన్ని పసిగట్టి
రాత్రిని వెలిగించి పగటిని చేయగల్గినవాడు కావాలి
మొగ్గ చిదమకుండా పూవుని చేసి
ప్రేమ సౌగంధికా పరిమళాన్ని ప్రపంచమంతా నింపి
నిర్భయంగా తిరగాడగల్గిన ప్రేమికుడు కావాలి
ఒకే కక్ష్యలోకి నిన్నూ నన్నూ అతడినీ ఆమెనీ చేర్చి
జన్మల్ని తిరగరాయగల్గిన మానవ బ్రహ్మ కావాలి
దీప సమూహాల్ని నడుముకు చుట్టుకుని
పూర్ణదేహపు ఆత్మనీ ఆ వెలుగులో నడిపించుకుంటూ
దేవుడి భుజంమీద చేయివేసి
నిజ సహవాసం చేయగల్గిన మానవుడు కావాలి
మనిషి కావాలిప్పుడు… ఈ ప్రపంచం కోసం
నిజమైన మనిషి తప్పక అవసరమిప్పుడు
బ్రతుకు సముద్రంలోని దుఃఖాన్ని అలల్నిచేసి
తీరానికి విసిరేయగల్గిన బలశాలి కావాలి
విగ్రహమై నిలబడినవాడు కాదు
ధీటైన నిగ్రహంతో నడవగల్గిన మనిషి కావాలిప్పుడు
ప్రపంచానికి నిజమానవుని అవసరం కల్గింది
దేవుళ్ళు ఎక్కువవుతున్నకొద్దీ
మనుషులు కరువైన ప్రపంచమే ఇప్పుడు మనముందు
దేవుడే మనిషిలా పుట్టడం కాదు….
పుట్టుకతోనే దేవుడిలాంటి మనిషి ఆవశ్యం ఇప్పుడు