ఒరే బావా
మాయలోడా
మాలో వాడా
మాల ఫైడ్ చెయ్యకు
మా మల్ల పగల గొట్టకు
ఊరు
నోటి కబుర్లు నీతో పంపించింది
దండోరా చాకిరీ నాతో చేయించింది
ఊరు
నీటి గట్ల కాడ నిన్ను కాపలా ఉంచింది
మురికి కాలవల చెత్త నాతో తీయించింది
ఊరు
నూలు పనికి నిన్ను తోలింది
తోలు పనికి నన్ను తరిమింది
ఊరు
ఎండు కసుపు నీతో తీయించింది
పచ్చి పెంట నాతో ఎత్తించింది
ఊరు
చొప్ప కట్టలు నీ నెత్తిన ఎత్తింది
పీతి తట్టలు నా నెత్తిన పెట్టింది
ఊరు
మణిసి శవాలు నీతో ఎత్తించింది
చచ్చిన గొడ్లను నాతో ఈడ్పించింది
ఊరు
నిన్ను కల్లానికి కాపలా ఉంచింది
నన్ను పరిగైనా ఏరుకోనీయకుండా జాగర్త పడింది
ఊరు
నిన్ను బయటుంచింది
నీకంటే బయట నన్నుంచింది
ఊరు
నిన్ను కిందుంచింది
నీకంటే కింద నన్నుంచింది
ఊరిపై
నేను అగ్గైనపుడల్లా
నీళ్లు చల్లింది నువ్వే
నీ యూదా ముద్దులాపు
నీ మహా నాడులూ
మాయ కేకలూ
ఐక్యతా రాగాలూ ఆపు
మనది
ఐక్యతా ఘర్షణల కాపరం
నిన్ను వదులుకోను
అట్లాగని వదలను
కుక్క కాటుకు చెప్పు దెబ్బ
కులం చేటుకు మెట్టు దెబ్బ