కంచంల కూడు కాకి తన్నిపోతె
కడుపుల కాల్లు పెట్టుకోని
కన్ను మలుపుకున్న
కలల నాలుగు పాములు
నా యెంట తలుగ వట్టినయ్
కండ్లు దెర్సి సూసెటాల్లకు
అవ్వన్ని మనుషుల రూపమెత్తినయ్
కానీ… తలలైతె పాములయే
పుస్తకం శేతవట్టిన పాము
నా నాలికె మీద కాటిచ్చింది
దాన్నేం జెయ్యలేక
దండంబెట్టి ఎనుకకు దిరిగిన
కత్తి శేత వట్టిన ఇంకో పాము
నన్ను తొక్కుకుంట గద్దె మీదెక్కి కూసున్నది
మూడో పాము నన్నంత వడివెట్టి
నా రౌతమంత పిండుకొని తాగింది
ఆకరిది అన్నింటి కంటె శిన్నపాము
అదిగుడ నన్ను జాసి
అసుంట, అసుంట అని బుసగొట్టింది
అరిగోసలవడి, అరవై యొక్క
శెరల వడి, శారెడు గింజలు
కొంగున వోసుకత్తె
గీ నాలుగు పాముల కాటు తినచ్చిన
నా ఇంటి వానపాములు గుడ
నా మీదికే బుసగొట్టవట్టె
ఇగేం జేతునుల్లా