తెంచు తెంచు తెంచు తెంచు
ఆంక్షలెట్టు బంధాలను
కాల్చి కాల్చి మసి చేసెయ్
నిన్ను కూల్చే ఆచార గ్రంథాలను
చీల్చుకొని రా స్వేచ్ఛగా
సాంప్రదాయ ముసుగుల్లో బలి చేసిన
పురుషాధిక్య మదమెక్కిన నీతుల నుంచి
వివాహ వ్యవస్థలు రెండు కుటుంబాల్ని,
ఇద్దరు మనుషుల్ని, రెండు జీవితాల్ని,
రెండు మనసుల్ని ఏకం చేయటానికా?
కాదేమో నయా నీతులు లిఖించుకున్న ఈ సమాజానికి ..
ఆడదానికి మాత్రమే రెండు ఇంటి పేర్లున్నా
జీవితాన్నిచ్చిన కన్నవారి నామరూపాలు చెరిపేస్తూ రెండిళ్ళున్నా చావైనా, బతుకైనా అత్తారిల్లేనంటూ
రెండు మనసులు ఏకమైనా పురుషాధిపత్యమే నడుస్తూ ..
ఇదేనా మీ వివాహ వ్యవస్థ నేర్పింది? అయితే చింపి నిప్పెట్టండి మీ దిక్కుమాలిన ఆచార గ్రంథాలను..
నిలువునా చీల్చెయ్యండి మీరు సృష్టించుకున్న చట్టాలను.. నరికేయండి మీ ఆధిపత్య అహాన్ని..
ఏం మారింది లోకం?
ఇంకొంచెం అతిగా నేర్చుకుందంతే.