ఈ చట్టాన్నే నేర సంబంధ న్యాయ (సవరణ) చట్టం-2013 గా వ్యవహరిస్తారు. భారతీయ శిక్షాస్మృతి, నేరశిక్షా విధానం, 1973, భారతీయ సాక్ష్యాధారాల చట్టం 1872, లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం 2012 చట్టాలకు మార్పుచేర్పులతో, మహిళలపై జరిగే లైంగికదాడులను సమగ్రంగా ఎదుర్కొనే ఉద్దేశంతో ఈ సవరణ చట్టం చేయడమైంది. కొన్ని కొత్త సెక్షన్‌లు చేర్చటం ద్వారా కొత్తగా వస్తున్న నేర పోకడలను సమర్థవంతంగా ఎదుర్కొని, నిందితులకు మరింత కఠిన శిక్షను విధించడం జరిగింది. ఢిల్లీలో ‘నిర్భయ’ కేసులో విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సర్వత్రా నిరసనలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం మహిళలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టే చర్యలు సూచించేందుకై జస్టిస్ వర్మ నేతృత్వంలో ఒక కమీషన్ నియమించింది.
ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఈ చట్టాన్ని ఆమోదించారు.
ఈ చట్టం ప్రకారం మహిళపై ఏసిడ్ దాడి జరిగిన పక్షంలోనూ లేదా మహిళపై శారీరకంగా గాయపర్చడం వల్ల మహిళ తీవ్ర గాయాలకు లోనైన పక్షంలో పదేళ్ళకు తగ్గని జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ఏసిడ్ దాడి జరిపినా, జరిపే ప్రయత్నం చేసినా ఐదేళ్ళకు తగ్గని జైలు శిక్షతోబాటు జరిమానా విధిస్తారు.
లైంగిక ఉద్దేశ్యంతో మహిళ శరీరాన్ని తాకడం, సైగలు చేయటం, లైంగికపరంగా ఒప్పుకోమని లేదా ఇతరత్రా అశ్లీల సంభాషణలు, మహిళ ఇష్టానికి వ్యతిరేకంగా బూతుబొమ్మలు, అశ్లీల చిత్రాల ప్రదర్శన వంటివి చేసినవారికి మూడేళ్ళ వరకూ కారాగార శిక్షతోబాటు జరిమానా విధించే వీలుంది. స్త్రీలు నగ్నంగా స్నానం చేయటం లేదా ఇతర పనుల్లో ఉన్నప్పుడు రహస్యంగా చూడడం, చిత్రీకరించడం వంటివి చేస్తే మూడేళ్ళకు పైన ఏడేళ్ళ వరకు జైలుతోబాటు జరిమానాతో కూడిన శిక్ష విధించే అవకాశం ఉంది. ఒకవేళ బాధితురాలి అంగీకారంతో నగ్నచిత్రీకరణ జరిపినా నేరమౌతుంది.
మహిళ అభిమతానికి విరుద్ధంగా సదరు స్త్రీ యోని, మల, మూత్ర విసర్జన భాగాలలో ఎక్కడయినా ఏ వస్తువు జొప్పించినా, అందుకు బలవంతం చేసినా, ఎవరితోనైనా ఆవిధంగా చేయమని ఒత్తిడి చేసినా అత్యాచార నేరం క్రింద శిక్ష విధించటమౌతుంది. ఆ మహిళకు సంబంధించిన వారిని ఎవరినయినా చంపుతామనికానీ, గాయపరుస్తామనికానీ స్త్రీని భయపెట్టి లొంగదీసుకున్నా, పరాయి మహిళను భర్తకు తెలియకుండా లొంగదీసుకున్నా లేదా ఆ స్త్రీ సరైన మానసిక స్థితిలో లేనపుడు లేదా మద్యం మత్తు లేదా హానికర పదార్థం వినియోగించిన స్థితిలో ఉన్నా, అంగీకారం సక్రమంగా తెలుపలేని పరిస్థితులలోనూ, అంగీకారం ఉన్నా 18 సం||లోపు బాలికతో పైపేరాలో వివరించినట్టు ప్రవర్తించినా అత్యాచారం క్రింద శిక్ష విధిస్తారు. ఇందుకు ఏడేళ్ళకు తగ్గకుండా జైలు శిక్షతోబాటు జరిమానా కూడా విధిస్తారు.
ఇదే నేరాన్ని పోలీస్‌స్టేషన్‌లో కానీ, మరెక్కడయినా చేసిన పోలీసు అధికారికి, సైన్యంలో పనిచేసే వారికి, రిమాండ్ హోం, బాలల హోం వంటి చోట్ల పనిచేసేవారికి, ఆస్పత్రి సిబ్బందికి, మతకలహాల సమయంలో అత్యాచారం చేసినవారికి, గర్భిణులు, 16 సం||ల లోపు పిల్లలను అత్యాచారం చేసినవారికి, తన ఆధీనంలోని మహిళపై అత్యాచారం జరిపినవారికి, మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే స్త్రీపై అత్యాచారం చేసినవారికి, అత్యాచారాన్ని మళ్ళీ మళ్ళీ కొనసాగించిన వారికి మరింత కఠిన శిక్షను నిర్దేశించటమయింది. పదేళ్ళకు తగ్గకుండా జైలుగానీ, జీవితఖైదుతోబాటు జరిమానా గానీ విధించవచ్చు.
ఈ సందర్భంగా మహిళ మరణించినా, కోమాలోకి వెళ్ళినా నేరస్తునికి 20 సం||లకు తగ్గకుండా ఆమరణ ఖైదు విధించవచ్చు.
ఈ చట్టం ప్రకారం భార్యతో కోర్టు డిక్రీద్వారా కానీ, మరేవిధంగా కానీ విడిగా ఉంటున్న సమయంలో భార్యతో సంభోగం జరిపితే రెండేళ్ళకు తక్కువ కాని జైలు జరిమానా విధించవచ్చు.
ఒక మహిళను ఒకరు లేదా అంతకు మించిన వ్యక్తులు సామూహికంగా / ఉమ్మడిగా అత్యాచారం చేస్తే ఆ చర్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆ నేరంలో వ్యక్తిగతంగా పాల్గొన్నట్లు భావించి విడివిడిగా ఒక్కొక్కరికీ జీవితఖైదు విధించవచ్చు.
ఏ వ్యక్తి అయినా మానసిక, శారీరక వైకల్యంతో ఉన్నట్లయితే ఆ వ్యక్తి గుర్తింపును వీడియో తీయాలి.
నేరారోపణ చేసిన స్త్రీ రక్షణకు సరయిన చర్యలు తీసుకునేందుకు న్యాయస్థానం ఆదేశించాలి.
నేరవిచారణను ఛార్జిషీటు నమోదయిన రెండు నెలల్లో పూర్తి చేయాలి. బాధితురాలికి ప్రయివేటు వైద్యశాలలతో సహా ప్రభుత్వ వైద్యశాలలన్నిటిలో ప్రథమ చికిత్సతో బాటు అన్ని వైద్యసేవలు అందించటమే కాకుండా, తక్షణం ఆ నేర సమాచారాన్ని పోలీసులకు అందించాలి.
బాధితురాలికి నిందితుడి నుంచి రాబట్టే అపరాధ రుసుముతో బాటు రాష్ట్రప్రభుత్వం కూడా నష్టపరిహారం చెల్లించాలి.
ఐతే చట్టాల అమలు ఆచరణలో ఎంత ఘోరంగా విఫలం అవుతోందీ మనకు ప్రత్యక్షంగా కనబడుతూనే వుంది. కాశ్మీర్ లోయలో, ఈశాన్య రాష్ట్రాలలో భద్రతా దళాల అమానుష చర్యలను ఎంతగా నొక్కిపట్టినా, స్త్రీల హక్కుల ఉద్యమకారుల నిరంతర పోరాటంతో ఆ దురంతాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా మాన్యం అడవులలో పోలీసులు గిరిజన మహిళలను సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో బాధితుల వేదన అరణ్య రోదనగానే మిగిలింది. విదేశీ కంపెనీల తరఫున ఇక్కడి ప్రజాప్రభుత్వమే బాక్సైట్ ఖనిజాన్ని కొల్లగొట్టేందుకు పోలీసుల ద్వారా ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి, నిర్వాసితులను చేసేందుకే ఇలా జరిపించారని మీడియా సైతం గోలపెట్టినా బాధ్యులపై చర్యలు లేవు. చట్టాలపై ప్రజలలో అవగాహన పెరిగి, తమ హక్కులకై ఎలుగెత్తి నినదించే కార్యకర్తల చైతన్యం పెరగనిదే ఇలాంటి అమానుషాలకు అడ్డుతగలడం సాధ్యం కాదు.