మహిళ
– యం. శాంతిరావు
మహిళా ఓ మహిళా!
మహిలోని మణిపూసా
మహిలోని ఆణిముత్యానివా?
సృష్టికర్తా బ్రహ్మా
బిడ్డకు జన్మనిచ్చిన అమ్మా
పాలిచ్చి పోషించి కన్నుకు
రెప్పవలే కాపాడే దివ్యతేజా
బిడ్డల అభివృద్ధికి పొంగిపోయే
ఫలితం ఆశించని నిష్కామకర్తా!
అహర్నిశలు బిడ్డల క్షేమానికై
పాటుపడే అలుపెరగని అనురాగమయి
అమ్మా, అమ్మా, మహిళా కనిపించే దేవతా!
ఆడవారిని గౌరవిస్తే దేవతలు కొలువై ఉంటారట
మాతృదేవోభవ అన్నది వేదం
అయినా, మహిళా ఓ మహిళా!
పురుషాధిక్యతచే అణచబడుతోంది నేడు
రెండో స్త్రీగా గుర్తిస్తోంది సమాజం
అబల అని అత్యాచారాలకు గృహహింసకు
వ్యభిచారానికి అర్ధనగ్నమైన ప్రకటనలకు
దిగజార్చి పరిమితం చేస్తోంది సమాజం
ఆడపిల్ల భారమని ఆదిలోనే హతమారుస్తోంది
చెత్తకుప్పలకు ధారాదత్తం చేస్తోంది
వెట్టిచాకిరి చేయించి వెలివేస్తోంది.
అందలమెక్కాల్సిన మహిళ
అథః పాతాళానికి తోసివేయబడుతోంది
మహిళా! ఓ మహిళా సహించకు,
అన్యాయాన్ని, అరాచకాన్ని దిగమింగకు
ఎవరో వచ్చి కాపాడుతారని ఎదురుచూడకు.
ఆశలపై నీళ్లు చల్లేదే ఈ సమాజం
కష్టాల కోర్చుకున్నది నాటి సీత
ఉద్దరేరాత్మ నాత్మానాం అన్నది గీత.
అణిగినంత వరకు అణిచివేస్తోంది లోకం
కాని నేటి మహిళా మేలుకో లేచి కదులు,
పురుష సంకెళ్లను విడిపించుకో.
రెచ్చిపోయే పురుషాధిక్యానికి ఆనకట్ట కట్టు
స్వేచ్ఛా గగన వీధుల్లో ఎగిరిపో
జంకుగొంకు లేకుండా ముందుకు సాగిపో
అబల కాదు సబల అని నిరూపించుకో
ఝాన్సీ లక్ష్మిబాయి మదర్ తెరెసా
అగ్రశ్రేణి మహిళా జాబితాలో చేరిపో
చల్లని చంద్రుని వెన్నెలలా
ఆశాదీపమై ప్రకాశించు
మహిళా ఓ మహిళా మణిదీపంలా
మహిని అలంకరించు