”పేరు”
– ఎస్. కాశింబి
వెన్నెలలా పుట్టి…వన్నెలతో అలరిస్తావు
పువ్వులా పెరుగుతూ…నవ్వులు పండిస్తావు
మమతలతో పెనవేసి…మాటలతో మురిపిస్తావు
మల్లెలా ఇల్లంతా…అనుక్షణం గుబాళిస్తావు!
కంటిపాపవై వెలుగుతావు
కడుపుతీపి కర్థంగా మెలుగుతావు
నీ కల్యాణపు ఊహకే ఉలిక్కిపడేలా చేస్తావు
నీ కాపురం గురించిన ఆందోళనకు బీజం వేస్తావు!
వెదికి వెదికి దుర్భిణితో వేలాది సంబంధాలు…
వేదిక నిర్ణయించి…వేడుక నిర్వహించేంతలో…
అనుకోని ఘటనకు తెరతీస్తావు
ఆరని మంటల్ని గుండెన రగిలిస్తావు!
ఒక్కసారైనా పునరాలోచన చేయక
ఒక్క మాటైనా మాతో చెప్పక
కొన్నాళ్ళ పరిచయాన్ని నమ్ముకుని
కొన్ని గంటల మాటల్ని నిజమనుకుని
ఎవరో తెలియని వాడిపై ప్రేమతో
ఏమాత్రం శంకించక పయనమౌతావు
ఆకాశం నుండి మమ్మల్ని అథఃపాతాళానికి నెట్టేస్తావు
అంతులేని వ్యథని మాకు మిగిలిస్తావు!
యిన్నాళ్ళూ సర్వస్వమైన మేము
యిప్పుడెందుకు పరాయివాళ్ళ మయ్యామమ్మా?
యిన్నాళ్ళూ వేదమంత్రాలైన మా మాటలు
యిప్పుదెండుకు వెగటయ్యాయమ్మా?
యిన్నేళ్ళ ఆప్యాయతల్నెలా మరుస్తారమ్మా?
యిదే నేటి రీతిగా ఎందుకు మారుస్తారమ్మా?
మీ యిద్దరిదే ప్రేమ అయితే…మన అనుబంధం పేరేమిటమ్మా?
మీ యిద్దరే ఒకరికొకరైతే…మేము ఎవరిగా బ్రతకాలమ్మా?