పియాతి ప్రియమైన పసుపులేటి గీతా! ఎలా ఉన్నావ్?
మొన్న రాత్రి ఓ కల వచ్చింది. నవ్వుతూ సముద్రతీరం నుండి పక్షిలా ఎగురుతూ నావైపే వస్తున్నావ్? ఎంత బాగున్నావో తెల్సా? నీ చిరునవ్వు ఇంకా విన్పిస్తూనే వుంది. మెలకువరాగానే నువ్వు లేవు. అందుకే ఈ అక్షరాల గులకరాళ్ళను పేర్చుతూ, నీతో కాస్సేపు మాట్లాడదామని మొదలు పెట్టాను. గీతా నీకు గుర్తుందా? నీ తొలి కవిత ‘నీడలు’ 95′ లో అనుకుంటా ‘జ్యోతి’ లో వచ్చింది కదూ! శ్రీకాళహస్తిలో పుట్టి, డిగ్రీ వరకూ చదివి, పద్మావతి యూనివర్సిటీలో యం.సి.జె. చేశావ్ కదా! తిరుపతి ‘ఆంధ్రజ్యోతి’ లో వర్క్ చేసేప్పుడు, ‘నామిని’ ని గురువు లాంటివాడు అనుకునే దానివి. 97′ తర్వాత అనుకుంటా ‘అక్బర్’ తో నీ పరిచయం, సహచరులు కావడంతో జీవితం ఇంకో మలుపు తిరిగింది. అక్బర్ పెయింటింగ్ నాక్కూడా చాలా ఇష్టం. నా ‘గాజునది’ కవిత్వ పుస్తకానికి అక్బర్ ముఖచిత్రం, నీ ‘ముందుమాట’ నాకెంతో ఇష్టమైన విషయాలు. మొత్తం కవిత్వంలో నేనేం చెప్పదలచుకున్నానో ఒక్క ముఖచిత్రంలో ఆ రంగులు గీతల్లోనే చెప్పేస్తే, నువ్వేమో కవిత్వ అంతస్సారాన్ని ముందుమాటలో చెప్పావు. మీ నాన్నగారంటే నీకు చాలా ఇష్టం కదా! జర్నలిజమ్‌పై ఆయనకున్న ఆసక్తే నిన్నెంతో ప్రోత్సహించింది. నిజానికి చిన్నప్పటినుంచీ చిత్రలేఖనమే నీకు చాలా ఇష్టం కదా! మధ్య గ్యాప్ వచ్చింది, రీస్టార్ట్ చేశావు మళ్ళీ. 2014లో ప్రొఫెషనల్ పెయింటర్‌గా మొదలై 5 గ్రూప్స్ షోస్‌లో పాల్గొన్నావు. బ్లాక్ & వైట్ ఇంక్ వర్క్ ఇష్టం. శరీర యుద్ధం చేస్తూనే వున్నావు. నీ విల్ పవరే జయిస్తోంది. గీతా! ‘కాఫ్కా’ రచనలిష్టం కదా నీకు. అలాగే బైరాగి కవిత్వం ఇష్టం. త్రిపుర కథలు, గోపిని కరుణాకర్ కథలూ ఇష్టం. పొయిటిక్ సెన్స్ వున్న వర్క్‌లిష్టం. ఏ రచనలోనైనా ఫిలసాఫికల్ టచ్ వుంటే చాలు చాలా ఇష్టపడతావు. నువ్వు రాసిన ‘యూ ట్యూబ్’ కథ నాకు చాలా ఇష్టం. అలాంటివి ఓ పది వరకూ రాసుంటావ్, పుస్తకం వెయ్యొచ్చు కదా తల్లీ! ఆలోచించు. యాస్ ఎ ఉమెన్ గా ఫెమినిజాన్ని సమర్థిస్తున్నా అక్కడే పరిమితమవకుండా కాన్వాస్ విస్తృతంగా ఉండాలనుకుంటావు. బాగా ఫీలవ్వనిదే ఏదీ రాయలేవు. నీకు తెలియకుండానే అప్రయత్నంగా నీలోంచి తన్నుకొచ్చే భావాలను మాత్రమే వ్యక్తీకరించగలవు. ఒక రచనోన్మాదం నిన్ను ఆవహించినప్పుడే రాస్తావు కాబట్టి, ఆ పదాలకు అంత పదును. భావావేశం ఉంటాయి. నాకు తెలిసిన గీత అలికిడికి దూరంగా, నిశ్శబ్దంగా, ఏకాంతంగా ఉండే ప్రదేశాలను ఇష్టపడుతుంది. ప్రతిదాన్నీ ‘ఆర్ట్’ అనుకొని దేన్నయినా కూడా కళా దృష్టితో చూడ్డం నీ అలవాటు. ప్రతి పనిలో అందుకే కళను వెతుక్కుంటూ ఉంటావు. 2003లో అనుకుంటా ‘చమన్’ పేరుతో నీ కవితా సంపుటి వచ్చింది. చాలా అద్భుతమైన కవితలున్నాయందులో. ప్రారంభంలో ‘చలం’ రచనల ప్రభావానికి గురై, తర్వాత బయటకొచ్చానంటావ్. చలం రచనలు స్టార్టింగ్ పాయింటై, తర్వాత విశాల ప్రపంచాన్ని ఎలా చూడాలో అనేదానికి భూమికగా ఉపయోగపడిందన్నావ్. నువ్వన్న ఇంకోమాట నాకు చాలా ఇష్టం గీతా! ‘నన్ను నేను ఒక స్త్రీగా కంటే, బియాండ్ జెండర్‌గా, ఒక వ్యక్తిగా గుర్తింపబడటానికే ఇష్టపడతాను’ అని. గీతా! పర్సనాలిటీ డెవలప్‌మెంట్ సంబంధించిన బుక్స్ చాలా ఇంగ్లీష్ నుంచి తెలుగుకు జాబ్ వర్క్‌లా అనువాదం చేశావు కదా! షార్ట్ స్టోరీస్ కూడా చేశావు. నువ్వు అనుసృజన కూడా చాలా అలవోకగా చేసేస్తావు. భాష మీద నీకున్న కమాండ్ అది. ‘భూమిక స్త్రీ వాద పత్రికలో కూడా చాన్నాళ్ళపాటు ‘కిటికీ’ పేరుతో కాలమ్ రాశావు. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఆ రోజుల్లో. ‘డాక్యుమెంటరీస్’ చూడ్డం నీకు చాలా ఇష్టం కదూ! నెట్ బ్రౌజింగ్ ఇష్టం. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండవు. నీకు నచ్చినప్పుడు మాత్రమే- ఆ అంతర్జాల కిటికీని తెరుస్తావు. కానీ గీతా! నువ్వు పెయింటింగ్స్‌లో పూర్తిగా ములిగిపోయి కవిత్వాన్ని, కథల్ని పక్కకు పెట్టేశావు. మళ్ళీ ఇటు తిరిగి అప్పుడప్పుడన్నా రాస్తుండొచ్చు కదా! ముందా కథల పుస్తకం వెయ్యడం గురించి ఆలోచించు. మనం కలిసిన ప్రతిసారీ ‘సంత సంబరం’లా ఉంటుంది. ఎంత ప్రేమో ఎంత ఆప్యాయతో నేనంటే నీకు. ఒక్కోసారి ‘అక్కా’ అని పిలవనా అంటావ్? ఇంకోసారి ‘అమ్మా!’ అని పిలవనా అంటావ్. నవ్వే నీకు సమాధానమౌతుందప్పుడు. ఆ ‘మణికొండ’కు మీరు ఇల్లు మారిన తర్వాత కలవడం అస్సలు వీలుపడటం లేదు. ఎక్కడో సిటీకి సుదూరంలో వున్న ఆ కొండపై గువ్వ పిట్టల్లా కుదురుగా కూర్చున్న మణులు మీరిద్దరూ! కొండ దిగరు. రారు. రాలేరు. నేను ఆ కొండను చేరడానికి ప్రయత్నాల నడకను నడుస్తూనే ఉన్నాను. ఐనా ఆ కొండను చేరలేక పోతున్నాను. తల్లీ! నిన్ను దలంచి ఈ లేఖ ఇక సెలవా మరి.