తాతమ్మ విజన్‌ నుంచి… పి . ప్రశాంతి

 

చెరువు మీదగా గాలిలో తేలి వస్తున్న తడి వాసన శాంతిని మైమరపింప చేస్తోంది. ఊర్లో బస్సాగగానే బ్యాగ్‌ తీసుకుని బస్సులోనించి దూకినట్టే దిగేసి తాతగారింటివైపు గబగబా నడిచింది. వీధి గుమ్మంలోనే ఎదురొచ్చిన బేబమ్మని ”అమ్మమ్మా…” అంటూ చుట్టేసింది. ”ఏమ్మా ప్రయాణం బాగా సాగిందా? కాలేజీ చదువు ఎలా ఉంది?” అంటూ కుశల ప్రశ్నలేస్తున్న అమ్మమ్మకి సమాధానం చెప్తూనే వరండాలో రాశులుగా పోసిన పసుపు కొమ్ముల్ని దోసిట్లోకి తీసుకుంటూ ”ఇంకా పసుపు ఉడకబెట్ట లేదా అమ్మమ్మా… ఐనా ఊరికి మైలు దూరం వరకు కమ్మటి వాసనొస్తోంది…” అంటూ ముఖానికి దగ్గరగా పెట్టుకుని బుగ్గలకానించుకుంది. ”అయ్యయ్యో… ఆ పసుపు కొమ్ముల ఛాయ ఒంటికంటుకుపోగలదు… అసలే బంగారం రంగులో ఉన్నావ్‌… ఈ పసుపుఛాయలో బంగారమేనేమో అనుకుని దొంగలెత్తుకుపోగలరు…” సరసమాడింది మేనమామ భార్య, ”పో అత్తా…” అంటూ ధాన్యపు పురికున్న గడ్డి మోకుల్ని సరిచేస్తున్న తాతగారి దగ్గరకెళ్ళింది శాంతి. ”ఈసారి పసుపు పంట బాగా దెబ్బతిందమ్మా. సరైన వర్షాలు లేక, సమయానికి కాల్వలు రాక దిగుబడి బాగా పడిపోయింది. మార్కెట్లో రేటు మాత్రం పెరగట్లేదు. అదేంటంటే, కొమ్ములు పెరగలేదు, నాణ్యత లేదు, రంగు మాడిపోయింది, నల్ల పసుపునెవరుకొంటారు అని దళారీలు దబాయిస్తున్నారు…” అని ఏకరువు పెట్టారు తాతగారు.

”అవన్నీ ఎప్పుడూ ఉండేవేకాని, నువ్వు కాళ్ళు, ముఖం కడుక్కురా… టిఫిన్‌ ఎప్పుడు చేశావో… నీ కిష్టమని పులిహోర చేశా, తిందూగాని రా…” మనవరాల్ని పిలుస్తూ ఇంట్లోకి దారితీసింది బేబమ్మ. దోసిట్లోకి తీసుకున్న పసుపు కొమ్ముల్లోని పుచ్చొచ్చినవి, పీలగా ఉన్నవి, తడార్చుకుపోయినట్లున్నవి ఏరి అలవాటుగా చేతి పంపు దగ్గర మూలకిసిరేసి పంపు కొట్టుకుని కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుని అమ్మమ్మని అనుసరించింది శాంతి. ఇంటర్‌ పూర్తవడానికి ఇంకో ఆర్నెల్లుంది. డిగ్రీలో వ్యవసాయానికి సంబంధించిన కోర్సు చేస్తే బాగుండని అనిపించింది. ‘కాని నాది హ్యుమానిటీస్‌ కదా…!’ అని అనుకుంటూ లోపలికెళ్ళింది.

భోజనాల గదిలో పీటమీద కూర్చుని ముందున్న పచ్చటి అరిటాకులోని అన్నంలో కూరని మునివేళ్ళతో మొత్తగా కలుపుకుని మెల్లగా ఆరగించే వృద్ధురాలైన తాతమ్మని సాలోచనగా చూస్తూ పక్కనే తనూ పీటేసుకుని కూర్చుంది భోజనానికి. సెలవులకి అమ్మమ్మ గారింటికి వచ్చిన శాంతికి తాతమ్మతో కబుర్లు ఎన్నో కొత్త విషయాల పట్ల ఆసక్తి పెంచడంతోపాటు మరెన్నో ప్రశ్నలనీ లేవనెత్తాయి. ”నీ వయసు వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూనో, ఆడుకుంటూనో, టీవీల ముందరో కూర్చునుంటే నువ్వేంటి తాతమ్మ దగ్గర్నించి కదలట్లేదు…” అని అంటున్న అత్తమ్మ మాటల్ని పట్టించుకోకుండా తాతమ్మ చెప్పే జీవితానుభవాల్ని చకితురాలై వింటోంది.

”నాకు, సుశీలకి మంచి స్నేహం. పుష్టిగా ఉండే సుశీలకి 10 ఏళ్ళకే 25 ఏళ్ళ రంగారావుతో పెళ్ళయింది. వారం రోజుల పెళ్ళి తర్వాత మూడు రాత్రులు గడపాలని అత్తారింటికెళ్ళిన సుశీలని భర్తతోపాటు నాలుగోరోజు పుట్టింటికి తీసుకొచ్చారు. వచ్చినప్పట్నుండి తిరిగి అత్తారింటికి పోనని బిగుసుక్కూర్చుంది. ‘ఏమయిందీ’ అంటే రెండోరోజుకి చెప్పింది. ‘భర్త గదిలోకెళ్ళాలంటే భయమేస్తోందని, తనకదంతా ఒద్దని, నచ్చట్లేదని, ఇక్కడే ఉండిపోతా’నని ఒకటే గోల. ఇంట్లో వాళ్ళిది చూసి సుశీలని కొన్నాళ్ళాగి పంపిస్తామని రంగారావుకి నచ్చజెప్పి పంపించారు. అలా దాదాపు సంవత్సరంపాటు పుట్టింట్లో ఉండిపోయిన సుశీల అప్పుడప్పుడు వచ్చిపోతున్న రంగారావుతో స్నేహంగానే ఉండేది. అంతలో రజస్వల అవటంతో, రెండు నెలలు నెలసరి అయ్యాక సుశీలనెలాగో ఒప్పించి భర్త దగ్గరికి పంపారు. అక్కడికెళ్ళిన ఏడాదిన్నరకే ఒక బాబు పుట్టిపోయాడు. అప్పటికి నాకూ పెళ్ళై అత్తారింటికెళ్ళిపోవడంతో మేం కలుసుకోవడం తగ్గిపోయింది.

ఒకరోజు సాయంత్రం మల్లెపూలు కోసుకుంటున్న నాకు, సుశీలకి సంబంధించిన వార్తవిని ఆ పూలు నా చేతుల్ని కాల్చేస్తునట్టని పించింది. వాళ్ళూర్లో జరిగిన కొట్లాటల్లో తలకి దెబ్బతగిలి రంగారావు చచ్చిపోయాడని, బాలింత ఒళ్ళు ఆరకుండానే మళ్ళీ నెలతప్పిన సుశీల ఈ వార్త విని మూర్ఛపోయిందని, ఒక పూట తర్వాత తెలివొచ్చినా తను మనుషుల్లో లేనట్లే ప్రవర్తిస్తోందని విని నాకు కాళ్ళు చేతులాడలేదు.

వయసు ఉద్రేకానికి తోడు, కుల ఆధిపత్యం, సావాసగాళ్ళ దన్ను… అన్నీ కలిసి పొలంపనుల్లో కూలీలతో తలెత్తిన చిన్న వాగ్వాదం రంగారావుతోపాటు మరో పది మంది కలిసి ఊరి చివరున్న మాలపల్లె మీద విరుచుకుపడే వరకుపోయింది. అప్పటిదాకా పెద్ద మనుషుల వల్ల కోపాన్ని దిగమింగుకుని దొరల అరాచకాల్ని సహించుకొస్తున్న మాలపల్లి యువకులంతా వీళ్ళమీద కర్రలతో తిరగబడ్డారు. దాన్తో పెద్ద యుద్ధమే అయి అటుఇటు కలిసి ఐదారుగురు చచ్చేదాకా వచ్చింది.

ఈ మొత్తం ప్రభావం మాలపల్లి ఆడాళ్ళ మీద బాగా పడింది. అటు దొరల ఇళ్ళల్లో, పొలాల్లో పనులకు పోలేక, ఇటు పిల్లల్ని పస్తులుంచలేక నలిగిపోయారు. దొంగచాటునొచ్చి దొరసాను ల్ని కలిస్తే, ఇంట్లో మగాళ్ళకి తెలియకుండా ఇంత అన్నం, పచ్చడి, మజ్జిగతో పాటు అడ్డెడు బియ్యం మూట కట్టిచ్చేవాళ్ళం. ఒకరికొకరు ఓదార్చుకుని ధైర్యం చెప్పుకునే వాళ్ళం. ఆ రోజులే వేరు! ఇప్పుడంటే, కులాల పట్టింపు తగ్గినట్టే అనిపిస్తుంది. కానీ, లోపల్లోపల పట్టింపులు, హెచ్చుతగ్గులు మితిమీరుతున్నాయనిపిస్తుంది. నువ్వేమంటావ్‌…” అంటున్న తాతమ్మ మాటలు చెవుల్లో పడ్తున్నా బుర్రలో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలు నోటెమ్మట మాటరాకుండా చేశాయి.

తాతమ్మ విశ్లేషణ, ప్రగతి భావాలు తనని విస్మయపరిచాయి. ఆ తరం వాళ్ళు ఆలోచించినట్లు, మానవ సంబంధాలకి వాళ్ళు విలువిచ్చినట్లుగా ఈ తరం వాళ్ళు ఎందుకులేరా అని మధనపడింది. బాలవితంతువుల గురించి చదువుకున్నది గుర్తొచ్చి నోరంతా చేదు తిన్నట్లైంది. అందులోనుంచే తన చదువుకు సంబంధించిన భవిష్యత్‌ ప్రణాళిక మనసులో ఒక స్పష్టమైన రూపుదిద్దుకోగా పెదవులపై వెన్నెలలా నవ్వు పూసింది.

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.