జాతర్లంటే అన్ని జాతర్లు వేరు సమ్మక్క సారక్క జాతర వేరు. యీ జాతర ఆడవాల్ల జాతర, అడవి బిడ్డల జాతర. అడవి రాణులైన సమ్మక్క సారక్క జాతర. అది అడవి వరకే పరిమితమై తర్వాత పల్లెల్ని కలుపుకున్నది. ఆదివాసులైన సమ్మక్క సారక్కలు తమ సమాజాల సమూహాల ఆత్మ గౌరవం కోసం, అడివి అస్తిత్వం కోసం, జల్ జంగల్ జమీన్‌లపై ఆధిపత్యాలు నెరపే ఆగడాల మీద సమరం జేసిన చరిత్ర వారిది. అందికే వారి మగసమాజాలక్కూడ వారి శక్తుల్ని, చైతన్యాల్ని, పోరాట స్ఫూర్తి ముందటి తరాల మహిళలకు అందించేందుకు యీ జాతరలు నిర్వహించడం తప్పని సరైంది. సమరాలు నడిపిన సమ్మక్క సారక్క జాతరకు తెలంగాణ పల్లె జనమంత అందులో బహుజన కులాల జనం విపరీతంగా పోయేవారు.
కోమటి బాపని కులాలు, పటేండ్లు, దొరల కులాలు పోయేవి కాకుండె యిది వరకు. అయితే పోయిన సారి జాతర నుంచి కోమటి బాపని కులాలు, దొరల కులాలే కాక ఆధిపత్య కులాల వాల్లు కూడా పోయి సమ్మక్క జాతరను ఆగంజేస్తూ హిందువైజ్ జేయడం పెద్ద వైపరీత్యము. వీల్ల వల్ల అడివంత నరికేసి, ఎడారిగ జేసిండ్రు. బ్రాండి షాపులు, రికార్డు డ్యాన్సులు, హోటల్లు, స్నానాలకు నల్లాలు, పనికి మాలిన షాపులు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్సు, ఫ్లెక్సీలు, మాంసం కొట్లు, సెల్ టవర్స్, వాహన కాలుష్య బీభత్సమొక దిక్కు చేసే విధ్వంసమైతే… హిందూ గుడి కల్చర్ దూప దీప నైవేద్యాలు, మంత్రాలు, పురోహితులు, ప్రసాదాలు, పట్టు వస్త్రాలు బైటి హిందూ గుడుల కల్చర్‌ని ప్రవేశ పెట్టి ముంజ కాయల నీల్లసోంటి చిక్కటి అడవిలో పచ్చటి పర్యావరణంలో జంపన్నవాగులో జరిగే బహుజన మహిళ జాతరలు (మగవాల్లు తక్కువ) క్రమంగా మగవాల్లు పెరిగి తర్వాత దొరల కులాలు, బాపని కులాలు, పురోహిత కులాలు ఆక్రమించుకుంటున్న తీరు యింకో విధ్వంసం.
తెలంగాణలో మహిళ గ్రామ దేవతలు ఎక్కువగా వుండేటివి. యిండ్లల్ల దుర్గమ్మ, పోషమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ,
ఉప్పలమ్మ, సమ్మక్క సారక్క గద్దెలుండేవి (విగ్రహారాధన లేదు). ఆ గద్దెలకే యాడాది కోసారి తీరినపుడు తాటికల్లో, ఈతకల్లో పోసి, కోడింగోసుకొని తినే వాల్లు. సాధార ణంగా పల్లె దేవతలంతా బహుజన కులాల ఆడ వాళ్లే. యీ ఆడదేవతల పురోహిత కులాలు, దొరకులాలు హీనప రిచేది. యిక మగ దేవుల్లకోసం గద్దెలు గానీ, పోటోలు గాని వుండవు. మగ దేవుల్లలో మల్లన్న ఒక్కడే. యిదంత హిందుత్వము కాదు. ఒక ప్రాకృతికమైన ఆధ్యాత్మికము.
ఒక ముప్పయేండ్ల కింద నేను సమ్మక్క జాతర చూసినపుడు చిక్కటి, కాకులు దూరని కారడివిలా గుండేది. జంపన్నవాగు పొంగి పొర్లేది. సమ్మక్క, సారక్క గద్దెల చుట్టు యిప్పటిలా యినప కంచెలు లేకుండేవి. జనం ఎంత మందొచ్చినా ఆ దట్టమైన అడివిలో చెట్లకింద పిట్టల్లాగనే కనిపించె టోల్లు. కాని యిప్పుడు ఈ నీడ కోసం గూడ ఒక్క చెట్టు కనిపించకుండా చేసిండ్రు. ఆదివాసులది గాని హిందూ సంస్కృతిని బలవంతంగా రుద్దుతున్నారు.
యిది వరకు సమ్మక్క సారక్క జాతరంటే పల్లెజాతర, అడివి జాతర, ఆదివాసీ జాతరగుండింది. యిప్పుడా జాతరకు పట్నాలు కదలడంతో మొత్తం అన్ని రకాల కలుషితాలు చేర్తున్నయి. యిప్పుడు యీ జాతర మార్కెట్‌కు, రాజకీయానికి, హిందుత్వానికి జాతర కావడం పెను విషాదం.
వూరిబాదలు, కుటుంబ బాధలు, ఆరోగ్య సంబంద బాధలు, వ్యక్తిగత బాధలు కూలినాలి చేసి అల్సిన బాధలతో సతమత మయే మహిళలకు సమ్మక్క సారక్క జాతర ఒక ఆటవిడుపు. మూటముల్లె, ముడుపులతో ఎడ్లబండ్ల ప్రయాణముతో గూడేలు గూడేలు కదిలిపోతుంటయి. ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో కండ్లకు కానరాకుండా పోయిన బంధువులు, చుట్టాలు, ఆత్మీయులు, తెల్సినోల్లు యీ జాతర్ల కనబడ్తరనే ఆశతో, ప్రేమతో, మానవీయ తండ్లాటలు తీర్చుకోనీకి యీ జాతరకు బోతరు. యింకా చెప్పాలంటే ఒక స్వేచ్ఛా ప్రపంచపు వెతుకులాటలు జాతర్లలో తీర్చుకుంటరా అన్నట్లు కనబడ్తరు.
జంపన్నవాగుల్లో మునగడం, రువునీల్ల సంబురాలలో తనివితీరా స్నానాలు జెయ్యడం, చుట్టాలు బంధువులు, స్నేహితులతో కలిసి యాటకూరలు, కోడికూరలు, సెనిగె గూడాలు, సెట్టు కల్లు… ఒక్క సంతోషం గాదు. అది అడివి. పచ్చబొట్టేసిన జ్ఞాపకంగా దాచుకుంటది. యిక పల్లె ప్రేమికులకు జాతర ఒక జమిలి. గాజులు, పిన్నీసులు, బొట్టుపెట్టెలు, లాయిలప్పలు, సిల్కల పేర్లు, పూసల దండలు, పుంగీలు కొత్త కొత్త వస్తువులు పరిచయమయేది జాతర్లోనే.
పల్లెలు దాటి బైటికి బొయే అవకాశం లేని కూలి, శ్రమ జనమైన బహుజన కులాల మహిళలు మల్లా జాతరొచ్చే దాక రీచార్జ్ అయ్యే సంబురాల కోసం, వుప్పుసల కోసం జాతరకు బోతరు.
కాకతీయుల ఆధిపత్యాల మీద పోరాడిన సమ్మక్క సారక్కలు గొప్ప ధీర మహిళలు. ఆ మహిళలను గద్దెల మీదకి చిల్కల గుట్టడివి నుంచి ఆడవాల్లు తేవాలె మగవాల్లెందుకు తెస్తారు? సమ్మక్క సారక్కల సమర స్ఫూర్తి దెబ్బదియ్యడం యిక్కన్నుంచే మొదలైందేమో? జల్ జంగల్ జమీన్ సాధికారం కోసం ఆధిపత్యాలకు వ్యతిరేకం గా పోరాడిన సమ్మక్క సారక్కలకు కొనసాగింపు కొమురం భీమ్.
జీవన వాహిని
ఆకాశాన్ని చుంబించి
అవనినంతా పూదోటై విరబూస్తావుపురుషాధిక్య వలయాలను ఆన్కొందలా బందిస్తున్నా
కొత్త యుగానికి తలుపులుతీస్తూ
ఆత్మా విశ్వాసపు రెక్కలతో తోనీగల ఎగురుతావు
అవకాశాల్ని ఆవహిస్తూ
ఎవరిస్తూ శిఖరాల్ని బచెంద్రిలా అధిరోహిస్తావు
తారాజువ్వలా నింగికెగసి కల్పనా చావ్లా లా చిరునవ్వు చిందిస్తావు
మదర్ తెరిస్సాలా మమతల కోవేలవై
కరుణా సముద్రంమై ఉప్పొంగుతావు
నీ శ్రమ లేని మగవాని జీవితం ఆకులు రాలిన హేమంతం
నీ మెఅధ సముద్రమై పోతెత్తితే
శిరసువంచు తుంది రాజ్యాధికారం
పాదాక్రాంత మవుతుంది మూడో వంతు భాగం .
-పిళ్ళా కుమారస్వామి
కదిరి అనంతపురం
8106432949