నిన్నమొన్నటిదాకా డా|| బాబా సాహెబ్ అంబేద్కర్‌ని జాతి ద్రోహి అనీ, దేశద్రోహి అనీ బ్రిటిష్ ఏజెంట్ అనీ, జాతీయ బూర్జువా అనీ అగ్రకుల హిందూ వ్యవస్థలు అగ్రకుల రాజకీయ పార్టీలనుంచి, అగ్రకుల కమ్యూనిస్టు విప్లవ పార్టీలదాకా తిట్టి పోసినయి, తూలనాడినయి. మూడేండ్ల కింద కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రపంచ మేటిమేధావి గా ప్రకటిస్తే అది భారతదేశ మీడియాకు వార్త కాకుండా పోయిన సంగతులు యింకా మరువలేదు. అంబేద్కర్‌ని తొక్కిపెట్టే చర్యలు చాలా పకడ్బందీగా జరిగినా… అంబేద్కర్ యింకా పైకి లేవడం పీడిత జనం, అంటరాని జనం అతన్ని ముందుకు తీసుకుపోవడం వల్ల ఓటు బ్యాంకు రాజకీయాలు యిప్పుడు సడన్‌గా అంబేద్కర్‌ని ఆకాశానికెత్తడం మొదలు బెట్టినయి.
అంబేద్కర్ గొప్ప దేశభక్తుడనీ, ప్రపంచ మేధావి అని, తత్త్వవేత్త అని అంబేద్కర్ లేకుంటే మేము లేమనీ, సమాజోద్ధారకుడనీ అంబేద్కర్ భజన చేస్తున్నయి యునైటెడ్ నేషన్స్ నుంచి హిందూ సన్యాసుల్నించి రాజకీయ పార్టీల్నించి కమ్యూనిస్టు పార్టీల దాకా… అయితే దీంట్ల చాలా మతలబులున్నాయి.
భారత ప్రధాని ‘అంబేద్కర్ ఇంటర్నే షనల్ సెంటర్’ కోసం ఫౌండేషన్ స్టోన్ వేస్తే… తెలంగాణ, ఆంధ్ర సీఎంలు పోటీలు పడి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాలు, కన్వెన్షనల్ పార్కుల కోసం ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు. అయితే బాధాక రమైన విషయ మేమిటంటే… అంబేద్కర్ హిందూమత ప్రత్యర్థి, హిందూమత వ్యతిరేకి. కులకట్టడిని నిలిపివుంచే హిందూమత వ్యవస్థకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన అంబేద్కర్ 125 అడుగుల విగ్రహానికి హిందూ మత విలువలలో దీప ధూప పూజారుల మంత్రోచ్చా రణలతో శంకుస్థాపన జరగడం తీరని వేదన. అమాననీయ, అసమాన మానవ విలువల తో మనుషుల్ని పశువులకన్నా హీనంగా చూసే హిందూమత వ్యవస్థని చీల్చి చెండాడి, బుద్దిస్టుగా మారిన అంబేద్కర్‌ని 125 అడుగుల విగ్రహం పేరుతో అంబేద్కర్ భావజాలానికి పూర్తి భిన్నమైన హిందూత్వ పద్ధతిలో మంత్రాలు, పూజాది కర్మలతో అగ్రకుల ఆసామి పార్టీలు అంబేద్కర్‌ని 125 అడుగుల లోతుల్లో పాతిపెట్టే శంకుస్థాపన గానే కనిపించింది. యిక ఆ ప్రోగ్రామ్ చుట్టూ దళిత నాయకులమని బ్రాండేసుకున్న వాల్లు యీ హిందూ తంతు శంకుస్థాపనను వ్యతిరేకిం చకుండా… అంబేద్కరిస్టులమని చెప్పుకుంటున్న వీల్లు కుంకుమబొట్ల వీరాంజ నేయులై (వీరబాంచలై) ఆ శంకుస్థాపనలో వూరేగడం జాతి విషాదం, అంబేద్కరిజ విషాదం, చారిత్ర కంగా అంట రాని జాతులు తెగలు హిందూ మతంలో భాగంగా లేరు. హిందూమతం జెప్పే పురుష సూక్తంలో ముఖాలల్ల, బుజాలల్ల, పొట్టల్ల, పాదాల్ల లేరు. వీల్లు జాంబవీయులుగా, చార్వాకులుగా, లోకాయుతులుగా, సాంఖ్యాయ నులుగా, బుద్ధిస్టులుగా వున్నారు. యీ పునాదులు మరిచి జాతి శత్రువైన హిందూ దూప దీపాలతో అంబేద్కర్‌ని పాతేసే ఫౌండేషన్ ‘స్టోన్’ కి పాదుగా వుపయోగపడడం జాతి ద్రోహం. అంబేద్కరిస్టులమని చెప్పుకుంటూ అంబేద్కర్‌ని పాతేయడమే.
అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ప్రపంచ పటమ్మీదికొచ్చాక, అతను ప్రపంచ పీడిత మానవ పక్షపాతిగా గ్లోబంతా వ్యాపిం చాక యునెటైడ్ నేషన్స్ కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు (125వ) చేసి మేము కూడా పీడిత జనం వైపు వున్నామని చెప్పుకో డానికి. (కాని ఆ ఉత్సవ వీడియోల్లో… ఊరేగింపులో ఒక్క తెల్లమొకం కనిపించలే!
యిక కుల వ్యవస్థను రూపు మాపడానికి ఎంత పోరాడిండో మహిళా విముక్తికి కూడా అంత పోరాడినాడని ఆనాటి పత్రికలు చూస్తే అర్థమైతుంది. కుల వ్యవస్థలో సవర్ణ మహిళలు కూడా బాధితులని, పీడితులని వారికి బాసటగా నిలిచిన గొప్ప మహిళా పక్షపాతి అంబేద్కర్. ఆ కాలం కమ్యూనిస్టు మహిళా సంగ నాయకులు తమ పుస్తకాల్లో కూడా యీ విషయాల్ని ప్రస్థావించారు అక్కడక్కడ. మహిళలకై తనెంతగా శ్రమిం చింది, బాసటగా నిలిచింది అనే విషయాలు 1940 నుంచి పత్రికలు తిరగేస్తే అర్థమైతుంది.
సవర్ణమగవాల్లు, సవర్ణ ఆడవాల్లు కొద్దిమంది తీవ్రంగా హిందూకోడ్ బిల్లును వ్యతిరేకిస్తున్నా కూడా… అంబేద్కర్ మహిళా సమస్యల్ని, వారి హక్కుల్ని మానవీయ కోణం తో, దృక్పథంతో అవగాహనతో హిందూకోడ్ బిల్లు తయారు చేసి పార్లమెంటులో ప్రవేశపెట్టాడు. దాన్ని నిర్దాక్షిన్యంగా వీగి పోయేట్టుచేసి ఆడవాల్లని అంబేద్కర్‌ని తీవ్రంగా అవమానించినయి సవర్ణ పితృ స్వామ్య వ్యవస్థలు. హిందూకోడ్ బిల్లును ఓడించడమంటే అంటరాని వాల్లను ఆడవాల్ల ను (సవర్ణ) ఓడించడమే (1951 ఫిబ్రవరి 5వ తేది) ఓడించడానికి నిరసనగా తన మంత్రి పదవినే ఒదిలేసిండు అంబేద్కర్.
నిజానికి, హిందూకోడ్ బిల్లులో వారసత్వహక్కు, ఆస్తిహక్కు, దత్తత స్వీకారహక్కు పునర్వివాహాల్లాంటివి, యింకా అనేక సమస్యలు సవర్ణ మహిళా సంబంధమైనవే. చరిత్ర నిర్మాతలు జాతివీరులు, శూరులు అని చెప్పబడ్తున్న మగవాల్లే పార్లమెంటులో మహిళా హిందుకోడ్ బిల్లును ఓడించారు. చరిత్రలో మహిళా ద్రోహులు, వ్యతిరేకులు అణచివేతదారులే కనబడ్తారుగానీ అంబేద్కర్‌లా మహిళల కోసం నిజాయితీగా పోరాడి, త్యాగపూరితమైన మద్ధతును, అండను ప్రకటించిన నాయకుడు కనబడడు. యింత గొప్ప జెండర్ వాదియైన అంబేద్కర్ అంటరాని వాడయినందునే (యింతింత సర్వీస్ పొందినా కూడా) మన సవర్ణ మహిళా సంగాలు, ఫెమినిస్టు సంగాలు అంబేద్కర్‌ని గుర్తించయి, గౌరవించయి, గుండెలకు హత్తుకోవు.
మహిళాజన విముక్తికి శ్రమించిన, త్యాగంజేసి, మహిళా మానవ హక్కుల కోసం పోరాడిన అంబేద్కర్ భావజాలానికి ఆశయానికి విరుద్ధంగా, పూర్తి వ్యతిరేకంగా, అంబేద్కర్ జపం చేస్తున్న దళిత మగ సంగాలు యిప్పటి దాకా జరిగిన అంబేద్కర్ ఉత్సవ కమిటీల్లోకి దళిత మహిళల్ని రానియ్యలేదు. కాని ఆ
ఉత్సవ కమిటీల్లో మాకు భాగముంది అని గొడవచేసిన దళిత మహిళల్ని నిర్దాక్షిణ్యంగా పక్కన బెట్టారు దళిత మగవాల్లు. మేము భాగమైతాము అని పోట్లాడిన మేరి మాదిగ లాంటి దండోర మహిళల్ని అవమానించి పంపించారు. వాల్ల నిరంతర నిలదీతవల్ల పోయినేడు ‘జీవ’ చైర్పర్సన్, యీయేడు మేరిమాదిగ వైస్ చైర్ పర్సన్ కావడం అంబేద్కర్ ఆనందించే విషయము. రేపు మా దళం ఆడవాల్లము పాలకులైతేనే అంబేద్కర్ ఆశయం పరిపూర్తవుతుంది.