ఈ మధ్య కాలంలో పుస్తక ఆవిష్కరణ వేడుకలు చూస్తూంటే సాహిత్యానికి మునిపటి వైభవం తధ్యమనిపిస్తోంది. సాహితీ ప్రియులంతా ఈ మధ్య కాలంలో కొంత నిరాశకు లోనైన మాట వాస్తవం. పుస్తక పఠనం పుస్తకాల పట్ల ఆసక్తి తగ్గిందని ఉవాచ. కానీ ఈతరుణంలో 2016 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెల వరకు జరిగిన ఆవిష్కరణలు చూస్తుంటే పై భావనలు కొట్టిపారేయవలసిందే.
మొదటగా ఫిబ్రవరి 21న రవీంద్రభారతి, మినీ హాలులో నంబూరి పరిపూర్ణగారి ‘శిఖరారోహణ’ కథలు – వ్యాసాలు పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఈ పుస్తకాన్ని ఆలూరి విజయలక్ష్మి గారు ఆవిష్కరించగా, నవ్య జగన్నాధశర్మ గారు ఆత్మీయ సంభాషణ చేసారు. చంద్రశేఖర్ అజాద్ గారు పుస్తక పరిచయం చేసారు. ఆమె రచనలు సమాజంలో ఉన్న పరిస్థితుల పట్ల తీవ్రనిరసన, అంతులేని ఆవేదనలకు ప్రతిరూపాలుగా వర్ణించారు. ఆరోగ్యకరమైన అసహనం గురించి, కలవరపడ్డ మనసు స్పందన గురించి ఎంతో ఉత్తేజంగా వివరించారు. చివరగా పరిపూర్ణగారి ఉత్తేజపూర్వకమైన రచయిత్రి స్పందన మహాద్భుతంగా ఉంది. సభ ఆద్యంతం ఉద్వేగ పూరిత వాతావరణంలో ఎంతో ఆనందంగా జరిగింది.
మార్చి 20, 2016న దాసరి శిరీష గారి మనోవీధి కథల పుస్తకం ‘సప్తపర్ణి’ ప్రాంగణంలో ఆవిష్కరణ జరిగింది. ఈ పుస్తకాన్ని అనిల్ అట్లూరి ఆవిష్కరించారు. జి.యస్.రామ్మోహన్ గారు పుస్తక పరిచయాన్ని చేసారు. 1980 నుంచి దాదాపు మూడు దశాబ్దాల పాటు సామాజికంగా, ఆర్థికంగా వచ్చిన మార్పులు, అవి మహిళల జీవితాన్ని ఎలా ప్రభావితం చేసాయి అన్న విషయాన్ని వివరించారు. చూపు కాత్యాయని, భూమిక నుంచి కె. సత్యవతి మాట్లాడారు. ఒక చల్లని సాయంత్రం మంచి వాతావర ణంలో సాహితీ మిత్రుల కలయిక అద్భుతంగా గడిచింది.
ఏఫ్రిల్ 9, 2016న వేమూరి రాజేష్ రచించిన ‘నా ఐరోపా యాత్ర’ పుస్తకం కూకట్పల్లి వేదిక ఆవరణలో జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత దాసరి అమరేంద్ర గారు ఆవిష్కరి ంచారు. రచయత ఉద్యోగార్ధి అయి పొలెండ్ వెళ్ళిన సందర్భంలో అక్కడ చూసిన హిట్లర్ కాన్సన్ట్రేషన్ క్యాంప్‌లను చూసిన సందర్భంలో వెలువడిన పుస్తకం ఇది. కాకతాళీయమైన ప్పటికి ఈ పుస్తకం తెలుగు ప్రజలకు వరం అని చెప్పక తప్పదు. అక్కడి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లుగా తెలియ చెప్పింది ఈ పుస్తకం.
27.4.2016న డా.షాజహాన్ రచించిన ‘లద్దాఫ్ని’ పుస్తకం ముస్లిం స్త్రీ కథలు పేరిట ఆవిష్కారం జరిగింది. ప్రొ|| ముదిగంటి సుజాతారెడ్డి గారు ఆవిష్కరించిన ఈ సభలో యాకూబ్, కె.శ్రీనివాస్, విమల పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కథలు అస్థిత్వ పోరాటంలో భాగంగా ఆవిష్కారమైన జీవ చరిత్రకు తార్కణాలు. ముస్లిం స్త్రీలు, అందునా దూదేకుల సమాజంలో స్త్రీల వెతలు, వారి బాధలు కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించారని వక్తలు షాజహానాను కొనియాడారు. మరిన్ని ఈ తరహా కథలు రావాలని షాజహానానుకోరారు.
పై పుస్తకాలన్నిటిలోనూ సమాజంలో సగభాగమైన స్త్రీలపై జరిగే అప్రకటిత యుద్ధాలు, దాడులు గురించి, అంటే అన్ని వైపుల నుండి స్త్రీలపై పడే ప్రభావాలు, వీటివల్ల ఛిద్రమవుతున్న వారి జీవితాలు, పితృస్వామిక సమాజం పోకడలు, ప్రపంచీకరణ నేపధ్యం, దళిత బహుజనులు ఏకం కావలసిన పరిస్థితులు, అస్థిత్వ వాదాలు, హిందూత్వ పెడధోరణులు వెరసి ప్రస్తుతం సమాజం ఎదుర్కుంటున్న సమస్యలు, మరీ ముఖ్యంగా స్త్రీలపై పడుతున్న పెనుభారాన్ని వివరించి ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో జ్ఞాన బోధలు చేసిన రచనలు కొన్ని, మహిళలు ఎలా సంఘటితం అయి ఈ పరిస్థితుల నుంచి బయటపడాలోతెలియ చెప్పాయి. మహిళల కు విద్యా ఉద్యోగంతోపాటు ప్రపంచ జ్ఞానం ఎంత అవసరమో, అనవసర, పాతకాల భావనలను వదిలించుకుని నవతరం ఆశలు, ఆకాంక్షలను ఎలా ఒంట బట్టించుకోవాలో తెలియచెప్పాయి ఈ పుస్తకాలు. మరోవైపు జాత్యాహంకార ధోరణలు ఎంత ప్రమాదక రమో చెప్పాయి. కొత్త ప్రదేశాలు, భిన్న సంస్కృతులు పరిచయం చేసేవిగా ఉన్న ఈపుస్తకాలు బహుదా ప్రశంసనీయం. ‘నన్నెవరూ నువ్వెవరూ అని అడగవద్దు’ అనే స్వేచ్ఛాగీతిక బహుశా ఇవాళ సమాజరీతికి సవాలు కాగలదు.
24, ఏఫ్రిల్ 2016న శివలెంక రాజేశ్వరి దేవి రచించిన కవితల పుస్తకం గోల్డెన్ త్రెషోల్డ్ ప్రాంగణంలో ఆవిష్కరింపబడింది. ఈ పుస్తకాన్ని ఇంద్రకంటి శ్రీకాంతశర్మ ఆవిష్కరించారు. అంబటి సురేంద్ర రాజా, డా.సమత తదతరులు పాల్గొన్న ఈ సభ శివలెంక రాజేశ్వరీ దేవి మనో ఫలకాన్ని, ఆవిడ వాదాన్ని బలంగా వివరించింది. వ్యక్తిస్వేచ్ఛకు విఘాతం కలుగుతున్న నేటి తరుణంలో ఆమె భావాలు సరి అయిన సమాధానాలు అని వక్తలు ఉద్ఘాటించారు.