తెలుగు సాహిత్య వనంలో ‘పుప్పొడి’ని మొసుకొచ్చిన సుజాతా పట్వారి, ఇటీవలే ‘పిట్టకు ఆహ్వానం’ అంటూ కవిత్వ పుస్తకంతో ఆహ్వానాన్ని పంపింది. ఇప్పు డున్న సామాజిక సందర్భానికి తగినట్లు గా ఈ పేరుంది. సుజాతా పట్వారీని గురించి ఇవాళ నేను కొత్తగా పరిచయం చేసేదేం లేదు. చాలా సీరియన్ పొయిట్‌గా ఆమెకున్న పేరు చిరపరిచితమే.
‘చేరా’ గారు ఆరోజుల్లోనే ‘కవయిత్రుల్లో మరో కొత్త కెరటం’ అన్నారు. సుజాతా పట్వారీని ఇటీవలి కాలంలో వస్తున్న ఏదో ఒక కవితా ధోరణికి కట్టిపడెయ్యటం కుదిరేపనికాదు. ఈమె పని గట్టుకొని కవిత్వం రాయదు. ఏదో ఒక భావ వీచిక తన ఎదను కదిలించి నప్పుడే కవిత్వం రాస్తుంది. ఈమెకు తన కవిత్వం ద్వారా ఏదో సందేశం వినిపించాలన్న తపన లేదు. ఒక ప్రణాళిక ఉండదు. కవితా వస్తువు ఫలానిది ఉండాలన్న నియమమూ లేదు. అందువల్లనే కాబోలు అచ్చమైన కవయిత్రి కాగలిగింది. అతిశయోక్తిలో కూడా రమణీయ కల్పనను ఇమడ్చగల శక్తిమంతురాలు. నిండు అమావాస్య రోజు చంద్రుడు కావాలన్నా వాళ్ళ నాన్న తన కోసం మబ్బుల్ని తవ్వి వెన్నెల జల పుట్టించే వాడట.
మామూలు మాటల్నే సింబల్సుగా వాడి మనను ఆలోచింప జేస్తుంది. ఈమెకు రాతి నుంచి కూడా కవిత్వాన్ని పిండగల శక్తి
ఉందని పిస్తుంది. శక్తిమంతులైన కవులకు అమలులో ఉన్న భాష చాలదు. కొత్త కొత్త పదాలను సృష్టించు కుంటారు. పాత మాటలకు కొత్త అర్థాలను కల్పిస్తారు. అలా ‘డిక్షన్’ ను సృష్టించుకున్న తీరు ఈ కవయిత్రిలో వుంది. చాలా నిరాడంబరతే ఈమె కవిత్వమంతటా కన్పించే మంచి గుణంగా చెప్పొచ్చు.
నగరాలన్నీ ఒట్టిపోయి, అరణ్యాలన్నీ సంహరింపబడి చెట్టుకొకరు పిట్టకొకరుగా విడిపోతున్న సందర్భంలో, ప్రకృతి మరిచి పోతున్న మనుష్యులందరి తరపున ‘పిట్టకు ఆహ్వానాన్ని’ హృదయ పూర్వకంగా ఈ కవయిత్రి చేసింది. ‘గుజిహాళం రఘునాధం’ అక్షరాల్లో ఈమెను గురించి చెప్పాలంటే… ‘ఈ స్వరం గురించి మాట్లాడటం అపురూప గౌరవం, అసూయ పడాల్సినంత లాలిత్వమూ లేదు. అబ్బుర పడాల్సినంత ఊహా, కాదు. చెంపలు వాయించగలిగే శక్తి అక్కడక్కడ. వర్తమానమా ఇదో గమ్మత్తువనం. ఈమె దవనం, మరువం కూడా. పలికితే చాలు. ఇంత పరిమళము!’ – ఒక పేరియన్ రైటర్ సుజాత కవిత్వాన్ని పలవరించిన తీరు అద్భుతమనిపించింది.
అలాగే ‘చూపు కాత్యాయని’ మాటల్లో… ‘తన మనసును కదిలించిన ఏ అంశాన్నయినా అలవోకగా కవిత్వం చెయ్యగలదు సుజాత. ఏ ప్రత్యేక సందర్భంలో ఏం రాస్తే ‘ప్రయోజనం’ ఉంటుందోన్న ప్రణాళికలేమీ ఆమెకుండవు. ఆమెవైన ప్రత్యేకతలూ, పరిమితులూ, స్పష్టంగా ప్రతిఫలించే ‘అద్దం’ లాంటి కవిత్వమిది అన్నారు.
ఈ కవిత్వాన్ని చదువుతుంటే, వినడానికి పిట్ట కూడా వచ్చి మన భుజాల మీదో గుండెల మీదో కూర్చుంటుంది సుమా! అన్పించేట్లు గా మెత్తగా ఉంటాయి కవితలన్నీ. అందుకే శివాజీ గారు కూడా – ‘కాస్తంత తేమ తగలగానే కాలం మరచి సూక్ష్మంగా ముడుచుకుని నిద్రించే పూలచెట్టు ఒకటి విత్తన కవచం దాటి వచ్చి మన మనసును పలకరించినట్లే వున్నాయి ఇందులో కవితలు… అసలు కవిత్వం చేయాల్సిన పనే ఇదన్నట్టు గుర్తు చేసే యోగ్యత గల పదధ్వని ప్రతికవితలో పల్లవిస్తుంది’ – అన్నారు.
వాకపల్లి గిరిజన స్త్రీలపై జరిగిన హింసకు నిరసనగా ‘నీడలమాటున’ కవిత రాసింది. ‘భూమిక’ టూర్‌లో వెళ్ళినప్పుడు వారిని ప్రత్యక్షంగా కలిసిన సందర్భంలో అతలాకుతలమైన ఆమె మనస్సంతా ఈ కవితై రూపుకట్టింది.
అమృతలత మీద ఆదిలాబాద్ అడవుల్ని చుట్టివచ్చిన నేపథ్యంలో రాసిన కవిత ‘నద్వైతం’. ప్రతి కవితకూ పేర్లు పెట్టడంలోనే విలక్షణత ఉంటుంది. లోతైన, కొత్త అర్థాలుంటా యందులో. పతంజలి గారి స్మృతిలో రాసిన కవిత ‘ప్రణమమ్యషమ్’. ‘యుద్ధాన్నయ్యాను’ కూడా చాలామంచి కవిత. 2006లో అనుకుంటా ‘జెన్ చుక్కలు’ అనే కవిత రాస్తూ అందులో తన ప్రియ నేస్తమైన కొండవీటి సత్యవతి గురించి చిన్నగా రాసిందిలా-
చిటారు కొమ్మన మిఠాయి పొట్లానికెళితే
కొమ్మల్లో సత్యవతి ఇక మిఠాయెందుకు? – అని తేల్చేసింది.
‘తల్లావఝ్జుల శివాజీ’ గారు అద్భుతమైన ముఖచిత్రాన్ని వేశారు. పచ్చపచ్చని రంగుల కలయికలు, ఊహల నెమలీకలు, ఊదారంగుల అన్వేషణలు, సాదాసీదా మాటలు, తానే ఒక పిట్టై, ప్రకృతై కవిత్వం పలవరించిన, కలవరించిన, కల-వరించిన ఎన్నెన్నో దృశ్య మాలికల్ని ఆ చిత్రంలో పొందుపరిచారు. 37 కవితల్తో మనముందు కొచ్చిన ఈ కవిత్వాన్ని ఆద్యంతమూ చదివి సంతోషిద్దాం. యు.ఆర్. అనంతమూర్తి కన్నడ భాషలో రచించిన ‘సంస్కార’ను తెలుగులోకి అనువదించితే దానికి తెలుగు యూనివర్సిటీ ఉత్తమ అవార్డును ఇచ్చింది. నారాయణరెడ్డి అవార్డు కూడా వచ్చింది.
ఇంతకాలానికైనా, మాలాంటి మిత్రుల ‘పోరు’ పడలేక పుస్తకాన్ని తెచ్చిన సుజాతకు అభినందనలు. గద్వాల్‌లో జన్మించిన సుజాత, ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రిన్సిపాల్‌గా ఉద్యోగం చేస్తున్నారు. తులనాత్మక సాహిత్యంలో అభిరుచి. శ్రీ ఎ.కె. రామానుజ్ గారి రచనల పట్ల ఆకర్షితులై పరిశోధన చేస్తున్నారు. అనువాదాలు అద్భుతంగా చేయగలరు. ఆసక్తి కూడా ఎక్కువుంది. ఒక మంచి పుస్తకాన్ని తప్పకుండా చదవండి.
ప్రథమ ముద్రణ – జనవరి 2016, వెల – రూ.50/-, ప్రచురణ – అనిరుధ్ ప్రచురణలు, ప్రతులకు – అన్ని పుస్తకాల షాపులు, ముద్రణ – ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్ ప్రెస్