నా ఇరవైల వయసంతా, నా వయసులోని స్త్రీలందరిలాగే, నాలో మాతృత్వం మేలుకోవడం కోసం ఓపిగ్గా ఎదురు చూశాను. కాలం గడుస్తున్న కొద్దీ, నాలో అసలాభావన లేదేమోనన్న అనుమానం కలిగింది. నాకు పిల్లలంచే ఇష్టం లేదనికాదు; నిజానికి నా ప్రాణ స్నేహితుల పిల్లలతోనూ, మా కుటుంబంలోని కొంతమంది పిల్లల్తోనూ గడపడమంటే నాకు చాలా ఇష్టం. కాని నాకు స్వంత పిల్లలు కావాలన్న భ్రాంతి మాత్రం ఎప్పుడూ లేదు, అంతే. అయితే రెండేళ్ళ క్రితం, నాకు 30 ఏళ్ళు వచ్చినపుడు ఏదో మార్పొచ్చింది. నా చుట్టూ ఉన్న, నా వయసువారంతా వారి వారి జీవితాలననుసరించి సరైన సమయానికే తల్లిదండ్రులయ్యారు. వాళ్ళు ఉద్యోగాల్ని, వ్యాపకాల్ని, మంచి ఆరోగ్యాన్ని, సామాజిక సంబంధాల్ని కొనసాగించడాన్ని, ఇంకా, పిల్లల్ని పెంచడాన్ని… అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోడాన్ని చూస్తూ ఇంత శక్తి, ఓపిక ఎక్కడనుంచి వస్తున్నాయా అని ఆశ్చర్యపోతుండేదాన్ని.
నాకిప్పటికీ పిల్లల్ని కనాలన్న కోరిక బలంగా కలగలేదు, కాని తప్పకుండా వాళ్ళతో సమానంగా సమాజంలో నేనూ ఇమడా లన్న ఒత్తిడిని అనుభవించడం మాత్రం నాలో ప్రారంభమైంది. లేదా, బహుశా, నాకు పిల్లలెందుకు లేరనేదానికి వివరణ ఇవ్వటంతో అలసిపోతున్నట్లున్నాను. ఒకవేళ ఇన్నాళ్ళ నుండి నాకొచ్చిన ఒక్కో ఉచిత సలహాకి ఒక్కో రూపాయి వచ్చుంటే, ఈ పాటికి ఎప్పుడో నేను రిటైర్ అయిపోగలిగేదాన్ని.
”ఒక విషయం తెల్సా, చిన్న వయసులోనే తల్లైతే, బిడ్డలు చిరాయువులుగా ఉంటారు, ఇదినిజం.” ”ఎంత తొందరగా గర్భవతైతే మగ పిల్లాడు పుట్టడానికి అంతెక్కువ అవకాశం ఉందని విన్నాను. నువ్విది ఆలోచించాల్సిందే.”
”కానిచ్చెయ్, బిడ్డని ఇప్పుడే కనేసెయ్. బాధ్యతలు పూర్తి చేసేసుకో. అప్పుడు నువ్వు 40ల్లోకి వచ్చేసరికి పూర్తిగా ఫ్రీ అయిపోతావ్. ముందే ప్లాన్ చేసుకోరాదు?” కుటుంబం అంతా కలిసినపుడైతే నేను పిల్లల్తో కలిసుంటే ఈ కుట్ర మరింత చిక్కబడేది.
”చూడు, పిల్లల్తో నువ్వెం తబాగా కలిసిపోతావో నీకు పిల్లలంటే అంతిష్టం! మరి స్వంత పిల్లలు వద్దని ఎందుకను కుంటున్నావ్? నాకిది అర్థమే కాదు.” ఏదో కొంతసేపు పిల్లల్ని ఆడించగలగడం ఒక్కటే నేను మంచి తల్లవ్వటానికి కావల్సిన అర్హతైనట్లు. ఏమో అవుతా నేమో… కాని నేనసలు తల్లి నవ్వాలనుకోకపోతే?
మాతృత్వం అనేది పరిణితికి సంబంధించిందన్న భావన మనలో లోతుగా నాటుకుపోయింది. అందుకే దానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా అది పిచ్చితనంగా చూస్తారు. నువ్వు యుక్తవయసు కొస్తే పెళ్ళి చేసుకుని తీరాల్సిందే. పెళ్ళైతే పిల్లల్ని కనాల్సిందే. (లేదా కనీసం అందుకు ప్రయత్నమన్నా చేయాలి). ఇక పిల్లల్ని కనడం అనేది పూర్తిగా వ్యక్తిగతమైనదైనా, ఎందుకు ఎలా అనే విషయాలమీద ఉచిత సలహాలు పడేయడమనేది తల్లిదండ్రులకి, అత్తమామలకి, ఇరుగు పొరుగుకి చాలా మామూలు విషయం.
ఎవరో ఒకరు నా ”వయసైపోతోంద”ని నిరంతరం గుర్తు చేస్తుండటంతో నేనూ పరిపూర్ణురాలినన్న అనుభూతి పొందడానికి మాతృత్వాన్ని పొందాల్సిందేనని అనిపించేది. నిజాయితీగా చెప్పాలంటే, పిల్లలు లేకపోవడం వల్ల నేనెప్పుడూ వెలితిగా ఫీలవ్వలేదు. నాకు తెల్సు, నా భర్తకి కూడా ఎప్పుడూ అలా అనిపించలేదు. మరి ఎందుకని నాలో ఎదో లోపముందని అనిపిస్తోంది నాకు? ఎందుకంటే, ఇప్పుడు నాలో చిన్నితనం కొంత అవమానం, సిగ్గు, చిన్నతనం అనే భావన పేరుకుంటోంది – నా సొంత ణచీూతో బిడ్డని కని, పెంచాలన్న ఒత్తిడికి లోనవ్వడం నిజమే, కాని నాకసలు ఇదంతా వద్దనిపించింది.
పిల్లల్ని కనాల్సిందే అన్న భావన మనలో ఎంత లోతుగా పాతుకుపోయిందంటే విశిష్టమైన పెద్ద భారతీయ కుటుంబం అన్న దానిపై ప్రేమ, అనుబంధం చూపించాలన్న యావతో అన్నిట్లో తలదూర్చే కళలో పరిపూర్ణులమైపోయాం. ఒక స్త్రీ తను పిల్లల్ని కనాలా, వద్దా అని నిర్ణయించుకోవడంలో ఎవరెవరో కల్పించు కోడాన్ని కూడా కాదనం, ఒప్పేసుకుంటా. ఇది కొంతకాలానికి ఎంతో ఆత్మస్థైర్యం, ఆత్మ విశ్వాసం ఉన్న స్త్రీని కూడా పిల్లలు లేని జీవితంతో ముడిపడున్న వెలివేస్తారేమోనన్న భయానికి లొంగిపోయేలా చేస్తుంది. ఇది ఎంతగా ఉంటుందంటే, గైనకాలజిస్ట్‌ని కలిసి గర్భనిరోధక మార్గాల గురించి తెల్సుకోవాలన్నా కూడా సిగ్గుపడేంతగాచేస్తుంది.
”నీకు Iఖణ ఎందుకు?”
”ఒకవేళ నువ్వు మనసు మార్చుకుని పిల్లల్ని కనాలనుకుంటే అప్పుడు ఇబ్బందులు ఎదురైతే ఏం చేస్తావు?”
ఇంకా అన్నింటికంటే హీనం: ”ఏదోఒకరోజు దీనికి నువ్వు పశ్చాత్తాపపడతావు” అనడం. ప్రతీ ఉచిత సలహా కూడా
భారతీయ స్త్రీల శరీరాలు మన సమ్మతితో పని లేకుండానే ఎలా నిఘాకి గురౌతాయో, ఎలా మన ఆలోచనతో పనిలేకుండానే ఒక సంస్కృతితో ఏర్పాటైన పరిమితులలో ఇమిడిపోవడం నయమని పించేలా ఉంటుందో… ఒక నమూనాలా ఉంటుంది. ఇది స్త్రీలు ఎంపిక చేసుకోకపోయినా మాతృత్వాన్ని వారిపై రుద్దేలాంటి ఒక విస్తృత సాంస్కృతిక సంసిద్ధతని ప్రతిఫలిస్తుంది. ఇది చాలాసార్లు హింసాత్మక పరిణామాలతో కూడి ఉంటుంది.
ఇప్పటికీ మాతృత్వాన్ని విజయానికి, ఒప్పుదలకి గుర్తుగా నిలబెడ్తున్న ఈ ప్రపంచంలో, నీ జీవితంలో ఇంకేం చేద్దామనుకుంటు న్నావనే దానితో సంబంధంలేకుండానే పిల్లలు వద్దనుకునే నిర్ణయం పిల్లతనంగానో, సోమరితనంగానో లేకపోతే తిరుగుబాటుగానో కనిపించడం మామూలే. పిల్లలు లేకుండా ఉండిపోవాలనుకున్న నా నిర్ణయం, నా హక్కు ”స్వార్థం”గా ముద్రవేయబడింది. గత సంవత్సరం, ”స్వార్థం, అల్పబుద్ధి మరియు తనలో తాను లీనమైపోవడం : పిల్లలు వద్దనుకున్న 16 మంది రచయిత్రుల నిర్ణయం” (సెల్ఫిష్, షాలో అండ్ సెల్ఫ్ అబ్సార్బడ్ : సిక్ట్సీన్ రైటర్స్ ఆన్ ది డెసిషన్ నాట్ టు హేవ్ కిడ్స్) మేఘన దావుమ్ ఎడిట్ చేసిన పుస్తకం దొరికింది. రెచ్చగొట్టేలాంటి టైటిల్ ఉన్న ఈ పుస్తకం మాతృత్వం చుట్టూ అల్లుకుపోయిన అపోహలని సవాలు చేస్తూ వ్రాసిన చక్కటి వ్యక్తీకరణతో కూడిన, స్పష్టమైన, నిజాయితీతో కూడిన 16 వ్యాసాల సంకలనం.
జీవితంలో మొట్టమొదటిసారి నాలాంటి ఇంకొంత మంది
ఉన్నారని తెల్సుకున్నాను: పిల్లలు లేకుండానే సంతృప్తికరమైన జీవితాల్ని గడిపిన నిజమైన వ్యక్తుల నిజజీవితాలు. ప్రతి వ్యాసంతోను, మన దేశంలో మనం రెండో పార్శ్వం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటామో అర్థమైంది. గోడమీద పిల్లిలా కూర్చున్న లేదా పిల్లలు లేకుండా
ఉండిపోవాలన్న ఆలోచన వైపు మొగ్గు చూపుతున్న కొంత మంది స్నేహితులలో వ్యక్తిగత చర్చల్లో తప్పించి బయటెక్కడా నేనెప్పుడూ నాయీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా మాట్లాడటం నాకు గుర్తులేదు.
దావుమ్ యొక్క ఈ వ్యాసాల సంకలనంలో ఆ మరో పార్శ్వం వివిధ ధృక్కోణాల నుంచి చక్కగా ఆవిష్కరించబడింది. ఇవి పిల్లలు లేని జీవితాన్ని పూర్తి ఎరుకతో ఎంచుకోడానికి ఎన్ని రకాల కారణాలున్నాయో అన్ని రకాల సందర్భాలను, అనుభవాలను కూడా తెలియచేస్తున్నాయి. ప్రతి రచయిత కూడా నిండైన, సంతోషంతో కూడిన, భావాత్మకమైన పరిపూర్ణ జీవితాన్ని గడుపుతున్నారు. దావూమ్ యొక్క పుస్తకం నాలో పిల్లలు లేని జీవితాన్ని ఎంచుకోవడం తప్పేమీకాదని భావించేలా చేసింది. ఏదో ఒక వివరణతో నాకు నేను సర్దిచెప్పుకోవాల్సిన అవసరం లేదనిపించింది. ఖచ్చితంగా, నేను సారహీనంగా డొల్లగా కాకుండా చేసింది.
నిజానికిది ఎంతో ఆలోచించిన తరవాత పూర్తి ఎరుకతో నేను ఎంచుకున్న మార్గమన్న నిజాన్ని తోసిపుచ్చి జనం నాతో ”ఏదో ఒకరోజు దీన్నించి బయటపడతావులే, అంతా మంచే జరుగు తుంద”ని అంటుంటారు. దావూమ్ తన పుస్తక పరిచయంలో ఈ విషయం గురించి చక్కగా వ్రాసింది: ”ఇది మనం ఆత్మజ్ఞానాన్ని ఆత్మశోషణగా పొరపాటుపడటాన్ని ఆపాల్సిన సమయం”.
ఈ పుస్తకంలోని వ్యాసాలలో నాకు ఎంతో నచ్చిన ఒక వ్యాసం జీన్‌ని సఫర్ వ్రాసిన ”మాతృత్వానికి ఆవల” (దీవవశీఅస వీశ్ీష్ట్రవతీష్ట్రశీశీస). ఇందులో ముఖ్యంగా ఈ క్రింది వాక్యాలు నన్ను కదిలించాయి: ”దుఃఖాలు లేకుండా జీవితమంటూ లేదు. జనం ఒప్పుకోనీ, ఒప్పుకోకపోనీ; నిజాన్ని గుర్తించనీ, గుర్తించకపోనీ… ప్రతికీలకమైన నిర్ణయంలోను కొన్ని లాభాలు, కొన్ని లోపాలు
ఉంటాయి : నా సంతోషం కోసం అవసరమైన విప్లవాత్మకమైన, జీవితాంతం నిలిచి ఉండే స్వేచ్ఛ ఏ తల్లికీ లేదు. నిజమే, ఒక తల్లికి తన బిడ్డతో ఉండే అన్యోన్యత ఆత్మీయత లేదా తన ప్రభావం బిడ్డపై ఎంత ఉంటుందనేది నాకు ఎప్పటికీ తెలియదు. అయితే, నష్టాలనేవి, భవిష్యత్ అవకాశాలను పోగొట్టుకోవడంతో సహా, జీవితంలో అనివార్యం; ఎవరకైనా తప్పదు. ఏ ఒక్కరికీ అన్నీ దొరకవు”.
నేను ఈ జీవితాన్ని ఎంచుకోడంలో ఊరట ఇందులోనే
ఉంది. భవిష్యత్తులో ఎదురవ్వబోయే బాధల గురించి ఆలోచిస్తూ కూర్చోలేను. ఎలా అయితే తల్లిదండ్రులు పిల్లల్ని కనాలని నిర్ణయించుకోడానికి వివిధ కారణాలు చాలా వివేకవంతమైనవిగా అనిపిస్తాయో అలాగే నా యీ నిర్ణయం నాకు ఇప్పుడు వివేకవంతమైన, సరైన నిర్ణయంగా అనిపిస్తోంది.
ఇప్పటి వరకు నా ఈ నిర్ణయం తాత్కాలికమైనదిగా భావించే జనాలు నాకు సలహాలిస్తూవచ్చారు. వాళ్ళంతా ఇది ప్రతి జీవితంలో గడిచే ఒక అనివార్యమైన దశగా నాకు నచ్చ చెప్పటానికి గట్టిగా ప్రయత్నం చేసేవారు. నువ్వు కోల్పోతావన్న భయం లేదా నీకు? నీకు నీ భర్తకి జీవితంలో ఒక కొత్తదనం ఒద్దా? / కావలని పించట్లేదా? తల్లినవ్వాలన్న కోరిక కలగట్లేదా నీకు? ముసలితనంలో నిన్ను జాగ్రత్తగా చూసుకునేవారు ఒకరు ఉండాలని అనిపించట్లేదా? వీటన్నిటికీ ప్రతిసారీ నా మనసులో ప్రతిధ్వనిస్తూ వచ్చే జవాబు ఒక్కటే – ఒద్దు.
వీటన్నిటికీ ప్రతిసారీ నా మనసులో ఒద్దు అనే జవాబే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. నిజానికి ఇది నాకొచ్చిన చాలా సహజమైన కోరికల్లో ఒకటి. ఒక విషయమేంటంటే, జీవితంలో నేను తీసుకున్న అనేక ఇతర నిర్ణయాల్లా కాకుండా, ఇది మాత్రం నాలో ఎటువంటి వ్యథని కలిగించలేదు. నాకు పిల్లల్ని కనాలన్న కోరిక లేకపోవడంతో పాటు, మన దేశం, ఈ ప్రపంచం ఏ దిశగా ప్రయాణిస్తోందో చూస్తున్న నాకు మరో ప్రాణిని ఈ ప్రపంచంలోకి తీసుకురావడం పట్ల ఏమాత్రం సానుకూలత, ప్రేరణ అనిపించలేదు.
చెప్పాలంటే, నా గర్భ సంచిలోపల ఏం జరుగుతుంది, నా స్త్రీ అవయవాలతో ఏం చేయాలనుకుంటున్నాననేది నా సమస్య. నా భర్తకాక, నా డాక్టరుకాక లేదా ఇంకెవరన్నా కాని…. నేను ఎవరితో చర్చించాలనుకున్ననో వాళ్ళుకాక ఇంకెవరికీ నేను ఎందుకు పిల్లలు ఒద్దనుకున్నానో తెల్సుకోవాల్సిన అవసరం లేదు. ”బేబ్స్ ఇన్ ద ఉడ్స్” పుస్తకంలో కోర్ట్నీ హెడెల్ చెప్పింది నడినెత్తిన మేకేసినట్లే ఉంటుంది: ”పిల్లల్ని ఒద్దనుకున్న విషయం మాట్లాడేటపుడు సమర్థించుకుంటున్నట్లు కాకుండా చెప్పటం అసాధ్యం. ఇది ఒక స్వార్థపరునిలోని ఆక్షేపించలేని శోభని, అన్నిటికీ సర్దుకుపోతూ జీవించడాన్ని సమర్థించుకోడానికి ప్రతయ్నం చేసినట్లే ఉంటుంది”.
సదుద్దేశ్యంతోనే అయినా, ఈ విషయమై ఇచ్చిన ఏ సలహా కూడా నన్ను కదిలించడమో లేక నా నిర్ణయాన్ని పునరా లోచించుకునేలానో చేయలేకపోయింది. నాకెప్పుడు అనిపిస్తుండేది, పిల్లల్ని కనడానికి గల ఒకేఒక కారణం పిల్లలు కావాలని అనుకోవడం మాత్రమే అని. అలాంటి కోరిక నాకిప్పటి వరకూ కలగలేదు. ప్రస్తుతం నాకు 32 ఏళ్ళు, పెళ్ళై ఎనిమిదేళ్ళయింది. అసలు ఆ కోరిక నాకు ఎప్పటికీ కలగకపోవచ్చన్న వాస్తవంతో నేను ప్రశాంతంగా ఉన్నాను.
ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఊర్వశి భూటాలియా ఒక వ్యాసంలో ఇలా వ్రాసారు: ”పిల్లలు లేని జీవితానికి మీరు ఏ పేరు పెట్టినా కూడా, చివరికి అది మరో విధమైన జీవితాన్ని గడపడం మాత్రమే: పిల్లలు లేనిదనిపించుకున్నా / గొడ్రాలని పేరుపెట్టినా – బహుశా, పిల్లలు లేకపోయినందుకేనేమో… ఒక సంతోషమైన, భావాత్మకమైన, సంపూర్ణమైన జీవితాన్ని గడపడం సాధ్యమైంది. ఈ విషయమై మీలో ఎవరైనా మీ మీద మీరే సందేహపడ్తుంటే నన్నడగండి, అలా ఉండడానికి తప్పకుండా ఇదే మంచి స్థానం అని గట్టిగా చెప్తాను.”
పిల్లలొద్దని నిర్ణయించుకున్న స్త్రీలకుకాని దంపతులకుకాని జీవితంలో ఎటువంటి పరిస్థితులెదురౌతాయనే దానిపై మేఘన దావూమ్ యొక్క పుస్తకం అనేక విస్త్రత కోణాల్ని ఆవిష్కరిస్తుంది. అయితే నా మనసుకు గట్టిగా హత్తుకుపోయింది మాత్రం ”మాతృత్వానికి ఆవల” అన్న కోణాన్ని వివరిస్తూ సంక్షిప్తంగా వ్రాసిన పదాలు. వీటిని పూర్తిగా అర్థం చేసుకోడానికి నాకు రెండేళ్ళ సమయం పట్టింది.
”అసలైన స్వీయ ఆమోదం, నిజమైన స్వేచ్ఛ అనేవి పరిమతులను అంగీకరించడంలోనే ఉంటుంది కాని వాటిని ఆడంబరంగా నిరాకరించడంలో కాదు. స్త్రీలు పిల్లలున్నా, లేకపోయినా సంపూర్ణత్వాన్ని పొందగలరనేది, ప్రతి ఒక్కటీ లేకపోయినా సరిపోయినంత మాత్రం ఖచ్చితంగా పొందవచ్చనేది వాస్తవం, దీన్ని అంగీకరించగలగాలి.
నేను ఇలాంటి నిర్ణయాన్ని స్వంతంగా నేనే తీసుకోగల కాలంలో, అలాంటి కుటుంబంలో, సమాజిక ఆర్థిక పరిస్థితిలో, ఒక విశేష స్థితిలో బ్రతుకుతున్నందుకు సదా కృతజ్ఞురాలను. అలాగే నేను ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నందుకు, నా శరీరంపై నేనే పూర్తి అధికారాన్ని కలిగి ఉండగలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఈ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టగలగటం, దానితో జీవించడం… అది కూడా అందులోని లాభనష్టాలన్నిటినీ తీసుకుంటూ ప్రశాంతంగా జీవించగలగడం అనేది నిజంగా అనంతమైన స్వేచ్ఛని పొందగలగడమే!