”వేల జనం ఉన్న ఈ ఊళ్ళో గుక్కెడు నీళ్ళ కోసం ఈ చెరువుకి రాని మనుషులు లేరు. ఊరి జనమంతటికి, పశువులకి దాహార్తి తీరుస్తున్న ఓ గంగమ్మా కోటి దణ్ణాలు” అంటూ కొంగునున్న ముడివిప్పి చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ తీసి ఆ చెరువు నీళ్ళల్లో వదిలిన తర్వాత నీళ్ళల్లో దిగి భక్తిగా దణ్ణం పెట్టి మూడు మునకలేసి నింపాదిగా స్నానం చేసి వెళ్తున్న ఆ పెద్దావిడ కళ్ళముందు కదిలి శాంతి పెదవులు విచ్చుకున్నాయి. ఎప్పుడో పాతికేళ్ళ క్రిందటి ఆ సంఘటన ఇబ్రహీంపట్నం చెరువు కట్ట మీదగా ప్రయాణం చేస్తున్న ప్రతిసారి గుర్తొస్తుంటుంది.
గత ఐదారేళ్ళలో కనీసం వంద సార్లకు పైగా తను ఆ కట్టమీదగా ప్రయాణం చేసింది. బాగా వర్షాలుపడ్డప్పుడు తప్పించి వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ చెరువులో తనెప్పుడూ నీరు చూడలేదు. గతేడాది మాత్రమే చెరువు గర్భంలో కొంతమేర నీరు వచ్చింది. ఆ మాత్రానికే చెరువు చుట్టూ సందడి. నీళ్ళు తాగడానికి వచ్చే పశువులు, చెట్లమీదకి వచ్చి చేరిన పక్షులు, నీళ్ళల్లో బెకబెకలాడుతూ కప్పలు, తోకలూపుకుంటూ కలదిరిగే చేపలు, వాటిని దొరికిచ్చుకోడానికి మాటువేసిన కొంగలు… వీటన్నింటితోపాటు బట్టలుతుక్కోడానికి చెరువుకు చేరే స్త్రీలు, బండ్లు కడుక్కోడానికి మోటారు సైకిళ్ళు, ట్రాక్టర్లు, లారీలు కట్టదిగి ఎక్కడో చెరువు మధ్యలో ఉన్న నీటి దాకా వెళ్ళే వాళ్ళతో.. అంతా సందడి సందడి… అదంతా మూడు, నాలుగు నెల్లే. అంతలోనే ఆ నీరంతా ఏమైపోయిందో చెరువు నిమ్మళంగా నిద్రపోయినట్లు … అంత పెద్ద చెరువు… నీళ్ళు లేకుండా ఎండిపోయి నెర్రులిచ్చిన నేలతో గంభీరంగా… అక్కడక్కడా దున్నుకొని కనీసం నాలుగ్గింజలు పండించు కుందామని సన్నకారు రైతులేసుకున్న జొన్న చేలు పల్చగా… ఇదెప్పుడూ శాంతికి కలగల్పు భావాల్ని – ఆనందాన్ని బాధని, సంతోషాన్ని, దుఃఖాన్ని, వీటన్నిటికంటే ఎన్నో ప్రశ్నలని, ఎంతో కోపాన్ని మిగులుస్తూంటుంది.
చెరువు చుట్టూ కొత్తగా వస్తున్న పెద్ద పెద్ద కట్టడాల్ని, వాటి కోసం వేసిన సిమెంట్ రోడ్లని చూస్తూ గత ఆరేడేళ్ళల్లో జరిగిన ‘అభివృద్ధి’ని తలచుకోగానే కుచించుకు పోతున్న అంత పెద్దచెరువు, నీళ్ళు లేకుండా నల్లబడి పోడాన్ని ఏ అభివృద్ది కొలమానంతో కొలవాలా అన్న ప్రశ్న మదిలో గింగిర్లు తిరుగుతోంది. మరో పక్క పట్నంలో కనిపించకుండా పోయిన ఎన్నో చెరువుల కన్నా కుచించుకుపోయినా మిగిలి ఉన్న చెరువుల పట్ల మనసంతా ఆర్ద్రత తో నిండిపోయింది. కనీసం పల్లెల్లో అయినా ఈ పరిస్థితి నుండి చెరువులు తప్పించుకుని నిలబడకపోవా అన్న భావం కొంత ఊరటని చ్చింది. వెనువెంటనే తను చిన్నప్పుడు ఆడి పాడి, చేపలుపట్టి, స్నేహితులతో కలిసి కలదిరి గిన అమ్మమ్మ, నాన్నమ్మల ఊళ్ళల్లోని చెరువు లు గుర్తొచ్చాయి. వారం రోజుల్లో తను అమ్మమ్మ గారి ఊరు వెళ్తోంది. సమయం చూసుకుని ఒక్క గంటైనా చెరువుగట్టు మీదున్న నిద్రగన్నేరు చెట్టుకింద కూర్చుని నీటిపై నుండొచ్చే తడిగాలిని, గాలికి చేలపై నుండొచ్చే పచ్చివాసన్ని, పక్షుల కిలకిలరావాల్ని, మధ్య మధ్యలో చటుక్కున ఎగిరి దూకే చేపల్ని అదాటున వచ్చి చప్పున ముక్కున కరుచుకు పోయే కొంగల్ని, చెంగున గెంతే కప్పల్ని, నీటి మీద తేలుతూ చెరువుకి అందాన్నిచ్చే ఎర్ర కలువల్ని తామరాకుల్ని, వాటి మీద వాలి ముక్కుల్తో పీల్చుకునే తేనే పిట్లల్ని… అన్నింటిని చూస్తూ గడపొచ్చు. అబ్బ… ఎంత కాలమైంది ఈ అనుభూతిని పొంది. బ్రతుకు పోరాటంలో మునిగిపోయి తేలడానికి కష్టపడే బ్రతుకులకు జీవం పోసి జీవించడం నేర్పించే ఆ అనుభ వాలు మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటూ వారం రోజులూ గడిచిపోయి ప్రయాణం రోజు రానేవచ్చింది.
వారం రోజులుగా ఇదే ఆలోచన లతో ఉన్న శాంతికి పల్లెల్లో చెరువులు ఎలా ఉన్నాయో అన్న కుతూహలం మరింత పెరిగింది. రెండు బస్సులు మారి అమ్మమ్మగారి ఊరెళ్ళో బస్సులో కిటీకికి అంటుకుపోయి కూర్చుని ఏ ఊర్లో చెరువు కనిపించినా అది కనిపించినంత దూరం పరికించి చూస్తోంది. చాలా చెరువుల్లో నీళ్ళైతే ఉన్నాయి కాని కొన్ని క్షీణించిపోయి మళ్ళీ వర్షాలకి తేరుకుంటు న్నట్లున్నాయి. కొన్నైతే చెరువు గట్లపై కొత్తగా వెలిసిన ఇళ్ళు, పాకలు, చిన్న చిన్న పాన్ షాపులు, టిఫిన్ సెంటర్లతో కుచించుకు పోయినట్లున్నాయి. మరి అవి వెలవాలంటే చెరువుగట్లను మింగాలి కదా!
చూస్తుండగానే అమ్మమ్మగారి ఊరు దగ్గర పడింది. వర్షానికి మెరుస్తున్న పచ్చటి చెట్లు, నాట్లేసిన వరిపొలాలు, గట్లమీద వరసగా వెళ్తున్న ఆడ కూలీలు… ఊరు దగ్గరౌ తున్న కొద్ది శాంతికి ఉత్సాహం పెరుగుతోంది. అల్లంత దూరం నుంచే చేలల్లోని తాటిచెట్ల మధ్యనుంచి తెల్లగా మెరుస్తూ కనబడే చెరువు కోసం బస్సు కిటికీలోంచి తలసాచి చూస్తోంది. ఇంకా కనపడదేంటని ఆతృతతో తదేకంగా చూస్తోంది. కనబడట్లేదన్న ఉక్రోషం లోపల్నించి తన్నుకొస్తోంది…. అంతలోనే ఊరి పొలిమేర వచ్చేసింది. ఆ వెంటనే పంట కాలువ… అందు లో డీజిల్ ఇంజన్లేసి నీటిని తోడి పొలాలకి పెడ్తున్న దృశ్యం … అయోమయంగా అనిపిం చింది శాంతికి. కాలవకి చెరువుకి మధ్య చెట్లతో నిండిన గట్టు దాటుతూనే గుండె బద్దలైనట్లు, కడుపులో ఉండగట్టుకు పోతున్నట్టు, మెదడులో నరాలు చిట్లుతున్నట్లు, ఒళ్ళంతా బరువెక్కిపోయి కదల్లేనట్లు, చూపు మసకబారిపోయి… ఎదురుగా నల్లగా, ఎండిపోయిన గర్భంతో ఖాళీ చెరువు … కనబడ్తున్న దృశ్యం మెదడులోకెళ్ళనా మనసు తీసుకోలేకపోతోంది. ఊహ తెలిసిన 40 ఏళ్ళ జీవితంలో ఎప్పుడూ చూడని దృశ్యం. బస్సు వెళ్తూనే ఉంది మెల్లగా… విశాలమైన మర్రిచెట్ల నీడలో గేదెలు విశ్రాంతిగా నెమరేసుకుంటూ, వేపచెట్టు కొమ్మలకి పిల్లలు ఊయ్యాల లూగుతూ, నిద్రగన్నేరు చెట్టుకింద కుర్రాళ్ళు పచ్చీసో, దాడీనో ఆడుతూ, రావిచెట్టు కొమ్మలకి కబోది పక్షులు తలక్రిందులుగా వేళ్ళాడుతూ, గట్టుకి కొంచెం ఎడంగా ఉన్న జమ్మి చెట్టుకింద చేరిన ఊరి పెద్దల రాజకీయ చర్చలు… ఇవన్నీ కనిపించకుండా పోతున్నా… మార్పు సహజం తప్పదనుకుంది. కానీ ఈ రోజు తను చూస్తున్నదేంటి! వర్షాకాలపు నీటితో కళకళ్ళాడాల్సిన చెరువు నీటిని మింగేసిందేంటి! నీటిని చెరువు మింగేసిందా? సిమెంటు రోడ్లతో, పక్కా ఇళ్ళతో చెరువు పేగుల్ని తెంపేసిన అభివృద్ధి మింగేసిందా? పల్లెలూ ఇలాగైపోతే జనపదుల మాటేంటి? జవాబు దొరకని ప్రశ్నలతో బస్సుదిగింది శాంతి.