వర్తమాన లేఖ – శిలాలోలిత

‘నిర్‌మలా’ ఎలా వున్నావ్‌? నా పేరును కూడా నువ్వు ముక్కలు చేశావు కదా తల్లీ! ‘శిలో’ అంటూ. నీ ఆత్మీయతవల్ల నువ్వు ఎలా పిలిచినా పలుకుతున్నాను కదా! నీ పలుకే బంగారమైపోయిందీ మధ్యన. ఎందుకు? మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడ ప్పుడూ, మధ్యమధ్యలో వానచినుకుల్లా స్నేహితుల్ని కలవకపోతే జీవితంలో రంగులే ముంటాయ్‌! ఇంద్రధస్సు లేముంటాయ్‌ చెప్పు. మనందర్నీ కలిపింది, మనమిలా సంవత్సరాలపాటు స్నేహబంధంలో కలిసిపోయేట్లు చేసింది మాత్రం కొండవీటి సత్యవతే. తనొక స్నేహపిపాసి. అందుకే ఇందరి హృదయాల్లో స్వచ్ఛంగా మిగిలిపోయింది. మనం స్త్రీలందరం, రచయిత్రులందరం కలిసి చేసిన రకరకాల టూర్ల వల్లనే మానసికంగా బాగా దగ్గరయ్యాం. ఇళ్ళు, కుటుంబాలు, బాధ్యతలు, బరువులు, ఉద్యోగాలు, సమస్యలు మనల్ని ఊపిరాడని వ్వకుండా చేస్తున్న సందర్భాల్లో ఒక ఆటవిడుపులా, ఒక స్ట్రెస్‌ రిలాక్సేషన్‌లా, ఒక ఆత్మీయ స్పర్శలా, స్నేహ వీచికలు వీయడంతో మనమంతా రీచార్జ్‌ అయినట్లుగా అయి మళ్ళీ బతుకుల్లోకి హాయిగా నడిచెళ్ళిపోయేవాళ్ళం.

‘ఘంటసాల నిర్మల’ అన్న పేరు వినపడగానే ‘ఎ కాల్‌గర్ల్స్‌ మోనోలాగ్‌’ వెంటనే గుర్తొస్తుంది. విజయవాడ వీథుల్లో జరిగిన ఊరేగింపు, ధిక్కార స్వరం ఆ రోజుల్లో ఈ కవిత పుట్టడానికి ప్రేరణ అయింది అన్నానొకసారి. ‘చేరా’గారు స్త్రీవాదులకు, స్త్రీవాద సాహిత్యానికి ఎంతో సపోర్టునిచ్చారు. నీ కవిత్వం కూడా ఆ రోజుల్లో ఆయన చాలా ఇష్టపడేవారు. సంస్కృత పదాలెక్కువగా ఉండి చిక్కనైన పదాల్ని అలవోగ్గా రచించే నీ శక్తిని చూసి ముచ్చటపడేవారు. ‘చేరా’ గారిలో ఉన్న గొప్ప లక్షణం, ఎక్కడ కవిత్వం గొప్పగా అన్పిస్తే, ఏ ఇగోల జోలికిపోకుండా, ఎంతో నిర్మలంగా వాళ్ళను స్వయంగా అభినందిం చేవారు. ఎంతో ప్రోత్సహించేవారు. సావిత్రి కవిత్వాన్ని ‘ఓపెన్‌ యూనివర్శిటీ’ టెక్ట్స్‌ బుక్‌లో పెట్టించింది కూడా చేరాగారే.

ఆరుద్ర ‘నేనెక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు’ అన్నట్లుగా నువ్వెప్పుడూ లేటే. నీ రాక కోసం అందరం నిరీక్షిస్తూ

ఉండేవాళ్ళం. ఏ మాత్రం మొహమాటం లేకుండా హాయిగా నవ్వుకుంటూ ‘హల్లో’ అని అందర్నీ పలకరిస్తూ వచ్చే నీ రూపం ఇంకా నాక్కనిపిస్తూనే ఉంది. కారణాల సంచీని విప్పి ‘తొందరగా వచ్చేస్తే నేన్నిర్మలను కాకుండా పోతాను…’ అని దబాయించే దానివి కూడా! నిర్మలా ఒక నిజం చెప్పనా? కొందరం ఎందుకు కలుస్తామో, ఎందుకు విడిపోతామో చెప్పలేం. కానీ ఒక ఆత్మీయత అనేది మనసుల్లో అలా గూడు కట్టుకొని పోయుంటుంది. ఒక్కోసారి చాలా తృప్తిగానూ, కించిత్‌ గర్వంగానూ అన్పిస్తుంది. ‘ప్రయాగ రామకృష్ణ’ గారు ఎలా ఉన్నారు? పిల్లలెక్కడున్నారు? మీ పాప నా ఫేవరెట్‌ కూడా కదా! తను మంచి మంచి సెలక్షన్స్‌ చేస్తుంది కదా! నిర్మల లిద్దరూ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్లుగా విజయవాడలో వర్క్‌ చేస్తున్న రోజుల్లోనే ఏది చెత్తో, ఏదికాదో, ఏది మంచి రచనో, ఏదికాదో, ఎలా రాయొచ్చో, ఎలా రాయకూడదో అన్న జ్ఞానసముపార్జన చాలా కలిగిందనేదానివి. సి.సుజాత, పి.సత్యవతి గార్ల మంచి స్నేహం కూడా

ఉండేది మీకు. చిన్నప్పటినుంచీ క్లాస్‌మేట్స యిన మీరిద్దరూ స్త్రీవాద సాహిత్యంలో సైతం జంటగా ప్రయాణించడం చెప్పుకోదగ్గ విషయం. ‘నిర్వచనం’ నీ మొదటి కవితా సంకలనం. చాలా గాఢత నిండిన కవిత్వమది. ఔను నిర్మలా నీకు గుర్తుందా? ‘నిర్వచనం’ ఆవిష్కరణ హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది కదా! ఆ రోజు ఎంత భయంకరమైన వర్షం పడిందో తెల్సా. నేనూ. సత్యా ఐతే మొత్తం తడిసిపోయి, నీళ్ళు కారుతున్న బట్టల్తోనే మీటింగ్‌లో కూర్చున్నాం. నీ పట్ల ప్రేమ లేకపోతే అలా రాం కదా! డుమ్మా కొట్టేసుండే వాళ్ళం. నీకున్న ఇంగ్లీష్‌ పాండిత్యం వల్ల ఎన్నెన్నో ట్రాన్స్‌లేషన్‌ వర్క్స్‌ చేశావు. ‘నౌదూరి మూర్తి’గారు కూడా చాలాసార్లు నిన్నభినం దించారు, ‘లామకాన్‌’ మీటింగ్‌లో కల్సినప్పుడు అనుకుంటా. ఐతే మీ పిల్లల పెళ్ళిక్కూడా నువ్వు లేటుగా వెళ్ళావని విన్నాను. నీ గొప్పతనాన్ని అక్కడ కూడా నువ్వు పోగొట్టుకోలేదన్నమాట. చాలా తక్కువగా రాస్తావు. అసలొక్కొక్కసారి రాయనే రాయవు. అదే కోపం నాకు. మా మంచితల్లీ మళ్ళీ రాయడం మొదలెట్టమ్మా. రాయగలిగే శక్తున్నవాళ్ళు రాయకపోతే నా దృష్టిలో నేరమే అది. మంచి రచయితలూ, మంచి వ్యక్తులూ ఐన మీరిద్దరూ, మీకిద్దరూ ఇలానే జీవనప్రయాణంలో హాయిగా కొనసాగిపో వాలని కోరుకుంటూ, నీ రాక కోసం, నవ్వు కోసం, పలకరింపు కోసం, ఎదురుచూస్తూ – నీ ‘శిలో’…..

(శిలాలోలిత)

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.