ఆ ప్రాంతాన్ని లోహ్రి అని పిలుస్తారు. అది రాంచీ, సర్గుజ, పలామూ అనే మూడు జిల్లాల సరిహద్దులు కలిసే చోట ఉంది. ఆఫీసు రికార్డుల్లో మాత్రం అది రాంచీ జిల్లాకు చెందినట్టుగా ఉంది. ఆ ప్రాంతమంతా ఎండిపోయి, భూమి లోపల ఏదో కొలిమి ఉన్నట్లుగా ఆర్చుకుపోయి పంటలకు పనికి రాకుండా బీటలు వారిపోయింది. అందువల్లే అక్కడ చెట్లు ఎదుగుదల లేక మరుగుజ్జుగా ఉండిపోయాయి. నది ఎండిపోయింది. ఊళ్ళన్నీ దుమ్ముతో కప్పబడిపోయాయి. అక్కడి నేల రంగు కూడా చాలా చిత్రంగా ఉంటుంది. ఆ ప్రాంతమంతా ఎర్రమట్టే ఉన్నా అంతటి ముదురు ఎరుపు మట్టి మత్రం ఎవ్వరూ చూసి ఉండరు. అది అచ్చం తడారని రక్తం రంగులో ఉంటుంది.
సహాయ కార్యక్రమాల అధికారికి ఇక్కడికి రాకముందే ఈ ప్రాంతం గురించి అంతా వివరంగా చెప్పి పంపించారు. అసలు ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ ప్రాంతానికి పంపడానికి అతన్ని ఎంపిక చేశారు. అతను మంచి మనసుగల, నిజాయితీపరుడైన వ్యక్తి. వచ్చేముందు అతనికి ఇది చాలా దరిగ్రపుగొట్టు ప్రాంతమని, ఇక్కడి జనం నిజాయితీగా బతికే అవకాశమే లేదని చెప్పారు.
”ఎందుకలా?”
”వాళ్ళు అసలు సేద్యం చేయరు”
”పండించడానికి వాళ్ళకు భూములు ఉన్నాయా?”
సహాయ కార్యక్రమాల అధికారి (ఆర్వో), బీడీవోలు ఇద్దరూ బంగళా లోపల కూర్చుని మాట్లాడుకుంటున్నారు. బయట ఇంకా వేడిగానే ఉంది. వాచ్‌మేన్ వాళ్ళ కోసం నవ్వారు నేసిన రెండు మంచాల్ని బంగళా కాంపౌండులో వేసి వాటిమీద పరుపులు సర్దాడు. అంత భయంకరమైన ఎండా కాలంలో ఎవరూ లోపల కప్పుకింద పడుకోరు. ఆర్వోను ఈ డ్యూటీలో మూడు నెలల కోసం మాత్రమే వేశారు. అప్పటికీ అతన్ని ఫుడ్ డిపార్టుమెంటు నుంచి పిలిపించుకోవాల్సి వచ్చింది. సూర్యుడి తాకిడికి మాడిపోయి ఎందుకూ కొరగాని ఇట్లాంటి ప్రాంతాన్ని అతను ఇంతవరకు జీవితంలో ఎన్నడూ చూడలేదు. అర్థనగ్నంగా, ఎండుకుపోయిన శరీరాలతో, పైకి పొడుచుకు వచ్చిన బానల్లాంటి పొట్టల్తో సహాయం కోసం కాసుకుని కూర్చున్న గుంపుల కొద్దీ జనాన్ని చూడాలంటే అతడికి ఏవగింపు కలుగుతోంది. తను ఆదివాసీ పురుషులు కొండల్లో పిల్లంగోవులు ఊదుతుంటారని, ఆదివాసీ మహిళలు కొప్పుల్లో పువ్వులు పెట్టుకుని నృత్యాలు చేస్తుంటారని అందరూ చెప్పుకోగా విన్నాడు. వాళ్ళు ఎప్పుడూ పాటలు పాడుకుంటూ కొండల మధ్యలో తిరుగుతూ ఉంటారనుకున్నాడు.
గుట్టల మీద ఉండే చిన్న చిన్న ఊళ్ళు వెళ్ళాల్సి రావడం అతనికి ప్రాణసంకటంలా తయారైంది. జీపును కిందే ఆపేసి, చిన్న గుట్ట ఎక్కాల్సి వచ్చినా సరే, ఊపిరి అందక వగర్చేవాడు. ఈ కొండలు గుట్టలు ఎక్కడం, దిగడం ఆసాధ్యమని అతనికి ఇప్పుడు అర్థమైంది. కమర్షియల్ హిందీ సినిమాలు చూసి ఆదివాసీల గురించి ఒక అభిప్రాయానికి వచ్చిన అతను ఇన్నాళ్ళుగా వాళ్ళ జీవితాల్లో సంగీతం ఒక భాగమని అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళు పాడుతుంటే.. ఆ పాటలన్నీ ఒంటరి బందిఖానాలో ఉన్న ముసలి మంత్రగత్తె వికృత రోదనలాగా, విసుగ్గా అనిపిస్తున్నాయి. ఇక్కడంతా చాలా నిరాశగా అనిపించింది. హు! ఇది వాళ్ళకు పాట. ఇదే ఇట్లా ఉంటే చావులప్పుడు పెట్టే శోకండాలు ఇంకా ఎట్లా ఉంటాయో? ఎంత ఇబ్బందిగా ఉంది.
”వాళ్ళెందుకు పాడుతున్నారు?”
”నాగరికత తెలీని వింత మృగాలు. ఏ ఆపదొచ్చినా అదేదో మానవాతీత శక్తి అనుకుంటారు. ఇప్పుడా పాడేది దెయ్యాలని తరమటం కోసం”
”దెయ్యం” మాట వింటూనే ఆర్వో వళ్ళు జలదరించింది. బీడీవో అది గమనించినట్లున్నాడు. చిన్నగా నవ్వాడు.
”భయమేసిందా?”
”లేదు, లేదు, భయమేం.. లేదు”
”వీళ్ళ దృష్టిలో, ఈ కరువు కాటకాలన్నీ పిశాచాలు పెట్టిన శాపాలు”
”అవునా”
”ఇదో శాపాల దిబ్బ. హిందువులు ఉండే ప్రదేశాలు నయం. అదిగో, ఆ గుడి గోపురం, దానిమీద భగవాన్ హనుమాన్ జెండా ఎగురుతూ కనిపిస్తున్నాయే.. అదే మంచి ప్లేసు. ఇది వట్టి పనికిమాలిన దరిద్రపుగొట్టు ప్రదేశం. ఎందుకూ పనికిరాదు. ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ చేయించుకునేందుకు ఛస్తున్నాను”
”రేపు నేను ఎక్కడికి వెళ్ళాలి?”
”లోహ్రి. అదింకా చెడ్డ ఊరు. నిజంగా. వాళ్ళకు పొలాలు ఇచ్చి చూడండి – అట్నించి అటే వెళ్ళి వడ్డీ వ్యాపారికి అమ్మేస్తారు. పైగా మళ్ళీ వచ్చి మనమీద పడతారు. ‘నీళ్ళేవి? విత్తులేవి? నాగలి, ఎద్దులు? సేద్యం ఎట్లా చేయమంటారు?” అని మళ్ళీ మనల్నే అడుగుతారు. అవి ఇచ్చామనుకోండి, వాటినీ అమ్మేసి, ‘ఆ పొలం పండేదాకా మేమెట్లా బతకాలి? అప్పులు చేశాం కదా. ఇప్పుడీ పొలం అమ్మేసి అప్పు కట్టేయాలి’ అంటారు.”
”నేను అక్కడ ఉండాల్సి ఉంటుందా?”
”అవును, ఒక క్యాంపులో ఉండాలి. వేరే దారి లేదు. క్యాంపు పని లైన్లో పడేట్టు చూడండి, ఆ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. నేను సాయం పంపిస్తాను. మీరు కంగారు పడకండి. ముఖ్యంగా.. భయపడకండి.”
”భయపడటమా? దేనికి? ఎవరి గురించి?”
”దొంగల గురించి”
”దొంగలా…?”
”అవును, మనం సహాయం కోసం ధాన్యం, సరుకు పంపించినప్పుడల్లా, చిన్న చిన్న పిల్లలు వచ్చి వాటిని ఎత్తుకుపోతారు. రెండు మూడు బస్తాల బియ్యం, మైలో… మెలాసిస్, చేతికి ఏవి దొరికితే అవే”
”ఏమన్నారు, చిన్న పిల్లలా…?”
”అవును, చిన్నపిల్లలే. అయినా వాళ్ళని ఎవ్వరూ పట్టుకోలేరు. కొంతమంది వాళ్ళను చూశారు. నా కళ్ళతో నేను కూడా వాళ్ళను ఒకసారి చూశాను. అప్పుడు నా దగ్గర తుపాకీ
ఉంది.”
”మీరు తుపాకీ పెట్టుకుని తిరుగుతారా?”
”అవును. లైసెన్సు కూడా ఉంది. మీకు తెలుసుగా, లోహ్రి చాలా చెడ్డ ప్రదేశం. పది పన్నెండేళ్ళ క్రితం అక్కడొక పెద్ద తిరుగుబాటు జరిగింది. అప్పుడు జనమంతా ఆయుధాలు పట్టారు”
”అవునా!”
”అవును. అప్పటికి నేనింకా సర్వీసులో చేరలేదు. అసలు లోహ్రి కథేమిటో విన్నారా?”
”లేదు”. నిజానికి ఆర్వోకు అది వినాలని లేదు. ఈ
ఉద్యోగం మూలంగా వెలుగు జిలుగుల రాంచీని వదిలిపెట్టేసి రావాల్సి వస్తోందని పరితపిస్తున్నాడు.
”అక్కడ ఇదివరకు ఆగారియాలనీ, ఇనుము పనులు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఆగారియాల గురించి చాలా కథలున్నాయి.వాళ్ళు రాక్షస సంతతికి చెందిన వారసులంట. గనుల్లోంచి ఇనుప ఖనిజాలు తీసి, వాటితో పనిముట్లు తయారు చేసేవాళ్ళు. నిప్పులు తాగేవాళ్ళు. నిప్పుల గదిలోనే స్నానం చేసే వాళ్ళు. లోహ్రి వాళ్ళ రాజధాని. వాళ్ళ రాజు లోగుండి. భూమికింద ఉన్న రాక్షసులు గనుల్లోంచి ఇనుమును తవ్వి తీసుకోడానికి ఆగారియాలను మాత్రమే అనుమతిచ్చేవాళ్ళు.”
”తరువాత..?”
”లోగుండికి పదకొండు మంది తమ్ముళ్ళు. మొత్తం ఆ పన్నెండు మందికీ ఒక్కతే భార్య.”
”ఓహో.. ద్రౌపది కథ కంటే రంజుగా ఉందే”
”లోగుండికి గర్వం విపరీతంగా పెరిగిపోయింది. పెరిగీ,పెరిగీ చివరికి నేను సూర్యభగవానుడి కన్నా గొప్పవాడినని ప్రకటించుకునే దాకా వెళ్ళింది. దీంతో స్వయంగా సూర్యభగవానుడే దిగి వచ్చి లోగుండినీ, అతని పదకొండు మంది తమ్ముళ్ళనీ, మొత్తం లోహ్రి రాజ్యాన్నే మాడ్చేశాడు. అంతా బొగ్గయిపోయింది. ఆ సమయంలో రాణి వేరే ఊరిలో ఉండడంతో బతికింది. అక్కడ కూడా తీక్షణమైన సూర్యుడి కిరణాల మంటలు కాల్చివేస్తుంటే.. పోయి ఒక గొర్రెల కాపరి ఇంట్లో ఉన్న ఒక మజ్జిగ గుండిగలో దూకి, శరీరాన్ని చల్లబరచుకుంది. ఆమెకు అక్కడే ‘చింది’ చెట్టుకింద ఒక కొడుకు పుట్టాడు. వాళ్ళంతా ఆ పిల్లాడిని జ్వాలాముఖి అని పిలిచే వాళ్ళు. జ్వాలాముఖి మంటలను పీల్చేవాడు. అతడు నోరు తెరిచినప్పుడల్లా గుప్పుమంటూ మంటలు బయటికి వస్తుండేవి.–
”అబ్బ! ఎంత భయంకరమైన కథ!”
”వయస్సు వచ్చిన తర్వాత, జ్వాలాముఖి సూర్యుడి మీదకు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం లోహ్రిలో జరిగింది. ఆ యుద్ధంలో పుట్టిన వేడికి అక్కడి నేల మాడిపోయింది. యుద్ధం పూర్తయిన తరువాత జ్వాలాముఖి సూర్యుడిని-‘చంద్రవంక నీ భార్య అవుతుంది. కానీ నువ్వు ఆమెను పూర్ణిమ రోజు మాత్రమే కలుసుకోగలవు” అని శపించాడు. అప్పుడు సూర్యభగవానుడు కూడా ‘మీ అగారియాలు ఇనప పని చేసుకుంటారు కానీ ఎప్పటికీ డబ్బు వెనకేసుకోలేరు. మీరు సంపాదించినదంతా బూడిదగా మారి కొట్టుకుపోతుంది’ అని శాపం పెట్టాడు. అప్పట్నుంచీ అగారియాలు పేదరికంలోనే బతుకుతున్నారు”
”మొరటు ఆటవిక పురాణాల్లో ఇదొక్కటన్నమాట”
”అవును. ఇప్పుడు అగారియాలు ఎలా ఉన్నారో చూడండి. ఆ వృత్తి మానేశారు. ఇనుము పని చెయ్యడంలేదు. కానీ వాళ్ళని వ్యవసాయం వైపు మళ్ళించడం మాత్రం చాలా కష్టం. జ్వాలాముఖి ఓటమి గురించి తాము ఇప్పుడు కూడా దు:ఖిస్తున్నామన్నారు. తాము ఇప్పటికీ అపవిత్రంగానే ఉన్నామనీ, అందుకే ఇనుముకు కాపలాగా ఉన్న లోహాసురుడు తమకు ఇనుము ఇవ్వడంలేదంటారు. బొగ్గుకు కాపలా కాస్తున్న కోయిలాసురుడు వాళ్ళకు బొగ్గు ఇవ్వడు. భూమి లోపల మంటలకు కాపలా కాస్తున్న అగాయాసురుడు వాళ్ళకు మంటలనివ్వడు. అయినా తమ పూర్వవైభవం మళ్ళీ తిరిగి వస్తుందని వాళ్ళు నమ్ముతారు”
”ఇది సరేగానీ, ఆ తిరుగుబాటు మాటేంటి?”
”పన్నెండేళ్ళో, పధ్నాలుగేళ్ళో అవుతుంది. లోహ్రిలో ఇనుప ఖనిజం గురించి వివరాలు సేకరించేందుకు భారత ప్రభుత్వం కొంతమంది భూగర్భ శాస్త్రజ్ఞులను పంపింది. ఇక్కడ కువా అని ఒక ఊరుంది. ఆ ఊళ్ళో ఉన్న అగారియాలు చాలా సమస్యలు తెచ్చిపెట్టారు. ఈ గుట్టల మీద- లోహాసురుడు, కోయిలాసురుడు, అగాయాసురుడు ఉంటారని, వాళ్ళు బయటివాళ్ళను తమ పవిత్ర స్థలం లోనికి రానివ్వరనీ, అక్కడ తవ్వితే అసలు ఊరుకోరని చెప్పారు. అసలు ఇప్పటికే ఆ ముగ్గురు రాక్షసులు తమ మీద కోపంగా ఉన్నారనీ, ఇప్పుడు ఇనుము కోసం గనులు తవ్వితే ఇక అగారియాలకు భవిష్యత్తే ఉండదని, తమ జాతి మొత్తం నాశనమైపోతుందని వాదించారు. కానీ బయటి నుంచి వెళ్ళిన
వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు. ఈ అగారియాల మూఢనమ్మకాలను వాళ్ళు పట్టించుకోలేదు. పంజాబు నుంచి వచ్చిన ఇద్దరు ఆఫీసర్లకు, దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన భూగర్భ శాస్త్రజ్ఞుడికి ఈ రాక్షసులంటే భయం లేదు. వాళ్ళు గుట్టలను డైనమైట్లు పెట్టి పేల్చేశారు.”
”తర్వాత?”
”కువా అనే ఊరుందని చెప్పానుగా, అక్కడి అగారియాలు మొత్తం ఆ బృందంలోని వాళ్ళందరినీ చంపేశారు. చంపడానికి ఎంతమంది వచ్చారో నాకు తెలియదు గానీ, వాళ్ళందరూ అడవిలోకి పారిపోయారు.””తప్పించుకునే..”
”అవును, తప్పించుకునే పారిపోయారు. ఆ రోజు మాయమైపోయిన ఆ వందా, నూట యాభై మంది ఎక్కడికి పోయారన్నది ఆ దేవుడికే తెలియాలి. వాళ్ళు మళ్ళీ ఎవళ్ళకీ కనిపించలేదు. పగ తీర్చుకుని అడవుల్లోకి అదృశ్యమైపోయారు.”
”చిత్రంగా ఉందే!”
”అది ఇప్పటికీ వీడని రహస్యమే”
”కనిబెట్టడానికి ఆధారాలే లేవా?”
”ఏమీ లేవు. చిన్న ముక్క సమాచారం కూడా లేదు”
”మరి ప్రభుత్వం వాళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యలేదా?”
”ఎందుకు చెయ్యలా? అడివంతా గాలించారు. బ్రాహ్మణ విధవరాలు బియ్యంలో పురుగులు ఏరినట్లుగా.. మొత్తం ఆ ప్రాంతమంతా అణువణువూ గాలించారు”
”అయినా జాడ దొరకలేదా?”
”లేదు”
”తర్వాత ఏం జరిగింది?”
”ప్రభుత్వం ఎటువంటి కనికరమూ లేకుండా మొత్తం గాలించింది. కువా ఊరు వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళెవరూ పారిపోలేదు. దాంతో మిగతావాళ్ళెవరూ ముద్దాయిలు కాదని అర్థమైంది. పోలీసులు ఒక నెల రోజులు వెతికారు. విసుగొచ్చి తిరిగి వెళ్ళిపోతూ ఊరికి నిప్పు పెట్టారు. అక్కడేమీ పండకుండా భూమిలో ఉప్పు చల్లి పోయారు. తర్వాత మిగతా అగారియా గ్రామాలు కూడా కష్టాలు పడ్డాయి. పన్నుల వేధింపులు, దారుణమైన అణచివేత, అత్యాచారాలు, హింస..”
”వాళ్ళు ఇప్పటికీ దొరకలేదా?”
”లేదు”
”అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు?”
”ఇంకెక్కడికి వెళ్తారు, అడవిలోకే! ఎన్నో గుట్టలు, గుహలు. ఎక్కడ దాక్కున్నారో ఎవడికి తెలుస్తుంది?”
”ఇదంతా లోహ్రిలోనే జరిగిందా?”
”అవును, లోహ్రిలోనే”
”మరి మీరు తుపాకి ఎందుకు దగ్గర పెట్టుకుంటారు?”
”భయం. తలుచుకుంటేనే వణుకు పుడుతుంది. ఎంత మంది మనుషులు! వాళ్ళంతా ఒక్కసారిగా దాక్కున్న చోటు నుండి బయటకు వస్తే ఏం చేయాలి చెప్పండి?”
”కేవలం అందుకోసమేనా?”
”కాదు”
”మరింకా ఎందుకు?”
”సహాయంగా బియ్యం, ఇంకా ఇతరత్రా సరంజామా పంపించిన ప్రతిసారీ – దొంగతనాలు జరుగుతాయి. ఇంతకు ముందయితే
నాలుగైదు బస్తాలు పోయేవి. కొన్నేళ్ళుగా రెండు మూడే పోతున్నాయి. అసలా ప్రదేశమే శాపగ్రస్తమైంది! అక్కడ ఏమీ పండదు. ఒకసారి నా సొంత మేనల్లుడే అక్కడ భూమి దున్ని, సేద్యం చెయ్యాలని చూశాడు. కానీ అక్కడ బియ్యం, మొక్కజొన్నలు,. ఆఖరికి మార్వా, జోవర్.. కూడా పండించలేకోయాడు. అక్కడ పైన కనిపించే పొర ఒక్కటే మట్టి. కొద్దిగా లోతుకు వెళితే చాలు, గట్టి బండరాయి తగులుతుంది. నాగళ్ళు దాన్ని పగలగొట్టలేవు. చెప్పాగా, అది వట్టి శాపగ్రస్త ప్రదేశం. ఒక్కసారి చూస్తేనే తెలుస్తుంది”
”దొంగతనాలు ఇంకా జరుగుతున్నాయా?”
”ఆ.. జరుగుతూనే ఉన్నాయి. అంతా రాత్రిళ్ళు పిల్లలు వచ్చి తిండి గింజలు ఎత్తుకుపోతారని చెబుతుంటారు. నేను మాత్రం వాళ్ళని నమ్మలేదు. సహాయం పనుల్లో ఉన్న కూలీలే ఎవరో వాటిని అమ్మేస్తున్నారని, దొంగతనం చేసేది వీళ్ళేనని అనుకున్నాను. చూడండి, ఇట్లాంటివి సర్వసాధారణం. ప్రభుత్వానికేమో ఇవి అర్థం కావు. పైవాళ్ళు చలి కాలంలోనే కాదు, వేసవి కాలంలో కూడా బోలెడు దుప్పట్లు, మందం బట్టల్లాంటివి పంపిస్తూనే ఉంటారు. కానీ ఈ అడవి మొహాలకి ఆ ధారివాల్ దుప్పట్లతో, మంచి బట్టలతో, పంచదారతో పనేముంది? పంపిణీ చేసిన మర్నాడే వ్యాపారుల దగ్గరకో, వడ్డీల వాళ్ళ దగ్గరకో పోయి వాటిని బ్యాటరీ లైట్లకు, అగ్గిపెట్టెలకు, అద్దాలకు మార్పిడి చేసేస్తారు. ఇదంతా మనకు సహాయపడే పనివాళ్ళకు బాగా తెలుసు. దాంతో వీళ్ళే వాటిని దొంగతనంగా అమ్మేస్తుంటారు. నాకైతే అందులో తప్పేమీ లేదనే అనిపిస్తుంటుంది.”
”కానీ అది తప్పు కదా?”
”ఇవన్నీ మామూలే. బంగ్లాదేశ్ యుద్ధం గుర్తుందా? ఓహ్.. కలకత్తా నుంచి, ఢిల్లీ నుంచి, ఇంకా ఇతర దేశాల నుంచి గుట్టల కొద్దీ వస్తువులు సరిహద్దుల దగ్గర ఉన్న క్యాంపులకు వచ్చాయి. బట్టలు, ఉన్ని దుస్తులు, దుప్పట్లు, దోమతెరలు, వంట పాత్రలు, స్టవ్వులు, బూట్లు, ఇంకా ఎన్నో! మరి వాటిని మనం రాంచీ బజార్లలో కొనుక్కోలేదా?”
”ఇది నిజమే”
”ఏది ఏమైనా, తిండి గింజల్ని, వస్తువుల్ని ఆ పనివాళ్ళే దొంగిలించి ఆ దొంగతనాన్ని పిల్లల మీదికి నెట్టారని నేను అనుకున్నాను. తరువాత అక్కడికి నేనే స్వయంగా వెళ్ళాను. నాతోపాటు ఇరవై వేల రూపాయల విలువైన సరంజామా ఉంది. అందుకని పోలీసు గార్డులను కూడా వెంటబెట్టుకెళ్ళాను. ఆ క్యాంపు లోహ్రిలోనే. ఆ రోజు రాత్రి చాలా చీకటిగా ఉంది. మామూలుగా కూడా కాదు. చాలా దట్టమైన చీకటి. వేడిగా కూడా ఉంది. నేను టెంట్ బయట పడుకుని నిద్రపోతున్నాను. ఒక రాత్రివేళ ఉన్నట్టుండి నాకో విచిత్రమైన శబ్దం వినిపించింది. వెంటనే లేచి చూశాను. చిన్న చిన్న మనుషులు… పిల్లలయి ఉండవచ్చు… గుంపులు గుంపులుగా బస్తాలతో పారిపోతున్నారు.”
”ఏం చేశావు నువ్వు?”
”గాల్లోకి కాల్చాను. ఇంకేం చెయ్యగలను? చూస్తూ చూస్తూ పిల్లల్ని కాల్చలేను కదా? కానీ దొంగలు.. పారిపోయారు. బట్టల్లేకుండా మొండి మొలల్తో ఉన్న పిల్లలు.. వాళ్ళని ఎలా కాల్చటం?”
”నిజమే. ఆ పని ఎట్లా చేయగలరు”
”కానీ..”
”ఏంటి?”
బీడీవో కళ్ళు చిట్లించి, ఏదో చెప్పాలనుకుంటున్నట్టుగా బయట దట్టంగా అలుముకున్న చీకట్లోకి చూశాడు. చీకటి చాలా వేడిగా, సలసలా కాగిపోతున్నట్లుంది. వేడివేడిగా మరిగిపోతున్న చీకటి మొత్తం ఆ సందులు, గొందులన్నీ ఆక్రమించేసినట్టుంది. పైన చుక్కలు కూడా కాంతి తగ్గి, మసకబారిన ఆకాశంలో కలిసిపోతున్నాయి. చంద్రుడు పైకి రావడానికి ఇంకా చాలా టైముంది.
మెల్లిగా ఆయన అన్నాడు ”ఇంతవరకూ ఈ సంగతి ఎవరికీ చెప్పలేదు. అయితే మీరు మంచివారు. రాష్ట్ర మంత్రి మీ మామయ్య కూడా కదా. అందుకని మీరంటే నాకు నమ్మకం కలిగింది. మీకు ప్రమాదం ఎదురైతే ఉపయోగపడే మార్గం నే చెబుతా”
”ఏంటది?”
”మిస్టర్ సింగ్, ఇప్పటికీ ఆ ప్రాంతానికి చాలా చెడ్డ పేరుంది. ఆ రాక్షసులూ, ఆదివాసీ బోంగా దెయ్యాలూ, ఇంకా దుష్టశక్తులూ ఆ స్థలాన్ని ఆవహించే ఉన్నాయని జనం చెబుతుంటారు. బస్తాలు మోసుకుంటూ పారిపోతున్న పిల్లల్ని చూశాను. వాళ్ళు మనుషుల పిల్లల్లా లేరు”
”చెప్పేదేమిటో..?”
”వాళ్ళ చేతులు, కాళ్ళు.. అసలు మొత్తం మనుషులే. ఏంటో అదోలా ఉన్నారు”
”అదోలానా? అంటే?”
”సరిగ్గా వివరించలేను. వాళ్ళకు పొడుగు జుట్టు ఉంది. కానీ వాళ్ళు నవ్విన తీరు..”
”అంతా వింటుంటే నాకు భయమేస్తోంది”
”భయపడకండి. నేను ఈ రోజు తాహెద్ వెళ్ళాల్సి
ఉండింది. కానీ మీకు ఇవన్నీ వివరంగా చెప్పడానికే ఆ ప్రయాణం మానుకున్నాను. మీ మామగారు రాష్ట్రమంత్రి. మీ ప్రాణానికి, మీ ఆస్తిపాస్తులకు నాది పూచీ. మీ కోసం ప్రత్యేకంగా హనుమాన్ దగ్గరి నుంచి ఈ ప్రసాదం తెచ్చా. మీ జేబులో పెట్టుకోండి, ప్రమాదాల నుంచి ఇదే రక్షిస్తుంది”
”కానీ, నా దగ్గర తుపాకి లేదే”
”అయితే నష్టం ఏమిటి? నీకు కాపలాగా చుట్టూ మనుషులుంటారు”
”తుపాకులు.. పోలీసులు..”
”ఇప్పుడే అవన్నీ అడగలేం. ఏమైనా రేపు మీరు వెళుతున్నారు. ఈసారి సరుకులు పంపిస్తారు కదా, వాటితో పాటు కొంతమంది కానిస్టేబుళ్ళను కూడా పంపించమని చెబుతాను.”
”రండి, భోంచేద్దాం”
”ముందు స్నానం కానీయండి”
బావి నీళ్ళు చల్లగా, హాయిగా ఉన్నాయి. సింగ్ వాళ్ళ మామయ్య మంత్రి కాబట్టి ఆ రాత్రి భోజనం కూడా బాగుంది. పచ్చి బఠాణీలేసి వండిన మంచి వరి అన్నం, మాంసం కూర, పచ్చళ్ళు, స్వీట్లు, ఆరు బయట నిద్ర. ముందుగా నేలమీద నీళ్ళు బాగా చల్లి, ఆ తర్వాత మంచాలు వేశారు. అనుకున్న దానికన్నా చాలా చల్లగా ఉంది. కానీ సింగ్‌కు నిద్రపట్టలేదు. సూర్యుడితో పోరాడుతున్న యువకుడు.. ఒక పెద్ద కొండ.. కటిక చీకట్లోంచి బయటకు పొడుచుకొచ్చి తళతళ మెరుస్తున్న గొడ్డళ్ళు.. శవాలు.. బ్రాహ్మణ విధవరాలు బియ్యంలో పురుగుల్ని ఏరినట్టు గాలింపులు.. సహాయ కార్యక్రమాల క్యాంపు.. కారు చీకట్లలో ఎవరో పిల్లలు.. మనుషులకు పుట్టిన వాళ్ళలా లేరు.. వచ్చి బస్తాలకు బస్తాలు ఎత్తుకు పోతున్నారు. ఈ దృశ్యాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి కళ్ళ ముందు ప్రత్యక్షం. ముఖమ్మీద ఎండపడి, మంట అనిపిస్తేగానీ సింగ్‌కు గాఢ నిద్ర నుంచి మెళకువ రాలేదు.
ఉదయం తను లోహ్రికి బయలుదేరాడు. బీడీవోనేమో తిరిగి తహద్‌కు వెళ్ళిపోయాడు. సింగ్‌తో పాటే వెనకాల తిండిగింజల బస్తాలు, టెంట్ సామాను ట్రక్కులో బయల్దేరాయి. రోడ్డు కాసేపట్లోనే మట్టిబాటగా మారిపోయింది. అదీ వేసవి కాబట్టి దాని మీద వెళ్ళడం సాధ్యపడుతోంది గానీ వానాకాలమయితే అంతా బురద బురదగా ఉండేది. ఆ బాటలో పోతున్నప్పుడే దారిలో మిషన్ భవనం కనబడింది. ఆ బిల్డింగులో మిషనరీలు సహాయ కేంద్రాన్ని తెరిచారు. అప్పటికే అక్కడ నల్లటి, బక్కపలచని ఆకారాలు గుంపులు గుంపులుగా, మౌనంగా నిలబడి ఎదురుచూస్తున్నాయి.
”థూ!…పశువులు. కరువొచ్చిందంటే చాలు, కన్నబిడ్డల్ని తీసుకొచ్చి, ఈ మిషన్ గడప ముందు వదిలేసి పోతారు. పైగా – ‘మిషన్ వాళ్ళు మా పిల్లల్ని ఆకలితో చావనివ్వరు, ఎలాగోలా కాపాడతారు. అదే మా దగ్గరుంటే పిల్లలు ఆకలికి చావడం ఖాయం’ అంటారు. ఇవేం బతుకులో.. ఛీ!” జీపు డ్రైవరు కాండ్రించి
ఉమ్మేశాడు.
”వీళ్ళు మనుషులు కారు”
”వీళ్ళ అసలు మతం వదిలేసుకుని, క్రైస్తవ మతంలోకి మారిపోతున్నారు. కానీ తెలివి తక్కువ వాళ్ళేం కాదు. చాలా తెలివైన
వాళ్ళు. క్రైస్తవ మతంలోకి మారుతుంటారు. కానీ మళ్ళీ వాళ్ళ పాత దేవుళ్ళను కూడా పూజిస్తూనే ఉంటారు”
”ఈ సంగతి మిషనరీలకు తెలియదా?” ఆర్వో అడిగాడు.
”తెలుసు. అయినా వీళ్ళను కాపాడుతుంటారు. జబ్బులు చేస్తే మందులిస్తారు. ఆ తెల్లతోలు ఆడమనుషులు ఈ పశువుల పిల్లల్ని వళ్ళోకి తీసుకొని, ముద్దులు కూడా పెడుతుంటారు”
”సిగ్గుచేటు!”
”పశువులు! వాళ్ళ పాటలు వినండి చాలు. మర్యాద తెలిసిన వాళ్ళెవరైనా ఇలాంటి సమయంలో ఆ పాటలు పాడతారా?” ఆ పాట చచ్చిపోయినప్పుడు పెట్టే శోకండాల్లాగా ఉంది. కొండలు, అడవులంతా ప్రతిధ్వనిస్తున్న ఆ పాట తరంగాలు.. వేగంగా కదిలిపోతున్న జీపును ఢీకొంటున్నాయి.
”వీళ్ళెందుకు.. అట్లా పాడతారు?”
”వాళ్ళంతే! వాళ్ళలో నడవగలిగిన వాళ్ళే రిలీఫ్ కేంద్రానికి వచ్చి సరుకులు, వస్తువులు తీసుకుపోతారు. నడవలేని ముసలాళ్ళంతా అదిగో.. అలా గుండ్రంగా కూర్చుని ఈ పాటలు మొదలెడతారు. చచ్చేదాకా అట్లా పాడుతూనే ఉంటారు. ఒక గ్రామంలో పాడటం మొదలైందా, దీన్ని విని పక్క ఊళ్ళో ముసలోళ్ళంతా కలిసి – కాలుచెయ్యి బాగున్న వాళ్ళందర్నీ సహాయ కేంద్రానికి పంపించి-తాము పాటలు మొదలెడతారు. వాళ్ళ పాట వింటూనే మళ్ళీ ఆ పక్క ఊళ్ళో వాళ్ళు.. ఇదంతా మనకు అర్థమై చావదు”
సింగ్‌కు తన కాళ్ళకింద నేల కదిలిపోతున్నట్టు, తానేదో ఇసుక అగాధంలోకి కూరుకుపోతున్నట్టు అనిపించింది. తను వచ్చింది – మిరుమిట్లు గొలిపే కరెంటు వెలుగు జిలుగులు, మోటారు కార్లు, టాక్సీలు, బస్సులతో నిరంతరం రద్దీగా ఉండే రాంచీ నుంచి. ఇప్పుడు ఎలాంటి ప్రాంతానికి వచ్చి పడ్డాడు? ఒకపక్క తుపాకులు మోగుతున్నా, దయ్యాల్లాంటి పిల్లలు వెటకారంగా నవ్వుకుంటూ, ధాన్యం బస్తాలు ఎత్తుకుపోయే చోటిది. దారి వెంట కొండలు, బూడిద రంగు అడవులు తప్పించి మరేమీ కనబడని శాపగ్రస్త ప్రాంతానికి వచ్చి పడ్డాడు.
కరువు కమ్ముకొస్తుంటే దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయకుండా ముసలాళ్ళంతా గుండ్రంగా కూర్చుని, వింత పాటలు పాడుతుండే విచిత్రమైన చోటిది. ఎటుచూసినా తనకంతా గందరగోళంగా ఉంది.
”ఇక్కడ చాలా మంది చచ్చిపోతుంటారా?”
”ఆ. చాలామంది పోతుంటారు. పైన చూడండి, ఆకాశంలో ఆ డేగలు, గద్దలు ఎట్లా తిరుగుతున్నాయో. కొన్నిసార్లు అవి బలహీనంగా, గట్టిగా తోలలేకుండా ఉన్నవాళ్ళని కూడా పీక్కు తింటాయి. చెప్పాగా, ఇది దయ్యాలుండే ప్రాంతమని”
”లోహ్రి ఇంకా ఎంత దూరం?”
”ఇప్పుడే మనం ఆ ప్రాంతంలోకి వచ్చాం. చూడండి, పర్వతాలు, చెట్లు, నేల అన్నీ ఎట్లా ఎర్రగా ఉన్నాయో! ఏది చూసినా రాగితో చేసినట్టు కనిపిస్తాయి. నిజం సార్. ఇది లొహ్రి. ఈ నేలలో విషముంటుంది”
కొద్ది దూరంలో కొండలు కనిపిస్తున్నాయి. ”అదే మన క్యాంపు సైటు” అన్నాడు డ్రైవర్. కొద్దిసేపు మౌనం తర్వాత మళ్ళీ డ్రైవరే అందుకున్నాడు. ”నేను మిమ్మల్ని హుజూర్ అని పిలిస్తే మీకేం అభ్యంతరముండదనుకుంటాను. కానీ.. లొహ్రిలో భయపెట్టేదేదో ఉంది సార్. అదేమిటో ఇప్పటికీ మాకు తెలియదు. మీరేమనుకోకపోతే.. రాత్రి క్యాంపులో మనం కొద్దిగా మందు పుచ్చుకోవాలి. లేకపోతే భయమేస్తుంది సార్. పాపం బహదూర్! పిచ్చోడయిపోయాడు”
”బహదూరా..అతనెవరు?”
”డ్రైవరు. అతని గురించి బీడీవో మీకు చెప్పలేదా?”
”లేదే.. ఆయనేం చెప్పలేదు”
”అయ్యో. తప్పు చేశారు. ఆయన మీకు చెప్పి ఉండాల్సింది”
”బహదూర్‌కి ఏమైంది?”
”ఏమైందో నిజంగా ఎవరికీ తెలియదు. అతనితో
ఉన్నవాళ్ళు చెప్పిందేమిటంటే.. వాళ్ళంతా నిద్రపోతున్నారు. ఒక రాత్రివేళ బహదూర్ నిద్రలేచి ‘దొంగ.. దొంగ..’ అని అరుచుకుంటూ ఎవరి వెనకాలో పరుగులు పెట్టుకుంటూ చీకట్లోకి వెళ్ళిపోయాడు. కొందరు వెనకాలే వెళ్ళారు గానీ చీకట్లోంచి భయంకరమైన నవ్వులు వినిపించడంతో బెదిరిపోయి తిరిగొచ్చేశారు. మరుసటి ఉదయం చూస్తే బహదూర్ దూరంగా స్పృహ తప్పి పడిపోయి కనిపించాడు. తర్వాత స్పృహ అయితే వచ్చింది గానీ మనిషి పిచ్చాడయిపోయాడు”
”తర్వాత?”
”పూర్తిగా పిచ్చాడయిపోయాడు. ఇప్పుడు రాంచీలో
ఉన్నాడు. ఆ..! మనం క్యాంపుకి వచ్చేశాం”
క్యాంపు ప్రాంతం మొత్తం అప్పుడే శుభ్రం చేసినట్టుంది. జీపు ఆగుతూనే చిన్న పూరి గుడిసెలోంచి తహసీల్దారు బయటికి వచ్చాడు. ”ముందు కొంచెం టీ తాగండి సార్. స్నానం చెయ్యాలనుకుంటే, నీళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నాయి. నీళ్ళు అరమైలు దూరం నుంచి తెచ్చారు”
”ఆ కొలనులో నుంచేనా?” డ్రైవరు అడిగాడు.
”ఆ. అక్కడి నుంచే”
సింగ్‌కు విషయం వివరంగా చెప్పేందుకు తహసీల్దారు అటువైపు తిరిగాడు. ”కువా తిరుగుబాటు తర్వాత, కొండ పేలిపోయి, ఒక లోతు గుంట ఏర్పడింది. వానలకు అందులో నీళ్ళు చేరి, ఈ ప్రాంతంలో ఏడాది పొడుగునా నీళ్ళకు ఇబ్బంది లేకుండా
ఉంటోంది”
వాళ్ళు టీ తాగారు. తహసీల్దారు టెంటు వేయించి, మొత్తం పంపిణీ కోసం తెచ్చిన బస్తాలన్నీ లెక్క వేయించి, టెంటులో లైనుగా పెట్టించాడు. ”మీరు ఆందోళన పడాల్సిందేమీ లేదు హుజూర్. ఈ పని నేను ఏటా చేస్తున్నదే. నా దగ్గర గ్రామాల వారీగా తయారు చేసిన జాబితా సిద్ధంగా ఉంది. మీరు చేయాల్సిందంతా పది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ సరుకును పంపిణీ చేయడం. ఆ పని చేస్తే చాలు. తర్వాత మనకేం పని ఉండదు”
”మొత్తం ఎంతమంది వస్తారనుకుంటున్నారు?”
”వెయ్యి మంది. లేకపోతే రెండు వేలు. ఖచ్చితంగా చెప్పలేం”
”మెడికల్ యూనిట్ కూడా వస్తోంది”
”ఇక్కడికా, హుజూర్?”
”అవును. వాళ్ళకి కూడా టెంట్లు కావాలి కదా. టెంట్లు వేయండి”
”మంచిది హుజూర్. ఇంతకు ముందెప్పుడూ మెడికల్ యూనిట్లు రాలేదే”
”ఇంతకు ముందు మీకు జనతా పార్టీ ప్రభుత్వం లేదు. అట్లాగే మీకు ఇట్లా సహాయ సామగ్రిని పంపిణీ చేసే అధికారీ లేడు”
తహసీల్దార్ పైకి వినబడకుండా లోపల్లోపలే ”పంది నాకొడకా!” అని తిట్టుకున్నాడు. పైకి – ”హుజూర్. మీరు ఏం చెబితే అది చేస్తాను” అన్నాడు.
”సర్దోహ యూనిట్ నుంచి ఒక మిషన్ వచ్చి పని చేస్తుంది”
”వాళ్ళా? ఇక్కడికా?”
”అవును. వాళ్ళ దగ్గర కూడా నర్సులు, డాక్టర్లు ఉన్నారు”
”మీరు ఎలా చెబితే అలాగ హుజూర్”
”క్యాంపుకు నీళ్ళు తీసుకురావడానికి, ఇక్కడంతా శుభ్రం చెయ్యడానికి, ఖాళీ అయిన గంజి గిన్నెలు తోమడానికి మనకు మనుషులు కావాలి. ఊర్లో నుంచి పదిమంది కుర్రాళ్ళని తీసుకు రండి. వాళ్ళ పేర్లు రాసి పెట్టండి. ఈ పనంతా వాళ్ళు చేస్తారు. వాళ్ళకు భోజనం పెట్టి, రోజుకు ఒక రూపాయి కూలీ ఇస్తామని చెప్పండి”
”భోజనం పెడితే చాలు, పనంతా వాళ్ళే చేస్తారు”
”నువ్వు వచ్చింది నాతో మాటలు పెట్టుకోవటానికా? లేకపోతే నేను చెప్పిన పని చెయ్యటానికా? క్యాంపు నేను నడిపిస్తాను. నువ్వు ప్రతిరోజూ ఇక్కడ ఉండాలి”
”క్యాంపు ఎన్నాళ్ళుంటుంది, హుజూర్?”
”నెల రోజులు. ఈ క్యాంపు నడిపించే ఇన్-ఛార్జిని నేనే. ఇట్లా ప్రతి ఇరవై మైళ్ళకు ఒక క్యాంపు ఉంటుంది. వింటున్నావా, నేను సరుకుల్ని, వస్తువుల్ని నిల్వ చేసిన టెంటులోనే పడుకుంటాను. ఎందుకంటే, వాటి పూర్తి బాధ్యత నాదే”
”మంచిది, హుజూర్. నా మట్టుకు నేను మాత్రం మీరు వంద రూపాయలిచ్చినా ఇక్కడ పడుకోను”
”ఎందుకు?”
”దొంగలు. పైగా వాళ్ళు మనుషులు కూడా కాదు”
”చెత్త మాట్లాడకండి. వలంటీర్లుగా పనిచేయడానికి కాలేజీల నుంచి విద్యార్థులు వస్తున్నారు. దూరం ఊళ్ళన్నింటికీ సహాయక సరంజామాను, వస్తువుల్ని వాళ్ళే తీసుకువెళ్తారు. ఇంక ఆ ముసలాళ్ళు ఆ చావు పాటలు పాడనక్కర్లేదని అందరికీ చెప్పండి”
తహసీల్దార్ కొంచెం ఆశ్చర్యంగా, అక్కడ్నుంచి వెళ్ళి పోయాడు. ప్రతి సంవత్సరం సహాయంగా వచ్చిన ధాన్యాన్ని దొంగిలించేవాడు. పెద్ద జిత్తులమారి. అయితే సమర్థంగా పని చేయగలవాడు. క్యాంపు కోసం పని చేయడానికి ఊళ్ళో నుంచి పది మంది అగారియా పిల్లగాళ్ళని నియమించాడు. మొదటి రోజు పంపిణీ కోసం వచ్చిన ధాన్యం బస్తాలను ఒక పద్ధతి ప్రకారం అమర్చే పనిలో తనకు సహాయంగా ఇద్దరు మనుషుల్ని పెట్టుకున్నాడు. మరుసటి రోజు నుంచీ, పెద్ద వాళ్ళకు గంజి, పిల్లలకు పాలు అందించాలి. తహశీల్దార్ సింగ్‌తో అన్నాడు, ”ఈ అగారియా కుర్రాళ్ళు రాత్రంతా ఇక్కడే ఉండి వస్తువుల్ని కాపలా కాస్తారు. మేమెవరం ఇక్కడ ఉండం గనక, మీకు వాళ్ళే తోడు. లేకపోతే మీరొక్కరే ఉండాల్సి వస్తుంది”
తహసీల్దార్ మాటలతో సింగ్ మరింత నిబ్బరంగా ఉన్నాడు. మరునాడే క్యాంప్ ప్రారంభమైంది. చాలా క్రమశిక్షణతో నడిచింది. గంజి వండి, పంచిపెట్టారు. కలరా, టైఫాయిడ్ రాకుండా మెడికల్ వలంటీర్లు సూది మందులు ఇచ్చారు. క్యాంపు చురుగ్గా, కోలాహలంగా మారింది.
ఇప్పుడు జనం దూరం ఊళ్ళ నుంచి కూడా రావడం మొదలుపెట్టారు. ఆకలితో అలమటించిపోతున్న జనం రాత్రిపూట కాగడాలు పట్టుకుని గుంపులు గుంపులుగా క్యాంపు వైపు కదిలి వస్తున్నారు. మండు వేసవిలో పగలు నడిచి రావడం అసాధ్యం. అందుకని జనం రాత్రిపూటే క్యాంపు దగ్గరకు వచ్చేసి, ఎప్పుడు తెల్లవారుతుందా.. అని ఎదురు చూస్తున్నారు. కొన్నాళ్ళు గడిచాక, జిత్తులమారి నక్క తహసీల్దార్ కూడా అంగీకరించాడు. ”హుజూర్, మీరు క్యాంపు నడిపే పద్ధతి వల్ల ఈ పశువులకు తాము మళ్ళీ బతకగలమన్న నమ్మకం ఏర్పడింది. ఇంతకు ముందు ముసలి
వాళ్ళు తమకు రోజులు దగ్గర పడ్డాయని చావు పాటలు పాడే
వాళ్ళు. ఇప్పుడు పాడటం మానేశారు. మీరు ఇంకో పని కూడా ఎందుకు చేయకూడదు?”
”ఏంటది?”
”ఈ సహాయ సామగ్రిని గ్రామాలకు పంపకండి. బాగున్న వాళ్ళకు ఎలాగూ రోజూ తిండి దొరుకుతోంది కదా. వీళ్ళు తమ ముసలి వాళ్ళను బాగానే మోసుకు రాగలుగుతారు”
”లేదు.. లేదు. చూడూ ఆకలనేది మనిషిలో సామాన్యమైన మానవ ఉద్వేగాల్ని మాడ్చేస్తుంది. వీళ్ళు గనక ఎవరినన్నా వెనకాల వదిలేసి వచ్చారంటే ఇక వాళ్ళు అక్కడ చచ్చిపోయినట్టే. అయినా, వీళ్ళు ఒకర్ని మరొకళ్ళు ఎట్లా మోస్తారు? ఇప్పటిక్కూడా కొందరు క్యాంపుకు వస్తూ దారిలోనే శోషవచ్చి పడిపోతున్నారు, చచ్చిపోతున్నారు. వాళ్ళకు అంత శక్తి ఎక్కడుంది?”
సింగ్ సహాయ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై పోయాడు. కాలిపోతుండే నేల, ఆకుల్లేని, పాలిపోయిన మరుగుజ్జు చెట్లు, ఆ కారడవి, రాగిలో ముంచి తీసినట్లుండే కొండలు, నకనకలాడే ఆకలి.. ఇవేవీ తనకు ఇప్పుడు అంత బీభత్సంగా కనిపించటం లేదు. ఆకలితో బాధపడుతున్న ప్రజలే ఆయనకు అన్నిటికన్నా ముఖ్యమైపోయారు. డాక్టర్లు మరో క్యాంపుకు వెళ్ళారు. అదీ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికీ కలరా, టైఫాయిడ్ రాకుండా టీకాలు వేశామని నిర్థారించుకున్నాకే వెళ్ళారు. సర్దోహ మిషన్ నుంచి వచ్చిన డాక్టర్లకు, నర్సులకు సింగ్ మంచి ఉత్సాహాన్ని ఇచ్చారు. కలరా, టైఫాయిడ్ రాకుండా ప్రజలకు టీకాలు మాత్రమే వెయ్యాలని రూల్స్ పుస్తకంలో ఉంది. కానీ సింగ్ ఈ కార్యక్రమాల్లో భాగంగా రాంచీ నుంచి యాంటీ బయోటిక్స్, పసిపిల్లల ఆహారం, పుళ్ళకు ఆయింట్‌మెంట్‌లు కూడా తెచ్చారు.
పది మంది అగారియా కుర్రాళ్ళూ ఈయనతో బాగా కలిసిపోయారు. ఈయన్ని ఆరాధనా భావంతో కూడా చూడటం మొదలుపెట్టారు. కొండల్లో పేలుడు వల్ల ఏర్పడిన కొలనులో
వాళ్ళు సింగ్‌ను స్నానం చెయ్యనివ్వలేదు. అది అసురుల నివాసం. ఆ కొలనులో దిగటం నిషిద్ధం. వాళ్ళు ఎక్కువగా లోహ్రి నదీ తలం ఆ కొలనులో దిగటం నిషిద్ధం. వాళ్ళు ఎక్కువగా లోహ్రి నదీ తలం మీద సహజసిద్ధమైన రాళ్ళతో ఏర్పడిన కొలనునే ఉపయోగిస్తారు. ఆయన్ను కూడా అక్కడికే తీసుకెళ్ళారు. దానిలో స్నానం చేస్తూ, సింగ్ జ్వాలాముఖి గురించి వాళ్ళు చెప్పుకునే కథ ఏమిటో విన్నాడు. అగారియా యువకుడైన జ్వాలాముఖి వల్లే తమ జాతి మొత్తం నిరుపేదగా మారిపోయినా వాళ్ళు మాత్రం జ్వాలాముఖిని తమ హీరోగానే చూసుకుంటున్నారు. జ్వాలాముఖి శాపం వల్లే సూర్య భగవానుడు రోజూ తన భార్య చంద్రవంకతో పడుకోలేకపోతున్నాడు. ఒక్క పున్నమిరోజు మాత్రమే వాళ్ళిద్దరూ కలుసుకుంటున్నారు. నిజమే, ఆ శాపాల కారణంగా ఇవాళ అగారియాలు నానా కష్టాలు పడుతున్నారు. కానీ- లోహాసురుడు, కొయిలాసురుడు, అగాయీసురులు ముగ్గురూ దయ చూపిన రోజున వాళ్ళ తలరాత మారిపోతుంది. రోజూ సింగ్ నెమ్మదిగా, హాయిగా స్నానం ముగించుకుని, క్యాంపుకు తిరిగి వచ్చేసరికి సాయంత్రం చీకటి పడిపోయేది.
సింగ్ రాత్రిపూట ఆ బస్తాలు నిల్వ ఉంచిన గుడారం ముందే మంచం వేయించుకుని పడుకునేవాడు. సహాయ కార్యక్రమాల్లో పనిచేస్తున్న వాళ్ళే సహాయం కోసం ప్రభుత్వం పంపే సరుకును దొంగిలించి, ఆ తప్పును కప్పి పుచ్చుకోవటానికి వింత పిల్లల కథ సృష్టించారని నిర్థారణకు వచ్చాడు. లోహ్రిలోని అగారియాలకు నిజంగా సహాయపడటం ఎట్లాగా అని ఆలోచించసాగాడు. సానుభూతి గల నిజాయితీ పరుడైన, చొరవగల అధికారి ఇక్కడ అవసరం. అటువంటే వ్యక్తే అగారియాలను మళ్ళీ సేద్యం వైపు మళ్ళించగలడు. రాంచీ తిరిగి వెళ్ళిన తర్వాత తను వీళ్ళకు భూమి, నీటి పారుదల, వ్యవసాయం పనిముట్లు, పశువులు – ఇవన్నీ దక్కేలా చూస్తాడు. వీళ్ళని ఎప్పుడో ఏడాదికోసారి పంపిణీ చేసే ఈ సహాయం మీదే ఆధారపడేలా చేయడం ఎంత అమానుషం అనుకున్నాడు. ఇలాంటి ఆలోచనలతో తను ఎప్పుడో ప్రశాంతంగా గాఢనిద్రలోకి వెళతాడు. గుడారం చుట్టూ పదిమంది అగారియా కుర్రాళ్ళు పడుకుంటున్నారు. సింగ్ తాను విజయం సాధించినట్టుగా సంతోషపడ్డాడు. ఈ కుర్రాళ్ళు తమలో తాము మాట్లాడుకుంటూ తను మనిషి రూపంలో ఈ ప్రాంతానికి వచ్చిన దేవుడు అంటున్నారు. బయటి నుంచి వెళ్ళి, అంత తక్కువ కాలంలో వాళ్ళ చేత అలా అనిపించుకోవడం చిన్న విషయమేం కాదు. అందునా, ఈ ప్రాంతపు అగారియాలు తమ వాళ్ళను తప్పించి, బయటి వాళ్ళను అస్సలు నమ్మరు. వాళ్ళతోనే ‘దేవుడు’ అనిపించుకోవడమంటే నిజంగా గొప్ప విజయమే.
సింగ్ నిద్రపోతున్నాడు. కానీ అగారియా కుర్రాళ్ళు మాత్రం నిద్రపోవటం లేదు. రోజూ కూడా మేలుకునే ఉండి, ఏవో శబ్దాల కోసం చెవులు రిక్కించి పడుకుంటున్నారు. ఇంకా వాళ్ళెందుకు రాలేదు? ఈ ఏడాది క్యాంపు చాలా పెద్దగా ఉందనా? చాలా మంది జనం, అంతా కోలాహలంగా ఉందనా.. కారణం ఏమై ఉంటుంది?
చివరికి ఒక రాత్రి, పిల్లుల్లాగా అడుగులో అడుగేసుకుంటూ ఒక పెద్ద గుంపు అటుగా వస్తున్న శబ్దం విన్నారు. చిన్నగా ఈల వినిపించింది. దానికి జవాబుగా ఇటునుంచి మరో ఈల. వెంటనే డేరా తాళ్ళు వదులు చేశారు. ఇక తరువాత అంతా నిశ్శబ్దమే. గానీ పనులు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. కుర్రాళ్ళు లేచి, టెంట్ దిగువ భాగాన్ని పైకి లేపారు. ఆకాశంలో చంద్రుడు రెండు బద్దలుగా చీలినట్టనిపిస్తోంది. కుర్రాళ్ళు బియ్యం, మైలో బస్తాలను ఎత్తి అందిస్తే, చిన్న చిన్న చేతులు వాటిని చాకచక్యంగా పట్టుకున్నాయి.
సింగ్‌కు అకస్మాత్తుగా మెళకువ వచ్చింది. టార్చిలైటు వేసి చూశాడు. అగారియాలు లేరు. ఒక్క క్షణంలో సుడిగాలిలాగా గుడారం చుట్టూ తిరిగి వచ్చాడు. కుర్రాళ్ళు టెంటు తాళ్ళు తిరిగి కొయ్యలకు బిగిస్తూ కనబడ్డారు. ఏమైంది? వాటిని ఎవరు వదులు చేశారసలు? ఆశ్చర్యం, అంతా అయోమయం, మోసానికి గాయపడిన సింగ్. వాళ్ళ వైపు కోపంగా చూశాడు. వాళ్ళ ముఖాలు కొత్తగా కనిపించాయి. అదే మనుషులు, అదే ముఖాలు. కానీ తను వాళ్ళను అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకని? ఆ ప్రశ్న అతని గుండెను దహించి వేసింది. తను వాళ్ళ మనసుల్ని చేరుకోలేకపోయానని గుర్తించాడు. ఒక నిజాయితీపరుడైన సహాయ కార్యక్రమాల అధికారినీ, ఆ పదిమంది ఆదివాసీ అగారియా కుర్రాళ్ళనీ కలిపే సూత్రం ఏదీ లేదు. వాళ్ళు ఏ సంబంధం లేని వేర్వేరు గ్రహాల మీది మనుషులు. ఆ కుర్రాళ్ళు దుర్మార్గంగా, ఒక అనాగరిక విజయమేదో సాధించిన వాళ్ళలాగా పళ్ళు ఇకిలించి, అడవిలోకి పారిపోయారు. సింగ్ గుడారంలోకి పరుగెత్తాడు. కరక్టే. రెండు బస్తాలు మాయం!
ఒక్క ఉదుటున బయటకు వచ్చి, వాళ్ళ వెంటబడ్డాడు. వాళ్ళు అక్కడే.. తన ముందే ఎక్కడో ఉన్నారు. చిన్న చిన్న అడుగులు పడుతున్న శబ్దం వినిపిస్తోంది గానీ తప్పించుకుపోతున్నారు. అడవిలోకి బస్తాలు మోసుకుపోవడం తను కళ్ళారా చూశాడు. వాళ్ళు మానవాతీతులేం కాదు, పిల్లలు. మనుషుల పిల్లలే. ఆహా! ఎంత జిత్తులమారి తనం! పెద్దవాళ్ళు దర్జాగా సహాయం కోసం వస్తారు. అదే సమయంలో, పిల్లల్నేమో దొంగతనానికి పంపిస్తారు. కానీ, ప్రభుత్వం రికార్డుల్లో మాత్రం – లోహ్రి అగారియాలు ఎప్పుడూ దొంగతనం చెయ్యరు. వాళ్ళు నేరస్థులు కారు. నిజమే. అందులో అబద్ధమేం లేదు. ఎంత తెలివి! తను వాళ్ళకు సాయం చెయ్యాలని మనస్ఫూర్తిగా అనుకున్నాడు. ఆ విషయం వాళ్ళకూ తెలుసు. ఆ కుర్రాళ్ళు తనని దేవుడు అన్నారు కదా, అదంతా మోసమేనా?
వాళ్ళు నటించారా? ఎవరో తనను నిజంగా మోసం చేసి, నిలువునా ముంచేసినట్టనిపించింది. విశ్వాస ఘాతుకత్వంతో వాళ్ళు తనను దివాళా తీయించినట్టనిపించింది. రక్తం ఉడికిపోయింది. తను నిజాయితీపరుడు. ఆదివాసీల పట్ల అపారమైన సానుభూతి ఉంది. ఈ కారణాలవల్లే తనని ఈ పని కోసం ప్రత్యేకంగా నియమించారు. తను కూడా చాలా శ్రమించాడు. తనకు ఈ బాధ్యత అప్పగించినందుకు న్యాయం చేకూర్చడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. సహాయక సామగ్రి నిజంగా అందాల్సినవాళ్ళకు అందేలా కృషి చేశాడు. వాళ్ళు ఇట్లాంటి సహాయం మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా వాళ్ళకు ఒక మంచి మార్గం చూపించాలని సంకల్పించాడు. వాళ్ళ ఆకలికి శాశ్వత పరిష్కారం కోసం కృషి చెయ్యాలనుకున్నాడు. దీనికి ప్రతిఫలం? ఈ మోసం. దొంగతనానికి పిల్లల్ని పంపారు! వాళ్ళను పట్టుకొని, కఠినంగా వ్యవహరించయినా సరే వాళ్ళు మళ్ళీ జన్మలో ఇటువంటి పని చేయకుండా ఈ దొంగతనం రోగాన్ని ఇక్కడితో కుదర్చాలనుకున్నాడు.
ముందుకు పరుగెత్తాడు. కోపం రగిలిపోతుంటే కాళ్ళు ఎంత వేగంగా పరుగెడుతున్నాయో కూడా తెలియలేదు. దొంగలు కూడా పరుగెత్తుతున్నారు. అడవి పలుచబడింది. గడ్డి కూడా ఎదగని చోటుకు చేరుకున్నారు. అదే పురాణ కాలంలో జ్వాలాముఖి సూర్యదేవుడితో యుద్ధం చేసిన స్థలం. ఉన్నట్టుండి పిల్లలు ఆగిపోయారు. బస్తాలు నేలమీద దింపారు.
బహుశా, పరుగెత్తీ పరుగెత్తీ అలిసిపోయి ఉంటారు, సింగ్ బస్తాల దగ్గరికి వెళ్ళాడు. కాపలా కాస్తున్నట్టుగా వాళ్ళు బస్తాల చుట్టూ గుండ్రంగా నిలబడ్డారు. ఆ క్షణంలో వాళ్ళు సింగ్ కంటికి – వేటలో దొరికిన జంతువు మీద దూకడానికి సిద్ధంగా కాసుక్కూర్చున్న ఆటవిక మృగాల్లా కనబడ్డారు. వాళ్ళు తననే తీక్షణంగా చూస్తున్నారు. వాళ్ళ కళ్ళు నిశ్శబ్దంగా, అచంచలంగా తననే చూస్తున్నాయి. మసక వెన్నెట్లో వాళ్ళ ఆకారాలు మాత్రం అంత స్పష్టంగా కనబడటం లేదు.
అకస్మాత్తుగా వాళ్ళు దగ్గరగా కదలి వచ్చారు. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఒక గుంపుగా. అతన్ని భయం ఆవరించింది. కాస్తాకూస్తా భయం కాదు. పెను భయం. ఎటూ కదల్లేకపోయాడు. అంతా కలసికట్టుగా ఒక్కసారే కదిలి, అతని చుట్టూ గుండ్రంగా గోడ కట్టినట్టుగా, చిన్న చిన్న స్తంభాల్లా నిలబడ్డారు. ఎందుకు?
వాళ్ళు అతనివైపే చూస్తున్నారు. అతను బెదురుబెదురుగా చూశాడు. గుంపు గుండ్రంగా ఇంకొంచెం దగ్గరకు కదిలింది. సింగ్ తల తిప్పి చూశాడు. ఎక్కడా ఖాళీ లేకుండా చుట్టూ మనుషులు. తను వాళ్ళని తప్పించుకుని పారిపోవటం అసాధ్యం. అయినా పారిపోవాల్సిన అవసరం తనకేముంది? వాళ్ళూ మనుషులే. మనుషులకు పుట్టిన వాళ్ళే. దయ్యాలేం కాదు. దయ్యాలు బియ్యాన్ని, మైలో బస్తాల్ని ఎత్తుకుపోవు. అవునూ.. ఎవరబ్బా ఇదో శాపగ్రస్థ ప్రాంతమని చెప్పారు? మరొకళ్ళెవరో ”మనం రాత్రికి మందు తాగాల్సిందే” అన్నారు కూడా.. సింగ్ గుండె దడను అదుపు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళు మరో అడుగు ముందుకు వేశారు.
భయం – అకారణమైన, నగ్నమైన భయం అతన్ని నిలువెల్లా ఆవరించింది. ఎందుకు నిశ్శబ్దంగా వాళ్ళు అలా ముందుకొస్తున్నారు? ఒక్కమాటైనా ఎందుకు మాట్లాడ్డం లేదు? వాళ్ళ ఆకారాలు చాలా భిన్నంగా కనబడుతున్నాయి. తనేం చూస్తున్నాడు. ఎందుకు వాళ్ళు నగ్నంగా ఉన్నారు? అంత పొడవాటి జుట్టు? పిల్లలు. తను పిల్లల గురించి చాలాసార్లు విన్నాడు గానీ మరి అతనికి తెల్ల వెంట్రుకలు ఉన్నాయేయంటి? ఆ ఆడవాళ్ళు, కాదు కాదు.. ఆ ఆడపిల్లల రొమ్ములు అట్లా ఎండిపోయి వేళ్ళాడుతున్నాయేంటి?
ఆ తెల్లజుట్టతను ఇంకా, ఇంకా దగ్గరికి వస్తున్నాడెందుకు? ”దగ్గరికి రావద్దు” అరిచాననుకున్నాడు గానీ కేక గొంతులోనే ఆగిపోయింది. ఈ సారి గట్టి ప్రయత్నం చేసి, బలవంతాన గొంతు పెగుల్చుకుని అరిచాడు. ఆ తెల్లజుట్టు ఆకారం, ఇంకా ఇంకా దగ్గరికొస్తున్నాడెందుకు? తనకు ఏం చూపించాలని అతని ప్రయత్నం? ఎండిపోయి, శుష్కించిపోయి, పీక్కుపోయి వేలాడుతున్న తన అంగాన్ని ఎత్తిపట్టి చూపిస్తున్నాడు.
వీళ్ళు పిల్లలు కారు. పెద్దవాళ్ళే! సింగ్ గొంతులోంచి ఒక్క శబ్దం కూడా బయటికి రాలేదు. కానీ మెదడులో మాత్రం ప్రళయ ప్రకంపనలతో అణు బాంబు పేల్చినట్లయింది. ఆ బీభత్సమంతా వెంటనే ముఖంలో కనిపించినట్లుంది. అందుకే సింగ్‌ని చూసి ఆ ముసలివాడు పెద్దగా వికటాట్టహాసం చేశాడు. ఆ వింత కూత అంతటా వ్యాపించింది. ఆ కూత వింటూనే అంతా పిచ్చిపట్టిన వాళ్ళలా అనాగరికమైన ఆనందంతో గంతులేశారు. కొందరు గాల్లోకి ఎగిరి దూకారు. కొందరు పరవశంతో నేలకు వంగి, అతుక్కుపోయారు. ఇప్పుడు సింగ్ ఏం చెయ్యాలి? తన డ్యూటీ ఏమిటి? ఎవరు చెబుతారు? ఇలాంటి సంఘటన ఎదురైనప్పుడు ఏం చెయ్యాలనేది ఆఫీసర్ల కోసం తయారు చేసిన ఆ రూల్స్ బుక్కులో ఎక్కడా లేదే. మరి సింగ్ తను తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నాననుకున్నాడు!
”మేం పిల్లలం కాదు. కువా తెలుసా? ఆ ఊరి అగారియాలం. కువా తెలుసా? ఆ పేరు విన్నావా?”
”లేదు, లేదు!” సింగ్ చేతులతో కళ్ళు మూసేసుకోవాలని ప్రయత్నం చేశాడు గానీ మెదడు ఏ ఆదేశం ఇవ్వకపోవడంతో చేతులు అతని మాట వినలేదు. ఈ అనాగరికమైన దాడికి అతని మెదడు ఎప్పుడో మొద్దు బారిపోయింది. ఎవరబ్బా.. ”ఇది హనుమాన్ ఆలయం నుంచి తెచ్చిన ప్రసాదం. జేబులో ఉంచుకో” అన్నారు? ఎవరు చెప్పారీ మాటలు?
”మా పవిత్రమైన కొండని రక్షించుకోవడానికి మేమే మీ ప్రజల్ని నరికేసి అడవుల్లోకి పారిపోయి వచ్చాం. పోలీసులు గానీ, సైన్యం గానీ ఎవ్వరూ మమ్మల్ని పట్టుకోలేకపోయారు. ఎప్పటికీ పట్టుకోలేరు కూడా”
మళ్ళీ ఒక్కసారిగా వింత కూతలాగా అంతా పెద్ద పెట్టున నవ్వారు.
”వద్దు, వద్దు, వద్దు…”
”మేము బతకటానికి ఆ అగారియాలు సాయం చేస్తున్నారు. చాలా మంది చచ్చిపోయారు.. తెలుసా.. ఇక్కడ బతకలేక, ఆకలితో మలమల్లాడిపోయి.. చాలా మంది, చాలా మంది చచ్చిపోయారు తెలుసా?”
”లేదు.. లేదు..” సింగ్ గొణిగాడు.
చుట్టూతా ఉన్నవాళ్ళు ఇంకా దగ్గరకు కదిలారు.
”వొద్దు.. దగ్గరికి రావొద్దు…”
”మేమెందుకు రావొద్దు? నీ దగ్గర బోలెడు బస్తాల బియ్యం, మైలో ఉన్నాయిగదా. రెండు బస్తాల కోసం మమ్మల్ని తరుముకుంటూ వస్తావా? ఎందుకు? వచ్చావు కాబట్టి మేం ఎట్లా ఉన్నామో చూసిపోవాల్సిందే. హే! రండి… దగ్గరికి రండి…అతనికి చూపించండి… చూపించండి!”
పురుషులు తమ అంగాల్ని, స్త్రీలు తమ రొమ్ముల్ని చూపించారు. ఆ ముసలి మనిషి సింగ్‌కు మరీ దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. అతని అంగం సింగ్‌కు తగిలింది. తర్వాత ముందు నుంచి.. వెనుకాల నుంచి. ఏదో ఎండిపోయిన, అపవిత్రమైన స్పర్శ. అతన్ని అశుభ్రం చేస్తోంది. ఎండిపోయిన పాము కుబుసం స్పర్శలాగా.. గరుకుగా.. అంతా బెరుకుగా..!
”ఇప్పుడు మేం పధ్నాలుగు మందిమే బతికున్నాం. తిండిలేక మా శరీరాలు ఎండిపోయి, కుంచించుకుపోయాయి. మా మగ
వాళ్ళు నపుంసకులు, మా ఆడవాళ్ళు గొడ్రాళ్ళయ్యారు. అందుకే సహాయంగా వచ్చిన వస్తువుల్ని దొంగతనం చేశాం. మేం మళ్ళీ మనుషులంత ఎత్తు ఎదగాలంటే మాకు తిండి అవసరమని నీకు తెలియదా?”
”కాదు… కాదు… కాదు…”
”మేం ప్రాణాలతో బతికి ఉండటానికి అగారియాలు సహాయపడుతున్నారు. అసలు మమ్మల్ని ఇంత బాధలకు ఎందుకు గురిచెయ్యాలి? ఇదంతా ఆ కువాలో హత్యలు చేసినందుకేనా? ఆ కువా హత్యల కోసమేనా?”
”లేదు, లేదు.. ఇది నిజమయ్యే అవకాశం లేదు”
ఒకవేళ ఇది నిజమైతే…? మిగిలినదంతా అబద్ధమే. ఇప్పుడు తను దేన్ని నమ్మాలి? ఎవర్ని నమ్మాలి? ఈ కువా అగారియాల మాటే సత్యమైతే.. ఇక నాగరికతను ఎట్లా సమర్థించటం? కొపర్నికస్ ఖగోళ సిద్ధాంతాన్ని, విజ్ఞాన శాస్త్ర వికాసాన్నీ, ఈ అతి గొప్ప సువర్ణ శతాబ్దాన్ని, ఈ స్వాతంత్య్రాన్నీ, మరింత మెరుగైన భారతదేశాన్ని నిర్మించేందుకు వేస్తున్న వరుస ప్రణాళికల్ని.. ఎట్లా.. ఎట్లా.. సమర్థించటం?
సింగ్ చేయగలిగిందల్లా ఒక్కటే..
మంత్రంలాగా ”లేదు… లేదు… లేదు…” అంటూనే
ఉన్నాడు.
”నువ్వు లేదనగానే ఇవన్నీ లేకుండా మాయమైపోతాయా? అయితే మా అంగాలు ఎందుకు ఇట్లా కుంచించుకుపోయాయి? చూడు.. బాగా చూడు.. మేం పిల్లలం కాము. పెద్దవాళ్ళం”
వాళ్ళ కోపంతో బిగ్గరగా నవ్వారు. ప్రతీకారంతో పెద్ద పెద్ద కేకలు పెట్టారు. వికటాట్టహాసం చేస్తూ, అతని చుట్టూ తిరిగారు. అతనికి తమ అంగాల్ని తాకించారు. తమ అంగాల్ని అతని వంటికేసి రుద్దుతూ.. తాము ఈ భారతదేశ పౌరులమేనని, ఎదిగిన పౌరులమని చెప్పారు.
పైన ఆకాశంలో చంద్రబింబం నిస్సహాయంగా, శక్తి హీనంగా మారిపోయింది. జ్వాలాముఖికీ, సూర్యదేవుడికీ మధ్య జరిగిన యుద్ధ జ్వాలలతో కాలిపోయిన ఆ మైదానంలో… తన వెన్నెల కాంతులు వెలాతెలా పోతున్నా ఏమీ చెయ్యలేకపోయింది. పిల్లల సైజుకన్నా పొడుగులేని పెద్దలు, అనాగరికమైన ఆనందంతో,
ఉద్వేగంతో నృత్యాలు చేశారు. ప్రతీకార వాంఛలో నుంచి పుట్టుకొచ్చిన ఆనందహేలలో బిగ్గరగా నవ్వారు. బహుశా, వాళ్ళు తమ శత్రువుల తలల్ని తెగనరికినప్పుడు ఇలా సంతోషంగా గంతులేసి ఉంటారు. అదే ప్రతీకారం, అదే ఆనందం!
అయితే ఈ ప్రతీకారం దేని మీద?
సింగ్ నీడ వాళ్ళ శరీరాల్ని ప్పుతోంది. ఆ నీడే విషయం అతనికి ఏదో అర్థమయ్యేలా చేసింది.
వాళ్ళు అతని ఐదడుగుల తొమ్మిది అంగుళాల పొడవును అసహ్యించుకున్నారు.
వాళ్ళు సహజంగా పెరిగిన అతని శరీరాన్ని అసహ్యించు కున్నారు.
అతని సాధారణత్వమే నేరం. దాన్ని వాళ్ళు క్షమించ లేకపోయారు.
సింగ్ మస్తిష్క కణాలు తార్కికంగా దొరికిన ఈ వివరణను నమోదు చెయ్యటానికి ప్రయత్నం చేశాయి. కానీ అతను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. ఎందుకు, ఎందుకు ఈ ప్రతీకారం? తనో అతి సాధారణ, సగటు భారతీయ పౌరుడు. తనకి కూడా ఒక ఆరోగ్యవంతుడైన రష్యన్‌కో, కెనెడియన్‌కో, అమెరికన్‌కో ఉన్నంత పుష్టి లేదు. తనూ మానవ శరీరానికి తగినన్ని కాలరీలను అందించే పౌష్టికాహారం తినలేదు. శరీరానికి కావల్సినన్ని కేలరీలు అందించకపోవటం నేరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.
అయినా, తనను తాను సమర్థించుకునేందుకు తను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. వెన్నెట్లో అలాగే నిలబడి… చెవులు దిబ్బళ్ళు వేసే వాళ్ళ అరుపులు వింటూ.. వాళ్ళ అంగాలు, రొమ్ములు తనకేసి రుద్దుతుంటే వణికిపోతూ, అట్లాగే స్థాణువులా నిలబడ్డాడు. విషయం సింగ్‌కు తెలుసు. సరైన తిండిలేక ఎండిపోయి, అసహ్యంగా, నవ్వులాటగా తయారైన సగటు భారతీయ శరీరమనేది నాగరిక సమాజపు చరిత్రలో జరిగిన అతి పెద్ద నేరమని సింగ్‌కు తెలుసు. దీనికి తనను తప్పుపట్టి, ఉరి తీయాలని తనకు తెలుసు. తనమీద తానే తీర్పు చెప్పుకొన్నాడు. తనకు తానే మరణశిక్ష వేసుకున్నాడు. ఎందుకంటే అగారియాలు తనంత ఎత్తు లేకపోవడంలో తనక్కూడా బాధ్యత ఉందని తనకు తెలుసు. ”అవును. నాకు మరణశిక్ష వెయ్యాలి” అని చెప్పాలను కున్నాడు. తల పైకెత్తి చంద్రునివైపు చూశాడు. వాళ్ళు ఇంకా బిగ్గరగా నవ్వుతూనే ఉన్నారు. గట్టిగా కేకలు పెడుతున్నారు. నృత్యాలు చేస్తున్నారు. పురుషాంగాల్ని తనకేసి రుద్దుతున్నారు. సింగ్‌కు మిగిలింది ఒక్కటే. బండరాయి అయిపోవాలి. పిచ్చితో ఊగిపోతూ, ఆ ప్రాంతం మొత్తాన్నీ చీల్చేలా, గొంతు మొత్తం చించుకుంటూ పిచ్చికుక్కలాగా గట్టిగా అరవడం ఒక్కటే మిగిలింది. కానీ అతని మెదడు అట్లా అరిచీ, అరిచీ, అరిచీ గీపెట్టాలని అతని గొంతు నరాలకు ఎందుకు ఆదేశాలు పంపటం లేదు? ఎందుకని? అతని చెక్కిళ్ళ మీద కన్నీళ్ళు మాత్రం ధారకట్టాయి.
సంపాదకులు: సూశీ తారు, కె.లలిత
ఇంగ్లీషు అనువాదం: పినాకి భట్టాచార్య
తెలుగు: మమత కొడిదెల
(దారులేసిన అక్షరాలు 20వ శతాబ్దపు
భారతీయ మహిళల రచనలు నుండి)