మణిపూర్‌ ముఖచిత్రం- సత్యవతి కొండవీటి

2008లో పూనాలో జరిగిన మహిళా జర్నలిస్ట్‌ల ఆరో సదస్సులో 2009లో జరగబోయే సదస్సు ఇంఫాల్‌లో జరుగుతుందని ప్రకటించిన దగ్గర నుంచి ఈశాన్య భారతాన్ని చూడడానికైనా తప్పనిసరిగా ఈ సమావేశాలకి హాజరవ్వాలని అనుకున్నాను. పూనాలో సమావేశాలు జరుగుతున్నపుడే హెల్ప్‌లైన్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కి జైపూర్‌ వెళ్ళడంవల్ల నేను వాటిని మిస్‌ అయ్యాను. ఎలాగైనా ఇంఫాల్‌ వెళ్ళాలని డబ్బులు దాచుకోవడం మొదలుపెట్టాను. మణిపూర్‌ చాలా దూరం కాబట్టి ప్రయాణం ఖర్చులకే ఇరవై వేలు కావాలి. సొంత డబ్బులతోనే వెళ్ళాలి.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న మహిళా జర్నలిస్ట్‌లు 2003లో ఢిల్లీలో సమావేశమైనపుడు ఒక వెబ్‌సైట్‌ నిర్మాణంతోపాటు ప్రతి సంవత్సరం కలవాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ మొదటి సమావేశానికి నేనూ హాజరయ్యాను. మీడియాలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చలతోపాటు, ఎన్నో అంశాల మీద మూడు రోజులపాటు సమావేశాలు జరుగుతాయి.

మూడు నెలల క్రితం ఇంఫాల్‌లో సదస్సు నిర్వహణా బాధ్యతని స్వీకరించిన అంజులిక నుంచి చక్కటి కవితాత్మకమైన ఆహ్వానం నెట్‌వర్క్‌ సభ్యులందరికీ అందింది. అంజులిక రాసిన ఈ మెయిల్‌ అందరిలో ఉత్సాహాన్ని నింపింది. ఇక అప్పటినుంచి ప్రయాణపు ఏర్పాట్లు మొదలయ్యాయనే చెప్పాలి. అయితే ఎన్నో అనుమానాలు. మణిపూర్‌ గురించి గాని, మిగతా ఈశాన్య భారతం గురించి గానీ మీడియాలో ఎలాంటి వార్తలు, సమాచారం లేకపోవడం వల్ల ఎన్నెన్నో సందేహాలు. అసలు ఎలా వెళ్ళాలి? ఇంఫాల్‌కి రైల్వే లైను లేదు. విమానంలో వెళ్తే ఎక్కడ దిగాలి? కోల్‌కతానా? గౌహతీనా? అక్కడి నుండి బస్సులుంటాయా? ఎన్ని గంటల ప్రయాణం? ఇంటర్‌నెట్‌ నుంచి కొంత సమాచారం సేకరించినా తృప్తిలేదు. మొబైల్‌ ఫోన్‌లు మౌనవ్రతం పడతాయని, ఏటీఎంలు మొత్తానికే మొరాయిస్తాయని కొందరు భయపెట్టారు. అవసరమైన డబ్బులు మోసుకెళ్ళాలన్నమాట.

ఈ అనుమానాలన్నీ ప్రశ్నల రూపంలో సంధిస్తూ అంజులికకు ఎన్ని మెయిల్స్‌ రాసినా సమాధానాల్లేవు. మణిపూర్‌లో పరిస్థితి, అంజులిక నిస్సహాయ స్థితి తెలియక కోపం తెచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఇంటర్నెట్‌ సరిగ్గా పనిచేయడం లేదని, త్వరలోనే అన్ని వివరాలు రాస్తానని తన మెయిల్‌, ఆ మర్నాడే కల్పనా శర్మ నుండి మెయిల్‌ వచ్చింది. అంజులిక కజిన్‌ ఇంఫాల్‌లో దారుణ హత్యకు గురయ్యాడని, తను చాలా దు:ఖంలో ఉందని దాని సారాంశం. అందరం చాలా బాధపడుతూ తనకి రాసాం. తను కాన్ఫరెన్స్‌ నిర్వహించగలుగుతుందా అనే భయాలను పటాపంచలు చేస్తూ అంజులిక అన్ని వివరాలతో మెయిల్‌ ఇచ్చింది. తన దు:ఖాన్ని దిగమింగి ప్రోగ్రామ్‌ జరపడానికి తను రెడీ అయ్యింది.

ఆంధ్రప్రదేశ్‌ నుండి ఎందరు వెళ్తారో, ఎవరెవరు వెళ్తారో స్పష్టత లేకపోవడం వల్ల నేను నా ప్రోగ్రామ్‌ ఒంటరిగానే తయారు చేసుకున్నాను. తిరుగు ప్రయాణంలో గౌహతిలో ఐఐటి చదువుతున్న నా ఫ్రెండ్‌ గీత కూతురు వైష్ణవి నా కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. క్యాంపస్‌లోను, షిల్లాంగ్‌లోను నా కోసం గెస్ట్‌హౌస్‌ బుక్‌ చేసి, టాక్సీ మాట్లాడి గౌహతి ఎయిర్‌పోర్ట్‌లో

ఉంచింది. ఈశాన్య రాష్ట్రాలకు ఎప్పుడూ వెళ్ళకపోయినా సరే, ఎలాంటి సంకోచం పెట్టుకోకుండా  ఒక్కదాన్నే తిరుగుదామని నిర్ణయించుకున్నాను. కొన్నిసార్లు ఒంటరి ప్రయాణాలు గొప్ప గొప్ప అనుభవాలను అందిస్తాయి. ఇంఫాల్‌ వెళ్ళిన తర్వాతే ఆంధ్రా నుండి వచ్చిన వాళ్ళను కలుసుకోవడం జరిగింది.

4వ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఫ్లయిట్‌లో నా ఇంఫాల్‌ ప్రయాణం మొదలైంది. పది గంటలకు కోల్‌కతాలో దిగి, ఇంఫాల్‌ ఫ్లయిట్‌ కోసం ఎదురుచూస్తున్నపుడు ముంబై, పూనా, కోల్‌కతా గ్రూపులు కలిసాయి. 12.30కి ఇండిగో విమానంలో బయలుదేరి 1.45కి ఇంఫాల్‌లో దిగాను. ముందు విమానంలో బయలుదేరి వెళ్ళిన ఆంధ్రా గ్రూప్‌లో సాక్షిలో పనిచేసే మంజరి, వార్తలో పనిచేసే జె.శ్యామల, వసంత, వనజారెడ్డి, ఎన్టీవీలో పనిచేసే సమీర (మంజరి కూతురు) కలిసారు. అంజులిక కోసం ఎదురుచూస్తుంటే గలగల నవ్వుతూ చిత్ర మా కోసం వాహనం తీసుకువచ్చింది. అందరం వాహనంలో ఎక్కి ‘మంత్రిపుక్రి’ అనే ప్రాంతానికి బయలుదేరాం. అక్కడే ఒక క్రిస్టియన్‌ సంస్థలో మా అందరికీ వసతి ఏర్పాటైంది. ఎయిర్‌పోర్ట్‌ నుండి మంత్రిపుక్రికి

వెళ్తుంటే, దారిపొడుగునా కనబడిన షాపులు, భవనాలు చూసినపుడు మేము ఒక రాష్ట్ర రాజధాని నగరంలో ఉన్న భావం కలగలేదు. దుమ్ము కొట్టుకుపోయిన ఆ దారంతా చూస్తున్నపుడు ఏదో చిన్న పట్టణంలో ఉన్నామనిపించింది. మధ్యలో అరగంటకి పైగా ట్రాఫిక్‌ జాం అయ్యింది. పెళ్ళిళ్ళ సీజన్‌ అని చిత్ర ప్రకటించింది. మామూలుపౌరులకన్నా తుపాకు లెక్కుపెట్టిన ఆర్మీ, అస్సామ్‌ రైఫిల్స్‌ సాయుధుల హడావుడి ఎక్కువగా ఉంది. జిప్సీ వాహనాల్లో ట్రిగ్గర్‌ మీద వేలుంచి, తీక్షణంగా జనంవైపు చూస్తున్న వాళ్ళని చూస్తుంటే వెన్నులో జలదరించినట్లయింది.

మా వాహనం దుమ్ము రేపుకుంటూ మంత్రిపుక్రిలోకి ప్రవేశించింది. మెయిన్‌ రోడ్డుకి అరకిలోమీటర్‌లో రిట్రీట్‌ హౌస్‌ ఉంది. దుమ్ము తుఫానును చీల్చుకుంటూ మా వాహనం ఓ చిన్నపాటి చెరువు పక్కనుంచి పాఠశాల భవనంలా ఉన్న రిట్రీట్‌ హౌస్‌ ముందు ఆగింది. అప్పటికి మూడు గంటలయింది. ఎవరి సామానులు వాళ్ళు మోసుకుంటూ రెండంతస్థులు ఎక్కి లోపలికెళితే బోర్డింగ్‌ స్కూల్‌లో ఉన్నట్లుగా వరుసగా ఓ ఇరవై మంచాలు కనబడ్డాయి. తలో మంచం దగ్గర లగేజ్‌ పెట్టి లంచ్‌ ఏర్పాట్లు ఏమిటా  అని అడిగితే ఏమీలేవు అని తెలిసింది. అందరి బ్యాగుల్లోంచి బిస్కెట్‌ ప్యాకెట్లు, చిక్కీలు, చపాతీలు బయటికొచ్చాయి. అందరం వాటిని షేర్‌ చేసుకుని కబుర్లలో పడ్డాం. ఇరవై మందికి మూడే బాత్రూమ్‌లున్నాయి. ఎవరెవరు, ఎప్పుడు స్నానాలు చేయాలో జోకులేసుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నపుడు ఎవరో వచ్చి మనకోసం రూమ్‌లు కూడా ఉన్నాయంట అని ప్రకటించారు. మళ్ళీ లగేజ్‌ మోసుకుంటూ రూమ్‌లున్న వైపు వెళ్ళాం. నేను, కల్పనా శర్మ ఒక రూమ్‌లో సర్దుకున్నాం.

మొబైల్‌ ఫోన్లు మూగనోము పట్టడంతో మెయిన్‌ రోడ్డుకెళ్ళి ఎస్టీడీ ఫోన్‌ చేయాలని కొంతమంది బయలుదేరాం. రోడ్డుమీదకు వెళ్ళేవరకు మాకు తెలియని విషయం ఒకటుంది. అదే గత నెలరోజులుగా ఇంఫాల్‌లో సాయంత్రం ఐదు నుండి ఉదయం ఐదు వరకు కర్ఫ్యూ ఉందని. మేము వెళ్ళేసరికి నాలుగున్నర అయింది. ఇంక అరగంటే టైముంది. ఒకే ఒక్క ఎస్టీడీ బూత్‌ కనబడింది. ఫోన్లు చేసి వాటర్‌ బాటిల్స్‌, ఏవో తినుబండారాలు కొనుక్కుని టీ కోసం చూస్తే ఒక్క హోటల్‌ కూడా కనబడలేదు. పోలీసుల విజిల్స్‌ వినబడసాగాయి. హడావుడిగా షాప్‌లు మూసేయసాగారు. ఒకామె టీ కోసం మేం పడుతున్న అవస్థ చూసి, ఇంట్లోకి పిలిచి బ్లాక్‌ టీ పెట్టి ఇచ్చింది. పాలు లేవని చెప్పింది. అందరం దుమ్ము లేపుకుంటూ మా బసవైపు నడవసాగాం. తీరా రిట్రీట్‌ హౌస్‌కి చేరేసరికి చిమ్మచీకటి. పవర్‌ కట్‌ అట. కరెంట్‌ ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. చీకటివల్ల వెన్నెల స్పష్టంగా కనబడుతోంది. చుట్టూ పరచుకున్న కొండలమీద తెల్లగా కురుస్తున్న వెన్నెల. పల్లెటూళ్ళలో కరెంట్‌ పోయినపుడు పౌర్ణమి ఎంత అందంగా కనబడుతుందో అష్టమినాటి చంద్రుడు అంత అందంగాను కనబడ్డాడు.

మా అదృష్టం బావుండి రూముల్లో చిన్న చిన్న సోలార్‌ లైట్‌లు వెలుగుతున్నాయి. ఎనిమిదింటికల్లా డిన్నర్‌కి రమ్మన్నారు. కట్టెల పొయ్యి మీద చికెన్‌ వొండుతుంటే లోపలికెళ్ళి చూసాన్నేను. అపుడే లిల్లీ పరిచయమైంది. రిట్రీట్‌ హౌస్‌లో వంట చేస్తుంది లిల్లీ. కూరల్లో ఉప్పు, కారం అస్సలు లేవు. చికెన్‌ కొంచెం బెటర్‌. క్యాబేజ్‌ ఎక్కువగా వాడారు. ఏదో తిన్నామన్పించి ఎనిమిదిన్నరకల్లా రూమ్‌ల్లో పడ్డాం. ఏం చెయ్యాలో ఎవరికీ అర్థం కాలేదు. కాసేపు కబుర్లయ్యాయి. ప్రయాణ బడలికతో అందరూ అలిసిపోయారు. అయినా నిద్దర రావట్లేదు. టీవీల్లేవు. చదువుదామంటే లైట్‌ లేదు. చుట్టూ చిమ్మచీకటి. ఉండుండి వినిపిస్తున్న పోలీస్‌ విజిల్స్‌. ముసుగేసి పడుకోవడం బెటరన్పించి తొమ్మిదికల్లా మంచమెక్కేసాం. నా రూమ్మేట్‌ కల్పనకి దుమ్మువల్ల బాగా జలుబు చేసి, రాత్రంతా చాలా ఇబ్బంది పడింది.

మర్నాడు ఐదుకల్లా మెలకువ వచ్చేసింది. తొమ్మిదింటికల్లా రెడీ అవ్వాలని క్రితం రోజు చిత్ర చెప్పింది. ఓ గంటసేపు వాకింగ్‌కెళితే టైమ్‌పాస్‌ అవుతుందని అనుకుని బూట్లేసుకుని బయటికొస్తే బాగా చలిగా అన్పించింది. అప్పటికే మంజరి, సమీర వాళ్ళు కూడా బయటికొచ్చారు. అందరం కలిసి బయటపడి కనబడుతున్న కొండలవైపు బయలుదేరాం. చల్లగాలిలో నడవడం చాలా హాయిగా ఉంది. చిన్న చిన్న ఇళ్ళు. ఎక్కువ భాగం వెదురు తడకలతో కట్టుకున్నవే. మేం నడుస్తూ వెళుతున్నపుడు ఒకామె ఇంటిముందు ఊడుస్తుంటే మాతో ఉన్న వసంత ఫోటో తియ్యడానికి ప్రయత్నించినపుడు మమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచింది. సన్నగా, సంప్రదాయ మణిపురి దుస్తుల్లో ఉన్న ఆమె పేరు సోసో. మమ్మల్ని ఎంతో ఆదరంగా పిలిచి, చిన్న చిన్న మోడాలు వేసి కూర్చో మంది. లోపల్నుంచి నలుగురు పిల్లలు వచ్చారు. తన పిల్లలని, ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలని చెప్పింది. చక్కటి నవ్వు ముఖాలతో, చికిలి కళ్ళతో ఉన్నారు వాళ్ళు. తన భర్త పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడట. వెదురు చాపలతో కట్టిన మూడు రూముల ఇల్లు. శుభ్రంగా ఉంది. లోపల్నుంచి కుంపటి తెచ్చి మా మధ్య పెట్టి టీ తెస్తానని వెళ్ళింది. మేం పిల్లల ఫోటోలు తియ్యడంలో మునిగాం. ఆమె కొడుకు నవ్వుతుంటే ఎంత ముద్దొచ్చాడో. ఆ పిల్లాడి కళ్ళు, ముక్కు, పెదాలు అన్నీ నవ్వుతుంటాయి. సోసో వేడివేడి టీ తెచ్చి ఇచ్చింది. ఆ చలిలో వెచ్చటి టీ తాగుతూ సోసోతో బోలెడు కబుర్లు చెప్పాం. కర్ఫ్యూ గురించి అడిగితే, నవ్వుతూ అలవాటయిపోయింది అంది. మేము జర్నలిస్ట్‌లమని చెప్పాం. ఆమెకు థాంక్స్‌ చెప్పి బయటపడ్డాం.

తొమ్మిదింటికల్లా అందరం తయారై బస్సులో కూర్చున్నాం. దాదాపు 60 మంది జర్నలిస్టులు అప్పటికి ఇంఫాల్‌ చేరుకున్నాం. ఇంకా రావలసిన వాళ్ళున్నారు. మొదటిరోజు మీటింగ్‌ కాంగ్లా ఫొర్ట్‌ అనే చోట జరుగుతోందని చిత్ర చెప్పింది. మేము కాంగ్లా చేరేసరికి పదయ్యింది. సమావేశాన్ని ప్రారంభించే హాలులో కూర్చున్నాం. మణిపూర్‌ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సమావేశాన్ని ప్రారంభించారు. అదే రోజు ”అనుపమ జయరామన్‌” అవార్డును ప్రదానం చేయడం జరిగింది. చాలా చిన్న వయసులో మరణించిన ”అనుపమ” పేరుమీద ఆమె తల్లిదండ్రులు, జర్నలిస్ట్‌ల నెట్‌వర్క్‌  సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవార్డును 2008కి గాను అలీఫియ ఖాన్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌, హిందుస్తాన్‌ టైమ్స్‌, ముంబయ్‌కి ప్రదానం చేసారు. ఆ తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ‘అరంబమ్‌ మెంచుబీ’ మణిపురి స్త్రీల స్థితిగతుల మీద ఉపన్యసించారు. అరంబమ్‌ నాకు బాగా పరిచయమే. మేమంతా ”స్పారో” ఏర్పాటు చేసిన జాతీయస్థాయి రచయిత్రుల సమావేశంలో ఐదు రోజులు ఖషీద్‌ (ముంబయి)లో కలిసి ఉన్నాం. నన్ను గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించింది. అక్కడే ఉండే మరో మణిపురి రచయిత్రి బోర్‌కన్య గురించి వాకబు చేస్తే, మర్నాడు తనని తీసుకొస్తానని వాగ్దానం చేసింది అరంబమ్‌. ఆ తర్వాత మణిపురి వర్కింగ్‌ జర్నలిస్ట్‌లతో మాటామంతీ జరిగింది. మణిపురి జర్నలిస్ట్‌లతో మాట్లాడుతున్న సందర్భంలోనే కాంగ్లా గేట్‌ ఉదంతం గురించి, ఆ గేట్‌ ముందు జరిగిన చారిత్రాత్మక మణిపురి స్త్రీల నగ్న ప్రదర్శన గురించి మా అందరికీ వివరంగా తెలిసింది. నాలుగున్నర అయ్యేసరికి కర్ఫ్యూ హడావుడి మొదలైంది. మేమంతా హడావుడిగా బస్సెక్కేశాం. అందరూ ఎక్కేసరికి ఆలస్యం కావడంతో కర్ఫ్యూ మొదలైంది. పోలీసులు, ఆర్మీ బెదిరింపుల మధ్య మా బస్సు భయంభయంగా బయలుదేరింది.

కాంగ్లా ఫోర్ట్‌, మనోరమాదేవి హత్య:

2004, జులై 11వ తేదీన తన ఇంట్లో నిద్రపోతున్న మనోరమాదేవి అనే మహిళను అర్థరాత్రి అస్సామ్‌ రైఫిల్స్‌ అరెస్ట్‌ చేసి తీసుకెళ్ళారు. తీవ్రవాది అనే అనుమానంతో ఆమెను అరెస్ట్‌ చేసారు. కొన్ని గంటల తర్వాత చిత్రహింసలకు గురిచేయబడి, ఒళ్ళంతా గాట్లు, కమిలిపోయిన శరీరభాగాలతో, సామూహిక అత్యాచారానికి గురైన మనోరమ శవం రోడ్డుమీద దర్శనమిచ్చింది.

ఈ సంఘటన మణిపూర్‌ స్త్రీలను తీవ్రంగా కలచివేసింది. 12 మంది ”మైరా ఫెయిబి” సంస్థకు చెందిన మణిపురి స్త్రీలు ”ఇండియన్‌ ఆర్మీ రేప్‌ అజ్‌” అనే బ్యానర్‌తో పబ్లిక్‌ ప్రదేశంలో, కాంగ్లా గేటు ముందు నగ్న ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శన దేశం మొత్తాన్నీ నివ్వెరపరచి మణిపూర్‌లో ఏం జరుగుతోందో అర్థం చేయించింది. మనోరమ హత్యానంతరం కొన్ని నెలలపాటు మణిపూర్‌ మండిపోయింది. కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ వేశారు కానీ ఈ రోజుకీ ఆ రిపోర్టు బయటికి రాలేదు. స్త్రీల నగ్న ప్రదర్శనానంతర ఉద్యమం వల్ల అస్సామ్‌ రైఫిల్స్‌కీ, ఆర్మీకీ కేంద్ర స్థావరంగా ఉన్న కాంగ్లా ప్రాంతాన్ని ఖాళీ చేయించి, సివిల్‌ అధికారులకు అప్పగించడం జరిగింది.

మేము బస్సులో మంత్రిపుక్రికి ప్రయాణం చేస్తున్నప్పుడు కాంగ్లా గేట్‌ ఉదంతం గురించి విన్నాం. మనోరమని తలుచుకుని కన్నీళ్ళ పర్యంతమయ్యాం. తోటి స్త్రీకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ నగ్న ప్రదర్శనలాంటి తీవ్రచర్యతో తమ నిరసనను వ్యక్తం చేసిన పన్నెండు మంది మణిపురి స్త్రీలకు పాదాభివందనం చెయ్యాలని పించింది. బస్సు మా బస దగ్గరికి దుమ్ము లేపుకుంటూ వచ్చింది. అప్పటికే చీకటి పడింది. కరెంట్‌ లేదు. దూరంగా కొండలమీద మిణుకు మిణుకుమంటూ వెలుగుతున్న దీపాలు. పిండారబోసినట్టు నవమి వెన్నెల. ”కొండలపైనా, కోనలలోనా గోగులు పూచే జాబిలి” అని పాడుకుంటూ ఆ చీకట్లో చేసే పనేంలేక బయటే కూర్చుండిపోయాం. చాలాసేపు కాంగ్లా గేట్‌ ఉదంతం మా మాటల్లో నలిగింది. డిన్నర్‌ అయ్యాక కొంతమందిమి ఒక గదిలో చేరి పాటలు పాడే కార్యక్రమం మొదలుపెట్టాం. బెంగుళూరు నుండి వచ్చిన వాసంతి రేష్మా ‘చార్‌ దినోం కా’ పాటను అద్భుతంగా పాడింది. అన్ని భాషల వాళ్ళు తలో పాట అందుకుని హై పిచ్‌లో పాడుతూ, అల్లరి చేస్తుంటే రిట్రీట్‌ ఫాదర్‌ పాల్‌ వచ్చి నిశ్శబ్దంగా ఉండాలని, తొమ్మిది అవుతోంది లైటు తీసేయాలని హుకుం జారీ చేశాడు.  బతుకుజీవుడా తొమ్మిదికే పడుకోవాలా అనుకుంటూ ఎవరి గదుల్లోకి వాళ్ళం ముడుచుకుపోయాం. ఆ రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. కలలో కాంగ్లా గేట్‌, నగ్న స్త్రీలు కలవరపరిచారు. మనసు కలచివేసినట్లయింది.

మర్నాడు ఉదయమే ఆంధ్రా బ్యాచ్‌ ఎదురుగా ఉన్న కొండ ఎక్కాలని బయలుదేరాం. నేను, వనజ, మంజరి, శ్యామల, సమీర, వసంత, అనూరాధ, వనజారెడ్డి అందరం హుషారుగా కొండెక్కు తున్నాం. కిందినుంచి చూస్తే కొండమీద ఏమీ కనబడలేదు కానీ మేము పైకి వెళుతుంటే ఒక ఇల్లు కనబడింది. దాని పక్కనే ఒక గెస్ట్‌హౌస్‌ లాంటిది కనబడింది. కొండమీదికి వెళ్ళేటప్పటికి ఆ ఇంట్లోని కుటుంబమంతా ఉదయపు ప్రార్థనలో ఉన్నారు. మేం నిశ్శబ్దంగా నిలబడ్డాం. కొంతసేపటికి ప్రార్థన ముగించి ఒకాయన మా దగ్గరకొచ్చాడు. మేం ఫలానా అని చెప్పాం. తన పేరు అనమ్‌ అని, ఆ కొండ పేరు ఖదిమ్‌ కొండ అని చెబుతూ ఖదిమ్‌ అనే అతను అక్కడ ఉండేవాడని, ఈ గెస్ట్‌హౌస్‌ వాళ్ళదేనని, తాను వాచ్‌మేన్‌నని చెప్పాడు. ఆ పక్కనే ఉన్న ఖదిమ్‌ భార్య సమాధిని చూపించాడు. మా ఎనిమిది మందికి పొగలు కక్కే టీ తీసుకొచ్చి ఇచ్చింది అతని కూతురు. టీ తాగి అతని ఇంట్లోకి వెళ్ళాం. చిన్న ఇల్లు. అనే, అతని భార్య, ఇద్దరు కూతుళ్ళు ఉంటున్నారు. ఆవులు, బాతులు పెంచుతున్నారు. మేం శెలవు తీసుకుని బయలుదేరబోతుంటే ‘ఆప్‌ లోగ్‌ ఫిర్‌ ఆయియే’ అంటూ ఆదరంగా చెప్పాడు అనమ్‌. మణిపూర్‌ వాస్తవ్యులు కొత్త వ్యక్తులతో కూడా చాలా ఆదరంగా, ఆప్యాయంగా మాట్లాడడం గమనించాం. సోసో, అనమ్‌ కుటుంబం మాకు బాగా గుర్తుండిపోయారు.

తొమ్మిదిన్నరకు రెండో రోజు సమావేశం మొదలయింది. నెట్‌వర్క్‌ సమావేశాలకు హాజరైన సభ్యుల పరిచయాలయ్యాయి. అంతకు ముందురోజు మధ్యాహ్నానికి ఇంఫాల్‌ చేరిన ‘నవోదయం’ సభ్యులు తమను తాము పరిచయం చేసుకున్నపుడు సభ్యులందరూ కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానించారు. చిత్తూరుకు చెందిన ఈ గ్రామీణ స్త్రీలు ఎంతో ప్రతిభావంతంగా తామే ఎడిటర్లుగా, రిపోర్టర్లుగా పనిచేస్తూ నడుపుతున్న పత్రిక నవోదయం. స్వయం సహాయక బృందాలకు చెందిన ఈ పత్రిక చాలా సంవత్సరాలుగా నడుస్తోంది. ఆ టీమ్‌ సభ్యులు ప్రతి సంవత్సరం మహిళా జర్నలిస్టుల నెట్‌వర్క్‌ సమావేశాలకు హాజరవుతారు.

పరస్పర పరిచయాలయ్యాక నెట్‌వర్క్‌ గురించి, వెబ్‌సైట్‌ గురించి చర్చ జరిగింది. జాతీయస్థాయిలో మహిళా జర్నలిస్ట్‌ల నెట్‌వర్క్‌ను  రిజిస్టర్‌ చేయాలా వద్దా అనే అంశం మీద వేడైన వాడైన చర్చ జరిగింది. కొంతమంది రిజిస్టర్‌ చేస్తే బావుంటుందని వాదిస్తే మరికొందరు నెట్‌వర్క్‌ అందం అంతా రిజిస్టర్‌ చేయకుండా, ఎలాంటి హెచ్చు తగ్గుల స్థాయిలు లేకపోవడంలోనే ఉందని వాదించారు. అయితే ఎక్కువ శాతం రిజిస్ట్రేషన్‌ వైపు మొగ్గు చూపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కల్పనాశర్మ చర్చను ముగిస్తూ దీనిమీద తొందరపడడం మంచిది కాదని మరింత చర్చ తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పింది.

ఆ తర్వాత మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి ముగ్గురు ప్రముఖ వ్యక్తులు ఉపన్యాసాలు ఇచ్చారు. హ్యూమన్‌ రైట్స్‌ అలర్ట్‌ అనే సంస్థ నుండి బబ్లూ లైటోంగ్‌బామ్‌ చాలా ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. సభ్యులందరూ నిశ్శబ్దంగా ఆయన ప్రసంగాన్ని విన్నారు. మణిపూర్‌లో తిరుగుబాటు నేపధ్యాన్ని గురించి ప్రస్తుతం ఎన్ని గ్రూపులు అండర్‌గ్రౌండ్‌లో ఉండి పోరాటం చేస్తున్నదీ వివరించారు. నాగాలు, కుకీలు, మైత్రేయులు, వైష్ణవులు, ముస్లిమ్‌ల గురించి వివరించాడు బబ్లూ. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి మణిపూర్‌ రాచరికంలో ఉంది. ఆగస్టు 14, 1947 రోజు అంటే ఇండియాకి స్వతంత్రం వచ్చిన ఒకరోజు ముందే నాగా నేషనల్‌ కౌన్సిల్‌ బ్రిటిష్‌ రాజ్యం నుండి తాము స్వతంత్రాన్ని పొందినట్లు ప్రకటించుకున్నారు. అయితే స్వాతంత్య్రానంతరం ఇండియన్‌ గవర్నమెంట్‌ మణిపూర్‌ని బలవంతంగా ఇండియాలో విలీనం చెయ్యడాన్ని జీర్ణించుకోలేని అనేక గ్రూపులు తిరుగుబాటు బాట పట్టాయి. ఈ తిరుగుబాట్లను అణచివేసే నెపంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రూరమైన చట్టాలను తెచ్చాయి. అనేక గ్రూపులు చేస్తున్న ఈ తిరుగుబాట్లను లా అండ్‌ ఆర్డర్‌ సమస్యగానే ప్రభుత్వాలు చూస్తున్నాయి తప్ప వారి ఆత్మగౌరవ పోరాటాలుగా గుర్తించడంలేదు. ఈ తిరుగుబాట్లను అణచడానికి ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ స్పెషల్‌ పవర్‌ యాక్ట్‌ 1958ని తీసుకొచ్చారు. సమస్యను పరిష్కరించడానికి బదులు మరింత జఠిలం చేసి, మణిపురి ప్రజల మాన, ప్రాణాలను ఈ చట్టం హరిస్తోందని బబ్లూ వివరించాడు. ఎన్నో దేశీయ గ్రూప్‌లు భారత ప్రభుత్వంతో పోరాడుతున్నాయని, ఆర్మీ, అస్సామ్‌ రైఫిల్స్‌కి చెందిన సాయుధులు ప్రజలను ఊచకోత కోస్తున్నారని బబ్లూ వివరించాడు.

బబ్లూ తర్వాత ‘నాగా ఉమెన్‌ యూనియన్‌’కి చెందిన గ్రేస్‌ ఫట్‌సంగ్‌ నాగా స్త్రీల ఉద్యమం గురించి చెప్పారు. ఆమె ప్రసంగం తర్వాత డా.ఎస్‌.చోంగ్లాయ్‌ మానవ హక్కుల కోసం ‘కుకీ’లు చేస్తున్న పోరాటం గురించి ప్రసంగించారు. 1919లో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌తో కలిసి బ్రిటిష్‌కి వ్యతిరేకంగా పోరాటం చేసిన, ఒకప్పుడు ‘ఇండిపెండెంట్‌, హిల్‌, కంట్రీని’ ఏలిన దేశీయ ప్రజలైన ‘కుకీ’లు ఈ రోజు అత్యంత దయనీయంగా బ్రతుకుతున్నారని చోంగ్లోయ్‌ వివరించారు.

వీరి ప్రసంగాలు చాలా ఆసక్తిదాయకంగా సాగి, మణిపూర్‌ చరిత్ర పూర్వాపరాలు, ప్రస్తుత స్థితిగతులను వివరిస్తూ మంచి చర్చను లేవనెత్తాయి.

ఆ తర్వాత ‘ఉమెన్‌ విడోడ్‌ బై కాన్‌ఫ్లిక్ట్‌ ఇన్‌ మణిపూర్‌’ పేరుతో అంజులిక తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను చూపించారు. సైన్యం విచక్షణారహితంగా కాల్చేసిన కుటుంబాల స్థితిగతులు, అతి చిన్న వయస్సులో భర్తల్ని పోగొట్టుకుని విధవలైన స్త్రీలు హృదయవిదారకంగా రోదిస్తూ కాల్పుల నేపథ్యాలను వివరించి నపుడు అందరం కదిలిపోయాం. నలుగురు నుంచి ఐదుగురు పిల్లలతో భర్తల్ని పోగొట్టుకున్న ఆ స్త్రీల జీవితాల్లోని విషాదం చూస్తూ కన్నీళ్ళ పర్యంతమైనాం అందరం. అన్నింటికన్నా అత్యంత దుఃఖాన్ని నింపిన సన్నివేశం మిలిటెంట్‌ గ్రూప్‌ చేతుల్లో హత్యకు గురైన అంజులిక సోదరుడి భార్య ప్రసంగం. ప్రస్తుత ఇంఫాల్‌లో కర్ఫ్యూకి కారణమైన దింగనమ్‌  కిషన్‌ (మణిపురి సివిల్‌ సర్వీస్‌కు చెందిన యువ అధికారి) దారుణ హత్య. ఫిబ్రవరి 13న కిషన్‌ని, అతని డ్రైవర్‌ని, అంగరక్షకుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్ళి హత్య చేశారు. శోకదినాలను పాటిస్తూ తెల్ల వస్త్రాలను ధరించి కిషన్‌ భార్య నెట్‌వర్క్‌ సమావేశాలకు వచ్చి జరిగిన దారుణాన్ని వివరించినపుడు మేమంతా దు:ఖాన్ని ఆపుకోలేకపోయాం. అందంగా, అమాయకంగా, పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆమె ముఖం ఈ రోజుకీ కళ్ళల్లోంచి పోకుండా కలవరపె డుతూనే ఉంది.

లంచ్‌ తర్వాత ఆరుబయట మణిపురి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు కలిసి అద్భుతంగా నృత్యం చేశారు. మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రదర్శనను కూడా తిలకించిన తర్వాత మనం ఇప్పుడు ఇమా మార్కెట్‌ చూడడానికి వెళుతున్నామని, త్వరగా వెళ్ళి కర్ఫ్యూ సమయానికి తిరిగి వచ్చేయాలని అంజులిక ప్రకటించడంతో అందరం హడావుడిగా బస్సెక్కేసాం. కాంగ్లా గేటుకి ఎదురుగా, కిటకిటలాడుతున్న మార్కెట్‌ దగ్గర బస్సు ఆగింది. అప్పటికి టైమ్‌ నాలుగుంబావు అయ్యింది. బ్యాచ్‌లుగా విడిపోయి ఒక్కో బ్యాచ్‌కీ ఒక్కో మణిపురి అమ్మాయి తోడురాగా మార్కెట్‌ వైపు వెళ్ళాం. మార్కెట్‌ యమ రద్దీగా ఉంది. లోపలికెళ్ళినపుడు అక్కడున్న షెడ్‌లలో బారులు తీరి కూర్చున్న మణిపురి స్త్రీలు వివిధ వ్యాపారాలు చేస్తూ కనబడ్డారు. అక్కడ దాదాపు 3000 మంది స్త్రీలు ప్రతిరోజూ వ్యాపారం చేస్తారని తెలిసింది. ఆ మార్కెట్‌ ఎప్పుడు మొదలైందనే దానికి స్పష్టమైన సమాధానం దొరకలేదు. అక్కడ వ్యాపారులందరూ ఆడవాళ్ళే. అదీ మధ్య వయసులో ఉన్నవాళ్ళు. అరవై దాటిన వాళ్ళూ ఉన్నారు. తల్లుల మార్కెట్‌ అని దీనికి పేరు. బట్టలు, వివిధ వస్తువులు, కూరగాయలు, చేపలు ఒకటేమిటి ఎన్నో అమ్ముతుంటారు. ఎక్కువగా వివిధ రంగుల్లో మణిపురీ చేనేత దుస్తులు కనిపించాయి. ఈ మార్కెట్‌ పేరు ‘ఇమా’  బజార్‌. అక్కడ కొనుక్కునే పురుషులు తప్ప అమ్మే పురుషులుండరు.

మేమంతా తలోదిక్కు వెళ్ళిపోయాం. అందరూ మణిపురి సంప్రదాయ లుంగీలు, షాల్‌లు కొన్నారు. ఎంతో హడావుడిగా అమ్మే వాళ్ళు అమ్ముతూ, సర్దుకునేవాళ్ళు సర్దుకుంటున్నారు. పిలిచి పిలిచి అమ్ముతున్నారు. కర్ఫ్యూ టైమ్‌ అయిపోతోంది. ఒక ముసలామె గంప నిండా  వంకాయ రంగు కలువపూలు తెస్తూ కనబడింది. నేను, మంజరి మూడేసి కట్టల పువ్వులు కొనేసాం. మాకు తోడుగా వచ్చినవాళ్ళు ఇంక పోదాం అంటూ కంగారు పెట్టసాగారు. మార్కెట్‌ వదిలి రావాలని ఎవ్వరికీ లేదు. సరదాగా అటు ఇటు తిరుగుతూ ఆ స్త్రీలను పలకరించాలని, వాళ్ళతో మాట్లాడాలని ఉన్నా గానీ పోలీసుల విజిల్స్‌, సాయుధ సైనికులు తుపాకులెక్కుపెట్టి తిరుగుతున్న జిప్సీ వాహనాలు అందరినీ టెన్షన్‌ పెట్టేసాయి. మార్కెట్‌ కూడా చాలావరకు మూసేసారు. మేమంతా కంగారు కంగారుగా మా బస్సు ఆగివున్న చోటుకి పరుగులు పెట్టాం. ప్రతి ఒక్కరూ, ఏదో ఒక వాహనం పట్టుకుని, కిటకిటలాడే ఆటోలెక్కి ఇళ్ళకు వెళ్ళిపోసాగారు. బిజినెస్‌ ఊపందుకునే సాయంత్రం వేళ పాపం! ఆ మహిళలంతా దుకాణాలు మూసేసి ఇళ్ళకు వెళ్ళిపోవడం అదీ ఎంతో టెన్షన్‌గా వెళ్లడం చాలా బాధనిపించింది. ఇళ్ళకెళ్ళాక మాత్రం ఏముంటుంది? కరెంట్‌ లేని చీకటి ఇళ్ళు మాత్రమే వాళ్ళకోసం ఎదురుచూస్తాయి. బహుశా సైన్యం ఇనుపబూట్ల చప్పుళ్ళే వాళ్ళకి వినోదమేమో! అంతకు మించి

చప్పుళ్ళు ఆ కర్ఫ్యూ వేళ ఇంకేముంటాయి?

మా బస్సు వేగంగా మమ్మల్ని తెచ్చి రిట్రీట్‌ హౌస్‌లో దింపేసింది. అప్పటికి ఐదున్నర అయింది. మార్కెట్‌ దగ్గర ఫోన్‌ చేద్దామని ప్రయత్నించినా ఎక్కడా ఎస్టీడీ బూత్‌ కనబడలేదు. నేను మెయిన్‌రోడ్డు మీదకెళుతున్నా ఎవరైనా వస్తారా అంటే మంజరి నేను కూడా వస్తానంది. శ్యామల కూడా మాతో బయలుదేరింది. ఎస్టీడీ బూత్‌ ఉంటుందనే ఆశతో ఆ చీకట్లో బయలుదేరాం. కరెంటు లేకపోవడంవల్ల వెన్నెల తెల్లగా మెరుస్తోంది. మాకు ఒక మిలిటరీ జీప్‌ ఎదురొచ్చింది. మేం పక్కకు జరిగి నిలబడ్డాం. దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోయింది. కొంతమంది స్త్రీలు గుడ్డిదీపాలు పెట్టుకుని కూరగాయలు, చేపలు అమ్ముకుంటున్నారు. షాపులన్నీ మూసేసారు. వాటర్‌ బాటిల్స్‌ కొందామంటే దొరకలేదు. మేము అంతకు ముందురోజు మాట్లాడిన ఎస్టీడీ బూత్‌ మూసేసి ఉంది. అర్జంటుగా మాట్లాడాలి ఎలా? అనుకుంటూ అక్కడ నిలబడిన ఒకాయన్ని ఇక్కడ ఇంకో ఎస్టీడీ బూత్‌ ఉందా అని హిందీలో అడిగాం. మావైపు ఎగాదిగా చూసి ఆ ప్రాంతానికి కొత్తవాళ్ళమని అర్థం చేసుకుని ‘ఆయియే’ అంటూ రోడ్డుమీదకు దారితీసాడు. మెయిన్‌ రోడ్డంతా చీకటిగా, నిర్మానుష్యంగా ఉంది. ఒక షాప్‌ ముందాగి తలుపు మీద కొడితే ఆ తలుపు ఓరగా తెరుచుకుంది. లోపల ఫోన్‌ ఉంది. ముగ్గురం లోపలికెళ్ళగానే ఆ షాపతను తలుపు మూసేసాడు. తనివితీరా ఫోన్‌లో మాట్లాడి, మిత్రులకి ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నామో చెప్పేసరికి వాళ్ళు కంగారుపడ్డారు. నా మిత్రురాలు ఒకామె అయితే నన్ను చివాట్లేసింది. అలాంటి ప్రమాదకర పరిస్థితులున్నచోట ఎడ్వంచర్లేమిటని కేకలేసింది.

షాపతనికి డబ్బులిచ్చేసి మొత్తంగా నిర్మానుష్యంగా మారిన రోడ్లమీద నడుస్తూ, ఇంఫాల్‌ ప్రజలు ముఖ్యంగా స్త్రీల కష్టాలకు బాధపడుతూ, ఇలా ఎన్నాళ్ళు కర్ఫ్యూ నడుస్తుందా, జనం ఇలా ఎంతకాలం భరించాలా అని చర్చించుకుంటూ మా బసకు చేరాం. మర్నాడు తొమ్మిదిన్నరకే మీటింగ్‌ మొదలైంది. నెట్‌వర్క్‌కి సంబంధించిన కార్యకలాపాల గురించి, వచ్చే సమావేశం ఎక్కడ నిర్వహించాలి అనే అంశం గురించి చర్చ జరిగింది. మేం నిర్వహిస్తాం అంటూ కేరళ బృందం ముందుకు రావడంతో నిర్వహణకు అవసరమైన వనరుల మీద, ఆ వనరుల్ని ఎలా సేకరించాలి అనే దానిమీద వాదోపవాదాలు జరిగాయి. బెంగుళూరు గ్రూప్‌ ‘అనుపమ జయరామన్‌’ అవార్డు నిర్వహణలో తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చకు పెట్టారు. చాలా సీరియస్‌గా అందరం చర్చలో మునిగివున్న వేళ అంజులిక హఠాత్తుగా ఒక ప్రకటన చేసింది. ఇరోమ్‌ షర్మిల ఆ రోజు విడుదల కాబోతోందని, మనమంతా ఇపుడు ఆమెను బంధించి ఉంచిన ఆస్పత్రికి వెళుతున్నామని చెప్పడంతో అక్కడంతా ఒక ఉత్కంఠ నెలకొంది. నేను ఇంఫాల్‌కి వచ్చిన రోజే షర్మిలను కలిసే వీలుందా అని చిత్రను అడిగితే చాలా కష్టం అని చెప్పింది. రెండు సంవత్సరాల క్రితమే ‘మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల’ అని నేను భూమికలో సంపాదకీయం రాసాను. ఆమె ధైర్యం, సాహసం ఎంతో స్ఫూర్తిదాయకమైనవి. అలాంటి షర్మిలను కలుసుకునే అవకాశం రావడం అందరిలోను ఉద్వేగాన్ని రేపింది.

లంచ్‌ తిన్నామనిపించి అందరం బస్సులో ఎక్కేసాం. ఓ అరగంట ప్రయాణం తర్వాత మేము షర్మిల విడుదల కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తున్న శిబిరం దగ్గర దిగాం. అప్పటికి 88 రోజులుగా మణిపురి స్త్రీలు రిలే నిరసన దీక్షలు చేస్తున్నారు. మేము కూడా శిబిరంలో కూర్చున్నాం.

అద్భుత సాహసమూర్తి ఇరోమ్‌ షర్మిల

ఇరోమ్‌ షర్మిల ఒక సామాజిక కార్యకర్తగా పనిచేసేది. భద్రతాదళాల చేతుల్లో హత్యలకు, అత్యాచారాలకు బలైన స్త్రీల కన్నీటి కథనాలను వినేది. శాంతియాత్రలో పాల్గొనేది. 2000 సంవత్సరం నవంబరు 2న ‘మాలోమ్‌’ పట్టణంలోని బస్టాండులో అస్సాం రైఫిల్స్‌ సాయుధులు పదిమంది పౌరులను కాల్చి చంపేసిన దారుణ సంఘటన జరిగినపుడు షర్మిల తీవ్రంగా చలించిపోయింది. అంతకుముందు మణిపురి తిరుగుబాటుదారులు భద్రతా దళాల వాహనాలపై దాడిచేసినందుకు ప్రతీకారంగా అస్సాం రైఫిల్స్‌ ఈ దురాగతానికి దిగింది.  ‘మాలోమ్‌’ పట్టణం ఇంఫాల్‌కి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది. షర్మిల ఈ సంఘటన జరగడానికి ముందే ఒక శాంతియాత్ర నిర్వహణ కోసం మాలోమ్‌కి వచ్చి ఉంది. ఆమె మాలోమ్‌లో ఉన్నప్పుడే ఈ దారుణ సంఘటన జరగడంతో, శాంతి ర్యాలీ ఆలోచనను విరమించి అంతకంటే తీవ్రమైన కార్యాచరణకి పూనుకోవాలని నిర్ణయించుకుంది. భద్రతాదళాలకు విచ్చలవిడి అధికారాలు కట్టబెట్టిన Armed Forces Special Powers Act, 1958 (AFSPA)ని రద్దు చేయాలంటూ ఆమరణ నిరాహారదీక్షకు దిగాలనే తీవ్ర నిర్ణయాన్ని ఇరోమ్‌ షర్మిల తీసుకుని తల్లితో చెప్పినపుడు ఆమె గట్టిగా వ్యతిరేకించి షర్మిలకు నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. షర్మిల తన నిర్ణయానికే కట్టుబడడంతో తల్లి కఠినాతి కఠినమైన నియమం పెట్టింది. షర్మిల తను మొదలుపెట్టిన కార్యంలో విజయం సాధించేవరకు తన ముఖం చూపించవద్దని నియమం పెట్టడంతో షర్మిల ఒప్పుకుని తన ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించింది. నవంబరు 11, 2000లో షర్మిల ప్రారంభించిన ఈ దీక్ష తొమ్మిది సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. ఆమరణ నిరాహారదీక్షలో ఉన్న షర్మిలను ఆత్మహత్యా నేరం కింద ప్రభుత్వం అరెస్ట్‌ చేసి బలవంతంగా ముక్కుల్లోంచి ట్యూబ్‌లేసి, ద్రవాహారం పంపిస్తూ జె.ఎన్‌.ఆస్పత్రిలోని ఎంతో భద్రత కలిగిన వార్డులో బంధించి ఉంచింది. ఈ నేరం కింద ఒక్క సంవత్సరమే ఖైదీలో ఉంచే వీలుండడంవల్ల, ప్రతి సంవత్సరం ఒక రోజు విడుదల చేసి షర్మిల ఆహారం తీసుకోదు కాబట్టి మళ్ళీ అరెస్ట్‌ చేయడం.. ఎనిమి దేళ్ళుగా ఒక ”తంతు”లాగా నడుస్తోంది. మేము ఇంఫాల్‌లో ఉన్నప్పుడే మార్చి 7న ఆమెను విడుదల చేసి, మార్చి 8 అంతర్జాతీయ మహిళాదినం రోజున అరెస్ట్‌ చేసి ఆస్పత్రి వార్డులో బంధించారు.

”షర్మిల కంబ లవ్‌” పేరుతో ”మైరా ఫెయిబి” స్త్రీలు ఆమెకు సహకరిస్తున్నారు. మణిపూర్‌ లోయలో ఈ ”మైరా ఫెయిబి” స్త్రీలు అట్టడుగు స్థాయినుంచి సాంప్రదాయక స్త్రీల సంఘాలుగా ఏర్పడి పనిచేస్తుంటారు. చారిత్రకంగా తీసుకుంటే ఈ ”మైరా ఫెయిబి” స్త్రీలు బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కలిగి ఉన్నారు. అలాగే మణిపూర్‌లో తాగుడు వ్యసనానికి, డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నది కూడా వీళ్ళే. అతి బలమైన సాయుధ దళాలను ధిక్కరిస్తూ మానవ హక్కుల ఉద్యమాన్ని నడుపుతున్నది కూడా మైరాఫెయిబీ స్త్రీలేనన్నది నగ్నసత్యం. ప్రస్తుతం షర్మిల అమరణదీక్షకు మద్దతునిస్తున్నవాళ్ళు వీళ్ళే.

2006లో షర్మిల విడుదలైనప్పుడు ఆమె తన సోదరుడు, మరో ఇద్దరు కార్యకర్తలతో ఢిల్లీకి వెళ్ళి జంతర్‌మంతర్‌ దగ్గర రోడ్డుమీద తన ద్షీను ప్రారంభించింది. పోలీసులు వెంటనే ఆమెను అరెస్ట్‌ చేసి ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో ఉంచి ఆమెకు బలవంతంగా ముక్కుద్వారా ద్రవాహారాన్ని పంపి ఆమె దీక్షను భగ్నం చేశారు. ఆ తర్వాత షర్మిలను ఇంఫాల్‌ తీసుకెళ్ళి జవహర్‌లాల్‌ నెహ్రు హాస్పిటల్‌లో నిర్బంధించారు. ఆమెని ప్రతి సంవత్సరం విడుదల చేసి ఆమె తన దీక్షను కొనసాగించడంతో, ఆమెపై ఆత్మహత్యా నేరం మోపి మళ్ళీ మళ్ళీ నిర్బంధిస్తూనే ఉన్నారు. మార్చి ఎనిమిదిన ఆమెను తిరిగి అరెస్ట్‌ చేశారు.

2009లో మేము ఇంఫాల్‌లో ఉన్నప్పుడు మార్చి 7న ఆమెను విడుదల చేశారు. ఆమె దీక్షకు మద్దతుగా మైరాఫెయిబీ స్త్రీలు చేపట్టిన నిరసన శిబిరంలో మేము కూర్చుని ఉన్నప్పుడే మరో పదిహేను నిమిషాల్లో షర్మిలను విడుదల చేస్తారనే సమాచారం వచ్చింది. మేమందరం శిబిరంలోంచి బయలుదేరి ఆస్పత్రికి కాలినడకనే చేరుకున్నాం. అప్పటికి సమయం మూడు కావస్తోంది. మేము వెళ్ళేసరికి అక్కడ పెద్ద ఎత్తున మీడియాకి చెందినవాళ్ళు, స్త్రీలు, మైరాఫెయిబికి చెందిన కార్యకర్తలు గుమిగూడారు. షర్మిలను నిర్బంధించిన హై సెక్యూరిటీ వార్డు ముందు మేమంతా నిలబడ్డాం. ఎవరెవరో వస్తున్నారు. లోపలికి వెళుతున్నారు. లోపలున్న పోలీసులు మాటిమాటికీ తలుపులు తీసి బయటకు తొంగిచూసి మళ్ళీ తలుపులు మూస్తున్నారు. 70 సంవత్సరాలు పైబడిన మైరాఫెయిబీకి చెందిన వృద్ధ స్త్రీలు చాలా ఓపికగా వార్డు మెట్లమీద కూర్చుని షర్మిల కోసం ఎదురుచూస్తున్నారు. 78 సంవత్సరాల కె.తరుణి అనే స్త్రీ మాట్లాడుతూ అఫ్స్పా (AFSPA) ని రద్దు చేయాలి, షర్మిలని కాపాడాలి, ఈ దుర్మార్గ చట్టాన్ని రద్దు చేయకపోతే మేము ఈసారి ఎవ్వరికీ ఓట్లు వెయ్యం, జరిగింది చాలు అంటూ దృఢమైన కంఠంతో చెప్పినపుడు ఆ వయస్సులో ఆమె కనబరచిన నిబద్ధత మమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. అలాంటి స్త్రీలు చాలామంది అక్కడ గుమిగూడి ఉన్నారు. వారంతా షర్మిల విడుదల కోసం 88 రోజులుగా  రిలే నిరాహారదీక్ష చేస్తున్నారు.

మాలో ఉత్కంఠ పెరగసాగింది. అక్కడ కూర్చునే చోటు లేదు. నిలబడ్డం కూడా కష్టంగానే ఉంది. సమయం గడుస్తున్నకొద్దీ కర్ఫ్యూ భూతం భయపెట్టసాగింది. నాలుగున్నర అయింది. నిలబడి నిలబడి కాళ్ళు పీకుతున్నాయి. ఇంకో అరగంటలో కర్ఫ్యూ పెట్టేస్తారు. వార్డు లోపల్నుంచి పోలీసులు బయటకు వస్తున్నారు. తొంగి చూస్తున్నారు. గ్రిల్‌ చప్పుడైనప్పుడల్లా మా కళ్ళు గ్రిల్‌కు అతుక్కుపో తున్నాయి. ఐదు కావస్తోంది. మేము షర్మిలను చూడలేమేమోననే సందేహం పీడించసాగింది. సరిగ్గా ఆ సమయంలో ఎవరో బిగ్గరగా ప్రకటించారు, ఆ రోజు కర్ఫ్యూ సడలింపు 7 గంటల వరకు పొడిగించారని. హమ్మయ్య అనుకుంటూ మళ్ళీ గ్రిల్‌ గేట్‌ చప్పుడు కోసం ఎదురుచూడసాగాం.

5.30 అయింది. వార్డు రూమ్‌ తలుపు తెరుచుకుంది. గ్రిల్‌ గేట్‌ కూడా తెరిచారు. సూర్యుడు అస్తమించేవేళ, ఆ చిరుచీకట్లో వెలుగు రేఖలా షర్మిల చాలా మెల్లిగా అడుగులేస్తూ వస్తూ కనబడింది. తెల్లగా పాలిపోయిన ముఖం. ఒక్కసారిగా పెరిగిన మీడియా ఫ్లడ్‌లైట్లను తట్టుకోలేక కళ్ళు మూసుకున్న షర్మిల కనబడింది. సంప్రదాయ మణిపురి దుస్తుల్లో, భుజాల చుట్టూ గులాబీ రంగు షాల్‌ చుట్టుకుని కళ్ళు మూసుకుని బయటకు వచ్చిన షర్మిలను చూసి కొంతమంది చప్పట్లు కొట్టారు. కొంతమంది స్త్రీలు బిగ్గరగా ఏడ్చారు.

‘మైరాఫెయిబి’ స్త్రీలు ఆమెకు రక్షణ కవచంలా ఏర్పడి, ఆమెను పసిపాపను పొదువుక్నుట్లు తమ చేతుల్లోకి తీసుకున్నారు. షర్మిల నిలబడడానికి కూడా శక్తిలేక తల వాల్చేస్తూ ఆ స్త్రీల చేతుల ఆసరాతో నడిచి మీడియా ముందుకొచ్చింది. నేను షర్మిల పక్కనే ఉండడంతో ఆమెను అతి దగ్గరగా పరిశీలించగలిగాను. తొమ్మిది సంవత్సరాలుగా నోటితో ఘనపదార్థం ఏమీ తినకుండా మణిపురి ప్రజల కోసం, AFSPA 1958 చట్టం రద్దు కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న 35 సంవత్సరాల షర్మిలను అతి సమీపంగా చూసినపుడు నా గుండె ఉద్వేగంతో వేగంగా కొట్టుకోవడంతో పాటు ఆమె వజ్రసంకల్పం ముందు నా శిరస్సు వాలిపోయింది. పోరాట పటిమ, దృఢ సంకల్పం, ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేయడానికి సిద్ధంగా ఉన్న ఆ స్త్రీ మూర్తి ముందు మోకరిల్లాలనిపించింది.

చాలా బలహీనంగా ఉన్నప్పటికీ ఆమె ఏ వాహనంలోను ఎక్కకుండా, స్త్రీల సమూహంతో కలిసి అక్కడికి 500 మీటర్ల దూరంలో ఉన్న నిరాహారదీక్షా శిబిరం వరకు నడవసాగింది. ఆమె వెంట మేమంతా, దాదాపు 70 మంది వివిధ భాషలకు చెందిన జర్నలిస్ట్‌లం నడిచాం. శిబిరం దగ్గరకు చేరగానే ఆమె కోసం పరుపు సిద్ధం చేసి కూర్చోబెట్టారు. ఆమె కాళ్ళకు మోజోళ్ళు తొడిగారు. ఆమె మెడను నిలపలేకపోతోంది. ఆమె శరీరం అటు ఇటు ఊగిపోతోంది. అక్కడ చేరిన అసంఖ్యాక మీడియా పదేపదే కోరగా ఆమె గళం విప్పింది. మెత్తగా, పీలగా ఆమె గొంతు విన్పించసాగింది. ”నా కోసం ఎదురుచూస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలపడానికి నా దగ్గర సరైన మాటలు లేవు. మీరు నాకు మరింత ధైర్యాన్నిచ్చారు. మణిపూర్‌ నుండి ూఖీూూూ 1958 చట్టాన్ని రద్దుచేసేవరకు నేను ఈ నిరాహార దీక్షను కొనసాగించదలిచాను. ఇమాస్‌తో కలిసి ప్రచారాన్ని సాగిస్తానని చెప్పింది. షర్మిల మెల్లగా, స్పష్టంగా  మాట్లాడుతూ ”ప్రపంచమంతా అంతర్జాతీయ మహిళా దినాన్ని జరుపుకుంటుంటే, ఇక్కడ మణిపూర్‌లో సారవంతమైన భూములతో, అపారమైన వనరులతో, చల్లటి గాలులు వీచే చోట, ప్రజలు ఎంతో స్నేహసుహృద్భావాలతో పలుకరించే చోట స్త్రీలు ఎదుర్కొంటున్న కష్టాలు, అణచివేత బయట ప్రపంచానికి తెలియవు” అన్నప్పుడు అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ”నేను మా అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెను చూడకుండానే ఇంతకాలం ఉన్నాను. తనకి చాలా అనారోగ్యం చేసినపుడు కూడా చూడాలంటే భయమన్పించింది. నువ్వెందుకు వచ్చావు, నన్ను చూడొద్దన్నాను కదా అంటుందేమోనని ఆమె ఉన్న ఆసుపత్రి వార్డు ముందు ఎంతోసేపు తచ్చాడాను” అన్నప్పుడు అక్కడున్న స్త్రీలు దు:ఖాన్ని ఆపుకోలేక భోరున ఏడ్చారు. మా అందరి కళ్ళల్లోను నీళ్ళు చిప్పిల్లాయి.

మెల్లగా చీకటి చిక్కనౌతోంది. షర్మిల ఆ రాత్రి శిబిరంలోనే గడపడానికి సిద్ధపడింది. కర్ఫ్యూ పెట్టే టైమ్‌ దగ్గరపడడంతో మేము కూడా వెళ్ళడానికి లేచాం. అప్పుడే అంజులిక షర్మిల సమీపానికి వెళ్ళి ఎంతోమంది మహిళా జర్నలిస్ట్‌లు ఆమెను చూడడానికి వచ్చారని, వారంతా శిబిరంలో ఉన్నారని చెప్పగానే ”మీ అందరినీ చూడడం నాకు సంతోషంగా ఉంది. ఇక్కడి  స్త్రీలకు ఏం జరుగుతోందో మీరు దేశం నలుమూలలా తెలియచేస్తారని నాకు ఆశగా ఉంది. మీ సోదరుడి హత్య నాకు చాలా దు:ఖాన్ని కలిగించింది.” అన్నప్పుడు అంజులిక బాధతో సతమతమైంది.

మేమంతా శిబిరంలోంచి బయటపడి బస్సులో ఎక్కాం. అందరం మౌనంగా కూర్చున్నాం. కాసేపట్లో కర్ఫ్యూ పెట్టేస్తారు. బస్సు రిట్రీట్‌ హౌస్‌ దగ్గర ఆగింది. యథాప్రకారం చీకటి. చిమ్మచీకట్లో కురుస్తున్న వెన్నెల. నాకు రూమ్‌లోకి వెళ్ళాలన్నించలేదు. కాసేపు వెన్నెల్లో కూర్చుని కిచెన్‌వైపు వెళ్ళాను. లిల్లీతో మాట్లాడాలనిపించింది. ”లిల్లీ! మేము రేపు పొద్దున్నే వెళ్ళిపోతున్నాం” అన్నాను. మళ్ళీ రమ్మని, వచ్చినప్పుడు తనని కలవమని చెప్పింది. నీకు ఇక్కడి పనికి జీతమెంత ఇస్తారని అడిగితే 1200 ఇస్తారని, రెండుపూటలా భోజనం పెడతారని చెబుతూ తనకి తొమ్మిది మంది చెల్లెళ్ళున్నారని, తండ్రి చనిపోయాడని, తన తల్లి కూడా వంట పని చేస్తుందని చెప్పింది. ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్‌ పాటించరా అంటే సిగ్గుపడుతూ లేదు అని చెప్పింది. సోసో కూడా ఇదే మాట అంది. ఆడవాళ్ళు పిల్లల్ని కంటూ పోవాల్సిందే. ఫ్యామిలీ ప్లానింగ్‌ లేదు అంది. చూడ్డానికి చిన్నగా ఉంటుంది సోసో. ఆమెకు నలుగురు పిల్లలు. డిన్నర్‌ చేసి లిల్లీకి బై చెప్పి నా రూమ్‌కు వచ్చేశాను.

8వ తేదీ ఉదయం సోసో ఇంటికెళ్ళాం. మళ్ళీ తప్పక రమ్మని కోరింది సోసో. ఆమెకు గుడ్‌బై చెప్పి మళ్ళీ ఇంకో కప్పు టీ తాగి అక్కడినుండి బయటపడ్డాం. పదిగంటలకి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలి. అన్ని సర్దుకుని అందరికీ వీడ్కోలు చెప్పి రూమ్‌లో ఏకాంతంగా కూర్చున్నపుడు ఇంఫాల్‌ అనుభవాలు ఒకటొకటే కళ్ళముందు కదలాడాయి. దుమ్ము కొట్టుకుపోయిన నగరం. చీకట్లో మగ్గుతున్న నగరం. కర్ఫ్యూ పడగనీడ కింద కుములుతున్న మణిపూర్‌ రాష్ట్ర రాజధాని. ఇపుడిపుడే ‘అభివృద్ధి’ నామజపం వినబడుతోందని, వందలాది కుటుంబాలు ఎయిర్‌పోర్ట్‌ విస్తరణలో నిర్వాసితమౌతున్నాయని బబ్లూ చెప్పాడు. మీ హైదరాబాద్‌ చాలా ‘అభివృద్ధి’ చెందిందటగా అని వ్యంగ్యంగా అడిగినపుడు శంషాబాద్‌ చుట్టపక్కల కనుమరుగైన వందలాది గ్రామాలు, పూలు, పండ్ల తోటలు గుర్తొచ్చాయి. చెట్టుకొకరుగా, పుట్టకొకరుగా చెదిరిపోయిన ఆ ఊళ్ళ ప్రజలు గుర్తొచ్చారు. ఆంధ్రదేశంలో ‘అభివృద్ధి’ పేరుమీద ఏర్పాటవుతున్న ‘సెజ్‌’ల గురించి జీవనాధారాల్ని కోల్పోతున్న ప్రజల్ని గురించి మేం చెప్పాం.

ఇంఫాల్‌లో ఉన్న నాలుగు రోజుల్లో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. ప్రజలెదుర్కొంటున్న కష్టాలు, స్త్రీలు పడుతున్న అగచాట్లు చూసాం. ఎక్కడ చూసినా ఏదో పనిచేస్తూ స్త్రీలు. ఇమా మార్కెట్‌లో వ్యాపారాలు చేసే వేలాది స్త్రీలు. కర్ఫ్యూ వేళ ఉరుకులు, పరుకులతో దుకాణాలు మూసేసి, కిక్కిరిసిన వాహనాల్లో ఇళ్ళకు చేరే స్త్రీలు. అన్నింటినీ మించి జిప్సీ వాహనాల్లో ప్రజలమీద తుపాకులెక్కుపెట్టి ఊరకుక్కల్లా వీథులెంబడి తిరిగే సైన్యం, అస్సామ్‌ రైఫిల్స్‌. ఎక్కడ చూసినా సైన్యమే. 23 లక్షల మణిపూర్‌ జనాభాకి 53000 సాయుధ సైనికులు వున్నారంటే పరిస్థితి ఎంత భీతావహంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడెవరిని చంపేస్తారో, ఎవరిని అరెస్ట్‌ చేస్తారో, ఎవరిని మాయం చేస్తారో తెలియదు. మహిళల మీద అత్యాచారాలకి అంతేలేదు. AFSPA 1958 చట్టం సైన్యానికిచ్చిన పాశవిక అధికారాలతో ఎవరినైనా కాల్చొచ్చు. ఎవరినైనా చంపొచ్చు. ఊళ్ళకు ఊళ్ళు తగలబెట్టొచ్చు. ఇవన్నీ కేవలం అనుమానంతోనే చెయ్యొచ్చు. తిరుగుబాటుదారులున్నారనే నెపంతో రోజుకి కనీసం రెండు హత్యలు జరుగుతున్నాయి. చిన్న వయసులో భర్తల్ని పోగొట్టుకుంటున్న స్త్రీలు. అయిదారుగురు పిల్లలతో అనాధలవుతున్న స్త్రీలు. ఉపాధి లేక, ఉద్యోగాల్లేక డ్రగ్స్‌కు, తాగుడుకు బానిసలౌతున్న యువత. నిరాశా నిస్పృహలతో తిరుగుబాటుదారుల్లో చేరుతున్న యువకులు. 60 సంవత్సరాలుగా అగ్నిగుండంగా మండుతున్న మణిపూర్‌. 40 ఎత్నిక్‌ కమ్యూనిటీలున్న మణిపూర్‌లో 38 తిరుగుబాటు గ్రూపులున్నాయి. ప్రభుత్వాలమీద తిరుగుబాటు చేయడంతోపాటు వాటిల్లో వాటికి ఎన్నో విభేదాలు, పరస్పర దాడులు.

‘గ్రేస్‌ షట్సంగ్‌’ నాగా ఉమెన్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ మాటల్లో చెప్పాలంటే సాంప్రదాయకంగా మణిపురి స్త్రీలు శాంతి ప్రేమికులు. శాంతి స్థాపన కోసం స్త్రీలు పాటుపడుతున్నారు. మణిపురి స్త్రీలు తీవ్ర వివక్షనెదుర్కొంటున్నారు. వారికి ఎలాంటి హక్కులూ లేవు. నిర్ణయాధికారం లేదు. సైన్యం చేతిలో అత్యాచారాలు, కాల్పుల్లో భర్తల మరణాలు, కుటుంబాల్ని కాపాడుకోవాల్సిన పెనుభారాలు. మణిపురి స్త్రీలు రెండు విధాలా సమస్యల్ని ఎదుర్కోవాలి. సైన్యం అత్యాచారాలొకవైపు, తిరుగుబాటుదారుల అవసరాలు తీర్చాల్సి రావడం మరోవైపు. అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్న మణిపురి స్త్రీలు. మొత్తం మణిపూర్‌ కోసం ప్రాణాలను అడ్డంపెట్టి పోరాడుతున్న షర్మిల. నగ్న ప్రదర్శనలాంటి తీవ్ర నిర్ణయాలతో సైన్యం అకృత్యాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన మైరాఫెయిబి కార్యకర్తల సాహసం.

AFSPA లాంటి బలమైన చట్టం పెట్టుకుని కూడా మణిపూర్‌ ప్రభుత్వం మణిపురి ప్రజల్ని కాపాడలేకపోతోంది. ప్రతిరోజూ సైన్యం కాల్పుల్లోనో, తిరుగుబాటుదారుల చర్యలవల్లో నలుగురో, ఐదుగురో చనిపోవాల్సిందే. మేము ఇంఫాల్‌లో ఉన్నప్పుడే 13 ఏళ్ళ కుర్రాడు కాల్పుల్లో చనిపోయిన విషాద సంఘటన జరిగింది. మణిపూర్‌లో మామూలు  పరిస్థితులు నెలకొనే ఆశ అయితే కనుచూపు మేరలో కనబడ్డం లేదు. ూఖీూూూ చట్టం రద్దు అవ్వడం గానీ, షర్మిల ఆమరణ నిరాహార దీక్ష ముగియడం అనేవి కల్లో మాటగానే అన్పిస్తున్నాయి.

ఇంతటి విషాదకర పరిస్థితుల్లో కూడా ఎంతో హాయిగా నవ్వే మణిపురి స్త్రీలను చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. హృద్యంగా నవ్వే చిత్ర, అంజులిక, సోసో, లిల్లీ, ఆరంభమ్‌. వీళ్ళ హాయైన నవ్వు చూసి చిత్రతో అన్నాన్నేను. ‘Magic of Manipur is your smile’  మీరింత చక్కగా ఎలా నవ్వగలుగుతున్నారు అంటే సమాధానంగా మరింత నవ్వే దొరికింది.

ఇంఫాల్‌ విమానాశ్రయంలో కూర్చుని గౌహతి వెళ్ళే విమానం ఎక్కేవరకు ఇవే ఆలోచనలు. మణిపూర్‌లో త్వరలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలనే ఆశాభావంతో నేను తిరుగు ప్రయాణమయ్యాను. మనసునిండా మణిపూర్‌ విషాదం నిండిపోవడంవల్ల అక్కడి నుండి అస్సాం, మేఘాలయ వెళ్ళిన అనుభవాలను ప్రస్తుతం రాయలేకపోతున్నాను. మేఘాలయలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, ప్రపంచంలోనే తడిప్రాంతంగా రెండుసార్లు గిన్నిస్‌ బుక్‌కెక్కిన చిరపుంజిలో చెక్కల బళ్ళమీద ప్లాస్టిక్‌ బిందెలతో కిలోమీటర్ల దూరం నీళ్ళకోసం వెతుకుతున్న స్త్రీలని మాత్రం నేనెప్పటికీ మర్చిపోలేను. నిత్యవర్షం కురుస్తుందని చెప్పుకునే చోట నీళ్ళ కోసం వెదుకులాట నిజంగా ఎంత విషాదం. మరెప్పుడైనా ఈ విషయాల గురించి రాస్తాను.

మొత్తానికి, మహిళా జర్నలిస్టుల మూడురోజుల కాన్ఫరెన్స్‌, మణిపూర్‌ మహిళల విషాద జీవితాల్లోని మల్లెపువ్వుల్లాంటి నవ్వులు, ఇరోం షర్మిల ఉక్కులాంటి పట్టుదల, మైరాపెయిబీ మాతృమూర్తుల మడమ తిప్పని పోరుబాట.. ఇవన్నీ నామీద గొప్ప ముద్ర వేసాయి. తిరిగి వచ్చాక కూడా మనసంతా ముసురుపట్టినట్లే ఉంది. కర్ఫ్యూలో ఉన్నట్లు అన్పిస్తోంది. చీకటి గుయ్యారంలో మగ్గుతున్నట్లే ఉంది. మణిపురి మహిళల మందహాసం గుర్తొచ్చినప్పుడు మాత్రం చాలా హాయిగా, రిలాక్స్‌డ్‌గా అన్పిస్తోంది. నాతోపాటు నాలుగు రోజులు గడిపిన మిత్రులందరూ పదేపదే గుర్తొచ్చినా, ఎక్కువగా నా మనసులో చోటు సంపాదించుకున్నది మాత్రం సమీర. షిల్లాంగ్‌లోని రెయిన్‌బో హోటల్‌ యజమాని హరీష్‌ని గురించి తప్పక రాయాలి. అతను చాలా ఎమోషనల్‌గా నన్ను కదిలించాడు. నేను అచ్చం తన చెల్లెలులాగా ఉన్నానని, కళ్ళు, ముక్కు తీరు తన చెల్లెల్ని గుర్తుకు తెస్తోందని చెబుతూ మా గురించి వివరాలు అడిగి, హెల్ప్‌లైన్‌ గురించి విని ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ఎవరూ అలా పని చెయ్యరని, తనకి లా ఫామ్‌ పెట్టాలని ఉందని మీరు హెల్ప్‌ చేస్తారా అని అడిగాడు. మాకు గౌహతిలో చౌకగా మూడు నక్షత్రాల హోటల్‌లో రూమ్‌లు మాట్లాడి పెట్టాడు. ఎనిమిది మందిమి  రెండు రూమ్‌ల్లో సర్దుకోగలిగాం. హైదరాబాద్‌ వచ్చాక రెండుసార్లు మాట్లాడాడు. ‘బెహన్‌! ఆప్‌ ఫిర్‌ కబ్‌ ఆరహే హై షిల్లాంగ్‌’ అంటూ ఆప్యాయంగా మాట్లాడే హరీష్‌, గౌహతిలో నన్ను తన ఆటోలో కూర్చోబెట్టుకుని కామాఖ్య కొండ మీదికి, బ్రహ్మపుత్ర నదిమీదికి, పడవ షికారుకి తీసుకెళ్ళి నగరమంతా తిప్పి చూపించి తిరిగి భద్రంగా  నన్ను ఎయిర్‌పోర్టులో దింపిన ఆటోవాలా కమల్‌ భాయ్‌, వందలకొద్దీ మా ఫోటోలు, వీడియోలు తీసి ఫోటోలు మాకివ్వాలి సుమా అని అడిగినపుడు ఖర్చవుతుందని అల్లరిగా నవ్వే సమీర, ఖర్చంటే డబ్బులేనా ఏంటి అని వెక్కిరించే సమీర నాకు చాలా నచ్చింది.

మంజరి కూతురుగా కంటే బోలెడన్ని పుస్తకాలు చదివిన, సరదాగా, సంబరంగా నవ్వే సమీర మా గ్రూప్‌లో ఉండడం మాకు గొప్ప ఎసెట్‌. అమ్మా కూతుళ్ళలా కాకుండా స్నేహితుల్లా మెలిగిన మంజరి, సమీరలు మాకు బోలెడంత వినోదం, హాస్యం అందించారు. ఇంఫాల్‌ ట్రిప్‌లో సమీర పరిచయం హైలెట్టే మరి. దీనిక్కూడా ఖర్చవుతుందంటుందో ఏమో!!!!

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

One Response to మణిపూర్‌ ముఖచిత్రం- సత్యవతి కొండవీటి

  1. Sharada Sivapurapu says:

    మణిపూరు ముఖచిత్రము మహా గొప్పగా ఉంది. పూర్తిగా ఆ వెన్నెల్లొ ఉన్నట్లు ఐరొమ షర్మిలని నిజంగా చూసిన అనుభూతి కలిగింది. చాలా విషయాలు తెలిపారు. ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.