1970లో మేమందరం ఠేకేదార్లకు విరుద్ధంగా పోరాటం చేస్తున్నాం. ఆ సమయంలో బీహారులో కాంగ్రెస్ పరిపాలన ఉండేది. సోషలిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, జనసంఘ్, రాజాకామాఖ్యా నారాయణసింహ్ పార్టీ … ఇంకా కొన్ని చిన్నా-చితకా పార్టీలు అసోసియేషన్ పార్టీలుగా పనిచేసేవి. సోషలిస్టు పార్టీలు అప్పుడప్పుడూ చీలుతూ ఉండేవి, అప్పుడప్పుడూ కలుస్తూ ఉండేవి. సంవిద సర్కార్ ఫెయిలయింది.
కొన్ని యూనియన్లు స్వతంత్రంగా పనిచేస్తే, కొన్ని యూనియన్లు పార్టీల సహకారంతో పనిచేసేవి. ఇంటక్ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది. హింద్ మజ్దూర్ సభ (హెచ్.ఎం.ఎస్)లో సోషలిస్టు పార్టీకి చెందినవారు ఉండేవారు. ఏ పార్టీకీ చెందని వాళ్ళు కూడా ఉండేవారు. వీళ్ళు రాజనీతిలో శ్రామిక ఉద్యమాలను ముడివేయడం ఇష్టపడరు. ఇందులో సమాజవాదుల ఇన్‌ప్లుయన్స్ బాగా ఉండేది. సమాజ వాదులలో ఒక్క జార్జి ఫెర్నాండెజ్ మాత్రం యూనియన్‌లో రాజనీతి ఎజెండా ప్రాతిపదికపై పోరాటం జరపడానికి ఇష్టపడేవారు. అందువల్ల ఆయనను ఎప్పుడూ హెచ్.ఎం.ఎస్. వాళ్ళు కలుపుకోలేదు. ఒకవేళ అందులో ఉన్నా ఆయనకు బైటికి వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చేవి. అందువలన జార్జికి తప్పనిసరి పరిస్థితులలో హింద్ మజ్దూర్ పంచాయతీ (ఇదే తర్వాత హింద్ మజ్దూర్ కిసాన్ పంచాయతీగా మారింది)ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇదేకాక సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సి.ఐ.టి.యు) ఉండేది. ఇది సీపీఎంతో కలిసి ఉండేది. తర్వాత భారతీయ మజ్దూర్ సభ (బి.ఎం.ఎస్.) ఏర్పడింది. ఇది బీజేపీతో అనుసంధానమై ఉండేది. ఝార్‌ఖండ్‌ను వేరే రాష్ట్రం చేయాలన్న ఉద్యమం మొదలైంది. ఎ.కె.రాయ్ యూనియన్ మార్క్సిస్ట్ కో ఆర్డినేషన్ పార్టీతో సంబంధం ఉండేది. బీహార్ సి.ఐ.టి.యు.కి ఉపాధ్యక్షుడైన శ్రీరామ్ నేతృత్వంలో తోయలా శ్రామికులలో ”బీహార్ కొకియారీ కామ్‌గార్ యూనియన్” ద్వారా ధన్‌బాద్ క్షేత్రంలో సూరజ్‌దేవ్ సింహ్ లాంటి బయటినుంచి వచ్చిన మాఫియాకి విరుద్ధంగా బలమైన ఉద్యమం మొదలయింది. ఝార్‌ఖండ్ ఉద్యమంతో పాటు బయట, లోపల చీలికలు మొదలయ్యాయి. వీటి ఆధారంగా యూనియన్లు కూడా చీలికలయ్యాయి. ఇంటక్ ఎక్కువగా బాహరీ (ఛోటా నాగపూర్‌కి బయటనుంచి వచ్చినవాళ్ళు)ల చేతులలో ఉండేది. సంథాల్ పరగణాలో అంటే జమ్‌షెడ్‌పూర్, బొఖారో కార్ఖానాలలో ఎక్కువగా బయటివాళ్ళే పనిచేసేవారు. అందువలన ఇంటక్ ప్రభావం వీటిమీద ఎక్కువగా ఉండేది. ప్రభుత్వ సంస్థాన అధికారులకు, ప్రైవేటు సంస్థల యజమానులకు ప్రాముఖ్యత ఉంటుంది. టాటా కంపెనీ బొగ్గు గనులైనా, స్టీల్ ప్లాంట్ అయినా ఇంటక్‌కే ఎక్కువ ప్రాముఖ్యత. తక్కువ యూనియన్ వాళ్ళు వీళ్ళను పైకి రానివ్వరు. సిద్ధాంతాన్ని కార్యరూపంలో పెట్టడానికి వీళ్ళు సామ, దాన, భేద, దండోపాయాలను అంటే మాఫియా, రంగదార్ ప్రభుత్వం, పోలీసులు, పెహల్వాన్లు (గూండాలు) మొదలైన వారి సహాయంతో మిగతా యూనియన్లను తలదూర్చనివ్వరు. బర్డ్, థాపర్, రాణీగంజ్ కోల్‌ఫీల్డ్, అగర్వాల్ గ్రూపు, చంచనీ-ఒహరా గ్రూపులలోని స్థితి ఇదే. బొగ్గుగనులు ముఖ్యంగా మూడు క్షేత్రాల్లో ఉండేవి. ఒకటి ధన్‌బాద్-ఝరియా క్షేత్రం (చాలా పాతవి. ఆంగ్లేయుల కాలం నుంచి ఉన్నాయి.) రెండోది హజారీబాగ్ పాతజిల్లా. దీనిలో బేరమో, గిరీడీహ్, రాయ్‌బచర్ మొదలైనవి వస్తాయి. మూడోది రాంచీ పాత జిల్లా. ఆ రోజుల్లో సలామూలో కూడా తవ్వకాలు జరుగుతూ ఉండేవి. లాల్ మాటియాలో తర్వాత తవ్వకాలు మొదలయ్యాయి. ఈ ప్రదేశాలన్నీ కొత్తవే.
ధన్‌బాద్-ఝరియా ప్రదేశాల్లోని గనులు చాలా పాతవైపోయాయి. మాఫియా ప్రారంభంలో, వీళ్ళు యజమానుల దగ్గర గూండాల రూపంలో ఉండేవారు. ఇప్పుడు గనులకు యజమానులయ్యారు. వీళ్ళే ఇంటక్ యూనియన్‌కి నేతలు. ప్రభుత్వం నిలబడడం ధన్‌బాద్ గనుల యజమానులపైనే ఆధారపడి ఉండేది. ఎవరు ముఖ్యమంత్రి అయినా ధన్‌బాద్‌కి వెళ్ళి డబ్బులు గుమ్మరించేవాడు. ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ప్రత్యర్థి గ్రూపు వాడిని కొనేవాడు. వాళ్ళ కులనేతలు వచ్చేవారు. తమ కులానికి చెందిన నేతల ద్వారా యజమానుల దగ్గర డబ్బులు జమ చేసి ప్రభుత్వాన్ని (కాంగ్రెస్ ప్రభుత్వం) పడగొట్టడానికి ప్రయత్నం చేసేవారు. తమ కులం వాడు ముఖ్యమంత్రి, లేకపోతే మంత్రి అయినా కావాలని వాళ్ళ ఉద్దేశ్యం. సంవిద్ ప్రభుత్వాన్ని సరిగ్గా పనిచేయకుండా ఈ మాఫియా నేతలు యజమానులతో చేతులు కలిపేవారు. కాంగ్రెస్ పార్టీవాళ్ళు ”ముఖ్యమంత్రి దిగిపోవాలి” అన్న ఉద్దేశ్యంతో ప్రయత్నాలు చేసేవాళ్ళు. అప్పుడు డబ్బు ఇక్కడినుంచే సరఫరా అయ్యేది.
ప్రైవేటు యాజమాన్యం ద్వారా నడిపే బొగ్గు గనులలో పనులు అవైజ్ఞానికంగా జరిగేవి. వర్టికల్‌గా కట్ చేయడం సురక్ష చట్టానికి వ్యతిరేకం. నిజానికి ఇది చాలా అపాయకరమైన పని. ఇటువంటి గనులలో చాలా దుర్ఘటనలు జరిగేవి. ఠేకేదార్లు నష్టం వచ్చే బొగ్గు గనుల నుంచి బొగ్గు తవ్వకుండా, లాభం వచ్చే ప్రదేశాల నుంచి (తేలికగా బొగ్గును తీయవచ్చు) బొగ్గును తీసేవారు. ఆ ప్రాంతమంతా పెద్ద పెద్ద గోతులు అయ్యేవి. నేల కూడా పనికి రాకుండా పోయేది. పెద్ద పెద్ద గోతులు అయ్యేవి. నేల కూడా పనికి రాకుండా పోయేది. ఎటు చూసినా మోసాలే. ధన్‌బాద్-ఝరియా మూసివున్న గనులలో ఇసుక నింపకుండానే వదిలేసేవాళ్ళు. ఇసు నింపుతున్నామనే నెపంతో ఠేకేదార్లు కోట్ల రూపాయలతో జేబులు నింపుకునేవాళ్ళు. ఒకసారి ధన్‌బాద్-ఝరియా బొగ్గు గనుల మూడు పొరలలో నిప్పంటుకుంది. మంటలను ఆర్పే నెపంతో డబ్బులు నీళ్ళలా ఖర్చు చేసేవారు, కానీ మంటలు ఆరేవి కాదు. ఇసుకను సరిగ్గా నింపకపోవడం వల్లే ఆ మంటలను ఆర్పడం వారికి అసాధ్యమయింది.
గనులలో సరైన ఏర్పాట్లు లేకుండానే తవ్వకాలు జరిగేవి. గనులు కుంగిపోయేవి. దీనివల్ల ఎందరో కూలీలు చనిపోయేవారు. ఇలాంటివి ఎన్నో దుర్ఘటనలు జరిగేవి.
తవ్వకాల సురక్షా విభాగం కూడా యజమానులకు తొత్తే. సురక్షా నియమాలు సరిగ్గా పాటించకపోవడంవల్ల రాజా కామాఖ్యా నారాయణ్ బేరమో క్షేత్రంలోని ధురీ బొగ్గు గనులలో జరిగిన దుర్ఘటనలో దాదాపు 300 మంది కార్మికులు చనిపోయారు.
కె.బి.సహాయ్ కాంగ్రెస్ గవర్నమెంట్ సమయంలో ముఖ్యమంత్రిగా ఉండేవారు. తర్వాత సంవిద గవర్నమెంట్ వచ్చింది, కానీ కొన్ని పరిస్థితులవల్ల ప్రభుత్వం పడిపోయింది. తర్వాత ఒక్కరోజు కోసం సతీష్ ప్రసాద్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన తర్వాత కేదార్ పాండే ముఖ్యమంత్రి అయ్యారు. శంకర్ దయాళ్ సింహ్, సతీదేవ సింహ్‌లు గూండాలు. వాళ్ళు అక్కడి గనులకు యజమాను లయ్యారు. వాళ్ళు ఇంటక్ నేతలు కూడా. గూండా నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన శంకర్ దయాళ్ సింహ్ మంత్రి అయ్యాడు. బి.పి.సిన్హా కార్మికుల నాయకుడు. ముఖ్యమంత్రులు ఆయన చేతుల్లో ఉండేవాళ్ళు, దీనికి కారణం ఆయనకు ధనబలం ఉండడమే. ఆయన కోల్ ఫీల్డ్ యజమానుల దగ్గర చందాలు వసూలు చేసి కాంగ్రెస్ మంత్రులందరికీ ఇచ్చేవారు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఆయనకు, నాకు మధ్య విరోధం పెరిగింది. ఎమ్మెల్యేకి నేను అర్హురాలినే కానీ ఆయన మనోరమా సిన్హాకి ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని కోరారు. ఆ సమయంలో నా భర్త ప్రకాశ్ గారు లేబర్ మినిస్ట్రీలో ప్రాంతీయ అధికారిగా పనిచేసేవారు. వారిపట్ల కూడా ఆయనకు సహానుభూతి ఉండేది. అందువలన నేను రాజకీయాల్లోకి రావడం ఆయనకు ఎంత మాత్రం ఇష్టంలేదు. నేను ధన్‌బాద్‌లో
ఉన్నప్పటినుండే సమాజ సేవ చేయడం మొదలుపెట్టాను. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పేరు ప్రఖ్యాతులు గల ప్రముఖ లాయర్ శ్రీరంగలాల్ చౌధరి నన్ను సపోర్టు చేసేవారు. తర్వాత నేను కాంగ్రెస్‌ని వదిలేసి సోషలిస్ట్ పార్టీకి వెళ్ళిపోయాను. అప్పుడు హింద్ మజ్దూర్ సభకి శ్రామిక నేత అయిన ఇమాముల్ హయీఖాన్ నన్ను సపోర్టు చేసేవారు. జయప్రకాష్ నారాయణ్ గారితో పాటు ఇమాముల్ హయీఖాన్ సోషలిస్టు పార్టీలో పనిచేసేవారు. ఆయనకి మంచి పేరు ఉండేది. ఆయన చాలా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అందరిలోకి చిన్న భార్య ఎం.బి.ఎ. చదువుతుండేది. ఆయన వయస్సు 55-66 సంవత్సరాలు ఉండేది. ఆయనకి కోపం ఎక్కువ. కహ్వరీగారి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసేవారు. ధన్‌బాద్ మైన్స్ బోర్డు అధ్యక్షునిగా కూడా ఆయన పనిచేసేవారు.
హజారీబాగ్‌లో మాండూ క్షేత్రం నుండి ఎన్నికలలో నిలబడమని నన్ను రసిక్ భాయీ వొహరా ప్రోత్సహించారు. ఆయన వేజ్ బోర్డు కమిటీలో బొగ్గు గనుల యాజమాన్యం వారికి ప్రతినిధిగా పనిచేసేవారు. వొహరా గ్రూపు గనులకు ఆయన యజమానిగా కూడా ఉండేవారు. ఆయన బర్డ్ కంపెనీకి వ్యతిరేకి. ఎందుకంటే బర్డ్ కంపెనీ ఆయన చేతుల నుంచి రైల్‌గఢా గనులను లాక్కొంది. ఆయనకి రాజా రామ్ గఢ్ అంటే కూడా కోపం. ‘భారత్ సేవక్ సమాజ్’ తరఫున నేను కుగ్రామాలలో సమాజ్ కళ్యాణ్ సెంటర్లను నడిపేదాన్ని. నా పర్యవేక్షణలో మహిళా కుట్టు శిక్షణా కేంద్రం నడిచేది. ధన్‌బాద్‌లో ఒక బాల్వాడీ కూడా నడిచేది. అలాగే లక్ష్మీ నారాయణ ట్రస్ట్ పర్యవేక్షణలో ఒక మహిళా కాలేజి నడిచేది. దాని ఎదురుగుండా ఎస్.సి. ధన్‌బాద్ బంగళాకి బయట ఉన్న స్థలంలో కుట్టు శిక్షణా కేంద్రాన్ని తెరిచాము. రసిక్ లాల్ ఓరా కాలేజీకి సీనియర్ ట్రస్టీ. నేను నా సంస్థలకు సెక్రటరీని. ఈ సంస్థలకు రసిక్‌గారు సహాయం చేసేవారు. కచ్ ఉద్యమం కోసం ఆయన ధన్‌బాద్‌లో దాదాపు ఒక లక్ష రూపాయలు చందా పోగుచేసి ఇచ్చారు. ఈ ధనాన్ని జన పరిషత్ సంస్థలో జమ చేయడానికి జార్జి ఫెర్నాండెజ్‌కి ఇచ్చాము. రసిక్‌గారు సమాజ సేవ సంస్థలకు సహాయపడడానికి ఎప్పుడూ ముందుండేవారు. లక్ష్మీ నారాయణ్ ట్రస్ట్ కాలేజి ఆయన పర్యవేక్షణలోనే ఉండేది.
నేను సంయుక్త సోషలిస్ట్ పార్టీ టికెట్‌పై మాండూ ఎన్నికలలో పోటీ చేసి 700 ఓట్లతో ఓడిపోయాను. నాకు ప్రజల మద్దతు ఉండేది. ఆదివాసీలు కూడా నాకెంతో సహాయపడ్డారు. ఎన్నికల తర్వాత ‘కోయలా శ్రామిక్ సంఘటన్’ పేరుతో ఒక యూనియన్‌ను ఏర్పాటు చేశారు.
1970లో శ్రీమతి ఇందిరాగాంధీ ధన్‌బాద్‌లోని అన్ని కోకింగ్ కోల్ గనులను నేషనలైజ్ చేశారు. ప్రభుత్వం రాత్రికి రాత్రి గనులను తన స్వాధీనంలోకి తీసుకుంది. కోల్ మైన్స్ యాజమాన్యం వారు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించలేదు. రాయల్టీ పెద్ద మొత్తం తీసేసి కార్మికులకు కూలీ ఇవ్వాలని నిర్ణయించారు. గనుల కార్మికులకు అమితమైన సంతోషం కలిగింది. వారికి తమ కళ్ళెదురుగా శోషణరహితమైన ఒక ముక్తాకాశం కనిపించసాగింది. కానీ విముక్తి అంత సులభంగా లభించదు. నేతలు, పోలీసులు, మాఫియా యజమానులకు ఈ సంగతి బాగా తెలుసు. అసలు వీళ్ళేగా కార్మికులను దోపిడీ చేసేది. ఇంటక్‌లోని చాలామంది నేతలు మైన్స్ యాజమాన్యంలో ఉండేవారు. ఏజెంట్లు పనిచేసేవారు. ఎన్.సి.డి.సి. నుంచి వచ్చిన అధికారులందరూ చేతులు కలిపారు. లంచాలు తీసుకుని వాళ్ళ బంధువుల పేర్లను రిజిస్టర్లలో రాసేవారు. ఈ విధంగా చేస్తూ నీతి, నిజాయితీలతో పనిచేసేవారిని తొలగించారు. వడ్డీ వ్యాపారస్థులు, గూండాలు, లంచాలు ఇవ్వగల శక్తి కలిగినవారు పనులు చేయడం మొదలుపెట్టారు. రిజిస్టర్లలో 100 పేర్లకు బదులు 200 పేర్లు రాయబడ్డాయి. ఈ రిజిస్టర్ల పనులు చూసేది గూండాలు, ఠేకేదార్లేగా. అధికారులు, పోలీసులు తమ ఇన్‌ఫ్లుయన్స్‌తో అడ్డమైన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించసాగారు.
కూలీలలో పేర్లు రాయించడానికి పోటీ పెరిగిపోయింది. ఆదివాసీలు, దళితులు, మహిళా కార్మికులు మొదలైన వారికి ఉద్యోగం, సద్యోగం లేకుండా పోయింది. వీళ్ళకోసం పెద్ద ఎత్తున ధన్‌బాద్ ఎ.కె.రాయ్, ఎస్.కె.భక్షీ, హజారీబాగ్, రాంచీలలో మా యూనియన్ తరపున పోరాటం జరిపారు.
నేషనలైజ్ అయ్యాక ఉద్యోగాల కోసం పెద్ద పోరాటం జరపవలసి వచ్చింది. ఈ మధ్యలో అపీల్ కమిటీలలో ఇంటక్ ఇన్‌ఫ్లుయన్స్ ఇంకా పెరిగింది.
కోకింగ్ కోల్ మైన్స్ నేషనలైజ్డ్ అయ్యాక నాన్ కోకింగ్ – కోల్ మైన్స్ అలాగే ఉండిపోయాయి. నేను కొంత కాంగ్రెస్‌లో, ఇంటక్‌లో పేరు సంపాదించుకున్నాను. కేదార్ పాండే గారు 1972లో రాయ్‌గఢ్ నుండి నాకు టికెట్ రావాలని సిఫారసు చేశారు కానీ మాండూ ఎక్స్ లెజిస్లేటర్ వీరేంద్ర పాండే దీనిని వ్యతిరేకించారు. నేను కాంగ్రెస్‌కి రాకముందు ఒక షరతు పెట్టాను. కేదలా జార్ఖండ్ మైన్స్‌ని నేషనలైజ్ చేయాలని కేబినెట్‌కి సిఫారసు చేయాలని, బీహార్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (బి.ఎం.డి.సి.)కి ఇస్తామని కేబినెట్ ముందు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని చెప్పాను. ఆయన అట్లాగే చేశారు.
ఇందిరగారూ! మీకు అపాయం బయటనుండి కాదు, లోపలినుండే…
శ్రీ కేదార్ పాండే ద్వారా నేను మళ్ళీ బి.పి.సి.సి. మెంబర్‌ను అయ్యాను. ఇందిరగారు బంగ్లాదేశ్‌ని వేరే రాష్ట్రంగా ప్రకటించారు. అందరూ ఆమెను ప్రశంసించడం మొదలుపెట్టారు. బంగ్లాదేశ్ కొత్త రాష్ట్రం కావడం, గనుల రాష్ట్రీయకరణ అతి కష్టంమీద జరిగాయి.
బెంగాల్‌లో సిద్ధార్థ శంకర్ రాయ్ గారి ప్రభుత్వం ఏర్పడింది. నేను కేదలా జార్ఖండ్ గనులను రాష్ట్రీయకరణ చేయాలని పోరాటం మొదలు పెట్టాను. ఇంతకుముందు కుజు సంఘటన, కేదలా, రైలీగఢా హత్యకాండలు జరిగాయి. ‘ఠేకేదారీని రద్దు చేయండి. గనులను రాష్ట్రీయకరణ చేయండి.’- అని నినాదాలు చేశాం. కేదలా హత్యాకాండ తరువాత శ్రామికులను ఎంక్వైరీ లేకుండా అరెస్టులు చేయడం మొదలుపెట్టారు. దీనికి వ్యతిరేకంగా మేం ఘాట్ స్టేషన్ చుట్టుముట్టాలి అని ప్లాన్ వేశాం. మేం అందరం కాంగ్రెస్ పార్టీలో జాయినయ్యాం. ముఖ్యమంత్రి శ్రీ కేదార్ పాండే గారి దగ్గర శోషణ సమూలంగా లేకుండా చేయాలని, గనులను రాష్ట్రీయకరణ చేయాలని హామీ తీసుకున్నాం. ఈ మధ్యలో గనులలో ఒక పెద్ద వివాదం మొదలయింది. ఈ విషయంలో మేము ఘాటో స్టేషన్‌ని చుట్టుముట్టాలని అనుకున్నాం. అక్కడినుండి వచ్చాక కలకత్తా వెళ్ళాలనుకున్నాం. నా ప్రాణాలకి ముప్పు ఉందని, ఉమా బచన్ తివారీ గ్రూప్ నన్ను వ్యతిరేకించడానికి వస్తున్నారంటూ పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. ఉమా బచన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా కోల్ ఫీల్డ్‌లలో వాళ్ళలో వాళ్ళే భయంకరంగా కొట్టుకునేవాళ్ళు. ప్రత్యేకమైన యూనియన్లను ఆధీనం చేసుకోవడానికి కూడా కొట్లాడుకునేవాళ్ళు. పోలీసులు నన్ను 11 మైన్స్ బోర్డ్ డాక్ బంగ్లాలో వాళ్ళ పర్యవేక్షణలో ఉంచారు. నేను అక్కడినుండి దూబే గారికి ఫోన్ చేసి స్థితిగతుల గురించి చెప్పాను. నన్ను కలకత్తాకి పంపించే ఏర్పాటు చేయమని ఆయన డెప్యూటీ కమిషనర్‌కి చెప్పారు. మాతోపాటు బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (బి.పి.సి.సి) సభ్యులు కూడా వచ్చారు. బీహార్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఎ.ఐ.సి.సి. మీటింగ్‌లో పాల్గొనడానికి కేదార్ పాండే నా పేరు పంపారు. ఈ సభలో శ్రీ చంద్రశేఖర్ (మాజీ ప్రధానమంత్రి) గురించి ‘యువాతర్క్’ పేరున ప్రచారం చేశారు. చంద్రశేఖర్ స్టేజీమీద కూర్చున్నారు. ఓపెన్ సెషన్‌లో ఉపన్యాసం ఇచ్చేవారి లిస్టులో బి.పి.సి.సి.తరఫున నేను నా పేరును రాయించాను. ఈ సభలో ఎ.ఐ.సి.సి. సభ్యులు మాట్లాడారు. బి.పి.సి.సి.లో కొంతమంది సభ్యులకు ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళలో నేను ఒకరిని. సభలో ఇందిరా గాంధీ గారు, హోం మంత్రి ఉమాశంకర్ దీక్షిత్ కూడా ఉన్నారు. మంత్రి మోహన కుమార్ మంగళం, లేబర్ మినిస్టర్ ఖడీల్‌కర్ కూడా స్టేజీ మీద ఉన్నారు.
బీహార్ ముఖ్యమంత్రి కేదార్ పాండే కూడా ఉన్నారు. ప్రసంగించే వాళ్ళను కూడా స్టేజీపైకి పిలిచారు. ఈ సభకు వచ్చే ముందు నేను కుమార మంగళమ్‌కి కేదలాతో సహా అన్ని మైన్స్‌ని నేషనలైజ్ చేయాలని ప్రస్తావన ఇచ్చి వచ్చాము. ఇంటక్‌కి నేను సెక్రటరీగా పనిచేసేదాన్ని. దీనివైపు నుండి కూడా గనుల రాష్ట్రీయకరణ ప్రస్తావనకు అనుమతి లభించింది. కాంగ్రెస్‌కు సీపీఐ సమస్య ఉంది. సీపీఐ, ఇంకా సోషలిస్టు నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.
మీటింగుకు ముందు కుమారమంగళం స్టేజీ వెనుక
ఉన్న గదిలో నవ్వుతూ నాతో అన్నారు – ”అన్ని గనులు నేషనలైజ్ కావాలని చెప్పు రమణిక”. ఖాడిల్‌కర్ అన్నారు – ”శ్రామికుల హితం కోసం నియమాలను చేయాలని, పాత నియమాలలో పరివర్తన చేయాలని చెప్పు”.
చంద్రశేఖర్ ప్రసంగించారు. తర్వాత నా వంతు వచ్చింది. నేను ఇందిరాగాంధీ గారిని సంభోదిస్తూ మొదలుపెట్టాను.- ”ఇందిర గారూ! అందరూ చరిత్రను తయారు చేస్తారు. కానీ బంగళాదేశం పేరున ఒక కొత్త దేశాన్నే మీరు తయారుచేశారు. అందువలన మీరున్నంత కాలం దేశానికి ఎటువంటి అపాయం లేదు. కొందరు మీకు అపాయం ఉంది అంటున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, అపాయం మీకు బయటనుండి కాదు లోపలినుండే. ఈ సభలో వెనుక వరుసలో నిల్చున్న వారికి, స్టేజిపైన కూర్చున్నవారికి మధ్య ఎటువంటి సంబంధం ఉందో మీరే పరీక్షించండి. ఎందుకంటే (స్టేజిపై కూర్చున్న వాళ్ళవైపు చూస్తూ) వీళ్ళు, (ప్రజలవైపు చూస్తూ) వీళ్ళ బాధను అర్థం చేసుకోలేరు.
”నేను వికాసం-వికాసం అని వినబడుతున్న రాజనీతి గురించి చర్చిస్తాను. ఇప్పటికీ బీహార్‌లో భుయియాం (ట్రైబల్స్) ఇళ్ళలోని కొత్త పెళ్ళికూతురి మేనా (పల్లకీ) మొదటి రాత్రి భర్త ఇంటివైపు కాకుండా బాబూ సాహెబ్ జమీందారు హవేలీ వైపు
వెళ్తుంది. నేను అక్కడినుండి వచ్చాను. అక్కడ పత్‌రాటు డ్యామ్
ఉంది. అది చాలా పెద్ద డ్యామ్. నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి. అక్కడవిద్యుచ్ఛక్తి తయారవుతుంది. సగం బెంగాల్ తళతళా మెరుస్తూ
ఉంటుంది. కానీ సరిగ్గా దానిపైన ఉండే బస్తీలలో, ఊళ్ళలో నీళ్ళు లేవు. కరంటూ లేదు. అక్కడంతా ఆకుపచ్చదనంతో వెల్లివిరుస్తున్న అడవులు ఉన్నాయి. కానీ వాటిలో నివసించేవారికి ఏ హక్కూ లేదు. వారు అడవులలోకి వెళ్ళకూడదు. గిద్దీ, సౌందా, భర్‌కుండా, బొకారో, జమ్‌షెడ్‌పూర్, ధన్‌బాద్‌లు ఎంతో మెరిసే ప్రదేశాలు. కానీ నలువైపులా ఊళ్ళలో బురదే బురద. వికాసం అయింది కానీ కాగితాలలో మాత్రమే. ఈ వికాసం, వెలుగు అందరికీ సమంగా దొరకడం లేదు. ఈ వికాసం బురదలో విరిసిన కమలం లాంటిది కానీ ఈ బురదను కూడా తొలగించాలి.”
”మా దగ్గర బొగ్గు గనులు చాలా ఉన్నాయి. పావు వంతు ప్రభుత్వం ఆధీనంలో ఉంటే మిగిలినవి ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో
ఉన్నాయి. అక్కడ శ్రామికులు భయంకరమైన దోపిడీకి గురవుతున్నారు. మా ప్రభుత్వ గనుల సామగ్రి అంతా దొంగతనంగా ప్రైవేటు యాజమాన్యం చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మాకు అంతా నష్టమే, వాళ్ళకంతా లాభమే. బొగ్గు గనుల ఈనాటి స్థితి కుంటి గుర్రంపై సవారీ లాంటిది. అందువల్ల ఈ గనులన్నింటినీ రాష్ట్రీయకరణ చేయాలి.”
”కార్మికుల చట్టాలయితేనేం, ఐ.పి.సి. రూల్స్ అయితేనేం… అన్నీ ఆంగ్లేయుల సమయం నాటివే. హక్కులను అడిగితే ‘శాంతికి భంగం కలుగుతుంది’ అంటూ కూలీలను, వాళ్ళ నాయకులను 107, 113 సెక్షన్ల కింద జైళ్ళలో తోస్తారు. ఇప్పుడు కూడా సెక్షన్ 144
ఉంది. ఈ సెక్షన్ కేవలం కార్మికులకే చెందుతుంది. యజమానులకు చెందదు. ఎందుకంటే, యజమాని ఒక్కడే ఉంటాడు. కూలీలు చాలామంది ఉంటారు. యజమానులు ఎంతగా శాంతి భద్రతలను భగ్నం చేసినా వారికి ఈ సెక్షన్ వర్తించదు. వారాల తరబడి కూలీ దొరక్కపోతే, శ్రామికులు ఉద్యమం చేస్తే అప్పుడు వాళ్ళపై ఈ సెక్షన్ ప్రకారం కేసులు పెడతారు. అతి తక్కువ జీతాలకు విరుద్ధంగా పోరాటం చేసినా సురక్ష నియమాలను భగ్నం చేస్తున్నారు అంటూ పెట్టబడిన కేసులు లేబర్ కోర్టులో ఈనాటికీ వందల సంఖ్యలో
ఉన్నాయి. ఎంత సమయంలో ఈ కేసులను పూర్తి చేయాలి అనే నియమం ఏమీ లేదు. కేసులు కనీసం కొట్టేయాలి కదా! నేను స్టేజీపైన కూర్చున్న వారందరినీ ప్రార్థిస్తున్నాను. స్టేజీమీద కూర్చున్నవాళ్ళు దూరంగా నిల్చున్న గుంపుల దు:ఖాలను తెలుసుకోవాలంటే కిందికి దిగి వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తే కాంగ్రెస్ వాళ్ళకి ఇక ఎటువంటి అపాయం ఉండదు”.
నా ప్రసంగం పూర్తవగానే అక్కడి వాతావరణం చప్పట్లతో ప్రతిధ్వనించింది. ఇందిరగారు చిరునవ్వులు నవ్వుతూ నా వంక చూశారు. కేదార్ పాండే గారు కూడా ఎంతో ప్రభావితులయ్యారు. నేను స్టేజి పైనుంచి దిగి వచ్చాక గదిలోకి వెళ్ళాను. కుమార మంగళమ్ ఒక కాలిమీద నిల్చుని ఎగురుకుంటూ నడవడం మొదలుపెట్టారు. ”ఓహ్! అయామ్ రైడింగ్ ఎ థీమ్ హార్స్”.
ఖాడీల్‌కర్ గారు నా తల నిమురుతూ, ఆశీర్వాదం ఇస్తూ చాలా బాగా చెప్పావు అన్నారు. మంత్రి ఉమాశంకర్ దీక్షిత్ గారి కోడలు షీలా దీక్షిత్ (కలకత్తా నుండి తిరిగి వస్తున్నారు) గారిని కలవడానికి వెళ్ళాను. దీక్షిత్ గారు ఎంతో ప్రేమగా నన్ను ఆశీర్వదించారు. ”నీ నాలికమీద సరస్వతి ఉంది రమణికా! నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఢిల్లీ వస్తే నన్ను కలువు” అన్నారు.
షీలా గారు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. పాండే గారు నాకు రామ్‌గఢ్ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడానికి సిఫారసు చేశారు. నాకు టిక్కెట్ దొరికింది.
(ఇంకాఉంది…)