పీడిత జనబాంధవుడు, ప్రజా న్యాయవాది – బొజ్జా తారకం – టి.డి.ఎఫ్‌.

ప్రజా ఉద్యమాల పక్షపాతి, దళిత, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి, పీడిత ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుక, మేధావి, ఉద్యమకారుడు బొజ్జా తారకం గారు కొంతకాలంగా బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతూ ఈ నెల 16వ తేదీ, శుక్రవారం రాత్రి 10.30 గంటలకు తుది శ్వాస విడిచారు. అన్యాయం అదే పనిగా చేస్తున్న రాజ్యం, దాన్ని నడిపిస్తున్న దోపిడీ శక్తులను, ఆధిపత్య వర్గాల హత్యాకాండలను, అన్యాయాలను ధిక్కరించి ఆయన జీవితమంతా పీడిత ప్రజల కోసం, బహుజనుల పక్షాన నిలబడ్డారు. దళిత, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కొరకు తన శక్తి మేరకు కృషి చేశారు. దాదాపు ఐదు శతాబ్దాలపాటు ప్రజా

ఉద్యమాల వెంట నడిచిన బొజ్జా తారకం గారు తెలుగు నేలపై ప్రజా ఉద్యమాలకు అండగా నిలబడ్డారు.

1939 జూన్‌ 27న జన్మించిన బొజ్జా తారకం గారు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని కందికుప్ప గ్రామంలోని దళిత కుటుంబమైన శ్రీమతి మువ్వలమ్మ, బొజ్జా అప్పలస్వామి గార్ల చిన్న కుమారుడు. తన చుట్టూ సమాజంలో

ఉన్న కుల అణచివేతకు వ్యతిరేకంగా విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేశారు. కోనసీమలోని దళితులే కాదు దేశంలోని దళిత జాతి మొత్తం అట్టడుగు వర్గంగా గుర్తించి ఈ వర్గానికి భూమి, ఆత్మగౌరవం దక్కిన రోజునే ఈ సమాజానికి ఒక అర్థం ఉంటుందని ఆనాడే గ్రహించారు. ఈ దేశంలో కుల నిర్మూలన – వర్గ నిర్మూలన జరగాలంటే, పీడితులను పట్టి పీడిస్తున్న కుల వ్యవస్థను కూకటివేళ్ళతో పెకిలించాలంటే కులం-వర్గం రెండూ జమిలిగా పోరాటం చేసి నూతన వ్యవస్థను, ఒక సమసమాజాన్ని సృష్టించాలని కలలు గన్నారు. ఆయన కలలుగన్న నూతన వ్యవస్థలో శతాబ్దాల తరబడి హిందూ మనువాద వ్యవస్థ విషకౌగిలిలో కొనసాగుతున్న దళిత, వెనుకబడిన, అగ్రకులాలనే తేడా లేకుండా మనుషులంతా సమానంగా బతకాలన్నారు. అందుకొరకు ఈ దేశంలోని విప్లవ శక్తులు, కుల-వర్గ పునాదితో ఉద్యమించాలని చెప్పారు. ఆ పునాది తాత్విక నేపథ్యంలో 1981లో ‘కులం-వర్గం’ అనే పుస్తకం రాశారు.

తన విద్యాభ్యాసం నుంచే మార్క్సిజం – అంబేద్కరిజం రెండూ జోడించి పోరాటం చేయాలనే తాత్విక పునాది కలిగిన తారకం గారు ఎన్నో అంబేద్కర్‌ యువజన సంఘాలను స్థాపించి దళితుల్లో చైతన్యాన్ని తెచ్చి అగ్రకుల అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు నాయకత్వం వహించారు. తన న్యాయవాద వృత్తిని నిజామాబాద్‌లో మొదలుపెట్టి అక్కడి భూస్వాములు, అగ్ర కుల అహంకారులు దళితులపై జరుపుతున్న అమానుష కాండలకు వ్యతిరేకంగా ఒకవైపు ప్రజాతంత్ర పోరాటానికి, మరోవైపు న్యాయ పోరాటానికి తన వంతు శక్తినందించారు. అక్కడే బీడీ కార్మిక సంఘానికి నాయకత్వం వహిస్తూ కమ్యూనిస్టు పోరాటాల వైపు ఆకర్షితులయ్యారు. 1975లో విధించిన ఎమర్జెన్సీలో అరెస్టయి దాదాపు 18 నెలలు జైలులో గడిపిన తారకం గారు ఆ తరువాత హైదరాబాద్‌కు చేరుకుని హైకోర్టులో తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1979 నుంచి తన తుదిశ్వాస విడిచేవరకు ఎన్నో పోరాటాల ఫలితంగా రాజ్యాంగంలో చేర్చబడిన ప్రజాస్వామిక హక్కులు ప్రజలకు దక్కేలా ప్రజా పోరాటం, దానికి సమాంతరంగా న్యాయపోరాటం కొనసాగించారు.

ఆది ఆంధ్ర ఉద్యమం, కంచికచెర్ల కోటేశు మరణానికి వ్యతిరేకంగా నడిపిన ఉద్యమం, కారంచేడు, నీరుకొండ, పదిరికుప్పం, చుండూరు, లక్షింపేట, వెంపెంటలలో జరిగిన దుర్మార్గపు అగ్రకులాల హత్యాకాండలకు వ్యతిరేకంగా జరిపిన ప్రజా ఉద్యమాలలో ముందు వరసలో నిలిచారు. మొదటినుంచి ప్రజాతంత్ర హక్కుల కొరకు జరిపిన పోరాటాలకు నాయకత్వం వహించినన తారకం గారు ప్రతి ఎన్‌కౌంటర్‌ పోలీసుల హత్యే అని నినదించారు. ఆ నినాదాన్ని పోరాటం రూపంగా మార్చి ఒకవైపు ప్రజా పోరాటం, రెండోవైపు దోషులకు శిక్షపడేలా ఎన్‌కౌంటర్‌ అఫెన్స్‌లలో పాల్గొంటున్న వారందరినీ సెక్షన్‌ 302 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం కేసులు నమోదు చేసి శిక్షించాలని పోరాడారు. పౌరహక్కుల సంఘం బాధ్యునిగా, విరసం వ్యవస్థాపక సభ్యునిగా, ప్రజాభూమి కమిషన్‌ ఛైర్మన్‌గా, శవాల స్వాధీన కమిటీ నాయకునిగా, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ అధ్యక్షునిగా, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక (టిడిఎఫ్‌) వ్యవస్థాపక కన్వీనర్‌గా, ప్రజా సంఘాలకు నాయకత్వం వహిస్తూ, మరోవైపు డా. బి.ఆర్‌.అంబేద్కర్‌ స్థాపించిన రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌పిఐ)కు రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షునిగా కొనసాగారు.

కారంచేడు, నీరుకొండ, చుండూరు, వెంపెంట, లక్షింపేట బాధితులకు న్యాయం జరగడం అంటే దోషులకు కఠిన శిక్షలు పడడమే అని ఎలుగెత్తి చాటిన బొజ్జా తారకం గారు ఆయా కేసులను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు తీసుకు వెళ్ళి దోషులకు శిక్షపడేలా ప్రయత్నం చేశారు. అలాగే బూటకపు ఎన్‌కౌంటర్‌ సంఘటనలతో విప్లవకారులను కాల్చి చంపుతున్న ఎన్‌కౌంటర్‌ కేసులలో పోలీసు అధికారులను కూడా భారత శిక్షా స్మృతి 302 ప్రకారం శిక్షపడాలని రాష్ట్ర ఉన్న త న్యాయస్థానంలోను, దేశ సర్వోన్నత న్యాయస్థానంలోను పోరాడారు. 2004లో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం విప్లవోద్యమ కారులతో చర్చలు జరిపిన సందర్బంలో బొజ్జా తారకం గారు తెలుగు నేలపై అనేకమంది ప్రజాస్వామిక వాదులు, ప్రగతిశీల మేధావులతో పాటు ప్రభుత్వానికి, విప్లవోద్యమానికి మధ్యవర్తిగా ఉన్నారు. ఆ సందర్భంలో ప్రధానంగా చర్చకు వచ్చిన భూమి సమస్యను పరష్కరించే నైతికత, ధైర్యం పాలకులకు లేదని స్పష్టం చేస్తూ, విప్లవోద్యమం నాయకత్వంలో ఏర్పడిన ప్రజా భూమి కమిషన్‌కు ఛైర్మన్‌గా ఎన్నకోబడ్డారు. అదే సందర్భంలో

అత్యంత అమానుషంగా కాల్పుల విరమణకు తిలోదకాలు ఇచ్చి బూటకపు ఎదురు కాల్పులతో విప్లవోద్యమంపై ముప్పేట దాడిని కొనసాగిస్తూ పదుల సంఖ్యలో విప్లవకారులను చంపుతున్న నాటి వైఎస్సార్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నిజామాబాద్‌ మానాలలో కోవర్టుచే విషం ఇచ్చి మత్తులో ఉండగా పట్టుకొని విప్లవకారులను అత్యంత పాశవికంగా చంపిన కేసులో పోలీసులను సెక్షన్‌ 302 కింద నమోదు చేసి శిక్షించాలని డిమాండ్‌ చేసి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పోరాడారు.

1997లో మధుసూదన్‌ రాజ్‌ కేసులో, రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ఎన్‌కౌంటర్‌ కేసుల్లో పోలీసులపై ఐపిసి సెక్షన్‌ 302 నమోదు చేసి విచారించాలని తీర్పునివ్వగా, మానాల కేసును ముగ్గురు జడ్జీల బెంచ్‌కు రిఫర్‌ చెయ్యగా, ఆ ముగ్గురు జడ్జీల బెంచ్‌ ఐదుగురు జడ్జీల బెంచ్‌కు రిఫర్‌ చేసింది. ఇదే కేసుతో నాటి శేషాచలం, నల్లమల అడవుల్లో జరిపిన పలు బూటకపు ఎదురుకాల్పులు కూడా జమ కావడంతో మొత్తం కేసులను విచారించిన రాష్ట్ర ధర్మాసనం 2009 జనవరి 29న చారిత్రాత్మక తీర్పును వెలువరిస్తూ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ప్రతి పోలీసుపై ఐపిసి సెక్షన్‌ 302 కేసు నమోదు చేసి విచారించాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పు దేశ న్యాయచరిత్రలోనే చారిత్రాత్మకమైన తీర్పుగా ప్రసిద్ధికెక్కింది. తీర్పు వెలువరించే ప్రక్రియలో తారకం గారి కృషి అపారమైంది. దాదాపు రెండు సంవత్సరాలు తారకం గారు, కన్నబిరాన్‌ గారు, ఇతర న్యాయవాదులు చేసిన గొప్ప పోరాట ఫలితంగా వచ్చిన ఈ తీర్పుపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి అప్పీలు చేసి కింది కోర్టు తీర్పుపై స్టే తెచ్చుకుంది. ఇప్పటికీ ఆ కేసు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో నడుస్తోంది. గత ఏడు సంవత్సరాలుగా ఆ కేసులకు సంబంధించి తారకంగారు తన అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా సుప్రీంకోర్టులో పలుమార్లు తన వాదనలు వినిపించారు.

తారకం గారు బహుముఖ ప్రజ్ఞాశాలిగా తన జీవిత కాలచక్రాన్ని నడిపి ఈ సమాజానికి ఒక విలువైన సందేశాన్నిచ్చారు. ఒకవైపు ప్రజాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తూనే, మరోవైపు భావితరాలకు తన రచనల ద్వారా జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేశారు. తారకం గారికి కార్ల్‌ మార్క్స్‌ అంటే ఎంత అభిమానమో, ఆదర్శమో, అండేద్కర్‌ అంటే కూడా అంతే అభిమానం, ఆదర్శం. తారకం గారు ఒక అద్భుతమైన కవి. సున్నిత మనస్కుడు. తన రచనల ద్వారా సామాన్య మానవుడికి అర్థమయ్యే విధంగా, సరళంగా తన మొట్టమొదటి రచన ‘పోలీసులు అరెస్టు చేస్తే?’ పుస్తకం 1981లో ప్రచురించగా, ‘కులం-వర్గం’, ‘నదీ పుట్టిన గొంతుక’, ‘నాలాగే గోదావరి’, ‘దళితులు-రాజ్యం’, ‘పంచతంత్రం’, ‘నేల-నాగలి- మూడెద్దులు’ వంటి అద్భుతమైన పుస్తకాలను ఈ సమాజానికి అందించారు. పలు రచనలను తెలుగులోకి అనవదించిన తారకం గారు అంబేద్కర్‌ రచనలను కూడా తెలుగులోకి అనువదించారు. జీవిత కాలంలో ఎందరో రాజకీయ ఖైదీలను విడిపించడంలో, రాజకీయ ఖైదీలకు న్యాయం అందించడంలో ఎంతటి ధైర్యాన్నయినా ప్రదర్శించేవారు. అందులో భాగంగా విశేష కృషి చేసిన ఘనత తారకం గారిది అంటే అతిశయోక్తి కాదు. తన ఆరోగ్యాన్ని ఎప్పుడూ లెక్కచేసేవారు కాదు. పీడిత ప్రజల సమస్యల ముందు తారకం గారు తన అనారోగ్యం పెద్ద సమస్య కాదనుకున్నారు. తన ఆరోగ్యం సహకరించకున్నా ప్రజలను కలవడంలో, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో భాగమై వారి హృదయాలలో చోటు సంపాదించు కోవడంలోనే తృప్తి ఉందని ఎన్నోసార్లు చెప్పేవారు. పోలవరం ప్రాజెక్టు, స్పెషల్‌ ఎకానమీ జోన్‌, లక్షింపేట ప్రాంతాల్లోనే కాక గ్రీన్‌హంట్‌ పేరుతో భారత పాలకులు మధ్యభారతంలోని ఛత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని ఆదివాసీ సమాజంపై జరుపుతున్న హత్యాకాండలను నిరసించారు. ‘ప్రజలపై యుద్ధం’లో భాగంగా కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు 2013లో దండకారణ్యంలోని బీజాపూర్‌ జిల్లా బాసగూడలో జరిపిన దారుణమైన మారణకాండలో 18 మంది ఆదివాసులు, మహిళలు, పిల్లలు చంపివేయబడ్డప్పుడు ఆయన తీవ్రంగా చలించిపోయారు. ఘటనా ప్రాంతానికి వెళ్ళి అక్కడ అమెరికన్‌ సామ్రాజ్యవాద మద్దతుతో భారత పాలకవర్గాలు ఆదివాసీ సమాజం మీద జరుపుతున్న దమనకాండకు వ్యతిరేకంగా ప్రజాతంత్ర వాదులను సమీకరించి పోరాటాలు చేశారు. భారత పాలక వర్గాల హత్యాకాండలను బయటి సమాజానికి తెలియజేసి ప్రజా కోర్టులో పాలకుల దాష్టీకాలను విప్పి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015 సెప్టెంబరులో వరంగల్‌ జిల్లాలోని మేడారం అడవుల్లో మొద్దుగుట్ట ప్రాంతంలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో విప్లవకారులు తంగెళ్ళ శృతి, విద్యాసాగర్‌ల మరణం బొజ్జా తారకం గారిని తీవ్రంగా కలచివేసింది. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రేహౌండ్స్‌ పోలీసులు అత్యంత పాశవికంగా జరిపిన హత్యాకాండలో శృతి, విద్యాసాగర్‌లు అంగాంగం చీల్చబడి క్రూరంగా చంపబడ్డారు. ఈ ఘటన మొత్తం తెలుగు సమాజాన్నే సెన్సిటైజ్‌ చేయడమే కాకుండా ప్రజాసంఘాలన్నీ ఒకటిగా ఆ బూటకపు ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా ప్రజాస్వామిక హక్కుల కొరకు ఉద్యమించడానికి తీసుకున్న నిర్ణయంలో తారకం గారే ప్రధాన భూమిక పోషించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న దుర్మార్గపు హత్యాకాండలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజాస్వామిక హక్కుల రక్షణ కొరకు నిరంతరం పోరాటం కొనసాగాలని, ఆ పోరాటంలో తాను కీలక భాగస్వామ్యం కావాలని తారకం గారు నిశ్చయించుకున్నారు. ఆ తరుణంలో ఏర్పడిన తెలంగాణ ప్రజాస్వామిక వేదిక (టిడిఎఫ్‌) వ్యవస్థాపక కన్వీనర్‌గా ఉండడంతో పాటు నాయకత్వా న్ని అందిస్తానని ముందుకు వచ్చారు. ఆయన జీవితం మొత్తం ప్రజాస్వామిక ఉద్యమాలతోనే పెనవేసుకుంది. ముఖ్యంగా రాజ్యం చేసిన, చేస్తున్న హత్యాకాండలకు వ్యతిరేకంగా ఆదివాసీ, దళిత, బడుగు, బలహీన, మత, మైనారిటీ వర్గాలపై ఆధిపత్య వర్గాలు చేస్తున్న హత్యాకాండలకు వ్యతిరేకంగా ఉద్యమించినన చరిత్ర తారకం గారిది.

అలాగే ఎన్‌కౌంటర్‌ హత్యాకాండలో అమరులైన వారి ఆశయాలను అమలు చేసేందుకు, ముందుకు తీసుకెళ్ళేందుకు విశేష కృషి చేసిన తారకం గారు అమరుల చరిత్రను రాసి ముందు తరాలకు అందించి చెప్పాలనేవారు. అందులో భాగంగా అనంతపురం బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపబడిన సందె రాజమౌళి, నల్లమల అడవుల్లో చంపబడిన బుర్ర చిన్నన్న (మాధవ్‌), అలాగే మహబూబ్‌నగర్‌ భూస్వాముల అమానుష హత్యాకాండలకు బలైన బాలస్వామి, మొద్దుగుట్టలో బూటకపు ఎన్‌కౌంటర్‌లో అమరులైన శృతి, విద్యాసాగర్‌ల చరిత్ర రాయాలని నిరంతరం తపన చెందారు. ఇందులో భాగంగా కొన్ని వివరాలు కూడా సేకరించారు. అంతలోనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ఆశయాలను తుదకంటూ ఆచరణలో కొససాగించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. పీడిత, తాడిత ప్రజల హక్కుల కోసం అలుపెరగని యోధుడు తారకం గారు మన మధ్య భౌతికంగా లేకున్నా, ఆయన సైద్ధాంతిక, రాజకీయ అవగాహన చిరకాలం ఉంటుంది.

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.