ప్రియమైన హైమవతీ,
ఎలా ఉన్నావ్? మనం కలుసు కొని కూడా చాలా రోజులైంది కదూ! పి.సత్యవతిగారెలా ఉన్నారు? మొన్న 11కి అవార్డ్ ఫంక్షన్ విజయవాడలో జరిగింది కదా! ఫోటోలవీ ఫేస్‌బుక్‌లో చూశాను. నేనసలు నిజానికి రావాల్సి ఉంది. తనని పలకరించడంతో పాటు అభినందన సభలో ఆవిడని చూడాలని కూడా అన్నించింది. ప్చ్! రాలేకపోయాను. 21కి స్టేట్స్‌కి
వెళ్తున్నాను. ఓ ఆర్నెల్లవరకూ రాను. అక్కడికెళ్ళాకన్నా తీరిగ్గా మాట్లాడదామని ఉంది. కానీ పగలూ, రాత్రుళ్ళు వరసలు మార్చుకొని ఉంటాయి కదా! అంతా గందరగోళమక్కడ. నయాగరా జలపా తాన్ని, ఆ హోరుని వినాలనీ, చూడాలని ఉందనుకో.
‘మందరపు హైమవతి’ – అనగానే ‘సర్ప పరిష్వంగం’ కవిత గుర్తొస్తుంది. ‘చేరా’గారు ఆ కవిత గురించి అప్పట్లో ఆంధ్రజ్యోతిలో చాలా విపులంగా విశ్లేషించారు. తాదాత్మ్యపు అంచుల్లో విహరిస్తున్న ఆమెని, ‘జీతమెప్పుడొస్తుంది’ అన్న ప్రశ్న ఎంత గాయపరుస్తుందో ఆ కవితాక్షరాలు చెప్పాయి. నీక్కూడా బాగా నచ్చిన కవిత కదా అది. నీ కవిత్వంలో పురాణ ప్రతీకలెక్కువ. ‘నిషిద్ధాక్షరి’ పేరే అద్భుతంగా ఉంటుంది. పాత పాత పాత్రలన్నింటినీ, కొత్త అర్థంతో, కొత్త చూపుతో కవిత్వీకరించడం నీకలవాటు. బంగారు పనిముట్లు చేసేవారి జీవితం ఎలా ఉంటుందో, పాదరసంలా కరిగిపోయే వారి జీవన విఫలత్వాన్నీ, పేదరికపు అంచుల్లోకి నెట్టివేయబడుతున్న బతుకు బొమ్మల్ని, చివరికి ఆత్మహత్యలకు మాత్రమే పనికొస్తున్న దైన్యస్థితి కరుణా త్మకంగా రాశావు. నన్ను చాలా కదిలిం చిందా కవిత. అలాగే తెలుగు సిలబస్‌లో ఉన్న చిత్రవిచిత్రాలన్నింటినీ, వ్యంగ్యంగా చిత్రించావొకచోట. మనమొక సారి కేరళ టూర్‌కి వెళ్ళినప్పుడనుకుంటా కలిశాం. ఒక దు:ఖపు నదిలా ప్రవహించా వప్పుడు. నీలోని మరొక కోణాన్ని చూశానప్పుడు. మనం ఆత్మీయులుగా మారిన సందర్భం కూడా అది. నీ లోని అమాయకత్వం, స్నేహ పిపాస, కవిత్వానురాగం అన్నీ చూసింద ప్పుడే. బతుకు చాలా చిత్రమైంది కదూ!
‘ద్విపాత్రాభినయం, లేడీస్ స్టాఫ్‌రూమ్, శీతాకాలం రాత్రి, బంగారు చేతులు…’ నువ్వు రాసిన అద్భుతమైన కవితలు. నాకిష్టం కూడా. 82’లో అనుకుంటా, నీ మొదటి కవిత్వ పుస్తకం ”సూర్యుడు తప్పిపోయాడు” వచ్చింది. ఆ తరువాత 2004లో వచ్చిన ”నిషిద్ధాక్షరి” కాలానికి నీ కవిత్వం సాంద్రతను చేరుకొంది. అవునూ నే రావొచ్చు కదా! మీ నాన్నగారు ‘కాసులు’ గారంటే నీకు చాలా ఇష్టం కదూ! ఒకసారి నాతో అన్నావు అక్షరాల ఆస్తినిచ్చారు, నన్ను చదువుకోమని చాలా ప్రోత్సహించారు అని. నాకు తెలిసి నువ్వు హైస్కూలు రోజుల్లోనే 12, 13 ఏళ్ళప్పుడే రాయడం మొదలుపెట్టావు. పద్యాలు రాసేదానివి. స్కూలు టీచర్ల ప్రోత్సాహంతో స్నేహితుల పుట్టిన రోజులక్కూడా వాళ్ళమీద కూడా పద్యాలు రాసేదానివి. ఎదిగిన తర్వాత పద్యం నుంచి వచన కవిత్వ దిశగా నీ ప్రయాణం సాగింది. అందుకనే నీకున్న ప్రాచీన సాహిత్యం మీదున్న పట్టు, పద్యం మీదున్న మక్కువ కవిత్వంలో చాలాచోట్ల ప్రతిఫలిస్తూ ఉంటుంది. నీకు తెలీకుండానే ఉపమలు, రూపకాలు, ఉత్ప్రేక్షలు ఎక్కువగా తొంగి చూస్తూ ఉంటాయి. సమకాలీన సంఘటనల మీద కాలమ్స్ కూడా రాశావు కదూ! ‘విశాలాంధ్ర’లో నాలుగేళ్ళపాటు రాసిన కాలమ్స్‌ని ‘వానచినుకులు’ అనే పేరుతో పుస్తకం కూడా వేశావు కదూ! అలాగే ‘ఆంధ్రప్రభ’లో అనుకుంటా సుమారు రెండేళ్ళపాటు ‘హరివిల్లు’ పేరుతో కాలమ్ రాశావు. రేవతీదేవి, శ్రీశ్రీ, తిలక్, బైరాగి, కృష్ణశాస్త్రి, మో, ల రచనలు ఇష్టమవడంవల్ల వాళ్ళ ప్రభావం కూడా నీమీదుందన్నావు.
హైమా! నీకు గుర్తుందా? ఒకసారి ఒక సభలో సినారె గార్ని కలిసినప్పుడు నీ పేరులో దీర్ఘముండాలి హైమావతి అని ఉండాలి అని అంటే కాదండీ, హైమవతే నా పేరు. అదే కరెక్ట్ కూడా అన్నావ్. నవ్వొచ్చిందప్పుడు. ‘భూమిక’ తరఫున రచయిత్రులందరం కలిసి వెళ్ళిన టూర్లవల్లనే చాలావరకు మనమందరం మానసికంగా దగ్గరయ్యాం. ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెల్సుకొనే వీలు, ఒకరి పట్ల ఒకరికి ఆప్యాయతను వ్యక్తీకరించగలిగే దగ్గరితనం వచ్చాయి. లేకపోతే ఎక్కడో విజయవాడలో పుట్టి, పెరిగి, ఉద్యోగస్తురాలివై జీవిస్తున్న నీకూ, నాకూ ఈ స్నేహ వారధిని నిర్మించింది అక్షరాల రూపురేఖలే కదా! సమాజానికి సాహిత్యమెంత అవసరమో, సాహిత్యకా రులకు అంత స్నేహ వాత్సల్యాలు అవసరమన్పిస్తుంది. విలువలపట్ల, వ్యక్తులపట్ల ఉండే గౌరవాలు, మనిషినెప్పటికీ తాజాగా ఉంచుతాయి. ఏమంటావో? ప్రస్తుతం మనని కలుపుతున్న ‘అల’లాంటి లేఖకు ఆధారం దాని వెనకున్న సాహిత్య సముద్రమే కదా!
– శిలాలోలిత…