వాళ్ళప్పుడప్పుడూ
వచ్చి పోతూ ఉంటారు
సరిహద్దు కాపలా కాస్తూ
తచ్చాడుతూ ఉంటారు కాబట్టి
వీళ్ళు అవకాశం కోసం
ఆబగా చూస్తూ ఉంటారు
వాళ్ళప్పుడయినా గీతను దాటి
ఇటువైపు రాకపోతారా అని
అక్కడ కుక్కలు అరవవు
పిల్లలూ ఏడ్వటానికి ఇష్టపడరు
ఆడవాళ్ళు వీథుల్లోకి రాలేరు
మగవాళ్ళకూ మాటలే ఉండవు
ఎక్కడ చూసినా మైదానమే
అంతా చల్లని శిశిర ఋతువే
వెచ్చని సాయంకాలపు గాలులు
బాంబుల మోతలకు భయపడి
చీమ కళ్ళతో పహారా కాస్తూ
ఇంటి చూరుకు వేళాడుతుంటాయి
నిట్టూర్పుల పొగల సెగలు
మీదకు రాబోయే తూటాలను
తరంగాలుగా వీస్తున్న శబ్దాలను
బిక్కు బిక్కున ఎదుర్కొంటానికి
ఒళ్ళంతా చెవులు చేసుకొని
మీదకు కుమ్మరించబడే
ఫిరంగుల మృత్యుహేళను
నిక్కబొడుచుకొని చూస్తుంటాయి
పాలకొండల నడుమ ఎప్పుడూ
వార్ధక్యం వొళ్ళు విర్చుకున్నట్లుగా
యవ్వనం మసకబారుతుంది
కౌమార్యం పగబట్టి వణికిస్తుంది
బాల్యం బందీలా ముడుచుకుంటుంది
దిన దిన గండం నూరేళ్ళుగా… యుద్ధం
అత్యంత కౄరమై వేధిస్తుంది
అక్కడ పరుగెత్తే బుల్లెట్లు
కుర్చీల్లో రాజకీయాలు చేస్తాయి
అంతర్లీనంగా చిక్కటి నిశ్శబ్దం
ఏరులై ప్రవహిస్తూ ఉంటుంది
ఎటు స్వర్గమో!
ఎటు నరకమో! తెలియని
నిగూఢచర్యల మధ్యన
జీలంనది వెక్కిళ్ళు పడుతూ
ఒంటరిగా ఏడుస్తోంది
మనుషులు ఏమైతేనేమి
జీవాలు ఎటుపోతేనేమి
ఇళ్ళు, లోగిళ్ళు కూలిపోతేనేమి
శతాబ్దాల సంస్కృతులు
సుందర కాశ్మీరం
ఏమైపోతే మీకేంటి?
మీకు కావల్సింది ఒక్కటే!
చావటం… చంపటం…
అయినా… యుద్ధం చేసేది
ప్రజల కోసం కాదుకదా
మతోన్మాదుల పాశవికత అంతా
తమ ప్రాబల్యం పెంచుకుంటూ
ఉపరితలంలోకి చొచ్చుకొనిపోతూ
మనిషితనాన్ని మృగ్యం చేస్తూ
ఎర్రటి నెత్తురునేగా మీరు తాగేది
శవాల కుప్పల మీదేగా మీరు నడిచేది
యుద్ధం మీకనివార్యం కావచ్చు
వారికి ప్రాణసంకటమే ఎప్పుడూ
మీకు కావల్సింది రాజ్యాధికారం
అక్కడ కనుమరుగయ్యేది మాత్రం
స్వేచ్ఛ, స్వాతంత్య్రం…!
మీ ఆధిపత్య దురహంకారాలు
పేర్చిన చితిమంటలలో… జీవశ్చవమై
కాందిశీకులై కన్నీళ్ళు కార్చుతూ,
కమిలిన ముఖంతో కాశ్మీరం!