ఆధునిక యుగంలో స్త్రీలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నప్పటికీ మహిళలపై హింస రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. అసమానతలు, అత్యాచారాలు, అవమానాలు, రకరకాల కొత్త రూపాలలో స్త్రీలను హింసకు గురిచేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా స్త్రీలు వరకట్న మహమ్మారికి నేటికీ బలవుతూనే ఉన్నారు. ప్రతినిత్యం పత్రికలలో, టీవీలలో వచ్చే వార్తల్లో వరకట్న చావులు చూస్తూనే ఉన్నాం. వరకట్న మహమ్మారి అన్ని కులాల్లోకి, మతాల్లోకి విస్తరించింది. 1961 లో వరకట్న నిషేధ చట్టం వచ్చింది. కానీ కట్నం ఇవ్వడం, పుచ్చుకోవడం బహిరంగ రహస్యమే. పెళ్ళి చేయాలంటే డబ్బుండాలి. లేకపోతే ఆడపిల్లకు పెళ్ళిచేయలేని పరిస్థితి. పురుషుడితో పాటు స్త్రీ అన్ని రంగాల్లోనూ సమాన స్థాయిలో ఉన్నప్పటికీ వరకట్న పిశాచానికి బలవడం బాధాకరమైన విషయం.
కట్నం ఇచ్చుకోలేని స్త్రీలను మానసిక క్షోభకు గురిచేయడం, కొన్ని సందర్భాలలో చంపడం కూడా చేస్తున్నారంటే ఇంతకంటే క్రూరమైన చర్య మరొకటి లేదేమో అన్పించక మానదు. కట్నం కోసం వ్యక్తిత్వాలను అమ్ముకొని యువకులు అమ్ముడుపోవడం, మానవత్వాన్నే మరిచి స్త్రీనొక ఆటబొమ్మగా చూడడం శోచనీయం.
స్త్రీల హత్యలకు, ఆత్మహత్యలకు వరకట్నం పెద్ద సమస్యగా మారింది. పేదరికంతో కట్నం ఇవ్వలేక, ఎదిగిన ఆమ్మాయికి పెళ్ళి చేయలేని తల్లిదండ్రులు కన్నకూతురిని రాత్రికి రాత్రే కడతేర్చి, తల్లిదండ్రుల ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలున్నాయి. కట్నం ఇవ్వలేని, పెళ్ళి చేయలేని తల్లిదండ్రుల ఆర్థిక దుర్భలత్వాన్ని తెలుసుకొని, అవమానాలను భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న అమ్మాయిలెందరో? వరకట్న పిశాచ వృక్షాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాల్సింది పోయి మన సమాజం దానికి జీవం పోస్తోంది. వరకట్న నిషేధం కోసం చట్టాలు చేసినా ప్రయోజనం కన్పించడం లేదు. ఇటీవలి కాలంలో వరకట్నం వేధింపులు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పెళ్ళైనప్పుడు ఇచ్చిన కట్నం తక్కువైందని, మళ్ళీ కొంత మొత్తాన్ని ఇవ్వాలంటూ వేధింపుల కేసులు ఎక్కువయ్యాయి.
వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండింటినీ నేరంగా పరిగణిస్తూ ప్రభుత్వం 1961 జులైలో చట్టం తెచ్చింది. ఈ చట్టంలోని లోపాలను సవరిస్తూ మరో 23 సంవత్సరాలకు 1984లో డౌరీ ప్రొహిబిషన్ ఎమెండ్మెంట్ యాక్ట్ తెచ్చారు. అంతేకాకుండా శిక్షకు సంబంధించి 1986లో మళ్ళీ సవరణ చేశారు. వివాహ సమయంలో కానీ, ముందు కానీ, తర్వాత కానీ వధూవరులలో ఎవరో ఒకరి తల్లిదండ్రులు, బంధువులు మరొకరికి ఎలాంటి సంపదలైనా ఇవ్వడాన్ని వరకట్న నేరంగా పరిగణిస్తారు. అయినప్పటికీ నూటికి 90 శాతం మంది కట్నం తీసుకుంటున్నారు. నూటికో కోటికో ఒకరికి శిక్ష పడుతోంది. వరకట్న హత్యలను కొంతవరకు నిరోధించవచ్చుననే ఆశయంతో 1956 నాటి హిందూ వారసత్వ చట్టం మహిళా హక్కులను మెరుగుపరిచి ఆస్తి హక్కు కల్పించింది. వరకట్నంగా ఇచ్చే సొమ్మును మహిళలకు ముందే సంక్రమించే ఆస్తిగా చేయడంవల్ల ఈ దురాచారాన్ని కొంతవరకు నిరోధించవచ్చునని ప్రభుత్వం భావించింది. కానీ ఆ ప్రయోగం ఆచరణలో విఫలమైంది.
1990 నుండి 1993 వరకు 20,507 వరకట్న మరణాలు నమోదయ్యాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో అత్యధిక వరకట్న కేసులు నమోదయ్యాయి. నమోదు కాని కేసులు వేలల్లో ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో 1993లో 307 వరకట్న మరణాలు, 1992లో 223 మరణాలు నమోదయ్యాయి. 2010 సంవత్సరంలో 8,391 వరకట్న మరణాలు నమోదయ్యాయని జాతీయ నేర గణాంక సంస్థ (యన్‌సిఆర్‌బి) తెలియజేసింది. వరకట్న నిషేధ చట్టమున్నా, ప్రభుత్వ ఉద్యోగులు వరకట్నం తీసుకోకూడదని, ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం నిషేధపు ఉత్తర్వులు జారీ చేసినా కట్నం తీసుకోవడం బహిరంగ రహస్యమే.
వరకట్నం సమస్యగా వరుడికి కట్నాన్ని ముట్టచెప్పే ఆడపిల్లలు తల్లిదండ్రుల బాధలను, వరకట్నాన్ని నిషేధించాల్సిన అవసరాన్ని, ఆ దిశగా సమాజం, అమ్మాయిల తల్లిదండ్రులు, వరుడు, అతని తల్లిదండ్రుల్లో రావాల్సిన మార్పును కథా సాహిత్యం వివరించింది. వరకట్న మహమ్మారిని అంతమొందించాల్సిన ఆవశ్యకతను, చైతన్యాన్ని పొందాల్సిన తీరును రచయితలు చిత్రించారు. కొన్ని కథల్లో సమస్యను మాత్రమే చూపించినప్పటికీ, మరికొన్ని కథల్లో అమ్మాయిలు ధైర్యంగా నిలబడాల్సిన చైతన్యాన్ని అందించాయి.
నేడు స్త్రీలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. పురుషులతో సమానంగా ఎందులోనూ తీసిపోమని అన్ని రంగాల్లోనూ తమ సత్తాను చాటుతున్నారు. అయినా స్త్రీల పట్ల జాఢ్యమై నిలిచిన వరకట్న దురాచారం మాత్రం సమసిపోవడం లేదు. కనీసం తగ్గుముఖం పట్టకపోగా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆ సమస్యను చిత్రిస్తూ సమాజంలో మార్పు రావాలన్న సందేశాన్నిచ్చిన కథలు తెలుగు కథాసాహిత్యాన్ని పరికిస్తే చాలావరకు వచ్చాయి. ఇంకా ఈ దిశగానే కథలు రాస్తున్నారు కూడా. ఎందుకంటే ఆధునిక యుగం అని చెప్పుకుంటున్నా నేటికి కూడా ఈ సమస్య ఇంకా కొనసాగుతోంది. కనుక ఆ కథల్లో కొన్ని పరికిస్తే…
అమ్మాయి ఎంత చదువుకున్నా కట్నం కావాలని కోరే అబ్బాయి తండ్రిని, వరుడ్ని కట్నం ఇవ్వాలనుకునే కన్నతండ్రిని పోలీసులకు పట్టించిన వైనం డా|| సూరంపూడి సుధ ”రేపటిపువ్వు” కథలో చిత్రించారు. ప్రవేణికి తల్లిదండ్రులు 50 వేల కట్నంతో ఒక మంచి ఇంజనీర్ సంబంధాన్ని కుదిరిస్తారు. కట్నం ఇచ్చి పెళ్ళిచేసుకోవడం ఇష్టం లేదని తండ్రికి చెప్తుంది. పెళ్ళికి ఎంతైనా ఖర్చు పెట్టుకుంటామని, మాట్లాడకుండా పెళ్ళి చేసుకోమంటాడు తండ్రి రాఘవరావు.
ప్రవేణి కాలేజీ రోజుల్లో కట్నం ఇచ్చి పెళ్ళి చేసుకోవద్దని తన స్నేహితురాళ్ళకు చెప్పేది. ఆమె తాను చెప్పిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలనుకుంటుంది. ఆ పట్టుదలతోనే భీష్మించుకు కూర్చుంటుంది. ప్రవేణి మాటను తండ్రి వినడు. ఇక లాభం లేదనుకుని వరకట్న నిషేధం గురించి ఎన్నో పోటీలలో పాల్గొన్న తాను చెప్పిన ఆదర్శాలకు కట్టుబడే ఉంటానని, కట్నం తీసుకోకపోవడమో, పెళ్ళి మానుకోవడమో ఏదో ఒకటి నిర్ణయించుకోమని పెళ్ళికుమారునికి ఉత్తరం రాస్తుంది. ఆ ఉత్తరం పోస్ట్ చేయకముందే తండ్రి చేతిలో పడుతుంది. తన ప్రయత్నం విఫలమైనందుకు ప్రవేణి బాధపడుతుంది. పెళ్ళికి సిద్ధమవుతుంది. కానీ పెళ్ళిని ఆపాలన్న తన కోరికను నెరవేర్చే ప్రయత్నంలోనే ఉంటుంది.
ప్రవేణి అమ్మా నాన్న కట్నం ప్రస్తావన గురించి మాట్లాడుకుంటుంటే వారికి తెలియకుండా దాన్ని రికార్డ్ చేసి, కట్నానికి తెచ్చిన రూపాయిల నోట్లమీద నంబర్లు నోట్ చేసుకుని పోలీస్ కమిషనర్‌కి వెడ్డింగ్ కార్డుతో సహా పంపిస్తుంది. పోలీసులు పెళ్ళి మండపంలో నుంచి ప్రవేణి తండ్రిని, పెళ్ళికొడుకు తండ్రిని తీసుకెళ్తారు. ప్రవేణి ఒక్క క్షణం పొరపాటు చేశానేమోనని బాధపడుతుంది. పెళ్ళికి వచ్చిన వారంతా ఆమెను తండ్రిని అరెస్ట్ చేయించిన మహాపాతకిగా చూస్తారు. పెళ్ళి ముహూర్తానికి ఇంకా మూడు నిమిషాల సమయం ఉంటుంది. పెళ్ళి కుమారుడు ప్రవేణిని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడతాడు.
పెళ్ళైన ఒక ఆడపిల్లకు అత్తింటి వేధింపులు ఎదురైతే, ఆ వేధింపులలో ఒకవేళ తన ప్రాణాలు పోతే తనది ఆత్మహత్య కాదని, హత్య అని నిరూపించాలని ఆమె మహిళామండలి సభ్యులను కలుస్తుంది. తర్వాత ఆ మహిళా మండలి సభ్యురాలు ఇచ్చిన సలహాతో బతికుండి ధైర్యంగా పోరాడాలని నిర్ణయించుకున్న శ్యామల గాథ… పోల్కంపల్లి శాంతాదేవి ”ముగింపు మీరే చెప్పండి” కథ.
శ్యామల తల్లిదండ్రులు అందినచోటల్లా అప్పులు చేసి, శ్యామలను వేణుకిచ్చి పెళ్ళి చేస్తారు. పెళ్ళైన నాటినుంచి శ్యామలను అత్త, భర్త కట్నం తెమ్మని ఆరడి పెడ్తారు. మొదటి పండక్కి నెల రోజుల ముందు తీసుకెళ్ళలేదని, వారిని తీసుకెళ్ళడానికి వచ్చిన శ్యామల తమ్ముడి ముందు అత్త సూటిపోటి మాటలంటుంది. శ్యామలతో పండుగకి వెళ్ళిన వేణు అత్తగారింట్లో ఇష్టంగా ఉండడు. పండుగకు పెట్టిన బట్టలు చాలా తక్కువ రేటువని శ్యామల తల్లిగారు పెట్టిన బట్టలు తీసుకోడు. శ్యామల తీసుకుంటుంది.
శ్యామల మిషన్ నేర్చుకోవాలనుకుంటుంది. భర్త ఒప్పుకోడు. బట్టలు బాగా కుట్టి మిషన్ అప్పు తీర్చి తాళి చేయించుకోవచ్చనగానే శ్యామల అత్త ఒప్పుకుంటుంది. శ్యామలకు మహిళా మండలి ప్రెసిడెంట్ వరలక్ష్మి, సెక్రటరీ ఇందిరతో పరిచయం ఏర్పడుతుంది. శ్యామల తన పరిస్థితి అంతా వారికి చెప్పి ఒకవేళ అత్తింటివారు తనను చంపితే తనది ఆత్మహత్య కాదని హత్యని నిరూపించాలని వేడుకుంటుంది. చనిపోయాక నిరూపించడం కాదు, చనిపోకుండా ఉండే ఆత్మస్థైర్యాన్నివ్వాలని ఇందిర చెప్తుంది.
వరకట్నం వేధింపులకు ముగింపు పలకాలంటే ఆ బారిన పడుతున్న వారికి రక్షణ కల్పించాలని, వారికి ధైర్యాన్నివ్వాలని ఇందిర అంటుంది. డబ్బుకు గడ్డితిని పనిచేసే అధికారుల వైఖరి మారాలంటుంది. తల్లిదండ్రులు కూడా తాహతుకు మించి కట్నాలు ఇవ్వడం చేయకూడదని చెప్తుంది. ముఖ్యంగా ఆడపిల్ల తనను తాను రక్షించుకునే ఆత్మస్థైర్యంతో ముందుకు నడవాలని ఇందిర చెప్తుంది. ఈ మాటలు విన్న శ్యామలలో ఉత్సాహం వచ్చి తను వాళ్ళ చేతిలో చనిపోవడానికి సిద్ధంగా లేనని సర్ది చెప్పినా మళ్ళీ ఆ నరకంలోకే పంపే తల్లిదండ్రులు, సమాజం ఆలోచనల్లో మార్పు వస్తేనే వరకట్నం వేధింపులవల్ల ఆడపిల్లల మరణాల కేసులు ఉండవంటుంది.
తాహతుకు మించి కట్నం ఒప్పుకొన్నప్పటికీ, ఇంకా ఇంకా కట్నం కావాలన్న వారి గొంతెమ్మ కోరికలు విసుగు చెందిన తండ్రి కూతుర్ని చంపుతాడు. అలా వరకట్న పిశాచానికి బలైపోయిన అమ్మాయి సీతమ్మ గాథ గన్ను కృష్ణమూర్తి ”గన్ను” కథ.
శరభయ్య కూతురు సీతమ్మ. తల్లి చనిపోవడంతో స్కూలు చదువు ఆగిపోతుంది. చెల్లెళ్ళ కోసం, తండ్రి కోసం ఇంటికే అంకితమై పోతుంది. సీతమ్మ అందగత్తె కాదు. నలుపు రంగు. అడిగినంత కట్నం ఇచ్చుకోలేని సీతమ్మ తండ్రి సంబంధాలు వెతుకుతాడు. సీతమ్మకు ఒక సంబంధం కుదురుతుంది. అబ్బాయికి ఫ్యాక్టరీలో ఉద్యోగం. ఎడమ చేతికి వేళ్ళుండవు. అయినా ఏదో ఒక సంబంధం అని శరభయ్య ఒప్పుకుంటాడు. లగ్నం పెట్టుకుంటారు. ఎకరం పొలం కట్నంగా ఒప్పుకుంటారు. తర్వాత పదివేల రూపాయల కట్నం అదనంగా ఇవ్వాలంటారు. చాలా రోజుల తర్వాత కుదిరిన సంబంధం అని అప్పోసప్పో చేసి ఇవ్వడానికి శరభయ్య ఒప్పుకుంటాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే అబ్బాయి చెల్లెలు ఆడపడుచు కట్నం కింద ఐదువేలు ఇవ్వమని అడుగుతుంది. అంత డబ్బు ఇవ్వడం తనవల్ల కాదని, ఇల్లు కుదువపెట్టి రెండువేలిస్తాడు.
మరొకరోజు అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి ఎక్కువ కట్నం ఇస్తామని వేరే సంబంధాలు వస్తున్నాయని, కనీసం ఇంకా ఐదువేలైనా ఇవ్వాలంటారు. ఇంకా కట్నం ఇవ్వడం తనవల్ల కాదని, ఉన్న రెండు బర్రెలను అమ్మి ఇస్తానని శరభయ్య బతిమలాడుకుంటాడు. వాటితోపాటు వెయ్యి రూపాయలు కూడా ఇవ్వమంటారు. శరభయ్యకి విసుగొచ్చి ఇంట్లోకి వెళ్ళి తెస్తానని చెప్పి విరక్తి చెంది కూతురు తలను పళ్ళెంలో పెట్టి, గుడ్డ కప్పి తీసుకువస్తాడు. అబ్బాయి తల్లిదండ్రులు గుడ్డతీసి చూడగా సీతమ్మ తలకాయ. పోలీసులొచ్చి శరభయ్యను, అబ్బాయి తల్లిదండ్రులను పట్టుకెళ్తారు.
ఆడపిల్లలకు పెళ్ళి పేరుతో కట్నం ఇవ్వడాన్ని వ్యతిరేకించి, తల్లిదండ్రులను అప్పుల ఊబిలో దించలేనని ఆత్మస్థైర్యంతో కాబోయే భర్తకు లేఖ రాసిన లీల కథ పోల్కంపల్లి శాంతాదేవి ”బకాసురుడి విందు” కథ.
లీల తల్లిదండ్రులు ఎలాగో తంటాలుపడి పదివేల కట్నంతో ఆమె పెళ్ళి కుదిరిస్తారు. పెళ్ళి చూపుల్లో పెళ్ళికొడుకు లీలకు పళ్ళు ఎత్తుగా ఉన్నాయని, అయినా ఫర్వాలేదంటాడు. అతడి స్వభావం లీలకు నచ్చదు. కట్నం పేరుతో ఒక్క పైసా ఇచ్చినా పెళ్ళి చేసుకోనని తల్లిదండ్రులతో ఖచ్చితంగా చెప్తుంది లీల. ఆమె మాటలకు తల్లి కోప్పడి ”పెళ్ళీ పెటాకులు లేకుండా మా గుండెలమీద కుంపటిలాగా ఉండి పోతానంటావా?” అని నిష్ఠూరాలాడుతుంది. తల్లి మాటలకు బదులుగా ”అన్నయ్య నా కంటే పెద్దవాడే కదా! వాడు గుండెలపై కుంపటి కాదా?” అన్న లీల ప్రశ్నకు ”వాడికీ నీకూ పోలికేమిటీ? వాడు మగాడు. ఏనుగు చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే అన్నట్టు మగాడు పెళ్ళి చేసుకున్నా సరే, చేసుకోకపోయినా సరే” అంటుంది.
చివరకు ఒకరోజు లీల కాబోయే భర్తకు తమ కుటుంబ పరిస్థితిని వివరిస్తూ ఉత్తరం రాస్తుంది. అంత కట్నం ఇచ్చుకోలేమని, తన తర్వాత ఆడపిల్లలున్నారని, చదువులకు మగపిల్లలున్నారని, తిండికి ఆధారమైన పొలం అమ్మితే వారి పరిస్థితి ఏమిటని, ప్రతి ఆడపిల్ల తండ్రి వరకట్నమనే బకుడికి ఆహారమవుతున్నారని బకాసురుడనే రాక్షసుని కథ వివరిస్తుంది.
స్త్రీకి పురుషుడి అండ ఎంత అవసరమో, అతడికీ ఆమె తోడు అంతే అవసరమని, అర్థంలేని ఆచారాలను నిరసిస్తుంది. తన భావాలు నచ్చితే పెళ్ళి చేసుకోమని పేర్కొంటుంది. ఉత్తరం రాసిన సంగతి తెలిసిన లీల తండ్రి ఉద్యోగం చేసి జీవితం గడుపుకోవడంతోనే సమస్యలు తీరవని, ఆడపిల్ల పెళ్ళితోనే సమస్యలు తీరతాయని అంటాడు. తానొక్కతే ఇలా చేయడంవల్ల పెళ్ళికొడుకుల్లో మార్పు రాదంటాడు. ”నా ఒక్కదాని వల్ల ఏ ఉపకారం జరుగుతుందని అనుకుని ప్రతి వర్ష బిందువు కురవడం ఆగిపోతే ప్రపంచం గతి ఎలా మారుతుందో ఊహించలేవా నాన్నా” అని లీల అడుగుతుంది. ”బలవంతంగా పెళ్ళి చేయకుండా ఆడపిల్లకు ఒక మనిషిగా వ్యక్తిత్వంతో బతికే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వండని” లీల తండ్రితో అంటుంది.
”కట్నం” కథలో వరకట్న దాహానికి సీత బలైపోయిన సప్పటికీ, ”రేపటి పువ్వు” కథలో ప్రవేణిలా, ”బకాసురుడి విందు” కథలో లీలలాగా, ”ముగింపు మీరే చెప్పండి” కథలో శ్యామల, ఇందిర లాగా అమ్మాయిలు చైతన్యవంతమయిన స్ఫూర్తితో ఉండాలని పై కథల ద్వారా రచయితలు సందేశాన్నిచ్చారు. వరకట్నం ఇవ్వలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రుల పరిస్థితులను, వరకట్నానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకతను ఆ దిశగా చైతన్యాన్ని పొందాల్సిన తీరును కూడా రచయితలు తెలియచేశారు.
కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమన్న సంగతి వధువు, వరుడి తల్లిదండ్రులకు తెలిసే ఈ దురాచారానికి జీవం పోస్తున్నారు. ఏది ఏమైనా ఈ దురాచారానికి బలయ్యేది యువతులే. కట్నం తీసుకునే పెళ్ళి చేసుకోవాలన్న దురాలోచనను పురుషులు మానుకోవాలి. కొందరు ఆత్మహత్యలు చేసుకుని కట్నం ఇచ్చుకోలేని తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. అమ్మాయిలు చదువుకొని తమ కాళ్ళపై తాము నిలబడి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాలి. అంతేకాకుండా జీవితాంతం తోడుండాల్సిన భర్త కట్నం పేరుతో వేధింపులకు గురి చేయడం అమానుషం. ఆదర్శ భావాలతో జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలన్న భావజాలాన్ని కలిగి ఉండాలి. హైటెక్ యుగంలో కూడా వ ుహమ్మారిలా వ్యాపించి స్త్రీల జీవితాన్ని వరకట్నం పేరుతో కబళిస్తున్న ఈ దుష్ట సంప్రదాయానికి చరమగీతం పాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. ముఖ్యంగా యువతలో ఉంది. వరకట్నానికి సంబంధించిన శిక్షలను కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ దిశగా కృషి జరిగినపుడు వరకట్నం లేని సమాజాన్ని ఊహించగలం. ఈ దిశగా సాహిత్యాన్ని వెలువరిస్తూ సమాజంలో వరకట్నం మహమ్మారిని పారద్రోలాలన్న తెలుగు కథా రచయితల సాహితీ కృషిని కొనియాడక తప్పదు. ఇంకా ఈ దిశగా సాహిత్యం వెలువడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సాహిత్యం ద్వారానే సమాజాభివృద్ధి జరుగుతుంది.