ప్రియాతి ప్రియమైన సావిత్రీ!
మబ్బుల లోకంలోనో, నేల కడుపులోనో, నక్షత్రాల హృదయంలోనో, గాలి ఆవరించిన చైతన్యంలోనో, సూర్యుని కిరణాల్లోనో, చంద్రుని వెన్నెల కాంతిలోనో, పచ్చటి ప్రకృతి ఒడిలోనో, జలపాతపు హోరులోనో, ఘనీభవించిన కొండ చరియల్లోనో, గడ్డకట్టిన మంచు మదిలోనో, ఎక్కడో, ఇంకెక్కడో నీకు అనువైన చోట, నీవు నిర్మించుకున్న అద్భుత లోకంలోనో ఉండే ఉంటావ్ కదూ! నువ్వు ఉన్నావన్న స్పృహే నన్ను సంతోషపరుస్తుంది. నేన్నిన్ను చూడలేకపోయినా, మీ మిత్రుల మాటల్లో, మీ అక్షరాల ఆకృతిలో మనిద్దరం చిరపరిచితులమే స్నేహలాలసలో మునిగిన వాళ్ళకు. ఎందుకో సావిత్రీ తెలీదు, నీతో మాట్లాడాలన్పించింది. కొంత సమయమైనా నీతో గడపాలనిపించింది. ‘రిటర్న్ టికెట్’ ఇంతవరకూ ఎవరూ కొనుక్కుని రాలేదు కదా!
రాజమండ్రికి పది మైళ్ళ దూరంలో ఉన్న ‘ఉండేశ్వరపురం’లో 1941 మే 18న ఈ ప్రపంచాన్ని కళ్ళిప్పి చూశావు. జీవితమంతా పోరాడి, పోరాడి అలసిన శరీరంతో 1991 అక్టోబర్ 4న కొత్త లోకానికి వెళ్ళిపోయావు. భౌతిక రూపం కనబడలేదిక ఎవరికీ, కానీ ‘అరణ్య కృష్ణ’ సంపాదకత్వంలో ‘సావిత్రి’ పేరుతో వచ్చిన పుస్తకంతో నన్ను చేరుకున్నావు. అందులో నీ కవితలు, గల్పికలు, వ్యాసాలు ఉన్నాయి. 1984లో నువ్వు రాసిన ‘బందిపోట్లు’ కవితలో సావిత్రి రాసిన అద్భుతమైన కవితగా సాహితీలోకంలో ముద్రింపబడి పోయింది. ‘చేరా’ సాహిత్య వేదిక ఆంధ్రజ్యోతిలో రాశారిలా – ‘ఈ కవిత బలమైన తొలి స్త్రీ వాద కవితగా గుర్తించొచ్చ’ న్నారు. ఈ కవిత తర్వాతనే ‘స్త్రీ విముక్తి వాద కవిత్వం’ ఉధృతి నందుకొందని అంచనా వేశారు. ఈ కవిత దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల సదస్సుల్లో చర్చనీ యాంశమైంది. ఓపెన్ యూనివర్శిటీలో పాఠాల్లో చోటుచేసుకుంది. చేరా, ూ=కూజుచీజు ్గIణజు సంయుక్తానువాదంలో ‘పెంగ్విన్’ వారి స్త్రీ విముక్తి వాద సంకలనంలో కూడా ఈ కవిత చోటుచేసుకుంది. సావిత్రీ! నువ్వు మార్క్సిజం వల్ల బాగా ప్రభావితమయ్యావు. ఎవరినైనా ప్రేమించడానికైనా, ద్వేషించడా నికైనా ఆచరణ ఒక్కటే గీటురాయిగా తీసుకొనేదానివి. స్త్రీలమీద అమలయ్యే అణచివేత, వివక్ష, అత్యాచారాలు నిన్ను తీవ్రంగా కలచివేశాయి కదూ! అంతేకాదు ముక్కుసూటిగా సాగే నీ వైఖరివల్ల విప్లవ వ్యక్తుల్లో సైతం ఈ సమస్యల పట్ల స్పృహ లేకపోవడం చూసి తీవ్రంగా వ్యతిరేకించే దానివి. అవునూ! రంగనాయకమ్మను, ఆమె సాహిత్యాన్నీ ఎంతో అభిమానించేదానివి కదూ! కృష్ణాబాయిగారి ‘అగ్నిశ్వాస – సావిత్రి’లో అన్నారిలా… నిజానికి ఈ కవిత అందమైన కవిత కాదు. సావిత్రి ముప్పై ఏళ్ళ జీవితం. భారత స్త్రీ ‘పవిత్ర’ వైవాహిక జీవితం, ఆమె బాధామయ జీవితం నుంచి వెలువడిన వేదనా భరిత మహాకావ్యం. సగటు ఆడపిల్లలందరిలాగే ‘లక్షణం’గా కాపురం చేసుకుంటూ సుఖంగా బతికెయ్యొచ్చు. కానీ భూస్వామ్య విలువలతో రాజీ పడటం ఎరగని నువ్వు అడుగడుగునా ఫ్యూడల్ భావజాలాన్ని ఎదిరిస్తూ ఏటికెదురీదావు. అదే నీ జీవిత విధానం. పితృస్వామ్య భావజాలాన్ని ప్రశ్నించగల, ఎదిరించగల ధైర్యాన్ని పిల్లల కిచ్చావ్. అదే నీ విజయం. మానవ సంబంధా ల పట్లా, విలువల పట్లా ఎంతో విశ్వాసం కలదానివి కాబట్టే, జీవితమంతా అవిశ్రాం తంగా పోరాడగలిగావ్. దానికి ఎన్నడూ పశ్చాత్తాపపడలేదు కూడా! నజరాజ్ మాటల్లో (ఆరని జ్యోతి) చెరబండరాజు ఒంట్లో ప్రతి భాగం కృశిస్తుంటే చివరికంటా సాహసిగానే ఊపిరి పీల్చాడు. సావిత్రీ అంతే. అయితే ఇది ధనస్వామ్య వ్యవస్థ, పురుషస్వామ్య వ్యవస్థ కూడా. అందువల్లనే ద్విముఖ పోరాటం సాగించాల్సి వస్తోంది. ఈ పోరాటానికి సావిత్రి ప్రతీకగా నిలిచింది. కళ్ళ ముందర ధగధగా మెరిసే నక్షత్రం ‘ఆమె’ అని నువ్వున్న చోటును కొంతమేరకు చెప్పారు. తమ జీవితాలకు సంబంధించి నంతవరకూ ఫెమినిజాన్ని అనుసరిస్తూ ప్రజలకు, పేద స్త్రీలకు మాత్రం పితృస్వామిక భావజాలానికి కట్టిపడేసే పార్టీ కమ్యూనిజాన్ని బోధించేవారంటే నీకు కోపం, అసహ్యం. రాణీ శివశంకర్ అక్షరాల్లో నువ్వు, నీ ఆవేశ స్వభావం, నిజాయితీ, ధైర్యం, నిస్సంకోచం, దృఢవిశ్వాసం, విజ్ఞాన తృష్ణ ఇలాంటి వెయ్యి గుణాల కలబోతవి. సతీష్ చందర్‌కి కూడా నువ్వంటే చాలా అభిమానం. తెలుగు సాహిత్య లోకం పోగొట్టుకున్న వారిలో ఒకరు ఈశ్వరి, ఇంకొకరు సావిత్రి, మరొకరు రేవతీదేవి. వీళ్ళకి యింటిపేర్లుండవు. కుమారి, శ్రీమతుల్లాంటి బేడీలుండవు.
వీళ్ళు రాసింది తక్కువ, అభివ్యక్తి చేసింది ఎక్కువ. సావిత్రి పురుషాధిక్యత శత్రువు. అది కట్టుకున్న భర్తలోనే కాదు, కన్నతండ్రిలో వున్నా పసిగడుతుంది. అలాగని ఆమె పురుష ద్వేషి కాదు. మంచితనం పురుషుడిలో ఉన్నా, స్త్రీలో ఉన్నా గౌరవిస్తుంది. బందిపోట్లు కవితలో తాత్విక నేపథ్యం వుంది. ”మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది” అని ఆగ్రహించిన నీ ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి. కవయిత్రులలో చాలా స్పష్టమైన బలమైన గొంతు అని శిఖామణి భావించారు. నేను నీపై రాసిన కవితలో కొన్ని ముక్కలు సావిత్రీ!
యముడితో పోరాడి భర్త ప్రాణాలు సాధించిన పురాణ ప్రతీక కాదామె / తన కోసం ప్రపంచమంతా శోధించిన బాటసారి / ఒంటరితనాల గుహలోకి స్వేచ్ఛగా కాలుమోపి / అంతటా తన అడుగుల గుర్తులు వేసి వెళ్ళిపోయింది / అక్షరాలుగా అనుభవాలను మలిచి / కవిత్వాన్ని కవిత్వంగా ప్రేమించి / నిసర్గంగా తను మాత్రం అక్షరాల్లోకి ఒదిగిపోయింది. సావిత్రీ ఈ లేఖను నువ్వు చదువుతావో లేదో కచ్చితంగా తెలీకపోయినా, నీతో నాలుగు క్షణాలు పంచుకున్న తృప్తితో..
నీ – నెచ్చెలి – శిలాలోలిత