మగ యిగోల మతాలు – జూపాక సుభద్ర

యీ మద్దెన ఒక టీవీ ఛానల్‌ వాల్లు లౌకిక ప్రజాస్వామ్యాల మీద డిస్కషన్‌ వుంది రమ్మంటే పోయిన. నిజానికి టీవీవాల్లు ఆపద్ధర్మంగా పిలుస్తుంటరు. పిలిచిన వాల్లు రాకుంటే.. ఆడవాల్లను బిలుస్తరు. వాల్ల ప్రాధాన్యంలో మగవాల్లే. వాల్లందుబాటులోకి రాకుంటే సవర్ణ ఆడవాల్లని; వాల్లు కూడా లేకుంటే మాలాంటి దళిత మహిళల్ని పిలుస్తుంటరు….. ఆ సందర్భంలో ఒక ముస్లిమ్‌ సంస్కరణ వాది, ప్రగతిశీలుడు, మతాలమీద బాగా మాట్లాడే, చెండాడే అవగాహనున్నతను కలిసిండు. భారత భాగవత కతల్ని, శ్లోకాల్ని బాగా విడమరిచి చెప్తుంటడు. హిందూ మతంలో వున్న అంటరానితనాలు, అమానవీ యాలు, అసమానత్వాలు, దేవదాసీతనాల మీద బాగా మాట్లాడిండు. లౌకిక ప్రజాస్వామ్యాలు సమాజాలకు ఎట్లా అవసరం అనేవి చాలా మంచిగ మాట్లాడిండు. టీవీ చర్చ తర్వాత యింటికి ఒకే కార్లో బైల్దేరినం.

యిప్పుడు ‘ట్రిపుల్‌ తలాక్‌’ అంశమ్మీద దేశమంతా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జెండర్‌ ప్రజాస్వామ్యాల మీద

ఏమి మాట్లాడ్తడో విందామని నాకున్న అభిప్రాయాలు పంచుకున్న. మీరు ‘ట్రిపుల్‌ తలాక్‌’ని ఎట్లా చూస్తున్నారు?  ముస్లిమ్‌ మహిళలకు కామన్‌ సివిల్‌ కోడ్‌ కావాలనీ, ‘ట్రిపుల్‌ తలాక్‌’ని రద్దు చేయాలనీ, రాజ్యాంగం యిచ్చిన ‘సమానత్వ హక్కు’ ముస్లిం మహిళలకు కల్పించడం న్యాయమైందనీ, యిది హిందూ ముస్లిం సమస్య కాదంటుంది బీజేపీ గవర్నమెంట్‌. ముస్లిమ్‌ మహిళా ప్రజాస్వామ్యాల మీద ఇండియన్‌ ముస్లిం మహిళా ఆందోళన మీద మీరేమంటారు, మీ సపోర్టు ఏంది? అని అడిగిన ఉత్సాహంగా… ”మేడమ్‌ యిది ఖచ్చితంగా హిందూ ముస్లిమ్‌ సమస్యగానే చూస్తున్న. ఎందుకంటే ఎక్కడున్నయి ప్రజాస్వామ్యాలు? ఏ మతంలో వున్నయి, ఏ మత జెండర్‌లో వున్నయి ప్రజాస్వామ్యాలు? హిందూ మతంలో, క్రిస్టియన్‌, యితర మతాల్లో మహిళలకు సమాన హక్కులు న్నాయా! ఒక్క ముస్లిమ్‌ మతాన్నే ఎందుకు టార్గెట్‌ చేస్తోంది. ముస్లిమ్‌ మతమ్మీదనే ఎందుకు పడ్తోంది హిందుత్వ ప్రభుత్వం. భర్తతో పాటు చావమంటుంది హిందూ మతం. భర్త పోతే మల్లా పెండ్లి చేసుకోవద్దు. కనీసం పెండ్లి విషయాల్లో మహిళల యిష్టాయిష్టాల్ని అడిగే పద్ధతుందా! కానీ ముస్లిమ్‌ మహిళలకు ‘ఖుబూల్‌’ అనే అవకాశం కల్పించే ఆచారముంది’.

‘నా ముస్లిమ్‌ అక్కచెల్లెండ్లకు ‘ట్రిపుల్‌ తలాక్‌’ బాధలొద్దు, వారికి సమానత్వ హక్కు  కావాలి. దానికోసం కామన్‌ సివిల్‌ కోడ్‌ పెట్టాలని గగ్గోలు పెడ్తున్న వాల్లు ముస్లిమ్‌ మహిళలకు చదువు, ఉద్యోగం, ఆరోగ్యం, మెరుగైన జీవితం, అవకాశాల కామన్‌ సివిల్‌ కోడ్‌ గురించి ఎందుకు మాట్లాడ్తలేరు చెప్పండి! ఏ మతాలూ యివ్వని గౌరవాలు ఖురాన్‌ ముస్లిమ్‌ మహిళలకిచ్చింది. ‘ట్రిపుల్‌ తలాక్‌’ షరియత్‌ లా లో పేరుకే వుంది. కానీ అది ఎవరు అమలు చేస్తున్నరు? మీరు ముస్లిమ్‌ బస్తీలకు బోండ్రి వాల్లు చెప్తరు ‘ట్రిపుల్‌ తలాక్‌’ వల్ల ఎంతమంది ముస్లిమ్‌ మహిళల బత్కులు ధ్వంసమైనయో లెక్కలు తీయమనండి…… లిక్కర్‌తో వేల, లక్షల మంది జీవితాలు, కుటుంబాలు నాశనమైతున్నయి. లిక్కర్‌ మీద నిషేధాలెందుకు పెట్టడం లేదు! ముస్లిమ్‌ ‘ట్రిపుల్‌ తలాక్‌’నే  భారతదేశ తక్షణం నిషేధించాల్సిన భూతంలా ఎందుకు చూపిస్తున్నరు హిందుత్వాలు, వాటి ప్రభుత్వాలు? భారతదేశమంటేనే భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలున్న దేశము. అట్లాంటి దేశంలో ఒకటే సంస్కృతి (అదీ హిందూ సంస్కృతి), ఒకటే మతం (హిందూ మతం), ఒకటే భాష (హిందీ భాష) వుండాలని నిర్దేశించడం, బలవంతంగా రుద్దడం వంటి ప్రయత్నాల్ని హిందుత్వ కుట్రగానే చూడాలి’.

నాగా, మిజోరం వంటి రాష్ట్రాలకు ప్రత్యేక చట్టాలున్నయి. వాటిని కామన్‌ సివిల్‌ కోడ్‌ కిందకి తేగలమా! ఏ మతంలో జెండర్‌ సమానత్వాలున్నాయి! దేశంలో సంస్కరించా ల్సిన అంశాలు కోటి వున్నయి. అవన్నీ పక్కన బెట్టి ముస్లిమ్‌ పర్సనల్‌ లా మీదనే, మా ‘ట్రిపుల్‌ తలాక్‌’ మీదనే ఎందుకు దాడి?

ఏ మతానికా మతం యొక్క పర్సనల్‌ లా లున్నయి. అట్లాంటప్పుడు కామన్‌ సివిల్‌ కోడ్‌ ఎట్లా సాధ్యం? మా పర్సనల్‌ లా, మా షరియత్‌ లా మీదనే జరిగే యీ చర్చ హిందూ కుట్ర కాక ఏమనాలి? బహు భార్యత్వం మాకు లీగల్‌గా వుంది. కానీ హిందువుల్లో ఒక భార్యనే వున్న వాల్లెక్కడున్నరో చెప్పండి. చాటుగా, అక్రమంగా మెయింటెన్‌ చేస్తరు. కాని ముస్లిమ్‌ మగవాల్లు లీగల్‌గా చేసుకొని భార్యగా గౌరవిస్తారు. మా మహిళలు బుర్కా రక్షణ కోసం, అస్తిత్వం కోసం వేస్కుంటరు.

హిందూ మత సంస్థలు, ప్రభుత్వా లు చేస్తున్న కుట్రకు వత్తాసు పలికేది ప్రధానంగా హిందూ సవర్ణ మహిళా ఎన్జీవోలు, ఇండియన్‌ ముస్లిమ్‌ మహిళా ఆందోళన్‌, ముస్లిమ్‌ ధనిక మహిళలు, ముస్లిమ్స్‌ని చేస్కున్న సవర్ణ హిందూ మహిళలు. యీ దేశంలో ముస్లిమ్‌లంటే ఎస్సీ, బీసీలే. ముఖ్యంగా ఎస్సీలే అంటరాని తనాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ముస్లిమ్‌ మతంలో జేరిండ్రు. యీ సమూహాలకు ‘ట్రిపుల్‌ తలాక్‌’ ఒక సమస్యే కాదు” అని తీర్పిచ్చినట్లు తన ముస్లిమ్‌, మగ ప్రత్యేకతల రాజకీయాల్ని చెప్పుకొచ్చిండు. యింకా ‘యీ ‘ట్రిపుల్‌ తలాక్‌’ పై మా ముస్లిమ్‌ కమ్యూనిటీల్లో సీరియస్‌గా చర్చ నడుస్తోంది. ఆలిండియా ముస్లిమ్‌ పర్సనల్‌ లా బోర్డులో కూడా చర్చ తీవ్రంగానే వుంది. మా సంస్కరణలు మాకే వదిలేయాలి. మా షరియత్‌ లా మీద హిందుత్వము కామన్‌ సివిల్‌ కోడ్‌ పేరుతో జరిగే యీ దౌర్జన్యాల్ని ఆలిండియా ముస్లిమ్‌ పర్సనల్‌ లా బోర్డు (ూకూవీూకూదీ) తీవ్రంగా ఖండిస్తోంది. లా కమిషన్‌ ప్రశ్నావళిని బహిష్కరిస్తోంది’.

అతను చెప్పిందాంట్ల కొన్ని నిజాలు, కొన్ని మగ యిగోలున్నయి. నిజానికి యీ మతాలు, సంస్థలు, బోర్డులు, రాజకీయ పార్టీలు, విప్లవ, కమ్యూనిస్టు పార్టీలు, కుల సంగాలు… యిట్లా సమస్తం మగత్వాల నుంచే వచ్చినయి. వాటిలో సవర్ణ మహిళలకు, బహుజన మహిళలకు సూది మొనంత జాగా కూడా లేదు. యివన్నీ పితృస్వామ్య ఆధిపత్య అజమాయిషీలో నడుస్తున్నయి.

అంబేద్కర్‌ అధ్యక్షతన రాజ్యాంగ అసెంబ్లీలో మొదటిసారి కామన్‌ సివిల్‌ కోడ్‌ చర్చ జరిగినపుడు, పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అపుడు కామన్‌ సివిల్‌ కోడ్‌లో అమలుకు భిన్నత్వాల అంగీకారం వున్నపుడే దాన్ని అమలు చేయాలని తీర్మానించారు.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.