వాడిపోయిన ముఖాలలో ఆనంద లహరి స్క్రీనింగ్‌ పిడుగు – రమణిక గుప్తా; అనువాదం: సి. వసంత

కోల్‌ ఫీల్డ్స్‌ నేషనలైజ్డ్‌ అయ్యాక మేము సమ్మె విరమించాము. ‘నేషనలైజ్డ్‌ అయ్యాకే నేను కేదలాలో కాలు పెడతాను’ అని ఒట్టు పెట్టుకున్నాను.

నేషనలైజ్డ్‌ అయ్యాక మేము మొదటిసారి ప్రభుత్వ అధికారులతో మైన్స్‌కి వెళ్ళాము. ఎండిపోయిన ఎముకలతో, ముడతలు పడ్డ ముఖాలతో నిరాశ నిస్పృహలతో ఉన్న కార్మికులలో మళ్ళీ జీవం వచ్చింది. ఆనందపు అలలు ఎగసిపడ్డాయి. కానీ మళ్ళీ ఆ నవ్వు నిశ్శబ్దంలో మాయమైపోయింది. ప్రశ్నలు కోకొల్లలు. మేం గెలిచాం కానీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించడం కష్టమైపోయింది. నేషనలైజ్డ్‌ అయ్యాక ఎంతోమంది ఠేకేదార్లు నేతలయ్యారు. మేము వాళ్ళని కూడా ఎదిరించాల్సి వచ్చింది. ఠేకేదార్లు ఒక యూనియన్‌ ఏర్పాటు చేశారు. జాలీ రికార్డులు కూడా తయారయ్యాయి. శర్మగారు, ఉమావచన్‌ తివారితో ఇంటక్‌లోకి రావాలనుకున్నారు. నేను ఆయనను ఎదిరించాను. రాకుండా చూశాను.

స్క్రీనింగ్‌:

మేం దుబేగారి ద్వారా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి బహాలీ కోసం నాలుగు స్క్రీనింగ్‌ సెంటర్లు తెరిపించాం. కానీ ఒకరోజు తెరిచారు. తరువాత మూసేశారు. బహాలీ కోసం ఎంతో పోరాటం జరిపాం. కొంత ఇన్‌స్టాల్‌మెంట్స్‌ మీద బహాలీ అయింది. ఈ విషయంలో దాదాపు ఒక సంవత్సరం పోరాడాం. నేషనలైజ్డ్‌ సమయంలో నేను ఎమ్మెల్సీగా ఉండేదాన్ని కానీ స్క్రీనింగ్‌ మొదలయ్యాక నా టర్మ్‌ అయిపోయింది.

ఒకరోజు కోసం స్క్రీనింగ్‌ అయ్యేది. అపాయింట్‌మెంట్‌ ఫారాల కోసం పోట్లాడుకునేవాళ్ళు. ఒకరి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ మరొకరికి లభించేది. ఇక క్లర్కుల వైభవం చెప్పనక్కర్లేదు. వాళ్ళు డబ్బులు తీసుకుని ఆర్డర్లు అమ్మేసుకునేవాళ్ళు. ఎంతో శ్రమపడి మేం జాబితాలను తయారుచేశాం. మేము గొడవచేస్తే స్క్రీనింగ్‌ ఓపెనయ్యేది. కానీ సాయంత్రం మూసివేసేవారు. దుబే గారికి చెప్పి యాజమాన్యం వారిపై ఒత్తిడి తెచ్చి బహాలీని ప్రారంభం చేయించాము. మరోవైపు సి.పి.ఐ వాళ్ళు బీహారులోని మిగిలిన ప్రాంతాల నుండి వర్కర్లను తీసుకు వచ్చి ఒరిస్సా, బిలాస్‌ పూర్‌ల శ్రామికుల స్థానాలలో వీళ్ళను పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు ఆర్డర్లను మాయం చేసేవారు. క్లర్కులతో, అధికారులతో చేతులు కలిపి ఆర్డర్లను కొట్టేసే వాళ్ళు. ఎంతోమంది మహిళల పేర్లను కొట్టిపడేశారు. కొంతమంది పురుషులు భర్త పేరు బదులు తండ్రి పేరు రాసి ఉన్న ఆర్డర్లను తీసేసుకునేవాళ్ళు. ఈ విధంగా ఎంతోమంది పురుషులు తమ భార్యలు లేకపోతే పరాయి స్త్రీల చోట్లలో పనిచేయడం మొదలుపెట్టారు.

పరిస్థితి రానురాను ఘోరంగా  మారడం మొదలుపెట్టింది. ఇంటక్‌లో  రెండు గ్రూపులు అయ్యాయి. అందులో మా గ్రూపు ఒకటి. ఇందులో ఎక్కువగా పి.ఆర్‌. అంటే పీస్‌ రేటెడ్‌ కాంట్రాక్ట్‌ వర్కర్లు ఉన్నారు. రెండో దాంట్లో మున్షీలు, మైనింగ్‌ స్టాఫ్‌, ఠేకేదార్లు ఉన్నారు. వీళ్ళు పాత వర్కర్ల పేర్లను కొట్టేసి బయటనుండి వచ్చిన వాళ్ళకి బహాలీ ఇవ్వాలని అంటారు. నేను అపీల్‌ కమిటీలో వాదించి ఎస్‌.డి.శర్మ పేరును తీసివేయించాను. ఆయన ఉద్యోగం రద్దయింది. ఇంటక్‌లో ఉన్నపుడు ఆయనకు దామోదర్‌ పాండే (పార్లమెంటు సభ్యుడు), ఉమావచన్‌ తివారీల మద్దతు ఉండేది. నాకు బిందేశ్వరి దుబేగారి మద్దతు ఉండేది. దుబే గారు బీహారు ముఖ్యమంత్రి అయ్యారు. తరువాత బీహారు ఇంటక్‌లో సెక్రటరీ అయ్యారు.

………..

ఆర్బిట్రేషన్‌

బహాలీ పూర్తయింది. ఏ కార్మికులైతే నేషనలైజ్డ్‌ కోసం ప్రాణాలకు సైతం తెగించి పోరాడారో, వాళ్ళకు ఉద్యోగాలు దొరకలేదు. చాలామంది గ్రామస్థులకు కూడా బహాలీ దొరకలేదు. వాళ్ళు వర్షాకాలంలో తమ తమ పొలాలలో పని చేసే వాళ్ళు. తరువాత గనులలో చేసేవాళ్ళు. మేం పనిదొరకని మాజీ కూలీల జాబితా తయారు చేశాం. బిందేశ్వరీ దుబే గారు ఇంట్రెస్ట్‌ తీసుకోవడంతో యాజమాన్యం వారిని ఆర్బిట్రేషన్‌ కింద తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఆర్బిట్రేషన్‌ ప్రకారం పంచ్‌లను (పెద్ద మనుషులు, పంచాయతీ.. దీన్ని పంచట్‌ అంటారు) నియుక్తి చేస్తారు. ఇరుపక్షాల వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళ నిర్ణయాన్ని కోర్టులో కూడా ఎవరూ ఛాలెంజ్‌ చేయలేరు. అందువల్ల నిష్పక్షపాతంగా వ్యవహరించే వారినే తీసుకుంటారు. శ్రీ బిందేశ్వరీ దుబే, బి.ఎల్‌.వడేరాలు పంచ్‌లు (పెద్దమనుషులు)గా వ్యవహరించారు. యూనియన్‌ వైపునుండి నేను, యాజమాన్యం తరపున సీ.సీ.యం. డైరెక్టర్‌ పర్సనల్‌ శ్రీ మహేంద్ర కేసులు వేశాం. దీర్ఘ చర్చలు, వాదోపవాదాలు జరిగాయి. దీనికోసం నేను పలుసార్లు పాట్నా వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు బిందేశ్వరీ దుబే బీహారు ఆరోగ్య శాఖా మంత్రి. ఆయన ఇంట్లోనే చర్చలు జరిగేవి. ఆర్బిట్రేషన్‌లో 250 మంది వర్కర్లు, స్టాఫ్‌లో 14 మందికి బహాలీ దొరికింది. వీళ్ళతోపాటు డిస్‌ప్లేస్‌మెంట్‌ అయిన వారికి భూమి బదులు ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.

ఆర్బిట్రేషన్‌ అమలులో కూడా అవకతవకలు జరిగాయి. ఎంతోమంది కూలీల పేర్లు ఒకేలాగా ఉన్నాయి. వాళ్ళ తండ్రుల పేర్లు కూడా అవే. స్థానిక అధికారి ఆ రెండు పేర్లలో ఒకదాన్ని తీసేశారు. అసలు వాళ్ళకి పని ఇవ్వకుండా వేరేవాళ్ళకి ఇచ్చేశాడు. అక్షయరాయ్‌ బాధపడుతూ కేదలా వెళ్ళిపోయాడు. ఆ దృశ్యాన్ని నేనిప్పటివరకు మరచిపోలేదు. ఏ రోజైతే ఈ గనులు తెరవబడ్డాయో ఆ నాటి నుండి అక్షయ్‌ రాయ్‌ ఉన్నాడు. కేదలా విముక్తి, నేషనలైజ్డ్‌ కోసం అతను ఎప్పుడూ ముందంజ వేసేవాడు. కానీ ఉద్యోగంల వెనుకబడ్డాడు. మేము ఎంత పోరాటం చేసినా అతడికి ఉద్యోగం ఇప్పించలేకపోయాము. తాత్కాలికంగా  వచ్చిన మేనేజర్‌ (అతను పంజాబీ) తన పట్టుదల వదలలేదు. అక్షయరాయ్‌ దు:ఖంతో తన ఊరికి వెళ్ళిపోయాడు.

ఈ సమయంలో నాకు కొన్ని వివరాలు లభించాయి. కంపెనీ గ్రామస్థులను బుట్టలో వేసుకుని, ఆశలు చూపించి భూములను తీసుకుని నష్టపరిహారం ఇవ్వకుండా గనులను విస్తరింపచేసింది.

ఆర్బిట్రేషన్‌ తీర్పు 1976లో వచ్చింది. నేను ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ నుండి విధాన సభకు సభ్యురాలిగా

ఉండేదాన్ని. ఈ భూముల విషయాలు ఎక్కువగా తోపా కొలియారీ సెక్రటరీ రాజేంద్రలాల్‌ చూసేవారు. ఆయన స్థానికుడు. ఆరా, సారూ, బేడా, కొలియారులలో కార్తిక మహతో, కాశీ ఠేకేదార్‌ అయిన రషీద్‌ సాహెబ్‌కి ఆరాలో ఉద్యోగం దొరికింది. నేషనలైజ్డ్‌ అయ్యాక కొలియారీ సంబంధించిన రహస్యమైన విషయాలు మాకు చెప్పేవారు. బైజూ బాబు ఆ ఏరియా యూనియన్‌కి స్థానిక నేత. గ్రామస్థులకు సంబంధించిన సమస్యల విషయంలో  నా వైపు ఉండేవారు. ఈ విధంగా ఎన్నో గ్రామాలలో నా పేరు పాకిపోయింది. భూమికి బదులుగా ఉద్యోగం ఇవ్వాలని ఉద్యమం చేశాం. ఉద్యోగాలు ఇవ్వాలని కంపెనీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి చాలామందికి ఉద్యోగాలు ఇప్పించాం.

……………..

విస్థాపితుల పోరాటం కోసం పునాది…

స్థానీయత – పరిభాష

ఆర్బిట్రేషన్‌ చేసే నిర్ణయం తీసుకున్నాం. దీని ఆధారంగా యూనియన్‌ ప్లాట్‌ఫారం నుండి అన్ని గనులలో విస్థాపితులైన వారి సమస్యలను మేము యాజమాన్యం ఎదురుగా ఉంచడం మొదలుపెట్టాం. అందువలన ఆ నిర్ణయం ఎంతో విలువైనది. చాలావరకు తీర్పు మా వైపు ఉండేలా చూసుకున్నాం. ఈ సమయంలోనే గ్రామస్థులలో ఎవరికైతే గనుల కోసం తమ భూములను ఇచ్చినా ఉద్యోగం దొరకలేదో వాళ్ళ వివరాలన్నింటినీ సేకరించాం. బీహారుకు చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులు తాము పదవిలో ఉన్నప్పుడు భారత ప్రభుత్వంలో తాత్కాలికంగా  ఉన్న ఊర్జా మంత్రులకు లేఖలు (లెటర్‌  నంబర్‌ 233/సి.ఎస్‌.ఎస్‌., తేదీ 2 ఆగస్టు 1976, లెటర్‌ నంబర్‌ 400/సి.ఎస్‌.ఎస్‌., 26 జులై 1976, లెటర్‌ నంబర్‌ 793, 29 జులై 1977) రాసి కేంద్ర ప్రభుత్వాన్ని స్థానిక (లోకల్‌) పరిభాష, పాలసీ గురించి అడిగారు. ఊర్జా మంత్రులు లెటర్‌  నంబర్‌ డి.వో., 233/ఎస్‌.ఎమ్‌.ఎమ్‌/723511, 13 సెప్టెంబరు 1972, లెటర్‌  నంబర్‌ 6(47), 76 కంపెనీ, 17 నవంబరు 1976, లెటర్‌ నంబర్‌ -11-1357, 17 ఆగస్టు 1977లో స్పష్టంగా  లోకల్‌ అంటే పరిభాషలో ఇచ్చారు. ఎక్కడైతే ప్రాజెక్టులు మొదలయ్యాయో, దీనివలన ఎవరైతే విస్థాపితులు (తొలగింపబడ్డవారు) అయ్యారో వాళ్ళని ఈ స్థానం నుండి ఐదు కిలోమీటర్ల పరిధి లోపలి గ్రామస్థులను ఉద్యోగాలలో తీసుకోవాలి. అంటే ఈ ప్రాజెక్టులోనే ఉద్యోగాలు పొందవచ్చు. వీళ్ళే స్థానికులు.

నేను కొలియారీ మజ్దూర్‌ సంఘ్‌కి ఉపాధ్యక్షురాలిని. నేను, కోల్‌ ఇండియా ఛైర్మన్‌ శ్రీ జె.జె.కుమార మంగళంతో  కలిసి మీటింగులో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి – ‘కొత్తగా బహాలీ (అపాయింట్‌మెంట్‌) సమయంలో యాజమాన్యం ద్వారా స్థానిక అపాయింట్‌మెంట్‌, సంబంధిత ప్రాజెక్టులలో ఉద్యోగాల కోసం పంపబడే అభ్యర్థులు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండాలి’. ఈ తీర్పు నైపుణ్యం కలవారికి, లేనివారికి అందరికీ వర్తిస్తుంది. మోహన్‌ కుమార్‌ మంగళం ఇచ్చిన ఆర్డర్‌తో పాటు మాజీ గనుల శాఖా మంత్రుల ఆర్డర్లను కూడా సేకరించాం. ఏ ప్రాజెక్ట్‌ అధికారీ వీటిని అమలులో పెట్టలేదు. దీనికి రెండు కారణాలు… గ్రామీణ భాగంలో ఉన్న గనుల వైపు వెళ్ళడానికి భయపడేవాళ్ళు. అందువలన గనుల యాజమాన్యం వారు గోరఖ్‌పూర్‌, బిలాస్‌ పూర్‌.. ఇంకా కొన్ని ఇరత ప్రదేశాల నుంచి కూలీలను ముఖ్యంగా దళిత కూలీలను తీసుకువచ్చే వాళ్ళు. వీళ్ళను క్యాంప్‌లలో ఉంచేవాళ్ళు. ఎన్‌.సి.డి.సి. ప్రభుత్వానికి చెందిన కంపెనీ. ఈ కంపెనీ కార్మికులను క్యాంప్‌లలో ఉంచేదికాదు. రెండో కారణం గ్రామాలలోని శ్రామికులు వర్షాకాలంలో తమ తమ పొలాల్లో పని చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు. గనులలో కూలీ తక్కువ ఇచ్చేవాళ్ళు. అపాయం కూడా ఎక్కువ. అందువల్ల గనులలో ఉద్యోగం చేయడం కన్నా పొలాల్లో పనిచేయడానికి ఇష్టపడేవాళ్ళు.

మేనేజ్‌మెంట్‌ చెప్పేదానిలో కొంత సత్యం, కొంత అసత్యం ఉన్నాయి. అధికారులు తమ తమ బంధువులకు మంచి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. కేవలం పీస్‌-రేట్‌ కట్టర్ల లోడింగ్‌ పనులను మగవాళ్ళకు, ఆడవాళ్ళకు కూడా ఇచ్చేవాళ్ళు. లోడింగ్‌ పని అన్ని రోజులూ దొరకదు. ఎందుకంటే ఆ రోజుల్లో రైలు వ్యాగన్లు రోజూ దొరికేవి కాదు. ఎన్‌.సి.డి.సి.లో  ట్రక్కులలో బొగ్గు లోడింగ్‌ అయ్యేది కాదు. ప్రైవేటు గనులలో ట్రక్‌లలో లోడింగ్‌ అయ్యేది.

కుజు, అర్‌గడా క్షేత్రాలలోని బొగ్గు గనులను 1973లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కానీ 1975 వరకు ఓ.బి.ఆర్‌లో ఠేకేదారీ ఆచారం కొనసాగుతూనే ఉంది. నేను వ్యతిరేకించాను. దీన్ని పూర్తిగా  విరమించేలా చేశాను. వర్కర్లను పర్మనెంట్‌ చేయించాను.  జె.జె.కుమార మంగళం ఆ రోజుల్లో  కంపెనీకి ఛైర్మన్‌గా ఉండేవారు. బి.ఎల్‌.వడేరా డైరెక్టర్‌గా ఉండేవారు. ఈ విషయాలు వాళ్ళదాకా వెళ్ళాయి. నేను కార్మికుల తరపున వాళ్ళకి భూమి బదులు ఉద్యోగాలు ఇవ్వాలని, వాళ్ళని రెగ్యులరైజ్‌ చేయాలని పోరాడాను. పార్లమెంట్‌ సభ్యుడైన దామోదర్‌ పాండే ఈ విషయంలో మాకు విరోధి. అయినా మేము శాయశక్తులా పోరాడి విజేతలయ్యాం.

…………

నేను కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలినయ్యాను

నేను కేదార్‌ పాండే గ్రూప్‌లో మొదటినుండి ఉండేదాన్ని. ఆయన ముఖ్యమంత్రి పదవిని విరమించుకున్నప్పుడు కూడా ఆయన గ్రూపులోనే ఉన్నాను. నా వల్లే కేదార్‌ పాండే, దుబె గార్లు మిత్రులయ్యారు. నేను సెటిల్‌ అవ్వాలని పాండేగారి కోరిక. ఆయన కోరిక ప్రకారం మా యూనియన్‌ ఇంటక్‌లో విలీనమయింది. కొలియారీ మజ్దూర్‌ సంఘ్‌కి నేను సెక్రటరీ అయ్యాను. తర్వాత

ఉపాధ్యక్షురాలినయ్యాను. ఈ యూనియన్‌ పేరు తర్వాత రాష్ట్రీయ కొలియారీ మజ్దూర్‌ సంఘ్‌గా మారింది. ఈ యూనియన్‌ కేవలం బీహారుకు సంబంధించినదిగా కాకుండా మొత్తం భారతదేశం స్థాయిలో రిజిస్టరయింది. కేదార్‌పాండే, దుబె గార్లు ఎన్నో సంవత్సరాలు మిత్రులుగా ఉన్నారు. బిందేశ్వరి దుబె మొదట ముఖ్యమంత్రి పదవి కేదార్‌ పాండేకి దక్కాలని అన్నారు. కానీ ఆ తర్వాత స్వయంగా తానే ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. పాండేగారికి దూరమయ్యారు. చివరికి ఆయన జగన్నాధ మిశ్రా గారి క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. కేదార్‌ పాండే గారి సిఫారసు వలన ఇందిరా గాంధీకి ఉమా శంకర్‌ దీక్షిత్‌ చెప్పినందువల్ల నాకు రామ్‌గఢ్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించారు. షీలాదీక్షిత్‌ ఆయనకు సెక్రటరీగా ఉండేది. లలిత్‌ నారాయణ్‌ మిశ్రా ఆ రోజుల్లో విదేశాలకు వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చాక ఇందిరాగాంధీతో మాట్లాడి నన్ను ఎన్నికలలో నిలబడకుండా తొలగించాలన్నారు. బీహార్‌ మంత్రి చంద్రశేఖర్‌ సింహ్‌ రామ్‌గఢ్‌కి వచ్చి నాకు ఈ సందేశాన్నిచ్చారు. కార్యకర్తలు కోపగించుకున్నారు. నేను తొలగిపోయాను. అప్పుడు కేదార్‌ పాండే గారు ఎమ్మెల్సీ కోసం నా పేరు ఇచ్చారు. ఒకటిన్నర సంవత్సరం ఎమ్మెల్సీగా ఉన్నాను. రెండవసారి 73, 74 సంవత్సరాలలో ఎమ్మెల్సీగా  నా టర్న్‌ వచ్చింది. కానీ నేను ఢిల్లీ వెళ్ళలేకపోయాను. గనులు నేషనలైజ్డ్‌ అయ్యాక బహాలీ కోసం అపీల్‌ కమిటీలో కార్మికుల లిస్టులను జమ చేయడంలో నేను బిజీగా ఉన్నాను. నేను ఢిల్లీ వెళ్ళాక లలిత్‌ బాబు నా పేరు కొట్టేయించాడని తెలిసింది. అప్పుడు ఆయన రైల్వే మంత్రిగా

ఉండేవారు. వారిని కలవడానికి నేను రైల్వే భవన్‌కి వెళ్ళాను.

నేను వెళ్ళగానే ఆయన అన్నారు – ”నేను నీ పేరు ఎమ్మెల్సీ జాబితా నుండి తీసివేయించాను. నీకు తెలుసుగా?”

”తెలుసు. నిజంగా నాకెంతో ఆనందంగా ఉంది. నాకు మీరు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే పేరు తీసివేయాల్సిన అవసరం పడింది” అని నేను వెనక్కి వెళ్ళిపోయాను.

లలిత్‌బాబు హత్య జరిగిన రోజు యశ్‌పాల్‌ కపూర్‌ పాట్నాలో ఉన్నారు. మేమందరం అక్కడే ఉన్నాం. విధానసభలో ఈ వార్త వినగానే అందరూ నిశ్చేష్టులయ్యారు. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. అందరూ బైటికి వచ్చారు. ఆశ్రమం వైపు పరిగెత్తాం. అక్కడ శవాన్ని పెట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. లలిత్‌ బాబుని చంపించడంలో జగన్నాధ్‌ మిశ్రా, యశ్‌పాల్‌ కపూర్‌, ఇందిరాగాంధీల హస్తం

ఉందని జనం చెవులు కొరుక్కోసాగారు. దీనివెనుక వీళ్ళ కుట్ర

ఉందని అనుకోసాగారు. జగన్నాధ్‌ మిశ్రా నోరు మూయించడం కోసం ఆయనకు కానుకగా ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని అనుకోవడం మొదలుపెట్టారు. ఇందులో ఎంత సత్యం ఉందో ఎవరికీ తెలియదు. రాజకీయాలలో వచ్చిన మార్పులు ఇది సత్యమా, అసత్యమా అన్న సంగతిని కూడా తేల్చలేకపోయాయి. ఎవరి దోవన వాళ్ళు ఏవేవో అనుకోవడం మొదలుపెట్టారు. లలిత్‌బాబు స్వయంగా కుట్రలు పన్నుతూ ఉంటారని కొందరు అనుకునేవారు. సంజయ్‌ను ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తయారు చేయాలని తంటాలు పడేవారు. ఉసికొల్పేవారు. ఆయన సంజయ్‌కి కావల్సినంత ధనం ఇచ్చేవారు. ఇందిరాగాంధీ గారు సంజయ్‌ను దురలవాట్లకు బానిస చేస్తున్నారని అనేవారు.

బీహార్‌లో పెద్ద పెద్ద ఠేకేదార్లను, మాఫియాలను లలిత్‌ పోషించేవారు. కాంట్రాక్ట్‌లు ఆయన సిఫారసు మీదే వచ్చేవి. మిథిలలో కోసీనది ప్రాజెక్టు పూర్తి కాలేదు. మట్టి బదులు ఇసుక నింపేవారు. మిథిలాంచల్‌లో ఎప్పుడూ వరదలు వచ్చేవి. ప్రతి సంవత్సరం ఈ వరదల వల్ల అంతా నాశనమయ్యేది. ఇప్పటికీ ఇదే పరిస్థితి. ప్రతి సంవత్సరం ప్రభుత్వం కరవు కాటకాల నష్టపరిహారం ఇచ్చేది. కానీ మధ్యస్థులు ఈ డబ్బునంతా స్వాహా చేసేవారు. ఈనాటికీ ఇదే పరిస్థితి. నేపాల్‌ ప్రభుత్వాన్ని సంప్రదించి కోసీ నదీ ప్రవాహాన్ని ఆపడానికి ఏ నేతా ఎటువంటి ప్రణాళిక వేయడానికీ సిద్ధంగా లేడు.

1974లో యశ్‌పాల్‌ క్లస్టర్‌ హజారీబాగ్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షురాలిగా నన్ను ఎన్నుకున్నారు. దీనివల్ల తాపేశ్వర్‌ దేవ్‌, అక్కడి క్షత్రియులు, జమీందారులు, చట్టవిరుద్ధంగా తవ్వకాలు జరిపే వారందరూ  ఇక తమ ఆటలు సాగవని తెలుసుకున్నారు. అసలు జరిగిందేమిటంటే, హజారీబాగ్‌ జిల్లా కమిటీ వారు తమలో తాము తన్నుకుని శాఖలుగా చీలిపోయారు. మొదట తాపేశ్వర్‌ దేవ్‌ అధ్యక్ష పదవిలో ఉండేవారు. తర్వాత మంత్రి అయ్యారు.

అసలు నేను అధ్యక్షురాలిని కావడం వెనుక కూడా ఒక కథ ఉంది. ఒకసారి హజారీబాగ్‌లోని కాంగ్రెస్‌ నేతలందరూ పాట్నాలో ఉన్నారు. సదాకత్‌ ఆశ్రమంలో ఒక గదిలో నేను, యశ్‌పాల్‌ కపూర్‌ కూర్చుని ఉన్నాం. మహిందర్‌ సింగ్‌, రామ్‌ బాబు (బీహార్‌ మాజీ మంత్రి కె.బి.సహాయ్‌ కొడుకు) కూడా  అక్కడికి వచ్చారు. హజారీబాగ్‌లో ఐదుగురు రాజకీయ నాయకులలో మేం నలుగురం ఆయనకి వ్యతిరేకం. హజారీబాగ్‌ అధ్యక్ష పదవిని ఎవరికి ఇద్దాం అని హఠాత్తుగా యశ్‌పాల్‌ కపూర్‌ అడిగారు.

ఎవరూ జవాబు చెప్పలేదు. ఎందుకంటే ఎవరికి వారే తాను అధ్యక్షుడు కావాలని అనుకునేవారు. నేనన్నాను ‘ఎవరో ఒకరి పేరు ఫైనల్‌ చేయండి, పోటీ ఉండదు. మనమందరం ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే ఎట్లా? తాపేశ్వర్‌ దేవ్‌యే అధ్యక్షుడవుతారు’.

‘హజారీబాగ్‌ జిల్లాకి మహిళను అధ్యక్షురాలిగా ఎందుకు ఎంచుకోకూడదు’ అని యశ్‌పాల్‌ కపూర్‌ అన్నారు.

ఒక్కసారిగా  అందరూ నా వైపు చూశారు. నేను సిద్ధంగా లేను. నాలో అలజడి రేగింది. ‘నేనెట్లా సంబాళిస్తాను? ఇన్ని కాంట్రడిక్షన్లు ఉన్నాయి. అక్కడ వీళ్ళందరూ నన్ను నిలువనిస్తారా? నేను యూనియన్‌ కూడా సంబాళించాలి’ అని నేనన్నాను.

రామ్‌ బాబు వెంటనే ‘మీ సహాయం కోసం మేమందరం ఉన్నాంగా. అవును కదూ మహేందర్‌ బాబూ!’ అన్నాడు.

వెంటనే అందరూ  ‘అవును మేమందరం నీకు సహాయం చేస్తాం’ అన్నారు.

బహుశా ఆ తర్వాత మహేందర్‌ బాబు ఏమీ చెప్పలేక పోయారేమో. ఎందుకంటే ఆ రోజే యశ్‌పాల్‌ కపూర్‌ అధ్యక్ష పదవిని నాకిచ్చినట్లు ప్రకటించారు.

హజారీబాగ్‌లో ఉన్న రామ్‌ నారాయణ్‌ యాదవ్‌ గారికి టెలిఫోన్‌ ద్వారా ఈ వార్తను పంపించారు.

నేను అవాక్కయ్యాను. బహుశా యశ్‌పాల్‌ కపూర్‌ గుడ్‌లుక్స్‌లో ఉండాలని అలా అని ఉంటారు. బాబు మహేంద్ర సింగ్‌ కూడా ఒప్పుకున్నారు. కానీ కాంగ్రెస్‌కు అన్ని ఆదేశాలూ పై నుండే వస్తాయి. అసలు వాళ్ళు ప్రజాస్వామ్యాన్నే మరచిపోయారు. నేను అధ్యక్షురాలిని అవుతానని ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదు.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.