పద్మిని – భండారు అచ్చమాంబ; సరళీకరణ : పి. ప్రశాంతి

సత్యనుకూలాచతురా ప్రియంవదాయా సురూప సంపూర్ణా సహజ స్నేహంరసాలా కులవనితా కేన తుల్యాస్యాత్‌
(పతికి అనుకూలమైనట్టియు, ప్రియభాషిణియు, సురూపవతియునైన కులవనితతో ఎవ్వరునూ సమానం కారు.)

ఈ పతివ్రతా తిలకము పన్నెండవ శతాబ్ది ప్రారంభంలో జన్మించింది. ఈమె తండ్రి సింహళద్వీప వాసియైన సమరసింహ చవ్వాణుడు. ఈ సతీరత్నం అసమాన రూపవతి అవడంచేత తల్లిదండ్రులామెకు పద్మిని అని పేరు పెట్టారు. పద్మినికి వివాహ యోగ్యమైన పిదప రజపుత స్థానంలోనిదైన మేవాడ్‌ అను సంస్థానానికి అధీశ్వరుడగు భీమసింహ రాణాగారికి ఆమెనిచ్చి వివాహం చేశారు. వివాహానంతరం పద్మిని తన రూపమునకు తోడు సుగుణములు సహాయపడగా భర్తకు ప్రాణతుల్యురాలయింది.

ఈ కాలమునందు ఆ రాజ్యము రామలక్ష్మణ సింహుడనే బాలరాజు పరిపాలనలో ఉండేది. కానీ అతడు బాలుడవటంవలన అతని పినతండ్రి అయిన భీమసింహుడే రాజ్యతంత్రములను నడుపుతుండేవాడు. భీమసింహుడు అత్యంత శూరుడు, చతురుడు అవటంవలన అతని రాజ్యమునకు అంతగా శత్రువుల భయంలేక ప్రజలు సుఖంగా ఉండేవారు. కానీ వారి దురదృష్టము వలన స్వల్పకాలంలోనే ఢిల్లీ బాదుషా అయినా అల్లాఉద్దీన్‌ మేవాడ్‌ రాజధాని అయిన చితురుపై దండెత్తాడు. ఈ బాదుషా పద్మిని యొక్క  అసమాన సౌందర్యం గురించి విని ఆమెయందు అధికాభిలాషి అయ్యెను. అసహాయ శూరులైన రజపుతులతో పోరి గెలుచుట కష్టమని తలచి బాదుషా పద్మినిని వశపరచుకోవాలని చూశాడు. కావున ముందుగా ఆయన తన సైనికులతో చితురు సంస్థాన ప్రాంత భూమిని చేరుకుని, గుప్తంగా అనేకమంది దాసీజనులకు ద్రవ్యాశ జూపి వారు తన రూపము, ఐశ్వర్యము మొదలైనవి పద్మినికి తెలిపి, ఆమె తనకు వశమవ్వడానికి అనేక యుక్తులను పన్నేటట్లు చేశాడు. కానీ సతీమణియైన పద్మిని వద్ద మ్లేచ్ఛ ప్రభువు యొక్క తుచ్ఛ యుక్తులు ఎంత మాత్రము పనికిరాక నిష్ఫలమయ్యాయి. అందుకు బాదుషా ఎంతో చింతించి తనకు పద్మినిపై కలిగిన దురుద్దేశమును మరల్చుకోలేక, రజపుతులతో యుద్ధంచేసి పద్మినిని చెరపట్టాలని నిశ్చయించుకున్నాడు. అల్లాఉద్దీన్‌ ఆ సమయంనందు ”పద్మినిని చేపట్టాల్సిందే లేదా ఈ రాజపుత్ర స్థానంనందే యుద్ధం చేసి ప్రాణాలు విడచాల్సిందే” అని ప్రతిన పూనాడు. తదనంతరం అతడు తన సైన్యంతో ఆ రాజధానిని ముట్టడించాడు.

అల్లాఉద్దీన్‌ తమ నగరమును ముట్టడించడాన్ని విని అసమాన శౌర్యధారులైన రజపుతులు యుద్ధసన్నద్ధులయ్యారు. అంతట వారందరూ భీమసింహుని ఆజ్ఞ ప్రకారం బైలువెడలి ప్రతిపక్షాలతో ఘోరంగా పోరాడసాగారు. ఇలా ఉభయ సైన్యాలలోని వీరులు కొన్ని నెలల వరకు యుద్ధం చేశారు. కానీ ఆ రెండు తెగల వారిలో ఎవ్వరూ వెనుకకు తగ్గలేదు. రజపుత సర్దార్లు అనేకులు రణరంగంనందు హతులయ్యారు. రజపుతులెంత దృఢనిశ్చయంతో పోరాడినా తురక సైన్యములు బీరుపోకుండటం, నానాటికీ రజపుత సైన్యం పలుచబడటం చూసి భీమసింహుడు మిక్కిలి చింతాక్రాంతుడయ్యాడు. చివరికతడు ప్రజల మరణానికి ఓర్వలేక ఢిల్లీశ్వరునితో సంధి చేయతలచి అందుకు కొందరు మంత్రులను పంపాడు. కానీ అది పొసగలేదు. సంధి తెలపడానికి వచ్చినవారితో అల్లాఉద్దీన్‌ తనకు పద్మిని దొరికితేనేగాని రణమాగదని స్పష్టంగా తెలిపాడు. ఈ వార్త వినగానే శూర రజపుతులందరూ పడగతొక్కిన సర్పంలా అదిరిపడి తమ అందరి ప్రాణాలు పోవువరకు యుద్ధం చేస్తామని విజృంభించారు. ఆపై ఇరు పక్షాల సైన్యాలు తలపడి యుద్ధం చేయసాగారు.

ఇలా పద్దెనిమిది నెలలు యుద్ధం జరిగింది. కానీ శూరులైన రజపుతులు బాదుషా సైనికులను పట్టణంలోనికి పోనివ్వలేదు. అల్లా ఉద్దీన్‌ వారి కృతనిశ్చయాన్ని చూసి రజపుతులను యుద్ధంలో ఓడించి పద్మినిని పట్టుకునే ప్రయత్నం మానుకోవలసినవాడయ్యాడు. యుద్ధం మానుకున్నా కూడా పద్మినియందు అతని వ్యామోహం అతనిని ఆ పొలిమేర దాటిపోనివ్వలేదు. అందువలన అతను భీమసింహునకు ఇలా వర్తమానం పంపాడు. ”నాకు పద్మిని దొరుకునన్న ఆశలేదు. కానీ ఆమె రూపం ఒక్కసారైనా మీరు నాకు చూపించిన యెడల నేను సైన్యసమేతంగా ఢిల్లీకి తిరిగివెళ్తాను”. ఈ వర్తమానం విని కొంత రోషం కలిగినా యుద్ధమంటే విసుగెత్తిన రజపుతులు అందుకు ఒప్పుకున్నారు. తర్వాత ఆ సంగతి  భీమసింహుడు పద్మినికి తెలియచేయగా ఆమె తాను ప్రత్యక్షంగా  ఆ మ్లేచ్ఛుని కంటబడనని స్పష్టంగా తెలిపింది. దాంతో భీమసింహుడు ఆమె ఢిల్లీశ్వరునికి కనిపించని పక్షాన రజపుతులకు కలుగు బాధలను ఆమెకు తెలియచేయగా, ఆమె అద్దమునందు తన ప్రతిబింబాన్ని బాదుషాకు జూపడానికి ఒప్పుకుంది. అప్పుడు ”పద్మిని నీకు కనబడదు; కాబట్టి ఆమె ప్రతిబింబం జూపుతా”మని చితురు నుండి అల్లాఉద్దీన్‌కు వర్తమానం పంపారు.

దాంతో, యుద్ధాన్ని ఆపి నియమిత దినమున అల్లాఉద్దీన్‌ ఒకరిద్దరు సేవకులతో పద్మినిని జూడటానికి చితురు కోటలోనికి వచ్చాడు. అక్కడ భీమసింహుడు ఆయనకు తగిన మర్యాదలు చేసి అతనికి దర్పణం నందు (అద్దంనందు) పద్మిని రూపాన్ని చూపాడు. తాను విన్నదాని కంటే పద్మిని విశేష రూపవతి అవటం గమనించినందున బాదుషా యొక్క చిత్తచాంచల్యం ఇనుమడించింది. దానిని మనసులోనే అణచుకొని ఆ మ్లేచ్ఛ ప్రభువు తిరిగి పోయేటపుడు తన పనికి పశ్చాత్తాపపరుడైనట్లు భీమసింహునితో ఇలా అన్నాడు. ”భీమసింగు గారూ, నేను చేసిన నేరాన్ని మన్నించాలి. నేడు ముందుగా చితురు సంస్థానీశులతో నేను సఖ్యము చేయదలచాను. ఇంతవరకు మీ యోగ్యత తెలియకపోవడం వలన నేను వైరం తలపెట్టాను. కానీ నేడు మీ యోగ్యత నా కనులార చూడగా మీ వంటి మిత్రులు దొరుకుట నాకు చాలా శ్రేయస్కరమని తోస్తోంది. కాబట్టి, ఈ మొదటి రోజున తమరు నా విడిదికి దయచేసి నే చేయు పూజలను అంగీకరిస్తారని నమ్ముతున్నాను. ఈ నా చిన్న విన్నపము మీరంగీకరించక తప్పదు”. బాదుషా యొక్క నమ్రతను చూసి అతని మాటలను నమ్మి భీమసింహుడు మితపరివారంతో అతని శిబిరానికి ప్రయాణమయ్యాడు.

అల్లాఉద్దీన్‌ చాలా దుర్మార్గుడవడం వలన రాజుగారిని నమ్మించి తనతో తీసుకుని వచ్చి, తన శిబిర సమీపమునందు తన సైన్యం ఆయనను ముట్టడించి ఖైదు చేసేలా చేశాడు. రాజు పట్టుబడటం వలన ఎంతో ఉప్పొంగి అల్లాఉద్దీన్‌ చితురునకిలా వర్తమానం పంపాడు. ”పద్మిని నా వద్దకు రాని యెడల భీమసింహుని ప్రాణములను తీసి, తర్వాత రజపుతులను సంహరించెదను”. ఈ సంగతి విని రజపుతులందరూ ఏమి చేయడానికి తోచక చాలా విచారంతో ఉన్నారు. రాజైన లక్ష్మణ సింహుడు బాలుడవటం వలనను, భీమసింహుని పుత్రులు పండ్రెండుగురు అల్పవయస్కు లవటం వలనను ఇలాంటి సమయంలో తగిన ఉపాయమును ఆలోచించేవారు కనబడకపోతిరి. కానీ పద్మిని మాత్రం అప్పుడు ఇతర స్త్రీలలాగా దు:ఖిస్తూ కూర్చోక అత్యంత ధైర్యం వహించి భర్తను విడిపించు ఉపాయం ఆలోచించసాగింది. ఆ సమయమునందు ఏదో పనిమీద ఆమె సోదరుడైన గోరాసింహుడు, అతని పుత్రుడైన బాదలుడను వీరుడు అక్కడికి వచ్చారు. ఆమె వారితో ఆలోచించి చాలా చిత్రమైన యుక్తిని పన్నింది. పద్మిని అల్లాఉద్దీన్‌కు ఇలా వర్తమానం పంపింది – ”మీరు భీమసింహుని విడిచి ఢిల్లీకి బయలుదేరిన యెడల నేను తగు దాసీలతో కలిసి అక్కడికి వచ్చెదను. కానీ నా దాసీల పరువుకును, రాణివాసమునకు మీ సైనికులు భంగం చేయకుండునట్లు కట్టుదిట్టము చేయవలయును”. పద్మిని తెలిపిన వార్త విని అల్లాఉద్దీన్‌ పరమానందభరితుడయ్యాడు. అంతట అతడు ఆమె అన్న ప్రకారం ఒప్పుకుని ఆమెకు త్వరలో రమ్మని కబురు పంపాడు. బాదుషా వద్దనుండి తన పలుకులకు అంగీకారం రావటం విని పద్మిని తాను ప్రయాణమయ్యింది. ఆమె తోడు రావడానికి ఏడు వందల మేనాలను సిద్ధపరచారు. ఒక్కొక్క మేనాలో ముగ్గురేసి శూరులు ఆయుధాలు ధరించి కూర్చున్నారు. ప్రతి మేనాకు ఆరుగురు వంతున గుప్తాయుధులైన వీరులు ఆ అందలములను మోస్తున్నారు. పద్మిని తన సైన్యానికి, తనకు తోడుగా గోరాసింహుని, అతని పుత్రుడైన బాదలుని సహితం తనతో తీసుకుపోయింది. ఇలా వీరందరూ తురకల శిబిరాన్ని సమీపించి బాదుషా ఆజ్ఞవలన ఆ మేనాలన్నింటినీ శిబిరములోనికి నిరాటంకంగా తీసుకుపోయారు. తర్వాత పద్మిని భీమసింహుని ఒకసారి చూసెదనని బాదుషాకు తెలిపి, భీమసింహుని ఖైదు చేసిన స్థలమునకు తన మేనాను పట్టించుకు వెళ్ళింది. అంతట స్త్రీలలా ఉన్న ఆ గుప్తసైన్యమంతా తమ నిజస్వరూపమును కనబరచి మ్లేచ్ఛ సైన్యములను దైన్యమునొందింపసాగారు. భీమసింహుడు అదంతా ఏమని అడుగుచుండగా పద్మిని అతనిని త్వరపెట్టి సిద్ధపరచి తెచ్చిన గుఱ్ఱాలపై తాను, భర్తయు ఎక్కి ఆ సంగ్రామపు సందడిలో నుండి తప్పించుకుని క్షణంలో చితురునకు ప్రవేశించెను. ఇక్కడ జోరాసింహుడు సైన్యాధిపత్యం వహించి/ స్వీకరించి ఆ తురకలను ఓడించాడు. కానీ అర్జునతుల్యుడైన గోరాసింహుడు, అతని పుత్రుడైన బాదలుడు ఆ యుద్ధమునందు మృతులవడంతో రజపుతులకు ఆ విజయానందం అంతగా రుచించలేదు. అల్లాఉద్దీన్‌ పరాజయానికి బిసిబిల్లా అంటూ తన సైనికులతో ఢిల్లీ మార్గమునకు తరలిపోయాడు.

ఆ యుద్ధానంతరం మరికొంత కాలానికి ఢిల్లీపతి విశేష సైన్యంతో మరల చితురుపై దండెత్తి వచ్చాడు. ఈసారి చితురునందు శూరులు లేనందున రజపుతులకు విజయాశ అంతగా లేకపోయింది. కానీ, ఆ వీరులంతటితో నిరాశ చెంది ఉండక ప్రాణాలకు తెగించి శత్రువులతో పోరాడసాగారు. అట్టి సమయమునందు ఒక కారణం వలన ఆ రజపుతులకు జయము దొరకదని నిశ్చయముగా తోచింది. అది ఏమనగా ఆ యుద్ధం జరుగుచున్నపుడు ఒకరోజు రాత్రి గ్రామ దేవత భీమసింహుని స్వప్నంలో కనబడి ”నాకు అతి దాహముగా ఉన్నది. ఈ దాహము పండ్రెండుగురు రాజుల రక్తం త్రాగినగాని తీరద”ని చెప్పిందట. అదే ప్రకారం భీమసింహుని పుత్రులు పదకొండుమంది శత్రువులతో పోరాడి హతులయ్యారు. అంతటితోనైనా రజపుతులు ధైర్యాన్ని వీడక, పురమునందున్న పురుషులందరూ శత్రువులతో పోరాడి స్వర్గసుఖము పొందడానికి నిశ్చయించుకున్నారు. అంతట వారందరూ సిసోడియా వంశం నాశనమవడంతో బాధపడి భీమసింహుని కనిష్ఠపుత్రుని ఒక దాది చేతికిచ్చి సమీప అరణ్యానికి పంపారు. పిదప వారందరూ రాజవంశమునకు అంకురం ఉన్నదని నిశ్చయించుకుని కదనరంగా నికి వెళ్ళారు. ఆ రోజున ఆ రజపుతుల శౌర్యాగ్ని మరింత ప్రజ్వలిం చగా వారు శత్రువులకు మిక్కిలి దుస్సాధ్యులుగా తోచారు. కానీ విస్తీర్ణమగు మ్లేచ్ఛ సైన్యం ముందు అల్పమగు రజపుత సైన్యానికి జయమెలా దొరుకుతుంది?

భీమసింహునితో పాటు సకల రాజపుత్రులూ యుద్ధంలో చనిపోవడం నగరంనందున్న స్త్రీలకు తెలియగా, పద్మిని, సకల రజపుతుల భార్యలు పాతివ్రత్య రక్షణము పొంది అగ్ని ప్రవేశము చేయ నిశ్చయించుకున్నారు. ఇలా వారు కృతనిశ్చయులై ఒక గొప్ప చితిపేర్చి దానికి అగ్ని ముట్టించారు. అంతట పద్మిని తాను ముందా అగ్నిలో దూకగా అందరు స్త్రీలూ దూకారు. (ఈ అగ్నిప్రవేశమునే రజపుతులు జోహారు లేక జహరవ్రతమని అంటారు). బాదుషా విజయానందంలో పురప్రవేశం చేయగా ఆ గ్రామమంతా చితామయమై ఉంది. అందులో తాను ఇంత ప్రయత్నం చేసి చేపట్టదలచిన పద్మిని దేహం భస్మమై ఉండగా చూసి, అల్లాఉద్దీన్‌ మిక్కిలి చింతించాడు. యుద్ధానికి ప్రయాణమైనపుడు భీమసింహుడే స్త్రీలందరినీ ఒక గుహలోనికి తోసి ఆ గుహను మూసి గుహద్వారమునకు నిప్పంటించాడని కొందరు చరిత్రకారులు వ్రాసి యున్నారు.

Share
This entry was posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.