తమవి కాకుండా పోయిన శరీరాలు, మనసులు చెప్పిన కథ ఇది! – పి.సత్యవతి

ప్రఖ్యాత తమిళ రచయిత్రి సల్మా వ్రాసిన ఒక అద్భుతమైన నవల చదివానీ మధ్య.     ఆ నవల చదివిన అనుభ వం ఎవరితోనూ పంచుకోకుండా వుండడం అసాధ్యమనిపించింది. కుటుంబాలలో స్త్రీల ఆశ, నిరాశలు, అనుభవాలు, ఆనందాలు, దు:ఖాలు కళ్ళముందు పరిచే అచ్చమైన స్త్రీల నవల ఇది. సల్మా ఎక్కువగా కవిత్వమే వ్రాసింది. స్త్రీల లైంగికత్వం గురించి, వారి శరీరాల గురించి నిస్సంకోచంగా వ్రాసింది. ఆమెవి అశ్లీల రచనలన్న ఆరోపణలనీ, బెదిరింపులనీ ధైర్యంగా ఎదుర్కొంది. ”అర్థరాత్రి కథలు” అని అర్థం వచ్చే ఈ తమిళ నవలను ”అవర్‌ పాస్ట్‌ మిడ్‌నైట్‌” పేరుతో లక్ష్మీ హామ్‌ స్ట్రామ్‌ ఇంగ్లీష్‌లోకి అనువదించగా జుబాన్‌ సంస్థ ప్రచురించింది. 478 పేజీల పెద్ద నవల….

”స్త్రీల అసమానత్వం చర్చనీయాంశంగా వున్న ఈ పరిస్థితిలో, స్త్రీ శరీరంలో జీవిస్తూ స్త్రీ వాదిగా ఆలోచించకుండా ఎట్లా?” అంటుంది మీనా అలెక్జాండర్‌ అనే స్త్రీవాద కవి. అట్లాగే సల్మా కూడా పనిగట్టుకుని స్త్రీ వాద కవిత్వమూ, నవలా వ్రాయకపోయినా ఆమె రచనల్లో తప్పనిసరిగా స్త్రీ వాదమే వుంటుంది.

ఒక తమిళ గ్రామంలో కొన్ని ముస్లిం కుటుంబాలలోని స్త్రీల కథ ఇది. ఇందులోని అయిదారు కుటుంబాలకు దగ్గర బంధుత్వం వుంది. స్త్రీల మధ్య స్నేహం వుంది. ఒకరి జీవితాలను గురించి, వారి వ్యక్తిగత వివరాల గురించీ తెలుసుకోవాలన్న కుతూహలం మరొకరికి వుంది. ఒకరిపట్ల ఒకరికి ప్రేమ వుంది, అసూయ వుంది. సానుభూతి కూడా వుంది.

ఏడో తరగతి చదివే రబియా పాత్రతో ఈ నవల ప్రారంభమవుతుంది. ప్రపంచం పట్ల ప్రేమతో  రెక్కలు విప్పుకుంటున్న ఊహలతో, సున్నిత మనస్కురాలైన చిన్నారి రబియా!! ఆమె స్నేహితురాలు మదీనా! ఇద్దరిమధ్యా రహస్యాలు లేవు. ఒకరికోసం ఒకరు అన్నట్లుంటారు. అహమ్మద్‌ కూడా వాళ్ళ జట్టే. ఒకరోజు స్నేహితులతో సినిమా చూసొచ్చి తల్లి చేతిలో బాగా దెబ్బలు తింటుంది రబియా. తల్లి జోహ్రా రబియాను మంచి ఆడపిల్లగా తీర్చిదిద్దే క్రమంలో వుంటుంది. రబియా తండ్రి కరీం, పెదతండ్రి ఖాదర్‌లది ఉమ్మడి కుటుంబం. అన్నదమ్ములు, తోటికోడళ్ళు ఒకరంటే ఒకరు ప్రేమగా వుంటారు. రబియా పెద్దమ్మ రహీమా సంప్రదాయాల పట్ల కాస్త సడలింపు చూపించి తన కూతుర్ని పట్నంలో తన తండ్రి దగ్గర వుంచి హైస్కూల్‌ చదువు పూర్తి చేయిస్తుంది. గ్రామంలో అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈడొచ్చిన ఆడపిల్లలు ఇల్లు దాటరాదు, పరాయి పురుషుల కళ్ళపడరాదు, స్నానం చేసేటపుడు తమ శరీరాలను నగ్నంగా చూసుకోరాదు, సెక్స్‌ గురించి మాట్లాడరాదు. ఇటువంటి ఆంక్షలన్నీ ఆ గ్రామంలో వున్నాయి.

హైస్కూల్‌ చదువు పూర్తిచేసుకుని వచ్చిన వహీదాకు వివాహం తలపెట్టాడు తండ్రి. ఆమె ఇంకా చిన్నపిల్లేనని, అప్పుడే పెళ్ళి వద్దని భార్య చెప్పినా వినడు. వహీదాకు తనకు కాబోయే భర్త గురించి కొన్ని కోరికలున్నాయి. అతను సినిమాల్లో హీరోలా తన మీద ప్రేమ చూపించాలని, తనను అభిమానించాలని.. అలా చిన్న చిన్న కోరికలున్నాయి. ఎప్పుడూ సినిమా పాటలను కూనిరాగాలు తీస్తూ వుంటుంది. వహీదా హైస్కూల్లో చదివినా  మంచి కట్టడిలో పెరిగింది.  మతాచారాలు, సంప్రదాయాలు, శుచీ శుభ్రాలు అన్నీ తల్లి ఆమెకు తెలియచెప్పింది. రబియా తండ్రి కరీంకు భార్య జోహ్రా అంటే లెక్కలేదు. భోజనం చేసేటప్పుడు కూడా ఏం లోపం వచ్చినా అతను గట్టిగా అరుస్తాడు, ఆమెను గడగడలాడిస్తాడు. అతనికి వాళ్ళ ఎస్టేట్‌లో పనిచేసే మరుయాయి అనే ఆవిడతో సంబంధముంది. ఆ విషయం ఇంట్లోవాళ్ళకే కాక ఊరందరికీ కూడా తెలుసు. మగవాళ్ళకు అలాంటి సంబంధాలుండడం సహజం అనుకుంటారు. మరుయాయి ఇంట్లోనూ, తోటలోనూ కష్టపడి పనిచేస్తూ కరీంనే తన భర్తగా భావిస్తూ విశ్వసిస్తూ వుంటుంది. తను హిందూ అయినా బొట్టుపెట్టుకోదు. ముస్లింలా వుంటుంది. ఆమెకు సంతానం కలగకుండా ఆపరేషన్‌ చేయిస్తాడు కరీం. కరీం భార్య జోహ్రా ఆమెను పనిమనిషిగా  సహిస్తూ వుంటుంది. కరీం అన్న ఖాదర్‌కి భార్య రహీమా అంటే అభిమానం. ఆమె మాటకు విలువనిస్తాడు. కానీ కూతురి పెళ్ళి విషయంలో మాత్రం ఏకపక్ష నిర్ణయం తీసుకుంటాడు. తన తల్లికిచ్చిన మాట ప్రకారం తన సోదరి కొడుకు సికందర్‌తో వివాహం ఖాయం చేస్తాడు. అతడు వహీదాకన్నా పదిహేనేళ్ళు పెద్దవాడు. ఖాదర్‌, కరీం సోదరులకు పచారీ దుకాణం వుంది. భూములూ, తోటలూ వున్నాయి, కారు కూడా వుంది.

వీళ్ళుకాక వీళ్ళ బంధువుల కుటుంబాలు మరో మూడు వున్నాయి ఆ ఊళ్ళో. అందులో రబియా స్నేహితురాలు మదీనా కుటుంబం కూడా వుంది. మదీనా తండ్రి సింగపూర్‌లో వ్యాపారం చేస్తూ చనిపోయాడు. ఆమె తల్లి సైనా, అక్క ఫరీదా కాక మానసిక వైకల్యంతో పుట్టిన మరో ఇద్దరు అక్కలు కూడా ఉంటారు. అన్న సులేమాన్‌ సింగపూర్‌లో వుంటాడు. వదిన ముంతాజ్‌ ఇక్కడే వుంటుంది.

మరో కుటుంబం సారాది. ఆవిడ భర్త కూడా సింగపూర్‌లో వుంటాడు. వృద్ధుడైనా, జబ్బు చేసినా స్వదేశానికి రమ్మంటే తిరిగి రాడు. ఆమె కూతురు షరీఫా భర్త పెళ్ళయిన కొత్తలోనే దుబాయ్‌లో ప్రమాదంలో చనిపోయాడు. అప్పుడు గర్భవతిగా వున్న షరీఫా భర్త తమ్ముడ్ని పెళ్ళి చేసుకోవడానికి నిరాకరిస్తుంది. కూతుర్ని చూసుకుంటూ బ్రతుకుతానంటుంది. ఆమెకొక అక్క వుంటుంది. ఆమెకు శారీరక పెరుగుదల లేదు, పెద్దమనిషి కూడా కాలేదు. మరో తమ్ముడు కూడా వుంటాడు, చిన్నవాడు. వుంటాడు, చిన్నవాడు.

మరొక కుటుంబం నఫీజాది. ఆమెకు ఇద్దరు మగపిల్లలు. అందులో అహమ్మద్‌ అనే పిల్లవాడు రబియాకు స్నేహితుడు. అతనంటే రబియాకు ప్రేమ. పెద్దయ్యాక అతన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. నఫీజాకూ, ఆమె భర్తకూ వయస్సులో చాలా తేడా ఉంది. తన సమ వయస్కుడైన అజీజ్‌తో ఆమెకు స్నేహం వుంది. అది చాలామందికి తెలుసు.

ఈ కుటుంబాలలో మగవాళ్ళు డబ్బు సంపాదనకోసం విదేశాలకు వెళ్ళారు. కుటుంబాలు మాత్రం ఇక్కడే వున్నాయి. వివాహాలు చేసుకున్న యువకులు ఒంటరిగా దుబాయ్‌, సింగపూర్‌, సిలోన్‌ వెళ్తారు. ఏడాదికో, రెండేళ్ళకో వస్తారు. అప్పుడు భార్యలు గర్భం దాల్చి వంశాన్ని వృద్ధి చేయాలని ఆ కుటుంబాలు ఆశిస్తాయి. అంతవరకూ వాళ్ళ భార్యలు అత్తింట్లోనే, అత్తమామల అదుపాజ్ఞలలో వుంటారు.

ఈ కుటుంబాల మధ్య చుట్టరికం వుంది. ఒకరింట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న కుతూహలం ఇంకొకరికి వుంది. జోహ్రా, రహీమాలు తప్ప మిగతా స్త్రీలందరికీ ఊసుపోక కబుర్లెక్కువ. ఇందులో ఎవరి బాధలు వారికున్నాయి. అయినా ఇతరుల వ్యక్తిగత విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ. అందులో నఫీజా, ముంతాజ్‌లకు మరీ ఎక్కువ. వాళ్ళిద్దరూ అన్ని విషయాల గురించి సంకోచమనేది లేకుండా మాట్లాడతారు. భార్యాభర్తల అంతరంగిక విషయాల గురించి కూడా బాహాటంగా చర్చిస్తారు.

తన ఆడపడుచు సబియా సంగతి రహీమాకు తెలుసు. కూతురు అక్కడ సుఖపడదని కూడా తెలుసు. కానీ భర్త ఆమెను  సంప్రదించకుండానే నిఖా నిర్ణయించేశాడు. రహీమా ముందు బాధపడినా తర్వాత సర్దుకుంది. సికందర్‌కి సింగపూర్‌లో ఆడవాళ్ళతో సంబంధాలున్నాయని కూడా కొందరు చెప్పారు. ”అయినా మగవాడన్నాక ఇన్నేళ్ళు పెళ్ళి కాకుండా వుంటే సంబంధాలుండడం ఒక వింతా ఏం” అంటాడు కరీం. ఒక పక్క రంజాన్‌ పండగ సన్నాహాలు, మరో పక్క వహీదా పెళ్ళి సన్నాహాలు జరుగుతూ వుంటాయి. వహీదాకు మేనత్త కొడుకే అయినప్పటికీ అతనినెప్పుడూ ఆమె చూడలేదు, మాట్లాడలేదు. ఎటువంటి మనస్తత్వమో తెలియదు. పెళ్ళి అట్టహాసంగా జరిగిపోయింది. సబియా నోరు మంచిది కాదు. కొడుకు పెళ్ళికి తమ్ముళ్ళు ఎంత ముట్టచెప్పినా అసంతృప్తే. ఇంకా ఇంకా లాంఛనాలు తేలేదని కోడల్ని దెప్పుతూ వుంటుంది. వహీదా  మామ సయ్యద్‌ కొడుకు పెళ్ళి కోసం సిలోన్‌ నుంచీ వచ్చాడు. అక్కడ జరుగుతున్న హింసాత్మక సంఘటనల గురించి రేడియోలో విని మళ్ళీ వెళ్ళడమా, మానడమా అని ఆలోచిస్తున్నాడు.

వహీదా అత్త సబియా వుండే ఊళ్ళోనే జోహ్రా తల్లి అమీనా వుంటుంది. జోహ్రా చెల్లెలు ఫిర్దౌస్‌ పెళ్ళయిన వెంటనే భర్తను వదిలేసి వచ్చింది. ఆ పిన్ని అంటే రబియాకు చాలా యిష్టం కానీ ఆమె సంగతి ఇంట్లో ఎత్తవద్దంటుంది జోహ్రా. ఫిర్దౌస్‌కి వయసులో పెద్దవాడైన, డబ్బున్న ఒక అనాకారితో పెళ్ళి కుదిర్చాడు కరీం. ఎందుకంటే మామ చనిపోయాక అత్త అమీనా దగ్గర కట్నకానుకలు భారీగా ఇచ్చేంత డబ్బు లేదు. ఆ కుటుంబానికి మగ దిక్కుగా బాధ్యతను భుజాన వేసుకుని తనమీద భారం పడకుండా ఆ సంబంధం కుదిర్చాడు. భర్త ఎట్లా వున్నా సర్దుకుని కాపురం చేసుకోవలసిన ధర్మం స్త్రీలది అని అతనే కాదు మొత్తం సమాజం అంతా అంటుంది. ఆఖరికి అక్క జోహ్రా, తల్లి అమీనా కూడా. కానీ ఫిర్దౌస్‌ అతన్ని మొదటిసారి చూసిన క్షణాన్నే అసహ్యింంచుకుంటుంది. అతనితో కాపురం తనవల్ల కాదని పుట్టింటికి తిరిగి వచ్చింది. ఆ కుటుంబానికి అదొక మచ్చ. ఎప్పుడైతే అత్తవారింటినుంచీ వచ్చిందో ఇంక ఆమె గుమ్మం దాటకూడదు. అలంకరించుకోకూడదు. ఆ పిల్ల ఏ తప్పూ చేయకుండా చూడాల్సిన గురుతర బాధ్యత తల్లిమీద వుంటుంది. అయితే ఆ సమాజంలో స్త్రీలకు మళ్ళీ పెళ్ళి చేసుకునే హక్కు వుంది కనుక ఏదో ఒక సంబంధం తెచ్చి పెళ్ళిచేసి భారం తీర్చుకోవాలనుకుంటుంది అమీనా. రెండో పెళ్ళివాళ్ళని, పిల్లలున్న వాళ్ళని ఫిర్దౌస్‌ తిరస్కరిస్తూ వుంటుంది. ఆమె అందగత్తె, వయసు తెచ్చే కోరికలున్నాయి. కానీ సమాజం దృష్టిలో కుటుంబానికి మచ్చ తెచ్చింది. చెల్లిలికి ఇలాంటి స్థితి రావడానికి తన భర్తే కారణమని తెలిసీ ఏమీ చేయలేని అశక్తురాలు జోహ్రా. అమీనా వుంటున్న ఇల్లు పెద్దది. ఆ ఇల్లు  ఆమె భర్త ఇస్మాయిల్‌  మనసుపడి కట్టుకున్నది. ఊళ్ళో ఎవరిల్లూ లేనంత అందంగా కట్టుకున్నది. ఇప్పుడతను చనిపోయాక, రెండో కూతురు తిరిగివచ్చాక అమీనా ఇంట్లో ఒక భాగాన్ని శివ అనే టీచర్‌కి అద్దెకిచ్చింది. అతను ఫిర్దౌస్‌కి రోజూ కనపడుతూ వుంటాడు. ఆమె అతనిమీద మనసు పడుతుంది. ఇద్దరూ దగ్గరవుతారు. అది తప్పని ఫిర్దౌస్‌కి తెలుసు. కానీ ఆమె అనుభవాన్ని ప్రేమించింది, ఆనందించింది. అమీనా ఇల్లు సబియా ఇంటి ఎదురే.

వహీదా పెళ్ళి చేసుకుని అత్తగారింటికి వచ్చింది. మొదటి రాత్రే అతని స్వభావం అర్థమైంది ఆమెకి. పెళ్ళయ్యేవరకూ సెక్స్‌ గురించి మాట్లాడనివ్వకుండా, తమ శరీరాల గురించి తెలుసుకోనివ్వకుండా, నాలుగ్గోడల మధ్య బందీగా వున్న ఆడపిల్లలకు, పెళ్ళయిన మొదటి రాత్రే బంధువులంతా చేరి భర్తకు సహకరించమని హితబోధ చేస్తారు. పదిహేను, పదహారేళ్ళకే పెళ్ళిళ్ళవుతాయి. చిన్న పిల్ల అని కూడా చూడకుండా సికందర్‌ జరిపిన మోటు శృంగారానికి పొత్తికడుపులో నొప్పితో లుంగలు చుట్టుకుపోతుంది వహీదా. మొదట్లో అంతే అని ఆమె మామగారు వెకిలిగా మాట్లాడతాడు. అత్త పెడసరం మాటలు, మామగారి ఆకలి చూపులు, వెకిలి మాటలు, భార్యంటే సెక్స్‌ అని తప్ప ఇంకే మృదువైన భావమూ లేని సికందర్‌లు వహీదాకి నాలుగు రోజుల్లోనే నరకం చూపిస్తారు. అసలు చిన్నపిల్ల అని, సికందర్‌కి కూడా  వహీదాని చేసుకోవడం ఇష్టంలేదు. అతనికి ఎదురింటి షిర్దౌస్‌ అంటే ఇష్టం, కానీ అమీనా దగ్గర డబ్బు లేదని అల్లుడికి కట్నకానుకలు భారీగా  ఇవ్వలేదని సబియా ఒప్పుకోదు. మళ్ళీ ఇప్పుడు ఫిర్దౌస్‌ భర్తని వదిలి వచ్చాక కూడా  ఆమెను పెళ్ళి చేసుకుంటానంటాడు. కానీ తల్లి అసలు ఒప్పుకోదు. అతనికి కూడా ఇది బలవంతపు పెళ్ళే.

ఒకరోజు రాత్రి ఎంతకీ నిద్రపట్టక బాల్కనీలో నిలబడుతుంది వహీదా. ఆ అమ్మాయి చిన్నప్పటినుంచీ సమాజం చెప్పే మంచి చెడులను వింటూ పెరిగింది. తప్పొప్పుల గురించి సమాజం చేసే వ్యాఖ్యానాలు వింటూ పెరిగింది. బాల్కనీలో నిలబడ్డ వహీదాకి అప్పుడే ఎదురింట్లో నుంచీ శివ ఇంటివైపు వెళ్తున్న ఫిర్దౌస్‌ కనబడుతుంది. కోపంతో మండిపడుతూ మెట్లు దిగి ఎదురింటికి వెళ్ళి ఫిర్దౌస్‌నీ, శివనీ ”తప్పుచేస్తుండగా” పట్టుకుని దులిపేస్తుంది. అప్పుడే ఫిర్దౌస్‌ సహనం కోల్పోయి వహీదా తల్లినీ, పినతండ్రినీ గురించి ఒక మాట అంటుంది. వహీదా వచ్చేస్తుంది కానీ ఆమె చేసిన తొందరపాటు పని ఎంతకి దారితీస్తుందో ఊహించలేదు. వహీదాకీ, ఫిర్దౌస్‌కీ జరిగిన సంభాషణ విన్న అమీనా కూతురు చేసిన పనిని క్షమించదు. ఎలుకల మందు తెచ్చి ”మనిద్దర్లో ఎవరో ఒకరం చనిపోవాలి. చెప్పు. నువ్వా, నేనా?” అంటుంది. తనకు బ్రతకాలని వుందంటూ జీవనకాంక్షతో తల్లి పాదాలు పట్టుకుని వేడుకుంటుంది ఫిర్దౌస్‌. కానీ ఆమె చనిపోక తప్పలేదు.

ఆచారం ప్రకారం అత్తవారింటికి వచ్చిన నలభై రోజుల తర్వాత పుట్టింటికి వెళ్ళి ఒడి నింపుకు రావాలి ఆడపిల్లలు. పుట్టింటికి బయలుదేరిన వహీదా తన నగలన్నీ సర్దుకుని ఇంక జన్మలో అత్తగారింటికి రావొద్దనుకుంటుంది. సబియా శుభ్రంలేని తనం, మామగారు సయ్యద్‌ వెకిలి మాటలు, ఆకలి చూపులు, సికందర్‌ నిర్లక్ష్యం ఆమెకక్కడ నరకాన్ని చూపించాయి. ఫిర్దౌస్‌ మరణం అమీనాని అపరాధభావంతో కృంగదీసి ఆరోగ్యం మీద దెబ్బ తీసింది. తల్లిని చూసుకోవడానికి వచ్చిన జోహ్రాకు ఫిర్దౌస్‌ మరణానికి కారణాలు, వహీదా మాటలు అన్నీ తెలిశాయి. గతంలో ఎప్పుడో తన భర్త రహీమాతో చేసిన తప్పు గురించి తెలిసింది. ఆమె రహీమాని ద్వేషించడం ప్రారంభించింది. ఉమ్మడి కుటుంబం నుంచి వేరుపడాల్సిందేనని పట్టుబట్టింది. ఆ ఇంటిని విభజిస్తూ గోడ కట్టడం మొదలవుతుంది.

మదీనా అన్న సులేమాన్‌ సింగపూర్‌ నుంచీ వచ్చాడు. చెల్లెలు ఫరీదాకు పెళ్ళి చేయాలి. భార్య ముంతాజ్‌ను గర్భవతిని చెయ్యాలి అని రెండు ముఖ్యమైన పనులు పెట్టుకుని వచ్చాడు. మదీనా ఇల్లు రబియా ఇంటికి ఎదురే. వాళ్ళ వాకిట్లో కారు ఆగినప్పుడల్లా డ్రైవర్‌ ముత్తును చూసి నవ్వుతూ వుంటుంది ఫరీదా. ఆ సంగతి ఆమె వదిన ముంతాజ్‌కి తెలుసు. సులేమాన్‌ స్వభావం ఎరిగిన ముంతాజ్‌ అతనికి చెప్పదు. తప్పొప్పుల విషయంలో, మతాచారాల విషయంలో చాలా కఠినంగా వుంటాడు సులేమాన్‌. కరీం ఇంట్లో పనిచేసే ఫాతిమా ఒక హిందువుతో వెళ్ళిపోయిందని మసీదులో పెద్ద చర్చ లేవదీసి ఫాతిమా తల్లిని వెలివేయిస్తాడు. ఆ ఊళ్ళో ముస్లిం స్త్రీలెవరూ సినిమాకి వెళ్ళకూడదని ఆంక్షలు పెట్టిస్తాడు. ఇంకా పెద్దమనిషి కాకపోయిన మదీనాని బయట తిరగనివ్వడు. కరీం డ్రైవర్‌ ముత్తును ఉద్యోగంలోనుంచీ తీయించేస్తాడు. అతని స్నేహితుడు అరవై ఏళ్ళ అబ్దుల్లా స్వదేశానికి వచ్చినప్పుడల్లా ఒక చిన్నపిల్లని పెళ్ళి చేసుకోవడాన్ని ఊరంతా తప్పుబడితే అతను మాత్రం షారియత్‌ ప్రకారం మగవాళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చని సమర్ధిస్తాడు. ఒక ”కాఫిర్‌”తో వెళ్ళిపోయిన ఫాతిమా లారీ కిందపడి చనిపోయిందని వార్త తెలిసి అందరికీ చాలా సంతోషంగా చెబుతాడు. తగిన శిక్ష పడిందని ఆనందిస్తాడు. తనకి గర్భం రాకపోతే అతను మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడని ముంతాజ్‌ దిగులు పడుతుంది. ఆమె అనుకున్నది నిజమవుతుంది. డాక్టర్‌ ఆమెకు పిల్లలు పుట్టరని చెప్పడంతో ఆమె పట్ల సులేమాన్‌లో మార్పు వస్తుంది. ముంతాజ్‌ ప్రవర్తన కూడా వింతగా మారుతుంది. ఆమెను ఫిర్దౌస్‌ దయ్యమై ఆవహించిందని చెప్పి పుట్టింటికి పంపేస్తారు. సారా కూతురు షరీఫాతో సులేమాన్‌కు పెళ్ళి నిశ్చయం చేస్తుంది సైనా. షరీఫాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, చనిపోయిన భర్తను తలచుకుంటూ కూతుర్ని పెంచుకుంటూ వుండాలని అనుకుంటుంది. కానీ పెళ్ళికి ఒప్పుకోకపోతే చనిపోతానని ఆమె తల్లి షరీఫా బెదిరించి ఒప్పిస్తుంది. ఫాతిమా లారీకింద పడిందని సంతోషంగా చెప్పిన సులేమాన్‌ని ఎలా పెళ్ళి చేసుకోవాలి? కానీ తప్పదు. పనిలో పనిగా తన చెల్లెలు ఫరీదా పెళ్ళి అజీజ్‌తో నిశ్చయిస్తాడు. బీదవాడైన అజీజ్‌ను తనతో సింగపూర్‌ తీసుకువెళ్ళి అక్కడ కుదురుకునేలా చేస్తాడు. షరీదాకు కానీ,  షరీఫాకు కానీ పెళ్ళయినా ఒకటే, కాకపోయినా ఒకటే! కానీ భర్త వున్న స్త్రీలకుండే గౌరవం వేరు. అజీజ్‌ వెళ్ళిపోతున్నందుకు నఫీజా బాధపడుతుంది.

వహీదా పుట్టింటికి వచ్చినప్పటినుంచీ ఆమెకి నెలసరి వచ్చిందా లేదా అనేదే అక్కడి ఆడవాళ్ళ చర్చ. వహీదాకి పెళ్ళికాగానే గర్భం వస్తే ఇంక సికందర్‌ని నిశ్చింతగా సింగపూర్‌ పంపేస్తుంది సబియా. ఇంటివాళ్ళకీ, బయటివాళ్ళకీ కూడా వహీదా నెలసరిపైనే ఆసక్తి. కానీ వహీదాకు మాత్రం తనకు గర్భం రాకూడదని గట్టి కోరిక. తను ఇంక అత్తవారింటికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాక సికందర్‌ గర్భాన్ని ఎందుకు మొయ్యాలి అనుకుంటుంది.

మదీనా పెద్దమనిషి అయింది. ఆ పిల్ల రబియా అంత అమాయకురాలు కాదు. లోకం పోకడ తెలుసు. తల్లి ఆమెను స్కూలు మాన్పించినా బాధపడదు. అదంతా సహజం అనుకుంటుంది. ఇంకా పెద్దమనిషి కాకపోయినా, మదీనాతో పాటే రబియాను కూడా స్కూల్‌ మాన్పిస్తుంది జోహ్రా. ఆమెతోపాటు స్కూలుకు జతగా నడిచి వెళ్ళే ముస్లిమ్‌ పిల్లలు లేరనీ, ఒంటరిగా పంపననీ చెప్పేస్తుంది. రబియా స్నేహితుడు అహమ్మద్‌ మేనమామ దగ్గరుండి చదువుకోవడానికి వేరే ఊరు వెళ్ళిపోతాడు. రబియాని అక్క వహీదా దగ్గరకు కూడా ఎక్కువ పోనివ్వదు తల్లి. ఒంటరిగా గదిలో ముడుచుకుని పడుకుంటుంది రబియా. అన్నదమ్ముల ఇళ్ళమధ్య గోడ పూర్తవుతుంది. వహీదా నెల తప్పానని తెలుసుకుని కుప్పకూలిపోతుంది. తనింక అత్తవారింటికి పోక తప్పదు. ఆమె భవిష్యత్తు తేలిపోయింది.

రంజాన్‌ నెలలో అరిసెల పిండి కొట్టుకోవడం, గోరింటాకు పెట్టుకోవడం, ఉపవాసాలుండడం, వహీదా పెళ్ళికి నగలు, బట్టలూ కొనడం వంటి వేడుకలతో మొదలైన ఈ నవల ముగిసేసరికి పాఠకుల మనసు నిండా విషాదం మసురుకుంటుంది.

ఇందులో నలుగురు యువతులు: తనను ఎంతో ప్రేమించిన భర్తతో కొద్ది రోజులే కలిసి వున్న షరీఫా భర్త దుబాయ్‌లో ప్రమాదంలో మరణించడంతో, అతని గుర్తుగా వున్న కూతురి కోసం మళ్ళీ పెళ్ళి వద్దనుకుంటే తల్లి ఆమెను బెదిరించి బలవంతంగా యిష్టంలేని వ్యక్తితో పెళ్ళికి ఒప్పిస్తుంది. భర్త విదేశాలలో ఉంటే సంసారం ఈదుకొస్తోంది ఆమె తల్లి. ఆమెకు శారీరక పెరుగుదల లేని మరొక చిన్న కూతురు. చిన్నవాడైన కొడుకు. ఒకవేళ విదేశంలోనే భర్త మరణిస్తే ఇంటిని ఆదుకునే మగదిక్కు కావాలి. సులేమాన్‌ ఎవరో కాదు తన అన్న కొడుకే. అందుకే షరీఫాను బలవంతపెట్టి సులేమాన్‌తో పెళ్ళికి ఒప్పిస్తుంది. మొన్నటివరకూ తమతో కలిసి మెలిసి వుండిన ముంతాజ్‌కి అది ద్రోహం అయినా కూడా.

మరొక యువతి ఫరీదా. మదీనా అక్క… సులేమాన్‌ చెల్లెలు. వయసొచ్చిన కూతురు తల్లి గుండెలమీద కుంపటే. ఆమెకి సరైన సంబంధాలు రావడంలేదు. అందుకే ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్న అజీజ్‌తో పెళ్ళి కుదిర్చేసి తనతో సింగపూర్‌ తీసుకెళ్ళడానికి నిర్ణయించాడు. పెళ్ళి ఒక మొక్కుబడి. ఒక భద్రత. తరువాత మళ్ళీ ఎప్పుడో అతనొచ్చేదాకా ఒంటరి జీవితమే… ఫరీదాకైనా, షరీపాకైనా, వహీదాకైనా..! సులేమాన్‌ భార్య  ముంతాజ్‌. పిల్లలు పుట్టని నేరానికి, దయ్యం పట్టిందన్న ఆరోపణమీద పుట్టింటికి తరిమివేయబడింది. పుట్టింట్లో మళ్ళీ ఆమెకు నాలుగు గోడలే… మళ్ళీపెళ్ళి చేసుకుంటే తప్ప !

వహీదా ధనవంతుడైన తండ్రికి.. చదువూ, తెలివీ, అందం, పొందికా అన్నీ వున్న ఒక్కగానొక్క కూతురయినా ఆమె జీవితంపై ఆమెకు ఎలాంటి హక్కూ లేదు. ఆమె శరీరంపైనా, ఆమె ఆకాంక్షలపైనా.. హక్కు లేదు.

కరీం ఇంట్లో పనీచేసే ఫాతిమా! పెళ్ళయిన కొద్దిరోజులే ఆమె భర్త ఆమె దగ్గర వున్నాడు. తర్వాత మాయమైపోయాడు. ఎక్కడో ఎవరితోనో ఉంటున్నాడని ఫాతిమాకు తెలిసింది ఆమె అతనికోసం వెళ్ళలేదు. కొడుకుని పెంచుకుంటూ తల్లి దగ్గరే వుండిపోయింది. ఒకరోజు కొడుకును కూడా వదిలేసి తను కావాలనుకున్న వాడితో వెళ్ళిపోయింది. ఆమె చేసిన పనిని సమాజమంతా గర్హించింది. ఆమె చేసిన పనివల్ల ఊళ్ళో స్త్రీలెవరూ సినిమాలకు పోకూడదని శాసించింది మసీదు. ఆమె తల్లిని వెలివేసింది. ఆ తల్లి మంచం పట్టింది. ఫాతిమా కొడుకుని రహీమా చేరదీసింది. ఫాతిమా లారీ ప్రమాదంలో చనిపోయినపుడు  ఒక కాఫిర్‌తో వెళ్ళిపోయినందుకు తగిన శాస్తి జరిగిందని సులేమాన్‌ లాంటి వాళ్ళు సంతోషించారు కానీ ఆ ఊరి స్త్రీలే ఆమె కోసం ప్రార్థించారు.

పెళ్ళిళ్ళు కుదర్చడంలో బంధుత్వాలు, ఆస్తిపాస్తులు, కుటుంబ పరువు మర్యాదలు లెక్కలోకి వస్తాయి. కానీ ఈడూ జోడూ, ఆడపిల్ల మనసు, శరీరం లెక్కలోకి రావు. మూగజీవుల నిశ్శబ్ద రోదన లోలోపల అణగారిపోతూనే వుంటుంది. పదమూడేళ్ళకే నాలుగ్గోడల మధ్య బందీ అయిన రబియా జీవితం ఎట్లా వుండబోతోందో? ఆ పిల్లనలా ఇంటికి పరిమితం చేసి బుద్ధిమంతురాలైన ఆడపిల్లగా తయారు చేయడానికి జోహ్రా కారణాలు జోహ్రాకున్నాయి. జోహ్రా పిన్ని మైమూన్‌ పెళ్ళి అయిన కొద్దిరోజులకే భర్తని విడిచిపెట్టి వచ్చింది. ఆమెకు మళ్ళీ పెళ్ళి చేయాలనుకుంటుండగానే ఆమె గర్భవతి అని తెలిసింది. తల్లీ, అక్కా కలిసి ఒక నాటు మంత్రసానిచేత గర్భం తీయించగా మైమూన్‌ చనిపోయింది. భర్తని విడిచిపెట్టి వచ్చిన కుటుంబానికి మచ్చ తెచ్చిన జోహ్రా చెల్లెలు ఫిర్దౌస్‌ బలవంతంగా చనిపోయింది. జనాలు తమ కుటుంబం గురించి చెప్పుకుంటున్నారు.. మరి రబియా ఎలా తయారవుతుందో అని జోహ్రా భయం. అందుకని అంతులేని కట్టడి ఆ పిల్లకి.

ముక్కుపచ్చలారని పిల్లలకి పెద్దమనుషులు అయూ కాగానే వయో బేధాలు, అందచందాలు, మనస్తత్వాలు ఏమీ చూడకుండా

పెళ్ళిళ్ళు కుదిరిస్తారు. మొగుడు ఎలాంటివాడైనా తట్టుకుని బ్రతకమని శాసిస్తారు. భర్తని వదిలి వచ్చిన స్త్రీ కానీ, వితంతువైన స్త్రీ కానీ ఎన్నో ఆంక్షలకు లోబడి బ్రతుకు సాగించాలి. గుమ్మం దాటి బయటకు రాకూడదు. అలంకరించుకోకూడదు. వాళ్ళమీద నిత్యమూ కాపలాయే. మతాచారాలూ, ఆ పేరుమీద పురుషుల అదుపాజ్ఞలూ భరిస్తూ బ్రతుకుతున్న  స్త్రీలు కూడా మళ్ళీ తాము ఆ అవధులు మీరకుండా బ్రతుకుతున్నామా లేదా అని వారిని వారే సరిచూసుకుంటూ కాపలా కాసుకుంటూ వుంటారు. స్త్రీల జీవన పరమావధి వివాహం. ఆ వివాహ నిర్ణయంలో వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు. వాళ్ళ శరీరాల మీద, కోరికల మీద వాళ్ళకి అధికారం లేదు. ఇది ఏ ఒక్క సమాజపు స్త్రీల కథ మాత్రమే కాదు, అన్ని సమాజాల్లోనూ జరుగుతున్న కథే కొంత ప్రత్యక్షంగా, కొంత కనిపించకుండా….

ఈ నవలలో ఆ సమాజంలో పండగలూ, ఆచారాలూ, చావులూ, పెళ్ళిళ్ళూ… అన్నీ ఎంతో విశదంగా వర్ణించింది సల్మా. తానొక ప్రేక్షకురాలిగా వుంటుందే కానీ వ్యాఖ్యానాలు చేయదు.

ఈ రోజు సల్మా ఒక ప్రఖ్యాత రచయిత్రి కావడం, అంతర్జాతీయ కీర్తి పొందడం, విదేశాల్లో సెమినార్లకి హాజరు కావడం, ఆమెపై ఒక బ్రిటిష్‌ డాక్యుమెంటరీ నిర్మాత సినిమా తీయడం… ఇవన్నీ అంత సులభంగా జరిగిన విషయాలేమీ కావు.

”నాకప్పుడు పన్నెండేళ్ళు. తొమ్మిదో క్లాసు చదువుతున్నాను. ఆ రోజు శనివారం. మాకు స్కూల్‌ లేదు. మేం నలుగురం స్నేహితురాళ్ళం. లైబ్రరీలో కూర్చుని చదువుకుంటున్నాం. దగ్గర్లోనే ఒక సినిమా హాల్లో మ్యాటినీ ఆడుతోంది. ఇంట్లో అడిగితే సినిమాకి పంపించడం జరిగే పని కాదు. పైగా మా గ్రామంలో ఎప్పుడో కానీ మ్యాటనీలు వెయ్యరు. రాత్రిపూట సినిమాకి వెళ్ళడం అసంభవం. చీకటిపడ్డాక ఆడపిల్లలు బైటికి వెళ్ళకూడదు. మేం ఇంట్లో చెప్పకుండా సినిమాకి వెళ్ళాలనుకున్నాం. మేం లైబ్రరీలో వున్నామని ఇంట్లో  అనుకుంటారని బయల్దేరాం. అసలు ఆ హాల్లో ఆడే సినిమా ఏంటో కూడా మాకు తెలియదు. ఆత్రంకొద్దీ వెళ్ళి హాల్లో కూర్చున్నాక అది శృంగార భరితమైన మలయాళీ సినిమా  అని తేలింది. బైటికి వచ్చేద్దామా అంటే తలుపులు మూసేశారు. కొన్ని దృశ్యాలు వచ్చినప్పుడల్లా మేం చేతుల్లో మొహం దాచుకుని ఎట్లాగో బయటపడ్డాం. ఇంటికి వెళ్ళేసరికి అదే హాల్లో సినిమాకి వచ్చిన మా అన్న మా అమ్మకి చెప్పేశాడు. ఆవిడ నన్ను బాగా కొట్టి స్కూల్‌ మాన్పించేసింది. అప్పట్నుంచీ పెళ్ళయ్యేవరకూ తొమ్మిదేళ్ళు నాలుగ్గోడల మధ్య బందీ అయిపోయాను. జీవితంలో అతి ముఖ్యమైన ఆ వయసులో ఒంటరిగా, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా, స్నేహితులు లేకుండా గడపడం ఎంత దుర్భరమో కదా?” ఇది సల్మా స్వీయానుభవం.

ఆ తరువాత చాలా ఏళ్ళు ఇటు పుట్టింట్లో, అటు అత్తింట్లో ఆమె నాలుగు గోడల మధ్య బందీ. స్త్రీలకి తెలివితేటలు ఉండకూడదు. వాళ్ళు ప్రశ్నించకూడదు. కానీ వీటన్నింటినీ సల్మా ప్రశ్నించింది. అమ్మ ఇంట్లో బంధిస్తే, స్కూల్‌ మాన్పిస్తే ఆమె ఊరికే కూర్చోలేదు. బాగా పుస్తకాలు చదివింది. కవితలు వ్రాసి రహస్యంగా పత్రికలకు పంపించింది. తనలోని కోపాన్నీ, ఆవేశాన్నీ బహిర్గతం చేయడానికి ఒక వాహిక దొరికింది. ఆమె చదువుకోవాలనుకుంది, బురఖా వేసుకోవద్దనుకుంది. తన అసలు పేరు రుఖయ్యా సల్మా, రజతి అనే కలం పేరుతో కూడా వ్రాసింది. తను రాస్తున్నట్లు  తెలియకూడదు. నిశితమైన, పదునైన ఆమె కవితలు పత్రికలలో వచ్చాయి. వివాహమయ్యాక ఆమె రచనల్ని భర్త ఏ మాత్రమూ ప్రోత్సహించలేదు. అయితే సల్మా తల్లే సల్మా రచనలను పత్రికలకు పంపేది. రహస్యంగా పుస్తకావిష్కరణ కూడా ఏర్పాటు చేసింది. తర్వాత ఆమె తమ ఊరి పంచాయతీ బోర్డు అధ్యక్షురాలయింది. స్త్రీలకు రిజర్వయిన ఆ ఊరి పంచాయతీకి ఈమెను నిలబెట్టింది ఆమె భర్తే. 2006లో డి.ఎం.కె. తరఫున శాసనసభకు పోటీ చేసి ఓడిపోయింది. తర్వాతి సంవత్సరం తమిళనాడు సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌కి అధ్యక్షురాలైంది.

ఈ నవలలో చిన్నారి రబియా కూడా సల్మాలా పోరాడి గెలవాలని కోరుకున్నాను.

(సారంగ వెబ్‌ మాగజైన్‌ సౌజన్యంతో…)

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.