హక్కులకూ బాధ్యతలకూ అర్థం తెలియకుండా మనిషి జీవించిన యుగాలూ, కాలాల నుండీ క్రమేణా మానవ సమాజమంతా ఏర్పడి గుర్తింపబడిన వ్యవస్థలు, భూమ్మీద పుట్టిన మానవ ప్రాణికి హక్కులూ బాధ్యతలూ ఉంటాయని గ్రహిస్తూ గుర్తించడం జరిగింది.
”మానవ సమాజ పరిణామంలో సమిష్టి జీవితం, సమాజం రూపొందడం అనేది ఒక ముఖ్యమైన మలుపు. సమాజం, సహజీవనం, రాజ్య (ప్రభుత్వ) ఆవిర్భావం, ఉమ్మడి ఆమోదం అనేవి చైతన్య మానవుడు చేసిన కొన్ని వందల సంవత్సరాల ప్రయత్నాల ఫలితం”.
సమాజాన్ని నియంత్రణలో పెట్టి నియమానుసారంగా కొనసాగేట్టు చేయడం కోసం ప్రతినిధి అవసరం ఏర్పడింది. ఆ ప్రతినిధి పాలకుడిగా అధికారం చేపట్టి పాలితులను తన ఆధీనంలో అదుపులో పెట్టుకుని నడిపించడంతో అధికార పాలనా వ్యవస్థ ఆవిర్భవించింది.
‘అధికారం’ అనేది ప్రజానుకూలంగా ఆచరణలో కొనసాగినపుడు ‘హక్కుల’ ప్రచారం, ప్రస్తావనలు అంతగా జరగలేదు. ‘అధికారం’ జనామోదం (ఉమ్మడి ఆమోదం)తో ఏర్పడి అపరిమితమైన పరిధిలో అన్వయించబడుతూ అధిక జనావళి సంక్షుభితమైన సంక్షోభ జీవనస్థితిలోకి తోసివేయబడినప్పుడూ, ‘అధికారం’ అనే వ్యవస్థ నిర్బంధ బలప్రయోగ సాధంగా మారిన స్థితిలో సహజ హక్కులైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, జరుగుతూ వస్తున్నది. అతలాకుతలమైన ప్రజల అభీష్ట వ్యక్తీకరణగా ”మానవ హక్కులు” రూపుదాల్చుకున్నాయి.
‘మానవ హక్కులు’ సమిష్టి ప్రజా అవసరం. అవి ఉమ్మడి భద్రతకు, తమ అధికారాన్ని జవాబుదారీగా మల్చడానికి ప్రజల చేతుల్లో ఉన్న సాధనం. మానవ హక్కులు సహజంగా సంక్రమించినవి కాగా పౌరహక్కులనేవి రాజ్యాంగం వల్ల సంప్రాప్తించేవి. ప్రజా ప్రభుత్వాలు ఈ రెండింటినీ పరిరక్షించాలి, అందుకు ఒప్పుకోవాలి. ఒకవేళ ఒప్పుకొని పరిరక్షించని సందర్భాలలో మానవ హక్కులకు సంబంధించిన ఆందోళనా వేదికలు ప్రచారం, పరిశోధన, జ్ఞానం ద్వారా ఏర్పడి క్రమంగా సంఖ్యాపరంగా పెరుగుతూ ఉంటాయి. ఆధునిక సమాజాల్లో అంతర్భాగంగా మానవ హక్కుల భావన ఉంటుంది.
నిరంతరం విస్తరిస్తున్న లక్ష్యంగా మానవ హక్కుల సాధన ఉంటుంది. అయితే సామాజిక గమనంలో దాని ప్రగతిలో హక్కుల సాధన అనేది సంపూర్ణంగా ఎప్పటికీ సాధ్యం కాకుండా ఎంతో కొంత మిగిలిపోయి ఉంటుంది. రాజ్యానికీ, పౌర సమాజానికీ మధ్యన నివసించే వ్యక్తికి ఉండే సంబంధాలను నియంత్రించే విలువలు, నియమాలు సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా వేగంగా మార్పు చెందవు. అందువల్ల మానవ హక్కుల భావనకూ, ఆచరణకూ నడుమ తేడా ఏర్పడుతుంది. మానవ సమాజంలో పౌరులుగా మనం ఏ విధంగా జీవించాలి, ప్రవర్తించాలి అన్న భావనలు మానవ హక్కుల సాధనకు, ఆచరణకు నైతిక ప్రతిపాదికను కల్పిస్తాయి.
భారతదేశం – ప్రజాస్వామ్యం: ప్రజాస్వామ్యం అనే భావనకు మానవ హక్కులకు గాఢమైన సంబంధం ఉంటుంది. భారతదేశం ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటిగా పిలవబడుతున్నది. కొన్ని మూడవ ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అడ్డంకులు ఎదుర్కొని నిలదొక్కుకోలేక నియంతృత్వ దేశాలుగా మారినా భారతదేశం ఏడు దశాబ్దాలపాటుగా ఉదారవాద ప్రజాస్వామ్యంతో పయనిస్తున్నది.
మన రాజ్యాంగంలో మానవ హక్కుల ప్రస్తావన సమగ్రంగా చేయబడింది. సమసమాజ స్థాపన లక్ష్యంగా ప్రకటించబడింది. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన (1948) మానవ హక్కుల ప్రకటనను యధాతథంగా అంగీకరిస్తూ భారత ప్రభుత్వం వాటి పరిరక్షణకు హామీ ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నో మానవ హక్కుల ఒప్పందాలపై సంతకం చేసింది.
భారత స్వాతంత్య్ర పోరాటంలో నైతిక, రాజకీయ ప్రాతిపదిక ఏర్పడి స్వాతంత్య్ర ఉద్యమంలో అహింస ద్వారా హక్కుల పరిరక్షణ అనే ఆచరణకు ప్రచారం కల్పించి విస్తృత సామాజిక ఆమోదానికి ప్రయత్నం జరిగింది.
భారతదేశంలో సామాజిక నాగరికతకు ప్రజాస్వామిక పునాదులు ఉన్నాయి. కానీ చరిత్రను పరిశీలించినపుడు సామాన్య జనుల ప్రాథమిక హక్కులు నిరంతరం అణచివేతకు గురవ్వడం గమనిస్తాము. మన సమాజంలో ఇటు రకరకాల అణచివేతలూ, మరోవైపు ప్రజాస్వామిక చైతన్యం ఏకకాలంలో చూస్తుంటాము. మన దేశంలో వ్యవస్థీకృతమైన ఆధిపత్యం నుండి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో హక్కుల అతిక్రమణ పుడుతుంటుంది.
రాజ్యం, కులవ్యవస్థ, వనరులపై యాజమాన్యం, పురుషాధి క్యతల లాంటి విధానాలు, ఆధిక్యతలు మన సమాజంలో హక్కుల నిరాకరణా, అతిక్రమణకూ మూలంగా ఉంటున్నాయి. ఇవి ఒకదానిపై ఒకటి ఆధారితంగా ఉంటూ పరస్పరం బలోపేతం చేసుకుంటూ చెలరేగి పోతుంటాయి.
అపసవ్యపు విషయం ఏమిటంటే రాజ్యాధిపత్యానికి అవసరమైన సంస్కృతినీ, భావజాలాన్నీ సమాజంలోని వ్యవస్థలు కాపాడుతుంటే, సభ్యసమాజం అనబడే దానిలోని ఆధిపత్య వ్యవస్థలను రాజ్యం తన బలప్రయోగంతో కాపాడుతుంటుంది.
హక్కుల ఆవశ్యకత: హక్కులు లేని నాగరిక, సభ్య సమాజాలను ఊహించలేము. సమాజం అనేక వ్యవస్థలూ, ఉప వ్యవస్థలుగా, అనేక రంగాలూ, విభాగాలుగా ఏర్పడుతూ, విస్తరిస్తూ ఉంటే ఆధిపత్యాలూ, అధికారాలూ, పెత్తనాలూ, యాజమాన్యాలూ వాటి అభివృద్ధి, రక్షణ, విస్తరణల కోసం ఇతరుల హక్కులను కాలరాయడానికి పూనుకుంటాయి. అందుకే హక్కులు విలువైనవి. అవి అణచివేతలను ప్రతిఘటిస్తూ, జీవితాన్ని మరింత మెరుగు పర్చుకునే సాధనాలవుతాయి. ఉద్యమించి సాధించుకున్న హక్కులు, ప్రజాతంత్ర విలువలు వ్యవస్థీకృతం అయితే అవి శాసనరూపం తీసుకుంటాయి. హక్కులు రక్షించబడాలంటే ఆశాసనాలు సక్రమంగా అమలుపర్చబడాలి.
ప్రజాస్వామిక అవసరాలు: ఈనాటి ప్రజాస్వామిక అవసరాలు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తుంటాయి. హక్కులు ప్రజా చైతన్యంలో ఉంటాయి. ప్రజాతంత్ర విలువలు సాధించుకునే మద్దతు, సాధించుకున్న హక్కులూ, విలువల వ్యవస్థీకరణ జరిగేట్లు చూడడం, వాటిని వాస్తవంగా ప్రజలకు అందేలా చూడటం ఒక బాధ్యత. అది పీడిత ప్రజలకు కాకుండా పీడిత వర్గాలకు ఉపయోగపడుతున్నట్లయితే ప్రతిఘటించడం, సాధించుకున్న హక్కులనూ, విలువలనూ రక్షించుకుంటూ విస్తరించుకోవడానికి కృషి చేయడం ముఖ్యమైన కర్తవ్యం. భారత ప్రభుత్వం జాతీయ మానవ హక్కుల కమీషన్ 12 అక్టోబర్ 1993న ఏర్పర్చబడి దేశంలో మానవ హక్కుల చైతన్యానికి మార్గం ఏర్పడింది. ఈ కమీషన్ మానవ హక్కుల ఎజెండాను ఒక ప్రచార కార్యాచరణగా ముందుకు తీసుకుపోతుంది.
‘మానవ హక్కుల’ చైతన్యాన్ని మన సమాజంలో కలిగించ డానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలైన Amnesty International, Asia Watch, Commonwealth of Human Rights, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు (NGOs), పౌర హక్కుల వేదికలు, మానవ హక్కుల వేదికలు ఉన్నాయి.
మానవ హక్కుల సార్వలౌకిక ప్రకటన: 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్యసమితి ”మానవ హక్కుల సార్వలౌకిక ప్రకటన” (Universal Declaration of Human Rights) ను ఆమోదించి వెల్లడించింది. ఆసక్తి ఉన్న ప్రపంచ దేశాలను ఆహ్వానించి అసెంబ్లీలో 423 (వి) తీర్మానం ద్వారా ‘మానవ హక్కుల రోజు’ను 1950 నుండి అధికారికంగా అమల్లోకి తెచ్చింది. ప్రప్రథమంగా ప్రపంచ ప్రజలందరికీ సమానంగా మానవ హక్కులను అందుబాటులోకి తెస్తూ ఐక్యరాజ్య సమితి ఆధునిక మానవ జాతి చరిత్రలో మైలురాయిగా నిలిచింది.
నలభై అనుచ్ఛేదములతో (ఆర్టికల్స్) ప్రస్తావన (Preamble) తో ప్రారంభమయి ఈ ప్రతిజ్ఞ ప్రకటితమయింది.
మానవ సముదాయంలోని సభ్యులందరికీ పుట్టుకతో వారసత్వంగా వచ్చిన గౌరవము, అన్యాక్రాంతం చేయడానికి వీలులేని సమాన హక్కులను గుర్తించడం, స్వాతంత్య్రం, న్యాయం, శాంతులను ప్రపంచమున ప్రతిష్టించడం.
మానవజాతి అంతరాత్మను క్షోభపెట్టే ఘోరమైన అనాగరిక చర్యలు, మానవ హక్కుల పట్ల తిరస్కార ధిక్కార భావాల ఫలితంగా మానవులందరూ విశ్వాసాన్నీ, స్వాతంత్య్రాన్నీ, వాక్స్వాతంత్య్రాన్నీ, భయవిముక్తినీ, దారిద్య్ర విముక్తినీ అనుభవించడానికి అనువైన ప్రపంచ ఆవిర్భావమే సామాన్య జనుల ఆకాంక్షగా చెప్పబడింది.
నిరంకుశ పాలనలు, ప్రజాపీడనలపై గత్యంతరంలేని స్థితిలో మానవుడు తిరుగుబాటు చేయవలసిన పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే చట్టబద్ధమైన పరిపాలనచేత మానవ హక్కులు పరిరక్షింపబడటం అత్యవసరం.
రాజ్యాల మధ్య సౌహార్ద్ర సంబంధాల వృద్ధికి దోహదపడటం అత్యవసరం. మౌళికంగా మానవ హక్కుల యెడల వ్యక్తుల గౌరవ యోగ్యతలు, స్త్రీ పురుషులకు సమాన హక్కుల యెడల తమకున్న విశ్వాసాన్ని ఐక్యరాజ్య సమితి ఆజ్ఞాపత్రంలో పునరుద్ఘాటించి సామాజిక ప్రగతినీ, ఉన్నత జీవన ప్రమాణాలనీ, విశాల స్వాతంత్రంతో పెంపొందించడానికి నిశ్చయించుకుంంది.
మానవ హక్కులు, మౌళిక స్వాతంత్య్రాల పట్ల శ్రద్ధ చూపుతూ సార్వలౌకిక (Universal) గౌరవాభివృద్ధిని, సర్వసాధారణ అవగాహనను, ఐక్యరాజ్యసమితి సహకారంతో సాధించడానికి సభ్య రాజ్యాలు ప్రతిజ్ఞ చేశాయి. ఈ ప్రతిజ్ఞ సాధనకు ప్రధానమైనవి పైన అంశాలు.
ఈ సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను సమాజంలోని ప్రతి వ్యక్తీ, సమాజంలోని ప్రతి విభాగమూ మనసులో చేర్చుకొని విద్యాబోధనలలో మానవ హక్కులు, స్వాతంత్య్రాలపట్ల గౌరవం పెంపొందించడానికి జాతీయంగా, అంతర్జాతీయంగా అభ్యుదయ విధానాలను అనుసరిస్తూ సభ్య దేశాలతో, ప్రజలతో ఆమోద అంగీకారాలను సాధించాలి. ఈ ఆశయాలతో సకల మానవులకు అన్ని ప్రాంతాల్లో సమాన ప్రమాణాలను కాపాడునదిగా ఈ ప్రకటన సర్వసభ్య సమావేశం ఉద్ఘాటిస్తుంది.
మానవ హక్కులంటే: క్లుప్తంగా మానవ హక్కులు ఏమిటంటే: 1. మనుషులందరూ సమానులుగా సమానత్వపు హక్కు ఉంటుంది, 2. వివక్ష అనేది కూడదు, 3. జీవించే హక్కు,4. బానిసత్వ నిర్మూలనం, 5. ఎవరు ఎవర్నీ చిత్రహింసలు పెట్టరాదు, 6. వ్యక్తిగా గుర్తింపు హక్కు, 7. సమాన రక్షణ హక్కు, 8.న్యాయస్థానాల చేత హక్కుల పరిరక్షణ, 9. ఎవర్నీ అక్రమంగా నిర్బంధించడం, బహిష్కరించడం చేయరాదు, 10. న్యాయమైన బహిరంగ విచారణ హక్కు, 11. నేరస్థులుగా నిరూపించబడనంత వరకు నిరపరాధులే, 12. గౌరవ ప్రతిష్టల పరిరక్షణ హక్కు, 13. స్వేచ్ఛా సంచారణ హక్కు, 14. రక్షణాశ్రయ హక్కు,15. జాతీయత హక్కు, 16. స్వేచ్ఛా వివాహ, కుటుంబ హక్కు, 17. ఆస్తి హక్కు,18. విశ్వాస హక్కు, 19. భావ వ్యక్తీకరణ హక్కు, 20. సమావేశపు హక్కు,21. ప్రజాస్వామ్య హక్కు, 22. భద్రత పొందే హక్కు, 23. పని హక్కు, 24. కార్మిక హక్కులు, 25. హక్కుల సాధనా యంత్రాంగం ఏర్పాటు, 26. సామాజిక భాధ్యత హక్కు, 27. ఐక్యరాజ్య సమితి ప్రకటన
ాక్కులు అందరూ ఆచరించాలి.
మానవ హక్కులు కాపాడేందుకు మనమేం చేయాలి?: మానవ హక్కులు ఎందుకు అవసరమో మనకు మనం తెలుసుకుంటూ ఇతరులకు తెలియచెప్పాలి. ”సార్వలౌకిక మానవ హక్కుల ప్రకటన”ను చదివి ఇతరులతో పంచుకోవాలి. మానవ హక్కుల కోసం నిలబడిన వ్యక్తుల గురించి సోషల్ మీడియాలో కథనాలు పెట్టాలి. ఎవరి హక్కులైనా ఉల్లంఘనకు గురవుతున్నపుడు దాన్ని ఎలుగెత్తి చూపిస్తూ మనం మాట్లాడాలి.
ఎవరైనా వీథుల్లో, ప్రయాణాల్లో, దుకాణాల్లో, పాఠశాలల్లో వేధింపులకూ, అవమానాలకూ గురవుతుంటే వాళ్ళ పక్షాన నిలిచి వాటిని ప్రతిఘటించాలి. మానవ హక్కుల కోసం పనిచేస్తున్నన
వాళ్ళు వేధింపులకు, నిర్బంధాలకు గురవుతున్నపుడు సోషల్ మీడియా ద్వారా వారి పక్షాన నిలబడాలి. మానవ హక్కులు కాలరాయబడిన బాధితుల పక్షాన నిలబడి ఆయా సంఘాలను ఆదుకోవాలి. మానవ హక్కులను సపోర్టు చేస్తూ ప్రజా సంఘటనలు, సమావేశాలూ వీథుల్లో కానీ, ఇతర విధాలుగా కానీ జరుగుత్నుపుడు వాటిలో కలిసిపోవాలి.
నాయకులు అనబడే వారిని కలిసి మానవ హక్కులను నిలబెట్టమని చెప్పాలి. ప్రభుత్వాలను లాబీ చేస్తూ సంబంధిత పిటిషన్లపై సంతకం చేయమనీ, శాసనసభ్యులను కలుసుకొని మానవ హక్కుల స్నేహపూర్వకమైన చట్టాలను పాస్ చేస్తూ అస్నేహపూర్వకమైన వాటిని తొలగించమని చెప్పాలి. మత, స్థానిక, సాంస్కృతిక నాయకులను, కులపెద్దలను మానవ హక్కులకు నిబద్ధమై ఉండమని కోరాలి. ప్రతిరోజూ దైనందిన జీవనంలో వాస్తవాలతో కల్పితాలను పోల్చిచూస్తూ నిత్యం జరిగే సంభాషణల్లో ప్రమాదకరమైన విషయాలను సవాల్ చేయాలి. సహన భావనలతో అహంకారాలను తగ్గించుకోవాలని మాట్లాడాలి. మనల్ని మనం పరీక్షించుకుంటూ మన భావాలను, అహాలను సవాల్ చేసుకోవాలి. మన పిల్లలతో మానవ హక్కుల గురించి మాట్లాడుతూ వివిధ నమూనాల గురించి తెలియచెప్పాలి.
మనం చేయాలనుకుంటే చేయవలసినవి దైనందిన జీవన క్రమంలో చాలా ఉంటాయి. మనకెందుకులే అనో, ఇది కేవలం ప్రభుత్వాల పని అనో, లేదా కొందరు వ్యక్తులు, సంస్థలు అదే పనిగా పట్టించుకోవాల్సిన అంశమనో అనుకుంటే చాలా ప్రమాదకరం. ప్రజల్లో చాలా వరకు మానవ హక్కుల పట్ల జ్ఞాన శూన్యత, అవగాహనా రాహిత్యం, ఉదాసీన వైఖరి ఉండటం వల్లనే ప్రపంచంలో మానవ హక్కుల ఉల్లంఘన హీనాతిహీనంగా జరుగుతూ మానవ దు:ఖానికీ, హననానికీ కారణమవుతోంది.
ప్రభుత్వాలు ప్రాథమిక పాఠశాల స్థాయినుండే మానవ హక్కుల గురించి పిల్లలకు తెలియచెప్పే విధంగా విద్యా విధానం రూపొందించాలి. ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడూ మానవ హక్కులను గౌరవించడం, ఆచరించడం, ప్రచారం చేయడం తన బాధ్యతగా గుర్తించాలి.
మానవ హక్కులు – మహిళలు: మానవ హక్కుల ఉద్యమం అనేది పుట్టకముందు నుండీ కూడా మనిషికి పుట్టుకతోనే సహజమైన హక్కులుగా మానవ హక్కులు ఉన్నాయి. తరువాత అమెరికన్ విప్లవం మానవ హక్కుల చార్టర్‌కు దారి తీసింది. రష్యన్ విప్లవం దాన్ని మరింతగా విస్తృతపరిచింది. భారత రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కుల (Fundamental Rights) రూపంలో ప్రకటించింది.
శతాబ్దాలుగా ఎంతో అసంతృప్తి, ఆందోళనా రగిలిన తర్వాత నాగరిక ప్రపంచం మహిళలకు సమాన స్థాయిని వారి వారి రాజ్యాంగాల్లో చేర్చింది. సగం ప్రపంచమైన స్త్రీలు క్రమంగా కష్టాలను, అడ్డంకులను ఒకటొకటిగా దాటుతూ వారి స్థానంలోకి వస్తున్నారు. ‘మహిళల హక్కులూ మానవ హక్కులే’ అని బలంగా డిమాండ్ చేస్తున్నారు. అయినా సమాజం మాటలకూ, చేతలకూ ఎంతో వైరుధ్యం ఉంటోంది. సామాజిక వాస్తవికత, అనుభవం, విషతుల్యమైన, కుట్రపూరితమైన భావనలనూ, చర్యలనూ ప్రత్యక్షంగా చూపుతోంది.
ఒక్క చట్టాలు మారితే సరిపోదు. పెద్దలు ధర్మపన్నాలను వల్లిస్తే ఏమీ ఒరగదు. మహిళల పరిస్థితుల్లో సముద్రమంత మార్పు రావాల్సి ఉంది. భారతదేశంలో మహిళలు అధికార రాజకీయ రంగంలోకి రావడానికి మన రాజ్యాంగం గ్రామ పంచాయితీల నుండి పార్లమెంటు దాకా అవకాశం హక్కుగా ఇచ్చింది. కానీ వాస్తవంలో స్త్రీలు ఆ హక్కు నుండి వంచింపబడుతున్నారు. మహిళాభ్యుదయం శుష్కవాదాలూ, శూన్యహస్తాలుగా ఉండిపోయింది. కేవలం మహిళలే అయినందుకే అన్యాయంగా సమర్ధులైన తెలివైన మహిళలు విస్మరణకు గురవుతున్నారు. ఇది సాధారణ పరిస్థితి. ఒకరో, ఇద్దరో మహిళలు పెద్దస్థాయిలో ఉండటం, రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుండటం ఈ పరిస్థితిని ఏమీ మార్చదు, కేవలం ఏమార్చడమే అవుతుంది.
ఏళ్ళుగా పురుష దురహంకారాన్ని (Chauvinism) అధిగమిం చడానికి స్త్రీలు ఎంతో సంఘర్షిస్తున్నారు. అదేవిధంగా మన సాంఘిక నిర్మాణాన్ని మార్చడానికీ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకూ కూడా ఆత్మవిశ్వాసం కొరవడటం, చొరవ చూపలేకపోవటం, మహిళోద్య మంలో నిస్తబ్దత ఏర్పడటానికి కారణమయ్యాయి. ఆత్మవిమర్శతో ఒక నిర్ధిష్ట ప్రణాళికతో ఉద్యమించాల్సి ఉంది.
మహిళోద్యమం ముందర ఎన్నో సవాళ్ళు, చేపట్టాల్సిన చర్యలు ఉన్నాయి. ప్రభుత్వాలు చేసే వాగ్దానాలు, ప్రకటనలను ఆచరణలోకి తేవడానికి బలం కూర్చే తీర్మానాలు చేయించడాన్నీ, ప్రజాభిప్రాయాన్ని భవిష్యత్ ప్రగతి కోసం నిర్మించాల్సిన ఆవశ్యకతా ఉంది.
స్త్రీ విముక్తి అనేది సంక్లిష్టమైన పని. రాచరిక వ్యవస్థను కూలదోయడానికి శతాబ్దాలు పట్టినట్లుగా స్త్రీ విముక్తి కోసం ఇంకా సుదీర్ఘమైన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. స్త్రీ సమానత్వాన్ని కోరుకునే వాళ్ళే దాన్ని సాధించుకోవాలి అంటారు. ఇది అవమానకరమైనదీ, సవాల్ చేసే విషయం.
స్త్రీ సాధికారత, విముక్తి అనేవి పురుషుల్ని ద్వేషించే విషయాలు కావు. ఈ విషయాన్ని మూర్ఖత్వం తలకెక్కించుకున్న సమాజానికి తెలిసేట్లు చేయడానికి స్త్రీ విముక్తికారులు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. సగం మానవజాతిని మరో సగం మానవజాతి ఎందుకు ద్వేషిస్తుంది? స్త్రీ తన తండ్రినీ, అన్నదమ్ములనూ, భర్తనూ, కొడుకునూ, ఇతర బంధువర్గంలోని మగవాళ్ళని ఎందుకు ద్వేషిస్తుంది? అదే సమయంలో ఆమెనో పురుగుగానో, పశువుగానో, మానవేతర ప్రాణిగానో, అనవసరపు బరువుగానో భావించడాన్ని వ్యతిరేకిస్తుంది. ఆమె మానవప్రాణి. ఆమెకు ఆత్మగౌరవం, అంతర్గత హుందాతనం ఉంటుంది. వాటిని ఏ దశలోనూ వదులుకోవడానికి ఆమె ఇష్టపడదు.
ఎంత వెనకబడి ఉందీ సమాజం. స్త్రీ కూడా మనిషే అని తెలియజెప్పాల్సినంత కటిక చీకటిలో తచ్చాడుతున్నదీ సమాజం.
అన్ని విధాలా పురుషునితో సమాన తెలివితేటలు, శక్తిసామర్థ్యాలతో పాటుగా అదనంగా పిల్లలను గర్భంలో పది నెలలు మోసి జన్మనిచ్చే శక్తిని కలిగి ఉన్నది స్త్రీ. అందుకుగానూ ఆమె మానవాళి అభివృద్ధికీ, చేస్తున్న సేవలకూ ఆమెకు ఎంతో గౌరవ సత్కారం ఇవ్వాలి.
తన శరీరంపై తనకు స్వాతంత్య్రం, హక్కు, తన అభీష్టాలు ఆకాంక్షలు నెరవేర్చుకునే హక్కు, మనిషిగా మానవ గౌరవంతో జీవించే హక్కు. వివాహం, పని, చదువు, ఉద్యోగం ఎంపిక హక్కు. తల్లిగా పునరుత్పత్తిపై హక్కు. ముఖ్యంగా లైంగిక అత్యాచారాల నుండి స్త్రీలను భద్రత సమాజ పరిధిలోపలికి రానిస్తే తప్ప… ఆమెపై రోజూ కుటుంబంలో, సమాజంలో, రాజ్యపరంగా జరిగే అత్యాచారాలు, దాడుల నుండి విముక్తి చేస్తే కానీ సంపూర్ణ మానవిగా ఆమె ఎదుగుదల, ఉత్పత్తిదాయక చైతన్య వికాసం జరగదు.
స్త్రీ విద్య దేశంలో ఇంకా అంతంత మాత్రంగానే ఉంది. చదువు, విద్య లేక సామాజిక వ్యవస్థల పట్ల కనీస జ్ఞానం లేక, చేసేందుకు ఉత్సాదకమైనవిగా గుర్తింపబడిన పనులు లేక, పేదరికంలో, నిరుపయోగులుగా, అనవసరపు బరువులుగా చీకటి బ్రతుకులు ఈడుస్తున్నారు. మానవజాతిలో సగంగా ఉన్న స్త్రీలకు చట్టాల పట్ల, తమకున్న మానవ హక్కుల పట్ల కనీస జ్ఞానం ఉండదు. సగం బానిసలుగా, అజ్ఞానులుగా, అవమానకరంగా దుర్భర జీవితాలు గడుపుతున్నారు.
స్త్రీలు అసంఘటిత రంగాల్లో గొడ్డుచాకిరీ చేస్తున్నా, నిత్యం ఇంటి అవసరాల కోసం ఎంతో శ్రమిస్తున్నా వారిది అల్పాదాయం కావడంవల్లా, అనుత్పాదక (ఇంటి) శ్రమ కావడ వల్ల తక్కువగా చూడబడుతున్నారు.
సమగ్ర స్త్రీ విద్యపట్ల ప్రభుత్వ విధానమేదీ? భర్త చనిపోయిన స్త్రీలు అఘాయిత్యాలకూ, అమానవీయతకూ గురై తిరస్కృతులుగా కృశించిపోతున్నా పట్టించుకునే వారేరీ? మానవ వనరుల పట్ల నిర్దాక్షిణ్యత, అమానుషత, విధ్యంసత అనేవి సమాజ శాంతినీ, అభివృద్ధినీ దారుణంగా ధ్వంసం చేస్తుండడాన్ని నిలువరించడానికి మహిళల హక్కుల్ని మానవ హక్కులుగా గుర్తించి ఆచరించలేని అసమ సమాజపు కౄరత్వం కారణమవుతోంది.
ఈ సమాజం మనం సృష్టించి రూపొందించుకున్నదే. సమాజం పట్ల నియమాలు, విలువలు, ఆచారాలు, భావనలు, మనం ఏర్పరచుకున్నవే. మరి సాటి మానవుల పట్ల తేడాలు, అంతరాలు, వివక్షతలు, అణచివేతలు, దోపిడీలు ఎందుకు? ఒక మనిషి హక్కును హరించి మరో మనిషి స్వేచ్ఛగా ఉండాలనుకోవడం ఎంత నైచ్యం? అది సాధ్యమేనా?
సామాజిక దురాచారాలకు, కరడుగట్టిన కౄరాచారాలకు, దురహంకార భావాలకు బలహీనులను బలిచేస్తూ సభ్యసమాజంలో ఉన్నామనీ, నాగరిక సమాజంలో పురోగమిస్తున్నామనీ, ఆధునికంగా జీవిస్తున్నామనీ అనుకుంటున్నదంతా భ్రమే కదా. మనం గొప్పలుగా భావిస్తూ ఆడంబరాలను అందలమెక్కిస్తున్నదంతా ఒట్టి డాంబికమే కదా. మనుషులు మనుషులుగా ఉండకుండా డొల్లగా తయారయిన విషమ పరిస్థితిని గ్రహించకుండా రక్తనదీ ప్రవాహాల్లో విహార యాత్రలు… ఇదేనా ప్రగతి? అభివృద్ధి? గ్రహాలపై నివాసాలకు మార్గాలు కనుగొంటున్న సాంకేతిక విప్లవ స్ఫూర్తి. చరిత్ర పొడుగునా సాధించిన ఘనతలూ, ఒకరిని ఒకరు దోచుకోవడం, చంపుకోవడం, యుద్ధకాంక్ష, రక్తపాతం ఇంతేనా?
తెలివితప్పిన వాళ్ళను తెలివిలోకి తెచ్చేందుకు… తెలివిలో
ఉన్నవాళ్ళు మానవ హక్కుల మహోద్యమంలో భాగస్వాములు కావడం అంతర్జాతీయ మానవ హక్కుల దినం 10 డిసెంబర్ ఇస్తున్న సందేశం.