కె.సుభాషిణి కథలు – స్త్రీ జీవిత చిత్రణ – ఆచార్య మూలె విజయలక్ష్మి

స్త్రీలు అన్ని రంగాల్లో అడుగిడినారు. మెరుగైన జీవితానుభవాలను పొందుతున్నారు. ఇంకా చర్చలు, సమావేశాలు, సదస్సులు, సాహిత్యం అవసరమా అనే ప్రశ్న పురుషుల నుండి ఎదురవుతోంది. మహిళలు ప్రగతి పథంలో ఉన్నారు. కాదనలేం. ఆకాశంలో సగం జనాభాలో వాస్తవానికి ఎంత శాతం? పితృస్వామ్య భావజాలం నరనరాన ఇంకిపోయిన సమాజంలో గృహిణులైనా, ఉద్యోగస్తులైనా, ఆర్థికంగా స్థితిమంతులైనా స్త్రీల ఎదలోతుల్లోకి వెళ్ళి పరామర్శిస్తే పడుతున్న పాట్లు, మానసిక క్షోభ, శారీరక హింస, అణచివేత, స్వేచ్ఛారాహిత్యం, లేని నిర్ణయాధికారం హృదయాన్ని ద్రవింపజేస్తాయి. ఈ సమస్యల వలయం నుండి బయటపడి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్ననాడు మహిళా సమస్యల గురించి మాట్లాడుకోవలసిన, చర్చించుకోవలసిన అవసరం లేదు.

తరతరాల స్త్రీ జాతి తిమిరానికి వెలుగు రేఖ స్త్రీ వాద సాహిత్యం. 1975-85 మహిళా శతాబ్దంగా గుర్తించడం స్త్రీ చైతన్యానికి చేయూతనిచ్చింది. తెలుగు స్త్రీ వాద సాహిత్యం ఊపందుకుంట్ను దశలో విమర్శలను ఎదుర్కొన్నా గట్టిగానే తిప్పికొట్టింది. స్త్రీ వాద సాహిత్యం వల్ల సమాజానికి, ముఖ్యంగా స్త్రీలకు ఒనగూడింది ఏమిటి? అని ప్రశ్నించుకుంటే తమ గురించి తాము ఆలోచించుకునే, వివేచించుకునే వివేకాన్ని ప్రోదిచేసింది. సమాజం మూస ధోరణిని వదిలి, స్త్రీ దృక్కోణం నుంచి చూపు సారించడం నేర్పింది. మరబొమ్మగా కాకుండా మనసున్న మనిషిగా చూడాలని ఉద్బోధించింది. భర్త జీవితమే తన జీవితమనుకునే స్త్రీకి, తనకంటూ ఒక జీవితం ఉందని సూచించింది. నియంతలా వ్యవహరించే పురుషుని అజమాయిషీని ఆర్థిక, శారీరక, సామాజిక అంశాలపై ఆంక్షలను, నియంత్రణను నియంత్రించే యత్నం చేసింది. కులం, మతం, వర్గం, ప్రాంతం కూడా స్తీ పరివేదనకు, కుంగుబాటుకు, అణచివేతకు, అలజడికి కారణమవుతున్నాయని వెల్లడించింది. ఆయా కులాలు, వర్గాల నుండి రచయితలు తమ అస్థిత్వాలను, అనుభూతిని అక్షరీకరించుకోవడం నేటి సాహిత్య పరిణామం. అయితే స్త్రీలకు సానుకూలంగా పురుషాధిపత్యంపై పురుషులు కలంపోటు వేశారు. నారీమణులు నారి సంధించారు. సాహిత్య భేరి మోగించారు. ఫలితం.. మారిన సమాజం, మారుతున్న సమాజం. మారని సమాజం, మారని మనిషి కోసం, మానవతా విలువలు విప్పి చెప్పడం కోసం సాహిత్య స్రవంతి కొనసాగాలి. అందుకే నేటికీ స్త్రీల సమస్యలకు స్పందించే సాహిత్యం వెలువడుతోంది.

ఇప్పటికీ సమాజంలో మహిళ అంటే చులకన, చిన్నచూపు. మహిళా శక్తి మీద అపనమ్మకం. మహిళ స్వేచ్ఛకు అడుగడుగునా అడ్డుకట్టలు. ప్రగతిని ప్రోత్సహించరు. ముందుకు ముందుకు తోసుకుపోతుంటే ఓర్వలేనితనం. ఆమె ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అయితే మెప్పులు. తిరగబడి అడిగితే నోటట్టం మనిషి. మహిళ జాగృతిని జీర్ణించుకోలేని జనాలు మారుతున్న కాలంలో మహిళ ద్విపాత్రాభినయం చేస్తూ ఉరుకులు, పరుగులతో ఉక్కిరి బిక్కిరవుతున్నా, ఊడిగం చేస్తున్నా నేటి మహిళ చూపు చురుగ్గా

ఉంది. ఏటికి ఎదురీదుతూ గమ్యంవైపు సాగుతోంది. దారిలో సవాలక్ష సవాళ్ళు. ఇంటా బయటా ఒడిదుడుకులు. సజావుగా, సమంగా జీవితాలు సాగేదెన్నడో!

రాయలసీమ వెనుకబడిన ప్రాంతం. పురుషాధిపత్యం రాజ్యమేలుతున్న ప్రాంతం. ఈ ప్రాంతం నుండి రచయిత్రులను వేళ్ళమీద లెక్కించవచ్చు. కె. సుభాషిణి.. కర్నూలు జిల్లా రచయిత్రి. వీరి కథలు ”మర్మమెల్లా గ్రహించితి తల్లీ” (2008), ”అమూల్య” (2016) సంపుటాలుగా వెలువడ్డాయి. విద్యా విధానంలో ఒత్తిడి, విద్యా సంస్థల మోసం, వసివాడుతున్న పసిబిడ్డల జీవితాలు, పెళ్ళి ముసుగులో మహిళలపై జరుగుతున్న అరాచకం, పిల్లల పెంపకం, ఆడ-మగ వివక్ష, తరతరాల పురుషాధిపత్యంలో నలుగుతున్న మహిళ జీవితం, కులాంతర వివాహాల పరిణామాలు, ప్రాంతీయత… వీరి కథా వస్తువులు.

స్త్రీల ఆలోచనా శక్తిని, శక్తి సామర్ధ్యాలను అణచివేసేది ఇంటి చాకిరీ. పిల్లల పెంపకం, ఆడ-మగ వివక్షపై రచయిత్రి దృష్టి పెట్టారు. పెళ్ళి కాగానే వంటిల్లు కొంగు పట్టుకుంటుంది. అదొక యాంత్రిక జీవితం. సృజనాత్మకతను కోల్పోయి రుచిగా వండి వార్చటంలో మునిగి తేలి, కోల్పోయిందేదో తెలుసుకున్న మహిళ కథ ”జారవిడుచుకున్న రంగులు”.

స్త్రీలను వంటింటికి పరిమితం చేయాలనుకునే పురుషుని చాదస్తాన్ని చాటిచెప్పిన కథ ‘చీకట్లో చూపు’.

నయవంచకుడైన భర్త, వత్తాసు పలికిన అత్తమామలు. తన స్థానం తెలుసుకుని గుణపాఠం చెప్పిన కోడలి కథ ‘అనురాధ’.

‘అమ్మను యాభై సంవత్సరాలపాటు వంటింటికి పరిమితం చేసి ఆమెకు బయట ప్రపంచం లేకుండా చేశారు. అక్కవాళ్ళనూ అంతే, వదిన పరిస్థితీ అంతే. ఇప్పుడు అరుణను కూడా అలాగే చేయాలనుకుంటున్నారు. అది అసలు జరిగే పనికాదు. ఆలోచించి అర్థం చేసుకోండి. ఎంతమంది నలిగిపోయారో’ అని అరుణకు బాసటగా నిలబడి తండ్రికి కర్తవ్యబోధ చేశాడు. తండ్రే మార్పు పొందాలన్న వాస్తవాన్ని విడమరిచాడు రవి.

వివాహం అంటూనే ఇంట్లో వండి వార్చడానికి ఒక ఆడమనిషి వస్తుందని ఆనందించడం సమాజ వాతావరణం, అప్పటివరకున్న అభిరుచులు, ఆలోచనలు కుచించుకు పోయి, వంటింటి సామ్రాజ్యం విస్తరిస్తుంది. ఇంటి చాకిరీకి స్త్రీని పరిమితం చేయడాన్ని పై మూడు కథల్లో రచయిత్రి ఖండించారు. తన జీవితాన్ని గురించి ఆలోచనాత్మకంగా పరామర్శించుకునే స్త్రీ పాత్రలను సృష్టించారు. కుటుంబ వాతావరణం ఇంటి చాకిరీలో కూరుకుపోయేలా చేసినా తేరుకుని వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని ఆలోచించి అడుగెటు వేయాలో నిర్ణయించుకున్నారు.

ఇంటి చాకిరీతో పాటు స్త్రీని కుంగదీసేది పిల్లల పెంపకం బాధ్యత. పిల్లలు కనడంలో భార్యా భర్తల ప్రమేయమున్నా, పిల్లల పెంపకం భారం మాత్రం తల్లిపైనే. విద్య, ఉద్యోగాలు మానుకోవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి సహకరిస్తే ఫర్వాలేదు. లేకుంటే స్త్రీ పరిస్థితి ఎలా ఉంటుందో కళ్ళ ముందు పెట్టిన కథ ‘అన్వేషణ’.

ఆడ-మగ వివక్ష విషబీజాలు పిల్లల్లో ఇంకింపజేయడానికి పాఠ్యపుస్తకాలు, ప్రకటనలు లాంటివి ప్రధాన దోహనకారులని, పెంపకంలో తేడా లేకుండా చూడడం కుటుంబం నుండే రావాలని రచయిత్రి సూచించారు.

ఆడ-మగ తేడాను పిల్లల మనసుల్లో పితృస్వామ్య భావజాలాన్ని నరనరాన ఇంకించే వ్యవస్థను ఎత్తి చూపిన కథ ”మర్మమెల్లాగ్రహించితితల్లీ”.

ఆడ, మగపిల్లల పెంపకంలో వివ్షను, తరాల మధ్య అంతరాన్ని విస్పష్టం చేసిన కథ ‘ఏనుగు అడవిలోకి పారిపోతుంది’.

మర్మమెల్ల గ్రహించితి తల్లీ, ఏనుగు అడవిలోకే పారిపోతుంది. కథల్లో భర్త స్థానంలో ఉన్న పురుషుడ్ని కుటుంబం పట్ల, పిల్లల పెంపకంలో బాధ్యతాయుతంగా, ఆదర్శవంతంగా రచయిత్రి చిత్రించారు. ఇంటి పని, పిల్లల పనుల్లో చేదోడువాదోడుగా ఉంటూ కూడా పనిచేస్తూ భర్తంటే కుటుంబంలో ఎలా ఉండాలో చెప్పకనే చెప్పింది. ఒకరికొకరు సహకరించుకుంటూ, సామరస్యంగా సజావుగా సంసారం నడుపుకోవాల్సిన పద్ధతిని చూపెట్టింది. ఈ కథల్లో భర్త పాత్ర చిత్రణ చదువుతున్న పాఠకుడ్ని ఆలోచింపచేస్తుంది. మనస్తత్వ మార్పుకు దోహదపడుతుంది. పెద్ద తరం వారికి మగవాడు వంటా వార్పు, ఇంటిపని, పిల్లల పనులు చేయడం విడ్డూరంగా అన్పించినా, మారుతున్న సమాజంలో మరీ ఇరువురూ

ఉద్యోగులైతే లేచినప్పటినుండి ఉరుకులు పరుగులే. ఇరువురు పనిలో భాగస్వాములయితే స్త్రీకి వెసులుబాటు. శారీరక శ్రమ తగ్గుతుంది. ఎటొచ్చీ పిల్లల్లో స్త్రీలే ఇంటిపని, వంటపని చేయాలనే భావజాలాన్ని నూరిపోసే ప్రకటనల పట్ల, పాఠ్యపుస్తకాల పట్ల జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కులం కట్టుబాట్లు తెంచుకుని కులాంతర వివాహాలు చేసుకున్నా మళ్ళీ కుల చట్రంలో బిగుసుకుపోవడమేనా! దానికి చట్టాలు, తీర్పులు కూడా తోడవుతూ పితృస్వామిక సమాజపు విలువలకు విలువ ఇస్తున్నాయని, స్త్రీ ప్రాధాన్యతను, విలువలను తగ్గిస్తాయని ”నాణెంకు మూడోవైపు” కథలో విమర్శించారు. నీరజది కులాంతర వివాహం. ఇద్దరు పిల్లలు. లక్షల కట్నం వదులుకుని పెళ్ళి చేసుకున్నానని పదేపదే భర్త ఎత్తిపొడుపు. అతనికి శారీరక సుఖం, ఆమె ఉద్యోగంతో వచ్చే డబ్బు యావ. భార్యా బిడ్డలను వదిలేసి మరో సంసారం సాగిస్తున్న నయవంచకుడు.

కులాలను ధిక్కరించి పెళ్ళి చేసుకున్నవాళ్ళ పిల్లలను మళ్ళీ ఏదో కులంలో బంధించటమేనా? ప్రత్యామ్నాయం ఏమిటి? అసలు కులాంతర వివాహం చేసుకున్నవాళ్ళకు ప్రత్యేక రిజర్వేషన్‌ ఉంటే ఎలా ఉంటుంది? అని నీరజ ఆలోచన.

రిజర్వేషన్‌ ఉన్న, లేని కులస్థుల మధ్య వివాహ బంధాలేర్పడినపుడు, తండ్రి కులానికి రిజర్వేషన్‌ లేకపోతే సంతానం కోల్పోవటం లేదా! భార్యాబిడ్డలను నట్టేట్లో ముంచిన పురుషుని కులం వర్తించడం న్యాయమా! సంతానాన్ని కని, సాకి, సంతరిస్తున్నా ఇంటిపేరు, కులం, గోత్రం తండ్రిదే ఉండాలనడంలో సామంజస్యమేమిటి? సుప్రీంకోర్టు తీర్పు పితృప్వామ్య విలువలకు విలువ ఇవ్వటం లేదా! సమాజంలో స్త్రీ స్థానం, ప్రాధాన్యాన్ని తగ్గించటం కాదా! అన్న ఆలోచనలను ప్రేరేపించింది పై కథ.

మతాంతర వివాహాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగాదు. ఆలోచనలకు, అభిప్రాయాలకు విలువ లేదు. స్త్రీకి మతాచారాల పట్ల విముఖత ఉన్నా, భర్త కుటుంబ మతాచారాలకు అనుగుణంగా ఒదిగిపోవాలన్నది పురుషుడి అభిమతం. తన అభిమతానికి, అభిప్రాయానికి భిన్నంగా నడుచుకోలేని ఏ మతాచారాలకు బందీని కాలేనని తెగేసి చెప్పి వలచినవాడ్ని వదులుకున్న యువతి కథ ‘సంకెళ్ళు నీకు బై…బై’.

విలాసవంతమైన జీవితం కోరుకునే కొడుకుతో అండ కోల్పోయి స్వంత కాళ్ళపై సామాన్య జీవితం గడుపుతూ,

ఉన్నంతలో పొదుపుగా బతికే తల్లి పడే వేదన ‘రమాదేవి కొడుకు’.

పదవ తరగతి చదువుతున్నప్పుడే పెండ్లి చేసిన తండ్రి. పిల్లల్ని వదిలేసి అర్థంతరంగా లోకాన్ని వదిలిన భర్త. అప్పులపాలు చేస్తున్న కొడుకు… ఇదీ రమాదేవి జీవితం. తల్లి అటెండర్‌ అని చెప్పుకోవడం కొడుక్కి నామోషీ. భర్త పోవడంతో వచ్చే జీతంతో పొదుపుగా జీవితం నెట్టుకొస్తోంది రమాదేవి. కొడుకుకు విలాసవంతమైన జీవితంపై మోజు. ఖర్చుపెట్టే దమ్ము లేదు. సంపాదించే తెలివితేటలు లేవు. ఉన్నవి ఖర్చు కాకుంటే చాలు అన్నది రమాదేవికి. మంచి ఇంట్లో, విలువైన సామాన్లు ఉంటే సమాజంలో విలువ ఉంటుంది. అందుకే ఒకటి కాకపోతే మరో వ్యాపారం మొదలు పెడతానంటాడు. ఉన్నదంతా పెట్టుబడి పెడితే లాభసాటి కాకపోతే ఎలా? ఇది తల్లి యాతన. తనను సాకనక్కర్లేదు. తన జీతం, తర్వాత వచ్చే పెన్షన్‌ చాలు. జీవిత కాలమంతా కొడుకును భరించకుంటే చాలనుకుంటుంది తల్లి.

మారుతున్న సమాజంలో ఆడపిల్లలు చదువుల కోసం, ఉద్యోగాల కోసం బయటి ప్రపంచంలో అడుగిడుతున్నారు. అన్ని రంగాల్లో ఉద్యోగాలవైపు ఆకర్షితులవుతున్నారు. తమ సత్తా చాటుతున్నారు. జర్నలిజం, ఐటి రంగాల్లో వేళ కాని వేళల్లో డ్యూటీలు చేస్తున్నా వెనుకంజ వేయడం లేదు. నిర్భయ సంఘటన లాంటి అమానవీయ సంఘటనలు జరుగుతున్నాయి. స్త్రీ జాతిని, యావత్‌ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ”దీపం పురుగులు” కథ ద్వారా రచయిత్రి సూచించారు.

సామాన్యులపై లైంగిక దాడులు జరిగినా సమాజంలో చలనం ఉండదని, అలాంటి వారికి అండగా నిలవాల్సిన అవసరాన్ని తెలిపే కథ ”అరుణ కోసం”.

అరుణది మధ్య తరగతి కుటుంబం. అరుణ పట్టణంలో నర్సింగ్‌ కోర్సు చేస్తోంది. ఆమెపై అత్యాచారం జరుగుతుంది. ఆస్పత్రిలో చేర్పిస్తారు. కలెక్టర్‌, ఎస్‌పి వచ్చి వెళ్తారు. మాధవి, లత, మహేశ్వరి, మహిళా సంఘ సభ్యులు ఆస్పత్రికి వెళ్తారు. పెనుగులాటలో అరుణ తలకు గాయమవుతుంది. పట్టించుకునే వైద్యులు, సిబ్బంది లేరు. వాళ్ళకు దుండగుల పైశాచికానందం తలచుకుంటే చీదరింపు. పట్టణాల్లో అయితే గగ్గోలు పెడతారు. ఇక్కడ అరుణ వైద్యం అందక ఇబ్బంది పడుతుంది. బాధితులు తమ చావు తామే పడాలి. నిందితులను కాపాడడానికి ప్రయత్నాలు, పైగా బెదిరింపులు. అరుణ కోసం వచ్చినవారి జోక్యంతో తలకు ఆపరేషన్‌ జరిగింది. తల్లీ బిడ్డ తిండీ తిప్పల కోసం చందాలు పోగుచేసి ఇస్తారు. లత ప్లాన్‌ చేసి విద్యార్థులను కూడగట్టి అరుణకు న్యాయం కోసం పోరాటం సాగించడం కథాంశం.

తరతరాలుగా, పీడితులు, బాధితులుగా ఉన్నవాళ్ళు చైతన్యవంతులయితే ఆధిపత్య వర్గానికి అణచుకోలేని ఆవేశం రావచ్చు. ఓర్చుకోలేని బాధ కలగవచ్చు. మార్పును జీర్ణించుకోలేక పోవచ్చు. దాంతో కుటిల ఆలోచనలు రావచ్చు. యథాస్థితి కొనసాగించడానికి సమాజంలో వచ్చిన, వస్తున్న మార్పును తట్టుకోలేని పురుష ప్రపంచ నైజాన్ని బట్టబయలు చేసిన కథ ”బ్రహ్మ సూత్రాలు”. పతిని ఆనందిపచేయడం, సేవ చేయటం, వారి వంశాభివృద్ధి చేయడం ఆడవాళ్ళ నుదుటిరాత, బ్రహ్మ రాత అని అభిప్రాయం. ఇది ఆడవాళ్ళ సృష్టికి బ్రహ్మ సూత్రం.

పెళ్ళవుతూనే వంటింటికి పరిమితం కారాదని, అంతవరకు ఉన్న సృజనాత్మకతకు, ఆలోచనలకు పదును పెట్టాలని, భర్త ఇంటిపని, వంటపని, పిల్లల పనుల్లో సహకరించాలని రచయిత్రి సూచించారు. ఈ విషయాల్లో తరతరాల మధ్య అభిప్రాయాలు, అంతరాలున్నాయనీ, కరడుగట్టిన పితృస్వామ్య వ్యవస్థ భావజాలాన్ని పెంచి పోషిస్తున్న ప్రసార మాధ్యమాల ధోరణిని ఆమె ఎండగట్టారు. పిల్లల పెంపకంలో ఆడ, మగ వివక్ష చూపరాదనీ తెలిపారు. మారుతున్న సమాజంలో స్త్రీ ప్రగతికి, ముందడుగుకు అడ్డుకట్ట వేయాలనే ప్రయత్నాలు సాగుతున్నాయనీ, వాటిని తిప్పికొట్టాలనీ ప్రేరేపించారు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.