తెలుగు రచయిత్రులు – పర్యావరణ చేతనా స్పృహ – డా. తన్నీరు కళ్యాణ్‌ కుమార్

ఆధునిక ప్రపంచంలో అనేక రంగాల్లో మార్పులు కలిగినట్లుగా పర్యావరణంలో కూడా అనేక పరిణామాలు సంభవించాయి. ఆధునిక యుగం యాంత్రిక యుగం కావడంతో పర్యావరణం కలుషితమైంది. సృష్టిలోని అనంత ప్రాణకోటిలో బుద్ధి జీవి మానవుడు. మితిమీరిన స్వార్థంతో మానవుడు ప్రకృతిని వికృతిగా జేస్తూ, సృష్టిలోని సమతుల్యతను వినాశనం చేస్తున్నాడు. ప్రకృతి శక్తులను, సహజ వనరులను విచక్షణారహితంగా ఉపయోగించుకుంటూ, వాటిని మార్పులు చేర్పులకు లోను చేస్తూ పర్యావరణ కాలుష్యానికి కారకుడవుతున్నాడు. నేటి సామాజిక సమస్యలలో ఇది ముఖ్యమైనది.

ఆధునిక సాహిత్యంలో కవులు తమ రచనలలో ప్రకృతిని వర్ణించారు. ప్రకృతి ఆరాధన ఆవశ్యకతను తమ రచనలలో వ్యక్తం చేశారు. రాయప్రోలు, దేవులపల్లి, దువ్వూరి, విశ్వనాథ, జాషువా, కరుణశ్రీ, వెంకటేశ్వర పార్వతీశ్వర కవులు, నాయని సుబ్బారావు, వేదుల సత్యనారాయణ మొదలైన కవుల రచనలలో ప్రకృతి పట్ల ఆరాధనా భావం ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఈ కవులు ప్రకృతిని గురించి, ప్రకృతిలో జీవజాలాన్ని, వాటిపట్ల చూపవలసిన భూత దయను గురించి పద్యాలు రాశారు. ప్రకృతిని ఆరాధించాలని ప్రబోధించారు. వీరి కవిత్వంలో ప్రకృతిని చూసి మురిసిపోవడమే కనిపిస్తుంది కానీ భవిష్యత్తులో ప్రకృతికి కలుగబోయే వినాశనాన్ని గురించి, ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతను గురించి చెప్పినట్లు కనిపించదు.

కాలం గడుస్తున్నకొద్దీ కాలుష్యం పెరిగిపోతూ ఉండడాన్ని గుర్తించి మరికొంతమంది రచయితలు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రబోధించారు. ఈ పర్యావరణ చేతన అనేది సాహిత్యంలో విలువైన వస్తువుగా గ్రహించబడింది. తెలుగు కవులు పర్యావరణ సమస్యల పట్ల స్పందించి మానవాళికి తమ సాహిత్య సృష్టి ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే హితోపదేశం చేస్తున్నారు. రచనల ద్వారా పర్యావరణ పరిరక్షణను ప్రబోధిస్తూ ప్రజలను జాగృతం చేసి, కర్తవ్యోన్ముఖులను చేసే ప్రయత్నం చేస్తున్న తెలుగు రచయితలు, రచయిత్రులు అభినందనీయులు.

గతంలో సముద్ర జలాలు స్వచ్ఛంగా ఉండేవి. అందులో జీవించే జీవరాశులు సుఖంగా బతికేవి. ఆ పరిస్థితులు ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి. జలచరాలు వాణిజ్య వస్తువులుగా మారిపోవడంతో పాటు విస్తరిస్తున్న నూనె బావులు, బ్లో అవుట్‌-డ్రిల్లింగ్‌ వల్ల నూనె సముద్రంలోకి వచ్చి చేరుతోంది. సముద్రాలను నిర్లక్ష్యం చేయడంవల్ల వాటిలోని ప్రాణులకే కాదు మొత్తం భూగోళానికే ప్రమాదమన్న సంగతి నేడు విస్మరిస్తున్న తీరును నిరసిస్తూ డాక్టర్‌ పి.విజయలక్ష్మీ పండిట్‌ ‘సముద్ర సంపదలను కాపాడుకో’ అనే కవితలో – ”చమురు బావులు ఓడలు ఒలికించిన, చమురు పేరుకొని కలుషితమై, అపార సముద్ర జీవ సంపదకు మృత్యు కుహరాలైనాయి” – అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. రసాయనాలతో కూడిన ఎరువులు, ఎత్తుల్లో ప్రయాణించే విమానాలు విడుదల చేసే వాయువులు, అంతరిస్తున్న అడవులు, ఎక్కువవుతున్న వేడిమి… ఇవన్నీ కలిసి ఓజోన్‌ పొరను బలహీనం చేస్తున్నాయి. సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూ వాతావరణంలోకి ప్రవేశించడంవల్ల వాతావరణంలో క్లోరిన్‌ అణువులు ఏర్పడతాయి. అతినీలలోహిత కిరణాలు ఎటువంటి వడపోత లేకుండా నేరుగా భూమిమీద ప్రసరించడంవల్ల ఎన్నో దుష్ప్రభావాలు చోటుచేసుకుంటున్నాయి. క్యాన్సర్‌ లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. చర్మ వ్యాధులు, కంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఓజోన్‌ పొరకు చిల్లులు పడడంవల్ల పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని గురించి డాక్టర్‌ పి.విజయలక్ష్మీ పండిట్‌ ”ధరిత్రీ విలాసం” కవితా సంపుటిలో ‘ఓజోన్‌ పొర గాయాలపూడ్చు’ అనే కవితలో – ”విష వాయువుల విసర్జనను, పూర్తిగా అరికట్టే మార్గం చూడు, ప్రాణవాయువు శాతం పెంచి, ఓజోన్‌ పొర గాయాలను పూడ్చడం, ప్రపంచ ప్రజలందరి బాధ్యత సుమా” – అంటూ మానవాళికి చేటును కలిగించే అతినీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా అడ్డుకోగల ఓజోన్‌ పొరను రక్షించుకోవడం ప్రపంచ ప్రజలందరూ తమ ప్రథమ కర్తవ్యంగా భావించాలని కవయిత్రి సూచించారు.

ఎం.సత్యవతి ‘కిట్‌-కీ’ అనే కవితలో భూమిని మానవులు తమ స్వార్థం కోసం ఎన్నో విధాలుగా హింసిస్తున్న విధానం గురించి ”భూమిని తొలిచే రాజకీయ మూషికాలు ఇనుప ఖనిజాన్నే తినేస్తుంటే, రాజకీయ భేతాళ యక్ష ప్రశ్నలకు కోకొల్లలు సమాధాన తులరాశులు, పచ్చని ప్రకృతిని మంటకలిపే సౌందర్య ఘాతకుల్ని కూకటి వేళ్ళతో పెకిలించాలి, అణు ఇంధనం వాటాలు పంచుకునే వృద్ధ వృకోదరులంతా, భవిష్యత్‌ భారతాన్ని భరతం పట్టే పథక రచన మానుకోవాలి” – అంటూ రాజకీయ నాయకులు తమ పదవులను అడ్డం పెట్టుకుని భూమితో వ్యాపారం చేస్తూ మట్టి త్రవ్వి పారేస్తున్నారని, కొందరు వ్యాపారులు తమ వ్యక్తిగత లాభం కోసం అడవులను నరుకుతూ జీవరాశిని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు మానవాళికి ముప్పు కలిగించే అణు ఒప్పందాలకు స్వస్తి చెప్పాలని అన్నారు. ప్రకృతికి, పర్యావరణానికి విధ్వంసం సృష్టించే నయవంచకుల్ని నామరూపాలు లేకుండా నశించిపోయే విధంగా కఠిన శిక్షలు విధించేలా చట్టాలు చేయాలని కవయిత్రి సూచించారు.

పాశ్చాత్య నాగరికత ప్రభావంతో మానవ జీవన విధానంలో అనూహ్యమైన జలావరణాన్ని ప్రధాన సమస్యగా తీసుకొని, ప్రకృతిని వికృతి చేయవద్దనే పిలుపునిస్తూ, ప్రకృతి సంపదలను భావితరాలకు అందచేయాలని సందేశాన్నిస్తూ చంద్రలత రాసిన నవల ‘దృశ్యాదృశ్యం’. ఈ నవల ఆనకట్ట నిర్మాణం, ఆ నిర్మాణం వల్ల చితికిపోతున్న జీవితాలను పరామర్శించింది. ప్రకృతికి – మనిషికి మధ్యనున్న అనుబంధాన్ని పెంచడానికి చేసిన ప్రయత్నమే ఈ నవలలో ఇతివృత్తంగా చెప్పబడింది. అప్పటి వరకు నది ఒడ్డున జీవించి, ప్రాజెక్టు కారణంగా తమ ఊరు మునిగిపోయే పరిస్థితి వచ్చినపుడు, ఏమీ చేయలేని అసహాయతతో కొత్త ఊరిని నిర్మించుకునే జనం, కేవలం మానవ జీవితాల్లోనే కాక సమస్త ప్రకృతిలోను ప్రాజెక్టు నిర్మాణం వల్ల కలిగిన మార్పులు… తదితర అంశాలను రచయిత్రి ఈ నవలలో స్పృశించారు. పర్యావరణం పట్ల అవగాహన లేకుండా ప్రవర్తించే తీరుపై రచయిత్రి ఈ నవలలో అక్కడక్కడా చురకలంటిస్తారు. డోకల సుజాతాదేవి రాసిన ‘సుజలాం సుఫలాం’ అనే నవలలో కూడా పర్యావరణ సమస్యలకు సంబంధించిన చిత్రణ కన్పిస్తుంది.

సమాజంలోని సమస్యల పట్ల ప్రజలను చైతన్యపరుస్తూ రచయితలకు ఏ మాత్రం తీసిపోకుండా రచయిత్రులు కూడా రచనలు చేస్తున్న ప్రస్తుత నేపథ్యంలో నేటి సమాజాన్ని గడగడలాడిస్తున్న పర్యావరణ సమస్యలపై కూడా తెలుగు రచయిత్రులు మరింతగా స్పందించాల్సిన ఆవశ్యకత ఉంది. పర్యావరణ సమస్యలు భవిష్యత్తులో వికృతరూపంలో విజృంభించి మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందని నేటి స్థితిని చూస్తేనే అవగతమవుతుంది. పర్యావరణాన్ని గురించి, దాని గొప్పదనాన్ని గురించి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను గురించి, పర్యావరణ సమస్యల వల్ల తలెత్తే విషమ పరిస్థితులను గురించి, భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించాల్సిన అవసరాన్ని గురించి కథల రూపంలో, నవలల రూపంలో, కవితల రూపంలో… తదితర సాహిత్య ప్రక్రియల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచే కార్యక్రమంలో తెలుగు రచయిత్రులు సైతం చురుకైన భాగస్వామ్యం పోషించాల్సిన సమయమిది. తెలుగు రచయిత్రుల పక్షాన రానున్న రోజుల్లో మరిన్ని పర్యావరణ చేతనా రచనలు వెలువడాలని మనసారా ఆశిద్దాం.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.