ఒక మార్చి 8 కథ – ఓల్గా

”ఇంకా పూర్తి కాలేదా నీ పని” అంటూ వచ్చిన రేణు ఆ హాల్లోని అలంకరణ చూసి నోరు తెరిచేసింది. ”వావ్‌! నీలో ఇంత కళాత్మక హృదయం, దాంతోపాటు కాస్త మేథోశక్తి ఉన్నాయని నాకు తెలియదే” అంటూ హాలంతా కలయదిరిగింది. ”బాగుందా” అంటూ తను ఉదయం నుంచీ కష్టపడి చేసిన, కొలీగ్స్‌ కొందరితో చేయించిన అలంకరణ తృప్తిగా చూసుకుంది వినీల. మర్నాడు మార్చి 8 – ఆ ఆఫీసులో ఉన్న నూటయాభై మంది మహిళలూ ప్రతి సంవత్సరం మార్చి 8 – ఆ ఆఫీసులో ఉన్న నూటయాభై మంది మహిళలూ ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదిన చిన్నపాటి సంబరం చేసుకుంటారు. ఈసారి ఆ భారం వినీల మీద పడింది.

వారం పది రోజుల ముందు నుంచే వంటలు, ముగ్గులు, కుట్లు, అల్లికలు, పెయింటింగ్‌, పాటలు, డాన్సులు అన్నిటిలో పోటీ పెట్టేశారు. 8న చిన్న పార్టీ, చిన్న మీటింగు, బహుమతి ప్రదానం. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. రేణు ఉద్యోగంలో చేరి

రెండేళ్ళు నిండి మూడో ఏడాది సగం గడిచింది. ఈ సంవత్సరం సీనియర్స్‌ తాము అలిసిపోయామని, జూనియర్స్‌ బాధ్యత తీసుకోవాలనీ తప్పుకున్నారు. వినీల మరో పదిమంది తనకంటే జూనియర్స్‌ సాయంతో పనులు చేసింది. పోటీలకు ఎవరి సాయమూ పెద్దగా అవసరం లేదు. మేమంటే మేమని పేర్లిచ్చేస్తారు. హుషారుగా పాల్గొంటారు. బహుమతుల కోసం ఎదురు చూస్తుంటారు.

అసలు రోజు జరిగే చిన్న మీటింగు గురించే కాస్త తిప్పలు పడాలి. ఒకోసారి మగవాళ్ళే ”మీరు తప్పుకోండి. చూస్తూ ఉండండి. ఈ రోజు మేం మీ కోసం కష్టపడతాం” అంటూ పనులన్నీ చేస్తారు. ఒకోసారి ఏమొస్తుందో ఏమోగానీ సహాయనిరాకరణ చేస్తారు. ”మీ ఉత్సవం మీరే చేసుకొండి” అని పక్కకు తప్పుకుంటారు. ఈసారి అలాంటి పరిస్థితే వస్తే ఆ బాధ్యతంతా వినీల మీద పడింది.

”అలంకరణ మనవాళ్ళు ప్రతి ఏడాదీ బాగానే చేస్తారు గానీ ఈసారి నువ్వు ఈ ఫోటోలు ఎక్కడ సంపాదించావు” రేణు ఒక్కో ఫోటో చూస్తూ నడుస్తోంది. అవి తమ తమ రంగాలలో ప్రసిద్ధి పొంది, తమదైన ముద్ర వేసిన ధీర వనితల ఫోటోలు. వాటి కింద వారి గురించిన కొంత సమాచారం రాసి ఉంది. ”నీకింత సీన్‌

ఉందనుకోలేదు” రేణు ఆశ్చర్యం తగ్గటం లేదు. వినీల బుద్ధిమంతు రాలు. అమాయకురాలు అని ఆఫీసులో దాదాపు ఏకాభిప్రాయమే ఉంది. వినీల పెళ్ళయి ఒంగోలు వంటి చిన్న పట్టణం నుంచి హైదరాబాదు నగరానికి వచ్చిన నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కూడా సంపాదించింది. రోజూ భర్త సాగర్‌ తన మోపెడ్‌ మీద సరిగ్గా టైమ్‌కి దించి వెళ్తాడు. మళ్ళీ సాయంత్రం ఒక అరగంట అటూ ఇటూగా తీసుకెళ్తాడు. కోలీగ్స్‌ చాలా మంది ”ఎంత మంచివాడు వినీల మొగుడు” అనుకుంటారు. ఓర్వలేని వాళ్ళు మూతి తిప్పుకుంటారు. వినీలకు పని నేర్చుకోవటంలో మొదటి ఆరు నెలలూ గడిచిపోయాయి. ఆ తర్వాత ఇద్దరు మనుషుల పని నెత్తిన వేసుకుని బుద్ధిమంతురాలనే పేరుకి తోడు పనిమంతురాలని కూడా అనిపించుకుంది. ఎందుకో రేణు తప్ప పెద్దగా ఎవరూ వినీలతో స్నేహం కలుపుకోలేదు. ఐనా స్నేహాలకు సమయం ఉండే ఉద్యోగాల కాలం పోయింది. అందునా వీళ్ళకు వారానికి ఒకరోజే శెలవు. ఆరోజు ఎవరిళ్ళ పని వాళ్ళ కోసం ఎదురుచూస్తుంటుంది.

రేణు ఫోటోలన్ని చూసి వినీల భుజం తట్టి ‘గ్రేట్‌’ అంది.

”అంతా పూర్తయింది. పూల బొకేలు కూడా ఇపుడే తెప్పిద్దామనుకుంటే అకౌంట్స్‌ క్లోజ్‌ చేశారు. నేను ముందే చెప్పాల్సింది” అంది వినీల.

”ఇప్పుడేమయింది. నీ డబ్బుతో తెప్పించి రేపు బిల్లు పెట్టు” అంది రేణు.

”నా దగ్గర ఐదొందలే ఉన్నాయి.” చిన్న బోయింది వినీల ముఖం.

”దానికంత చిన్నబుచ్చుకుంటావెందుకు. ఎ.టి.యం. కార్డు వాడు”

”నా దగ్గర లేదు” వినీల గొంతులో అంత విసుగెందుకో అర్థం కాక

”అబ్బా – ఇంకా ఎ.టి.యం. లేకుండానే బతికేస్తున్నావా? రేపు తీసేసుకో. డబ్బు అవసరం ఎప్పుడు ఎందుకు ఎంత వస్తుందో మనం ఊహించలేం”

”నాకు ఎ.టి.యం. కార్డు, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌కార్డు అన్నీ ఉన్నాయి. ఐతే అవన్నీ మా వారి దగ్గర ఉంటాయి.” ఉక్రోషం పలికింది వినీల గొంతులో.

”వాట్‌!”

వినీల మౌనంగా ఒక బెలూన్‌కి కట్టిన రంగు రిబ్బను కుచ్చు ఉడితే మళ్ళీ శ్రద్ధగా కడుతోంది.

”అవన్నీ మీ ఆయన దగ్గరెందుకు?” రేణూది విని ఊరుకునే స్వభావం కాదు.

”నేను మేనేజ్‌ చెయ్యలేనని. ఆయన చాలా మంచి మనిషి. నా గురించి అన్ని బాధ్యతలూ తనే మోస్తారు. అన్ని పనులూ తనే చూస్తారు. నాకే రిస్కూ లేకుండా చూసుకుంటారు.”

”రిస్కేమిటి?” రేణు ఆశ్చర్యపోయింది.

”ఏమిటంటే – అనేకం ఉంటాయి. అవన్నీ ఇప్పుడెందుకు గాని వెళ్దాం రా” హాలంతా ఓసారి తృప్తిగా చూసుకుంది వినీల.

రేణుకి మాత్రం ఏదో అసంతృప్తి మొదలయింది.

”ఇంటి పని, వంటపని కూడా మీ ఆయనే చేస్తాడా?”

”ఛా! అదంతా నా పని. నా ప్రపంచం. మా ఇంటి కొచ్చావుగా ఇంట్లో వంక పెట్టటానికేమైనా ఉందా?”

లేదని రేణుకి తెలుసు. చిన్న మరక, దుమ్ము, ధూళి లేకుండా పరిశుభ్రంగా ఉంటుంది.

ఇంతలో అటెండర్‌ కాఫీ తెచ్చింది.

”అమ్మయ్య. థ్యాంక్‌ యు రాములమ్మా” అంటూ అక్కడే కుర్చీలో కూలబడి కాఫీ అందుకున్న వినీలను చూస్తే ఆమె చాలా అలిసిపోయిందనిపించి రేణు తను కూడా మరో కుర్చీలో కూచుంది.

”ఇవాళ ఆయన రావటానికి లేట్‌ అవుతుంది. ఎంతలే అరగంట”

”పోనీ నాతోపాటు బస్‌లో వెళ్దాంరా. ఈ టైమ్‌లోకాస్త రష్‌గానే ఉంటుందనుకో” రేణు మాటను తుంచేస్తూ

”ఒద్దు రేణూ. ఆయనకిష్టం ఉండదు. ఆ రష్‌లో ఒత్తిడిలో ఒద్దంటారు. నాకూ ఇష్టం ఉండదు. చేతకాదు కూడా. మా ఊళ్ళో కూడా నా స్కూటీ మీదే తిరిగే దాన్ని. బస్సులు, ఆటోలు చిరాకు”

”నీకు స్కూటీ నడపటం వస్తే మరి కొనుక్కోవచ్చుగా”

రేణుకివాళ అన్నీ ఆశ్చర్యాలే ఎదురవుతున్నాయి వినీల విషయంలో.

”ఇక్కడ హైదరాబాద్‌ ట్రాఫిక్‌లో నడపటం రిస్కంటారు మావారు. తనే దించుతారు. నా స్కూటీ ఇంట్లో బద్రంగా ఉంది. దానిని వారానికోరోజు ఆయనే తుడిచి ఓ అరగంట నడిపి కండిషన్‌లో పెడతారు” మురిపెంగా చెప్పబోయి విఫలమై నవ్వేసింది వినీల.

”నువ్వెక్కడికైనా ఒంటరిగా వెళ్ళాల్సి వస్తే”

”ఎక్కడికీ ఒంటరిగా వెళ్ళనుగా. ఇద్దరం కలిసే వెళ్తాం. ఆయనకు నా మీద చాలా ప్రేమ. నన్నొదిలి ఎక్కడికీ వెళ్ళరు. వెళ్ళాల్సి వస్తే ఇంట్లో నాకేభయం లేకుండా భద్రంగా ఉంచి వెళ్తారు.”

”రెండేళ్ళ నుంచీ నువ్వొక్క దానివీ ఎక్కడికీ వెళ్ళలేదా?” రేణూ కాస్త షాకయింది.

”లేదే” మామూలు విషయంలా తీసేయబోయింది గానీ వినీల గొంతు పట్టేసింది. పొలమారినట్లు దగ్గుతూ దానిని మార్చి నవ్వింది.

”రెండేళ్ళ నుంచీ నీ అంతట నువ్వు ఎ.టి.యం., క్రెడిట్‌ కార్డు లేవీ వాడలేదా?”

”ఊహు – లేదు. అవసరం రాలేదంటుంటే”.

”షాపింగ్‌”

”ఇద్దరం కలిసే వెళ్తాం”

”బిల్లు ఆయన కడతాడు” రేణూ ప్రశ్న అడక్కుండా సమాధానం చెప్పింది.

వినీల తలూపింది. వేడి కాఫీతో కాబోలు ముఖం నిండా చిరుచెమట.

”నువ్వేదయినా కొనాలంటే ఆయన ఒద్దంటే -” రేణు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ మూడ్‌లోకి వెళ్ళింది.

”ఇంతవరకూ ఆ పరిస్థితి రాలేదు. నేనే ఒద్దంటాను ఆయన నా కోసం అవీ ఇవీ ఆర్భాటంగా కొనబోతుంటే”-

కాఫీ కప్పు పక్కన పెట్టి రెండు చేతులూ పైకెత్తి ఒక్కసారి ఒళ్ళు విరుచుకుంది వినీల.

రేణూ మనసంతా అశాంతితో చికాకయింది. మనసులో మాట పైకి అందామా ఒద్దా అని ఆలోచించి చివరకి అనేసింది.

”వినీలా – మీ ఆయన గురించి నాకేదో అనుమానంగా ఉంది”

”అదేంటి” నవ్వేసింది వినీల

ఏంటో నాకూ తెలియటం లేదు గానీ రేపు నీ ఎ.టి.యం కార్డు తీసుకొచ్చి నాకొకసారి చూపిస్తావా?”

”ఎందుకు?” ఈ సారి వినీల షాకయింది.

”ఎందుకో అందుకు. ఒక్కసారి చూపిస్తే అందులోంచి నేనేం డబ్బు డ్రా చేసుకోన్లేగాని – రేపు ఒక్కసారి తీసుకురాగలవా?”

”అలాగే – తెస్తాను. అందులో ఏముంది?” అన్నది గానీ వినీల మనసు కూడా కాస్త అశాంతిమయం అయింది.

తన గురించి తన అసంత్రప్తి గురించి రేణూకి తెలియగూడదని వినీల ఆరాటం.

”నా బస్‌ టైమయింది. వస్తా. రేపు ఎ.టి.యం. మర్చిపోకు. రేపు ఉదయం ఒకసారి ఫోన్‌ చేసి రిమైండ్‌ చేస్తాలే” అంటూ రేణు పరిగెత్తినట్లే వెళ్ళిపోయింది.

వినీలకు పెళ్ళి జరిగిన తొలి రోజులు గుర్తొచ్చాయి. రెండో రోజు సాయంత్రం తన హాండ్‌బ్యాగంతా వెతుకుతున్న భర్త సాగర్‌ని చూసి తను ఆశ్చర్యపోయిన క్షణాలు గుర్తొచ్చాయి.

”ఏం కావాలి?” అనడిగింది.

”ఏం లేదు. ఊరికే” అంటూ వెతుకుతున్నాడు.

వినీల బ్యాగ్‌లో చాలా చెత్త ఉంటుంది. వారానికోసారి సర్దినా రెండు రోజుల్లో అవీ ఇవీ చేరుతూనే ఉంటాయి. బ్యాగు అంత చెత్తగా ఉంచుకుంటున్నందుకు ఎప్పుడూ తనమీద తనే విసుక్కునే వినీల మొదటిసారి సిగ్గుపడింది.

”చాలా చెత్త ఉంది. సర్దాలి” అంది సంజాయిషీ చెబుతున్నట్టు

”చెత్త కాదు గానీ – నీకు సంపాదనేం లేదుగా ఈ కార్డులన్నీ ఎందుకు? ఎక్కడివి?” అనుమానంగా అడిగాడు.

”నేను బాపట్లలో చదివా గదా – నలుగురం స్నేహితులం కలిసి ఓ ఇల్లు తీసుకున్నాం. ఎప్పుడే అవసరం వస్తుందోనని నాన్న బ్యాంక్‌లో డబ్బు వేయటంతో పాటు ఈ కార్డులు కూడా తీసుకోమన్నాడు. మొదటి సంవత్సరం నుంచీ అలవాటయింది. నా స్నేహితులెవరికి అవసరం వచ్చినా నా దగ్గరకే వచ్చేవాళ్ళు. తీసుకుని మళ్ళీ ఇచ్చేవారు. నేనో బ్యాంక్‌ని అందరికీ – మా శాంతి – ”

ఉత్సాహంగా కాలేజి కబుర్లు చెప్పబోతున్న వినీల ఆగి ఆశ్చర్యంగా

చూసింది. సాగర్‌ ఆ కార్డులన్నీ తీసి తన పర్సులో పెట్టేసు కుంటున్నాడు. వినీలకేం చెయ్యాలో అర్థంకాక అయోమయంగా చూస్తూ నుంచుంది.

”ఈ బాధ్యతలన్నీ ఇక నావి. డబ్బు గురించి నువ్వు నిశ్చింతగా ఉండు. నీకే లోటూ లేకుండా నే చూస్తాను. సరేనా? ఎ.టి.యం.లకు, బ్యాంకులకు వెళ్ళటం, ఆ ఎకౌంట్లు, ఆ మోసాలు అవన్నీ నీకెందుకు? ఈ మధ్య ఎటియంలలో డబ్బు డ్రా చేసే ఆడవాళ్ళ మీద దాడులు చేసి డబ్బు లాక్కెళ్తున్నారు. హైదరాబాదులో మరీ ఎక్కువ. ఆ రిస్కులన్నీ నీకెందుకు? ఓ ఐదొందలు ఎప్పుడూ బ్యాగ్‌లో ఉండేలా చూస్తాను. అవసరానికుంటుంది.”

వినీలకు ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆ తర్వాత మాట్లాడాల్సిన అవసరమూ రాలేదు. డబ్బుకి ఇబ్బంది పడలేదు. కావల్సినవి అమరుతున్నాయి. కానీ తన ఎకౌంట్లో ఎంత డబ్బుంది? ఎంత దేనికి ఖర్చవుతోంది? ఎంత సేవ్‌ అవుతోంది. ఇవేవీ తనకు తెలియటం లేదని కాస్త బాధనిపించేది. ఆ వివరాలన్నీ అతని సెల్‌ఫోన్‌కే మెసేజ్‌లు వచ్చేవి. అడగటానికి మొహమాటం. అక్కడికీ ఒకసారి సున్నితంగా అడిగింది.

”నా మీద నమ్మకం లేదా? నీ డబ్బంతా వాడేసి నాది దాచుకుంటాననుకున్నావా?” అని కోపంగా అనేసరికి వినీల నోరు మూసుకుపోయింది.

”నాకే లోటు లేదు. అది చాల్లే” అనుకుంటుంది.

కానీ అతను ప్రతి ఆదివారం తన బ్యాగు వెదికేటప్పుడల్లా విపరీతమైన అవమానంగా ఉండేది. చాలాసార్లు ఐదొందలు అలాగే ఉండేది. ఎపుడైనా మూడొందలే ఉంటే అతనడిగే ప్రశ్నలకు సిగ్గుతో చచ్చిపోతూ సమాధానాలు చెబుతున్నపుడు చాలా లోటనిపించేది.

హైదరాబాద్‌ వచ్చేపుడు తండ్రి పెళ్ళప్పుడు కొనిచ్చిన కొత్త స్కూటీ తెచ్చుకుంది. దానిమీద ఎక్కి తిరగాలనే అనుకుంది. కానీ సాగర్‌ ఒప్పుకోలేదు. ”హైదరాబాద్‌లో డ్రైవింగ్‌ చాలా రిస్కు. మీ ఆఫీసు మీదుగానే నా ఆఫీసుకి వెళ్తాను గదా. అవకాశం

ఉన్నపుడెందుకు అనవసరపు రిస్కులు” అంటూ యాక్సిడెంట్ల గురించి వర్ణించి చెప్పేసరికి వినీల భయపడిపోయింది. కానీ వినీలకు అపుడపుడూ ఒక్కత్తే స్కూటీ మీద షికారు చేసిన సంవత్సరాలు గుర్తొచ్చేవి. డ్రైవింగ్‌ ఎంత బాగుంటుంది. వేగం, కదలిక, ముందుకు దూసుకెళ్తున్న ఉత్సాహం – అన్నీ పోయాయి. సాగర్‌ వెనకాల అతన్ని పట్టుకుని స్థిరంగా, స్థిమితంగా, భద్రంగా కూచోటం బాగానే ఉంది – కానీ –

”ఆ ‘కానీ’ ని రేణు కనిపెట్టేసిందా?” అనుకోగానే కాస్త కంగారనిపించింది. వాచీ చూసుకుని సాగర్‌ వచ్చే టైమయిందని లేచింది.

లి లి లి లి

ఆ రాత్రి సాగర్‌ని ఎ.టి.యం. కార్డు గురించి చాలాసార్లు అడగాలని ప్రయత్నించింది. కానీ మాట, మనసూ కూడా తడబడుతూ ఆగిపోయాయి. రాత్రిసాగర్‌ నిద్రపోతుంటే కళ్ళు విప్పార్చుకుని అతన్నే చూస్తూ ఉంది. ”తనకు ఏది కావాలంటే అది కొనిపెడుతున్నాడు. భద్రంగా చూసుకుంటున్నాడు. కానీ – ఈ కానీ నా దుంప తెంపుతోంది. భాషలో ‘కానీ’లు ‘ఐతే’లు ఉండగూడదు” అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది. కనురెప్పల చీకట్లో వెనక ‘కానీ’ అనే రెండక్షరాలు బండి చక్రాలంత పెద్దగా వెలుగుతున్నాయి.

”సరే కానీ – కానీ… ఈ ‘కానీ’ వెనక ఏముంది. తన బ్యాగు మాటి మాటికి తెరిచి వెతకొద్దని అంటే ఏమవుతుంది. ఆ మంచితనం. నా ఏ.టి.ఎమ్‌ కార్డుతో సహా అన్ని కార్డులు, బ్యాంక్‌ ఎకౌంటే సమస్త వివరాలతో సహా నేను తెలుసుకోవాలి. అన్నీ తెచ్చి నాక్విండి అంటే ఈ మనిషి ఇంత మంచిగానూ ఉంటాడా? నా స్కూటీ మీద నేను తిరుగుతూ అన్ని పనులూ చూసుకుంటాను అంటే ఈ ప్రేమ నిలబడుతుందా-”

రెండేళ్ళ నుంచీ వేధిస్తున్న ప్రశ్నలు. ప్రశ్నల స్వభావమే అది – సమాధానం దొరికే వరకూ ఏదో ఒక చిరాకు పెడుతూనే

ఉంటాయి. అణిచేసినా అణిగినట్లే ఉండి ఎప్పుడో సమయం చూసి తలలెత్తుతూనే ఉంటాయి. ”రేప్పొద్దున -” అంటూ ఆ ప్రశ్నల్ని అణిచేసినా నిద్రమాత్రం పట్టలేదు వినీలకు.

మర్నాడు సరిగ్గా ఆఫీసుకి వెళ్ళటానికి ఇంకా అరగంట టైముందనగా సాగర్‌ పేపర్‌ చదువుతున్న సమయంలోవెళ్ళి చాలా మామూలుగా అదెప్పుడూ జరిగే విషయంలా, మంచినీళ్ళు అడిగినంత సాధారణంగా అడిగేసింది వినీల

”నా ఎటిఎం కార్డు ఒకసారి ఇవ్వరా?”

”కార్డా? ఎందుకు?” పేపర్‌లోంచి తల కూడా ఎత్తలేదు సాగర్‌.

”కొంచెం పనుంది”.

”డబ్బు కావాలంటే చెప్పు. ఎంత? ఎందుకు? దారిలో వెళ్ళేపుడు డ్రా చేసి తీసుకుందాం. ఐనా ఇపుడు నీకేం అసవరం వచ్చింది”.

”నాకిపుడు డబ్బు అవసరం లేదు. కానీ నా ఎటిఎం కార్డు నాకు కావాలి. మళ్ళీ సాయంత్రం ఇచ్చేస్తాను. కాదు – కాదు – నా కార్డులన్నీ నా దగ్గరే పెట్టుకుంటాను. అన్నీ ఇచ్చేయండి.”

సాగర్‌ ఇపుడు పేపర్‌లోంచి తలెత్తాడు.

”ఏమైంది? ఒంట్లో బాలేదా? డాక్టర్‌ దగ్గరకి వెళ్దామా? కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి.”

వినీలకు కోపం, దుఃఖం తన్నుకొచ్చాయి.

”నేనడిగేదేమిటి? మీరు చెప్పేదేమిటి”.

”నీ మనసు బాగున్నట్టు లేదు. పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. వెళ్ళేదారిలో సైకియాట్రిస్ట్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకుని వెళ్దాం. పద. త్వరగా బయల్దేరు.”సాగర్‌ లేచాడు.

”ప్లీజ్‌. నాకా కార్డు ఇవ్వండి. సాయంత్రం మీకే ఇచ్చేస్తాను. డబ్బు డ్రా చెయ్యను. మళ్ళీ ఎప్పుడూ అడగను”. వినీలకు సైకియాట్రిస్ట్‌ మాట వినేసరికి భయం మొదలయింది.

”ఆ కార్డులన్నీ ఆఫీసులో నా సేఫ్‌లో ఉన్నాయి. నిన్న అక్కడ పెట్టాను తీసుకురాలేదు.” సాగర్‌ విసురుగా అన్నాడు.

వినీలకు అర్థమైపోయింది. అతనివ్వడు. కళ్ళనీళ్ళను కళ్ళ వెనకాల ఆపింది.

”మీరు ఆఫీసుకి వెళ్ళిండి. నేనివాళ రాను. నిజంగానే నాకు ఒంట్లో బాగో లేదు.” వెళ్ళి మంచం మీద పడుకుంది వినీల.

”లీవ్‌ లెటర్‌ ఇవ్వు. తీసికెళ్ళి ఇస్తాను” దగ్గరగా వచ్చి తీక్షణంగా చూశాడు.

”అవసరం లేదు. ఇవాళ మార్చి 8. శెలవు పెట్టకపోయినా ఫరవాలేదు. రేపు వెళ్ళి చెప్తే సరిపోతుంది.”

సాగర్‌ టైము చూసుకుని హడావుడిగా వెళ్ళిపోయాడు. కాసేపటికి వినీల లేచి ముఖం కడుక్కుని కొత్త సల్వార్‌ కమీజు వేసుకుంది. జడ విప్పి దువ్వి జుట్టు విరబోసినా ఎగరకుండా హెయిర్‌ పిన్నులు జాగ్రత్తగా పెట్టుకుంది. పెద్ద బొట్టు తీసేసి చిన్న నక్షత్రం లాంటి స్టిక్కర్‌ అంటించుకుంది. భద్రంగా దాచుకున్న స్కూటీ తాళాలు చేతిలోకి తీసుకుంది.

స్కూటీ మీద కాస్త దుమ్ము పేరుకుంది. వినీలకు దానిని తుడవాలనిపించలేదు. స్కూటీ బైటపెట్టి గేటు వేసి కిక్‌ కొట్టింది. రెండేళ్ళ తర్వాత మొదటి ‘కిక్‌’ – పాదాల్లోకి రక్తం వేగంగా ప్రసరించి ఎక్కడలేని హుషారొచ్చేసింది. స్కూటీ ముందుకు వెళ్తుంటే మార్చి నెల వేడిగాలి ముఖానికి తగిలి గడ్డ కట్టిన మెదడు, మంచుముద్దలా ఘనీభవించిన మెదడు మెల్లగా కరిగి శరీరమంతా చైతన్యం వేగంగా పరుగులెత్తింది. వెనక కూచోటానికేముంది? వెనకబడటానికేం కావాలి? ఎన్ని సంవత్సరాలైనా స్థిరంగా భద్రంగా ఉంటుంది. ఒక్క అడుగు ముందుకు పడిందా? వేగంగా క్షణక్షణం మారే జీవన ఝరి.

రెండేళ్ళ తర్వాత స్కూటీ ఎక్కిన వినీలకు భయంగా లేదు. భయం నుంచి విడుదలై హాయిగా ఉంది. రిస్కు అనిపించలేదు. పెద్ద రిస్కు నుంచి తప్పించుకున్నాననిపించింది. ప్రమాదం జరుగుతుందేమోననిపించలేదు. పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డాననిపించింది. ఆఫీసులోకి దూసుకొచ్చిన వినీలను, ఆమె స్కూటీని అందరూ వింతగా చూసారు. కొందరు దగ్గరకొచ్చి అభినందించారు కొత్త స్కూటీ కొనుక్కున్నందుకు.

వినీల స్కూటీ పాతదని చెప్పలేదు. జీవితం కొత్తది గదా అభినందించనివ్వు అనుకుని నవ్వుతూ లోపలికి వెళ్ళింది.

మార్చి 8 మీటింగు మొదలై ముగిసింది. బహుమతులు వచ్చిన వాళ్ళు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు.

రేణూ వచ్చి ”కార్డు తెచ్చావా?” అనడిగింది.

”లేదు. జీవితాన్ని తెచ్చా. చూస్తావా?” అనడిగింది వినీల డ్రీమీగా.

”చూసేశా” అంది రేణు వినీల భుజాల మీద చేతులు వేసి దగ్గరకు తీసుకుంటూ.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.