వీరమతి – భండారు అచ్చమాంబ సరళీకరణ : పి. ప్రశాంతి

(గత సంచిక తరువాత)

జగదేవుడు గ్రామంలోకి వెళ్ళిన కొంతసేపటికి చెరువు దగ్గరకు ఒక వనిత నీళ్ళ కోసం వచ్చి వీరమతిని చూసి నేర్పుగా ఆమె పేరు, ఆమె పెనిమిటి పేరు, మామగారి పేరు కనుక్కుని పోయి ఆ సంగతులన్నీ తన యజమానురాలితో చెప్పింది. ఆ కాలంలో ఆ పట్టణం పన్నెండు క్రోసుల వైశాల్యం కలిగి ఉండి ఎంతో రమ్యంగా ఉండేదట. జయసింగు సిద్ధరాజను రాజు ప్రజా పరిపాలన చేస్తుండేవాడు. ఆయన ధర్మాత్ముడని, దయాశాలి అని ప్రసిద్ధి కెక్కెను కాని, అతడు రాజ్యంలోని అధికారులను పరీక్షించక వారిపై నమ్మకం కలిగి ప్రవర్తించడంతో ఆ పట్టణం నందు అనేక అన్యాయాలు జరుగుతుండేవి. ఆ పట్టణానికి కొత్వాలు, అనగా దండనాయకుడిగా ఉన్న డుంగరసే అనువాడు స్వయంగా అన్యాయాలు చేయిస్తుండేవాడు. స్వయంగా దొంగలను ప్రోత్సహించి వారు తెచ్చిన సామాగ్రిలో భాగం తీసుకునేవాడు. వేశ్యలపట్ల ఆసక్తి కలిగినవాడై గ్రామానికి అనేక మంది వేశ్యాంగనలను తెచ్చి ఉంచాడు. వారిలో జామోతీ అను వేశ్య చాలా చక్కనిదై లెక్కించలేనంత ధనాన్ని సంపాదించింది. ఆమె ఇల్లు రాజభవనంలాగా, పూలతోటలు రాజోద్యానములలా కనిపించేవి. ఈ వేశ్యలలోని రాణి తన దేహాన్ని విక్రయించడమేకాక పట్టణంలోని అనేకమంది సాధ్వీమణులను మోసపుచ్చి తన ఇంటికి రప్పించి, బలవంతంగా వారిని కాముకులకు అర్పించి వారి పాతివ్రత్యాన్ని భంగం చేస్తుండేది. దండనాయకుని కుమారుడైన లాలదాసు అనేవాడు కూడా జారశిరోమణి అని పేరుపొంది ఈ జామోతికి దాసుడై ఉండేవాడు.

పైన చెరువుకు నీళ్ళ కోసం వచ్చి వీరమతిని ఆమె వివరాలు కనుగొన్నదని చెప్పిన వనిత ఈ జామోతి యొక్క సేవకురాలు. దాసి చెప్పిన మాటలు వినడంతోనే ఈ వేశ్యాంగన రాజ స్త్రీ లాగా వేషం వేసుకుని, మేనా ఎక్కి వెంట కొందరు భటులను తీసుకుని వీరమతి ఉన్నచోటికి వెళ్ళింది. అక్కడ ఆమెను చూసి ఎవరో కావలసినదానివలె ఆమె వద్దకు వచ్చి ”పరాయివారిలా మీరిలా వేరు బస చేసుకొనుట న్యాయమా? మీరు వస్తారని ముందే కబురు చేసినట్లైతే మేము మీకు ఎదురువచ్చుండే వారము. నేను

ఉదయాదిత్యుని పినతండ్రి కూతురిని; జగదేవునికి వేలు విడిచిన మేనత్తను. బస చూసుకోడానికి జగదేవుడు పట్టణంలోకి రాగా రాజుగారు అతనిని చూసి ఆనువాలు పట్టి రాజమందిరంలోనికి తీసుకుని వచ్చారు. అక్కడ అతని ద్వారా నువ్విక్కడున్న సంగతి విని నిన్ను రాజభవనంకు తీసుకుని పోదామని వచ్చాను. ఈ గుర్రాలు మొదలైన వాటిని నా బంట్లు తీసుకుని వస్తారు. ఈ మేనాలో కూర్చో. పద, పోదాము” అని పలికింది. ఆ మాటలు విని ఆమె చెప్పిన సంగతులన్నీ నిజమనుకుని వీరమతి ఆమె వెంట రాజ గృహముకు సరితూగేలా ఉన్న ఆమె గృహానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన పిదప ఆ వేశ్యాంగన వీరమతికి అభ్యంగన స్నానం చేయించి, కొంతసేపటికి భోజనానికి లెమ్మని పిలిచింది. అంతట మీ మేనల్లుడు భోజనం చేస్తేనేగాని నేను భోజనం చేయనని ఆమె జవాబిచ్చింది. అంతట జామోతి తన పరిచారికల్లో ఒకామెని ‘మీ కొరకు మీ మేనత్త కనిపెట్టుకుని కూర్చుంద’ని చెప్పి జగదేవుని తీసుకుని రమ్మని పంపింది. ఆ దాసి పోయినట్లే నటించి, తిరిగొచ్చి, ‘రాజుగారితో జగదేవుడు భోజనం చేశాడు, మిమ్మల్ని, వీరమతి గారిని భోజనం చేయమని చెప్పాడు’ అని చెప్పింది. దాన్తో వీరమతి కొంచెం భుజించింది. తరువాత ఆ యువతి ఒక సుందరమైన గది చూపించి వీరమతిని అక్కడ విశ్రాంతి తీసుకోమని చెప్పి వెళ్ళింది. ఈ సంగతులన్నీ చూసి వీరమతికి సంశయం కలిగింది కాని సాయంకాలం వరకు పెనిమిటి వస్తాడేమో అన్న ఆశతో ఆమె ఆ గదిలో పడుకుంది. సాయంకాలం కాగానే ఇంటి యజమానురాలు మళ్ళీ వచ్చి భోజనానికి రమ్మని పిలిచింది కాని, భర్త వచ్చి భోజనం చేయనిది తాను అన్నం ముట్టనని వీరమతి తన నిర్ణయాన్ని తెలిపింది. అప్పుడు జామోతి ఏమీ చేయలేక కొన్ని ఫలహారాలు అక్కడ పెట్టి తినమని చెప్పి వెళ్ళిపోయింది. పోతూ పోతూ జామోతి గది బయటి గొళ్ళాన్ని వేసుకునిపోయింది. అదంతా చూసి ఇదొక మాయగా

ఉందనుకుని వీరమతి మరింత భయపడింది. ఆమె ఆ గదిలో కూర్చుని పెనిమిటిని ఎప్పుడు చూస్తానా అని చింతిస్తుంది.

ఆ పట్టణంలోని దండనాయకుని కుమారుడైన లాలుదాసునకు ప్రతి రోజూ ఒక క్రొత్త యువతిని సమర్పించడం జామోతి యొక్క నిత్యవ్రతం. ఆ రోజు వీరమతిలాంటి చక్కని స్త్రీ దొరికినందుకు జామోతి ఎంతో సంతోషించి తనకు గొప్ప బహుమానం దొరుకుతుందని నిశ్చయించుకుని ఉంది. సాయంకాలం కాగానే, ఆ వారకాంత ఆ రోజు జరిగిన వృత్తాంత మంతా లాలుదాసుకి తెలిపి, వీరమతి పెనిమిటి పేరు చెప్పి అతనిని పట్టి కారాగారంలో వేయించి, రాత్రి అతనిని (లాలుదాసుని) తన ఇంటికి రమ్మని చెప్పింది. ఆ నరాధముడు రాత్రి అనుకున్న సమయానికి వేషం వేసుకుని, సురాపానం చేసి, జామోతి గృహానికిరాగా ఆ దుర్మార్గురాలు పుచ్చుకోవలసిన ధనమంతా పుచ్చుకుని, అతనికి వీరమతి ఉన్న మేడ చూపించి, తన నివాస స్థలానికి వెళ్ళిపోయింది. ఆ నరాధముడు మేడ ఎక్కేటపుడు అయిన చప్పుడు విని, భర్త ధ్యాసలో ఉన్న కథానాయిక, తన భర్త వచ్చాడని అనుకొని సంతోషపడింది కాని, ఆ కీచకుడు లోనికి రావడంతో వాని భయంకరమైన రూపాన్ని చూసి పరపురుషుడని తెల్సుకుని గజగజ వణకసాగింది. అంతలో రాజ స్త్రీలకు స్వాభావికమైన ధైర్యాన్ని

అవలంబించి ఎన్నో బోధ వచనాలతో ఆ దుష్టుడిని దుర్మార్గం నుంచి తొలగించడానికి ప్రయత్నించింది. ఆ మాటలు వినక, ఆ నరపశువు మదోన్మత్తుడై, వివేకం లేనివాడై వీరమతి యొక్క పవిత్ర దేహాన్ని తన పాపపు చేతుల్తో మట్టుకోడానికి ప్రయత్నించాడు. ఇక ఊరుకుంటే తన మానానికి భంగం కలుగుతుందని తలచి, ఆ అత్యంత పరాక్రమశీలి అయిన అబల తన నడుములోని రహస్య ఖడ్గాన్ని సర్రున తీసి ఆ నరాధముడ్ని రెండు తునకలుగా నరికింది. ఈ ఖడ్గం ఎక్కడిదని పాఠకులకి సందేహం వస్తుందేమో. ఆ కాలంతో ప్రతి రాజపుత్ర స్త్రీ నడుముకు మొలకట్టు రూపంలో ఒక సన్నటి ఖడ్గం అమర్చుకుని ఉండేవారు. ఈ ఖడ్గాలు వంచినా విరగనట్టి

ఉక్కుతో చేసినవి; ఇవి మొలకట్టు ఆకారంగల బంగారపు వరలో

ఉండటం వలన చూసేవారికి మొలకట్టుల్లానే కన్పిస్తుంది. మానమునకు / గౌరవానికి మోసం కలుగుతున్న పక్షాన రాజపుత్ర స్త్రీలు ఆ ఖడ్గాన్ని ఉపయోగించేవారు. ఆ ఖడ్గాలనే సంకట సమయంలో వీరమతి ఉపయోగించి, తన మానాన్ని సంరక్షించు కుంది! ఆహా! ఇలాంటి పతివ్రతా తిలకములను కొనియాడడం ఎవరి తరం? స్త్రీ పురుషులకు అందరికీ వందనార్హమైన ఈ నారీ తిలకము ముని తిలకుడైన మనువు వ్రాసిన

అరక్షితా గృహే రుద్ధాః పురుషై రాస్తకారిభిః

ఆత్మాన మాత్మనా యాస్తు రక్షేయుస్తాస్సురక్షితాః

ఆప్తులైన పురుషులచే గృహాన్న నిర్బంధించబడే స్త్రీలు రక్షితురాండ్రుకారు; ఏ స్త్రీలు తమ ఆత్మను తామే కాపాడుకుంటారో వారే సురక్షి – అన్న వచనాన్ని సోదాహరణగా స్థాపించి, స్త్రీలకు మహోపకారం చేసింది. ఓ సోదరీమణులారా! చూశారా పాతివ్రత్య ప్రభావము! వనితలకు పాతివ్రత్యమే శ్రేయమని, గ్రాహ్యమని, లలానుభూతమని నమ్మండి. పాతివ్రత్యంకంటె ఎక్కువ ధర్మం స్త్రీల కేదీ లేదు. పతివ్రతా స్త్రీలను సంరక్షించడానికి సదా సర్వేశ్వరుడు సిద్ధంగా ఉంటాడు. పాతివ్రత్యానికి తన్ను తానే రక్షించుకొను సామర్థ్యం ఉందని కొందరు చెప్తారు. అనగా పతివ్రతా స్త్రీలు ఎంత దుర్బలులై, ఎన్ని సంకటాలలో మునిగి ఉన్నా వారికి స్వసద్గుణాలను కాపాడుకునే సామర్థ్యం ఈశ్వరుడిస్తాడు.

పతివ్రతలను దుష్టుల చరలో నుంచి విడిపించడానికి పతివ్రతల వెంట ఎల్లప్పుడూ దేవదూతలు అదృశ్యులుగా తిరుగుతుంటారని ఒక పాశ్చిమాత్య కవి రాశాడు. కీచకుని ఇంటికి పోతున్నపుడు ద్రౌపదీదేవి తన పాతివ్రత్యాన్ని రక్షించవలసిందిగా సూర్యునికి విన్నవించుకోగా,

క. ”తరుణి యు దుఃఖిత యగున

త్తరుణిం గాంచుటకు నత్యు దగ్రభుజావి |

స్ఫురణాఢ్యు నొక్కరక్కసు |

గరుణార్ద్రమనస్కుడగుచు గ్రక్కున బనిచెన్‌”

అని మహాభారతంలో చదువుతున్నాముగదా? దమయంతి శాపంతో కిరాతుడు దగ్థమయ్యాడని వింటాము. ఈ దేవదూతలూ, రాక్షసుడూ, శాపసామర్థ్యమూ పతివ్రతా స్త్రీల యొక్క సత్ప్రవర్తన, దృఢ నిశ్చయము, శౌర్య సాహసాలు అనే చెప్పవచ్చు. తమ ధర్మానికి భంగం కలిగినపుడు పతివ్రతా నారీమణులకు విపరీతమైన కోపం కలుగుతుంది. ఆ క్రోధాతిశయంలోనే దుష్టుని శిక్షించే, పాతివ్రత్యాన్ని సంరక్షించుకునే సామర్థ్యం ఉంది. కనుక ఓ హిందూ సుందరులారా! ప్రాణాలైనా పోగొట్టుకుని మీ పాతివ్రత్యాన్ని రక్షించుకోండి. మీ సచ్ఛీలమనే ధనాన్ని అపహరించడానికి అనేక మంది నరచోరులు ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. మీకు విద్య నేర్పించక మూర్ఖుల్ని చేసి తమ వలలో వేసుకోవాలని చాలా మంది స్త్రీ విద్య అక్కరలేదని ప్రతిపాదిస్తారు. వారి మాటలు వినకండి. మంచి విద్యను పొంది, పతివ్రతల చరిత్రలను చదివి, వారిలా ప్రవర్తించడానికి ప్రయత్నించండి. విద్య నేర్చుకుంటే ఇలాంటి కష్టాలు రావని నా తాత్పర్యము కాదు. కాని ఇటువంటి సంకటాలు ఎదురైనపుడు మూర్ఖుల్లా నిరాశ చెందక, విద్య నేర్చినట్లైతే ధైర్యాన్ని అవలంబిస్తారు. సంకటాన్ని తొలగించుకోడానికి వారికి అనేక ఉపాయాలు తోస్తాయి. వీరమతి ఆయుధం ఎలా ఉపయోగించిందో, అలాగే విద్య ఇప్పటి స్త్రీలకు సంకట సమయంలో ఉపయోగపడుతుంది. కనుక, మీ పాతివ్రత్యం రక్షనార్థం మీరు ఎల్లప్పుడూ విద్య అనే ఆయుధాన్ని వెంట ఉంచుకోండి.

ఇలా నరాధముడైన లాలుదాసును యమలోకానికి పంపి, వాని శరీరాన్ని గుడ్డలో మూటకట్టి వీరమతి ఆ మూటని కిటికిలో నుంచి వీధిలోకి పారేసింది. తర్వాత లోపలికి ఇంకెవరూ రాకుండా ఉండేలా మేడ త్రోవ లోపల బిగించుకుని ఇక ఏమేమి విచిత్రాలు జరుగుతాయో చూద్దామని చేతిలో ఖడ్గాన్ని ధరించి కిటికీ వద్ద నిలబడింది. అంతట రాత్రి గస్తీ తిరిగే సంరక్షక భటులు కొందరు ఆ మూటను చూసి, విప్పి, దండనాయకుని కుమారుని శవమని తెల్సుకుని, తక్షణమే ఆ సమాచారాన్ని దండనాధునికి తెలియచేశారు. తన పుత్రుని శవాన్ని చూసి దండనాయకుడు శోకమనస్కుడై, ఆ శవం ఎక్కడ దొరికిందని ఆ భటులను అడిగాడు. జామోతి యొక్క రహస్య గృహం దగ్గర దొరికిందని వారు చెప్పగా, అతడు వెంటనే ఆ వారకాంత ఇంటికి పోయి లాలుదాసుడు ఏడని అడిగాడు. దానికి జామోతి నవ్వి అతడొక క్రొత్త రంభా విలాసములో ఉన్నాడు, భయపడకండి, పిలుచుకుని వస్తానని మేడపైకి పోడానికి వెళ్ళింది. కాని పైకిపోయే దారి మూసి ఉన్నందున, ఎన్ని పిలుపులు పిలిచినా ఎవరూ పలకలేదు. అప్పుడామె తిరిగివచ్చి ఆ సంగతంతా కొత్వాలుతో చెప్పింది. అప్పుడతడు కొందరు భటులను పిలిపించి ఆ మేడ తలుపులను తీయడానికి ప్రయత్నించాడు. కాని జామోతి ఇంట్లో జరిగిన ఘోరకృత్యాలన్నీ ఆ మేడలోనే జరుగుతున్నందున ఆ వేశ్యాంగన ఎవ్వరికీ తీయడానికి అలవికాని ఘనమైన తలుపు ఆ మేడకు పెట్టించింది. కనుక కొత్వాలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై తలుపురాలేదు. అప్పుడు వీధిగోడకు నిచ్చెనవేసి కిటికీలో నుంచి లోపలకు పోదామని నిశ్చయించి నిచ్చెన వేసుకుని ఒక భటుడు పైకెక్కి కిటికీలో తల పెట్టగానే అక్కడ నిల్చున్న వీరమతి తన ఖడ్గంతో వాని మెడ త్రుంచింది. అంతట వాని మెడ లోపల పడి, మొండెము వీధిలో పడింది! దానికి భయపడక మరొకడు పైకి రాగా పతివ్రతా తిలకమగు మన కథానాయిక వానిని కూడా ఖడ్గానికి బలి ఇచ్చింది! ఇలా పదకొండు మంది మేటి మగవారు ఆ అబల చేతిలో చచ్చారు!

అప్పుడు పైకెక్కడానికి ఏ శూరుడూ సాహసించలేక పోయాడు. ఇంతలో ఈ వార్త ప్రాతః కాలం అవడంతో గ్రామమంతా ప్రాకి, ఆ వారవనిత గృహానికి లోకులు గుంపులు గూడి రాసాగారు. ఒక స్త్రీ పన్నెండు మంది భటులను కూల్చిందని అందరూ అనుకుంటుండగా ఆ పట్టణపు రాజు కూడా విన్నాడు. అతడు ఇట్టి విచిత్రాన్ని చూడటానికని స్వయంగా అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఆమె చంపిన వారినందరిని చూసి స్వయంగా నిచ్చెన పైకి ఎక్కి, కిటికీ దగ్గర నిలబడి ఇలా అన్నాడు – ”ఓ అసమాన శౌర్యం గల స్త్రీ! నీవెవ్వరివి? ఇలా నా ప్రజలను చంపడానికి కారణమేంటి? నేనీ పట్టణానికి రాజును. నీవెవరైనా అపరాధము చేసిన పక్షాన చెప్పు, వారిని నేను దండిస్తాను”. అంతట ”మహారాజా! నేను చావడా కులోత్తముడైన బిరజ మహారాజు గారి చెల్లిల్ని; ధారానగరానికి అధిపతియైన ఉదయాదిత్య మహారాజు గారి కోడల్ని. నా పేరు వీరమతి” అని చెప్పి తన వృత్తాంతమంతా తనను మోసపుచ్చి వేశ్యాంగన ఇంటికి తీసుకుని వచ్చిన విధాన్ని సవివరంగా చెప్పి, లాలుదాసుని అనుచిత ప్రవర్తనను తెలిపి, ”నా పాతివ్రత్యాన్ని రక్షించుకోడానికి నేనతనిని చంపాను; నన్ను పట్టుకోడానికి వచ్చిన పదకొండు మందిని కూడా అందుకే వధించాను; నేను క్షత్రియ కన్యను. నా దేహమునందు ప్రాణముండు వరకు అన్య పురుష స్పర్శ కానివ్వను” అని స్పష్టంగా వీరమతి పలికింది. ఆ మాటలు విని రాజు ఎంతో సంతోషించి ”రాజపుత్ర స్త్రీలకు తగిన పని చేశావు; వెళ్ళిరా; నిన్ను నేను నా పుత్రికలా పెంచుకుంటాను. నీ పెనిమిటిని వెదికిస్తాను” అని పలికాడు. కాని ”నా పెనిమిటి వస్తేనే కాని ఈ మేడ తలుపు తియ్యనని ప్రతిజ్ఞ చేశాను. కనుక మొదట నా పెనిమిటిని తెప్పించినట్లైతే తమ ఆజ్ఞను శిరసావహిస్తాను. లేని పక్షాన ఇక్కడే దేహాన్ని విడిచెదను” అని వీరమతి జవాబిచ్చింది.

అప్పుడు రాజు తన భటులను పంపి వెతికించి, కారా గృహంలో ఉన్న జగదేవుని తెప్పించాడు. భర్తను చూసి ఆమె ఆనందించి, మేడ తలుపు తీసి వెలుపలికి వచ్చింది. రాజు జామోతిని కైదులో వేయించి ఆమె ఇల్లంతా జప్తు చేయించాడు. పిమ్మట జగదేవ వీరమతులను తన రథములో ఎక్కించుకుని ఇంటికి తీసుకుపోయాడు. పట్టణపు దారిలో రథాన్ని ఎక్కి వీరమతి పోతున్నపుడు అనేకమంది స్త్రీలు ఆమెకు వందనాలు చేసి, కులాంగనల పాలిట రాక్షుసులైన లాలుదాసు, జామోతిలను శిక్షించి పట్టణపు పాతివ్రత్యాన్ని రక్షించిన మహాపతివ్రత ఈమే అని వేనోళ్ళ కొనియాడారు.

రాజుగారు పూర్వపు దండనాయకుని దుశ్చేష్టలను కనుగొని అతనిని తీసేసి జగదేవుని బుద్ధి ప్రభావాలను చూసి అతనిని దండనాయకునిగా నియమించాడు. అధికారం చేతికి రాగానే జగదేవుడు రాజ్యంలో ఉన్న వ్యవస్థనంతా మాన్పించి, రాజ్యమంతటా న్యాయం జరిగేట్లు చేసాడు. రోజురోజూ శౌర్యవీర్యాదుల వల్ల అతడు రాజుకు అధిక ప్రియుడయ్యాడు. ఇంతలో వీరమతి గర్భవతి అయి ఆమెకు పుత్రుడు పుట్టాడు. అప్పుడు జగదేవుడు గొప్ప ఉత్సవం చేసి ఆ శిశువుకు జగద్ధవలుడని పేరు పెట్టాడు. ఈ సంగతి తన తల్లిదండ్రులకు తెలపడానికి ఒక దూతను పంపాడు. ఇలా సుఖంగా కాలక్షేపం చేస్తుండగా ఒకనాడు ఒక చమత్కారం జరిగింది. దానివల్ల జగదేవుని కుటుంబమంతా నాశనం చెందుతుందేమో అని భీతి కలిగింది. అది ఏమిటంటే:

జగదేవునికి అధికారం ప్రాప్తించినప్పటి నుంచి దుష్టులకు చాలా బాధ కలుగుతుండేది. కనుక వారందరూ జగదేవుని చంపడానికై అనేక ఆలోచనలను చేసారు. అవన్నీ నిష్ఫలాలయ్యాయి. కాని ఒక సంవత్సరం ఆ పట్టణంలో గత్తరలు పుట్టి అనేక మంది ప్రజలు చనిపోతున్నారు. ఎన్ని రకాల ఉపాయాలు చేసినా గత్తర ఆగడంలేదు. అప్పుడు రాజు ప్రజలంతా చనిపోతారేమో అని భయపడి, దాని నివారించడానికి ఊరి బైట ఉన్న కాళికాదేవిని పూజించడానికి రోజూ స్వయంగా వెళ్ళేవాడు. ఇలాంటి సంకట సమయాన్న ఎవరేమి చెప్పినా, ఎటువంటి అసంభవాలైనా దైవిక చమత్కారాలను చూపించినా రాజుగారు నమ్మగలరచి తలంచి దుష్టులు ఒక యుక్తిని పన్నారు. వారిలో ఒకడు కాళికాదేవి విగ్రహానికి వెనుక నిలబడిరాజుగారు ఏకాంతంగా పూజ చేసేటప్పుడు దేవి పలికినట్లే ఇలా అన్నాడు: ”ఓ మహారాజా! నీ భక్తికి మెచ్చితిని. ఈ రోగము పోవుటకు ఒక ఉపాయము చెప్తాను విను. సర్వ సద్గుణ సంపన్నుడైన ఒక రాజకుమారుని నాకు బలి ఇచ్చినట్లైతే ఈ రోగము పోయి ప్రజలు సుఖించెదరు; నీవు కూడా నూరేళ్ళు రాజ్యము చేసి ఆనందం పొందెదవు.” అందుకు రాజు ”ఓ తల్లీ! నా రాజ్యంలో సకలసద్గుణాలు గల రాజపుత్రుడు ఎవడున్నాడో నీవే ఆనతి ఇమ్ము” అన్నాడు. అప్పుడు కాళికాదేవి ఇలా అంది. ”వత్సా! నీ రాజ్యంలో ఇటువంటి రాజకుమారుడు లేడని చింతించకు. నీ దండ నాయకుడైన జగదేవుడు అన్ని సద్గుణాలు కలవాడు. కనుక అతనిని బలి ఇచ్చినట్లైతే నీవు, నీ ప్రజలు సుఖపడతారు.” ఈ మాటలు విని రాజు అత్యంత ఖిన్నుడై ఇంటికిపోయాడు. రాజు ఖిన్న వదనుడగుటకు కారణమేటని జగదేవుడు విచారించి ఆ సంగతి తెల్సుకుని, చిన్నబుచ్చుకోవద్దని, ప్రజల కొరకు, రాజుగారి కొరకు తాను సంతోషంగా బలికిపోతానని రాజుగారితో చెప్పాడు. రాజు వద్దని చెప్పాడు గాని, ఆ మాటలు వినక జగదేవుడు ఇంటికిపోయి భార్యతో ఆ మాటలు చెప్పగా ఆమె తాను, తన కుమారుడు కూడా బలి వస్తామని చెప్పింది. ఇలా లోకహితం కోసం ఆత్మ దేహాలను సమర్పించ నిశ్చయించుకుని ఆ దంపతులు తమ సొత్తంతా పేదలకు పంచి ఇచ్చి, అభ్యంగన స్నానం చేసి, ప్రాతఃకాలాన్న మంగళ వాద్యాలతో దేవి వద్దకు వెళ్ళారు. దేవికి పూజ చేసి, మొదట పిల్లవాడిని తర్వాత వీరమతిని తరువాత జగదేవుడిని బలి ఇవ్వదలిచారు. ఇలా ఆ దంపతులు కృతనిశ్చయులై ఉన్న సమయాన రాజుగారికి ఆ సమాచారం తెలిసి వారిని వారించడానికి అతడు దేవిగుడికి వచ్చాడు. వచ్చి జగదేవుడ్ని వద్దని వారించుచుండగా ఆ దుష్టులలో ఒకడు మరల దేవి వెనకకుపోయి దేవిలాగే ఇలా అన్నాడు – ”రాజా! వద్దని అతనిని వారించకు. ఈ బలి వలన నీకు చాలా లాభం కలుగును.” ఈ మాటలు వినగానే రాజుగారికి సంశయం కలిగి దేవి వెనుక వెదికి చూడగా ఆ దుష్టుల పని తెలిసింది. ఇదే కథని కొందరు ఇలా కూడా చెప్తారు – జగదేవుడూ అతని భార్యాపుత్రులు కాళికాదేవి వద్దకు పోయి స్వదేహాలను స్వహస్తాలతో బలి ఇచ్చుకున్నారట. వీరందరూ మృతులైన తర్వాత రాజు అక్కడికి వచ్చి, వారిని చూసి దుఃఖించి

తన దేహాన్ని కూడా దేవికి సమర్పించబోగా దేవి ప్రత్యక్షమై అతనిని వారించి, మృతులైపడున్న జగదేవాదులను లేపెనట. ఈ రెండు చరిత్రలలో ఏది నిజమై ఉండవచ్చో చదువరులే గ్రహించగలరు.

ఇలా దుష్టుల దుర్మార్గం తెలిసిన వెంటనే రాజుగారు వారికి తగిన శిక్షలను విధించి జగదేవుడు లోక హితంకోసం, రాజహితం కోసం చూపిన సాహసాకి అతనికి ఏమిచ్చినా ఋణం తీరదని తలచి, అతనికి ప్రభావతి అనే తన కుమార్తెనిచ్చి వివాహం చేసాడు. కూతురితోపాటు అనేక గ్రామాలను అల్లుడికి వరదక్షిణంగా ఇచ్చాడు. దుష్టులు జగదేవునకు కీడుచేయతలచారు కాని, అందువలన అతనికి మేలే జరిగింది.

ఈ ప్రకారం జగదేవుడు సుఖంగా కాలం గడుపుచుండగా అక్కడ ధారానగరంలో ఉదయాదిత్యుడు వాఘేలీ రాణిగారి కుతంత్రాలను తెలుసుకోలేక ఆమె చెప్పినట్లే రాజ్యము చేస్తున్నందున రాజ్యంలో అంతా అన్యాయాలు జరుగుతుండేవి. ప్రజలంతా అసంతృప్తులై ఉండేవారు. ఈ సంగతులన్నీ చూసి దగ్గరున్న ఒక రాజు దండెత్తి వచ్చి ఉదయాదిత్యుడి రాజ్యాన్ని తీసుకుని అతనిని, అతని బంధువులందరినీ కారాగృహంలో వేసాడు. ఈ సంగతంతా జయదేవుడికి తెలిసి అతడు మామగారి ఆజ్ఞ పుచ్చుకుని బయలుదేరి ధారానగరానికి పోయి శత్రురాజులను ఓడించి తండ్రిగారిని మరల రాజ్యరూఢునిగా చేసాడు.

అప్పుడు మంత్రియైన ధీరసింహుడు రాజుకి జగదేవుడి సమాచారమంతా చెప్పి, అతనిదేమీ తప్పులేదని, వాఘేలీరాణి యొక్క కుయుక్తులే జగదేవుని దుఃఖాలకు కారణమని తెలిపాడు. అప్పుడు ఉదయాదిత్యుడు జగదేవుడ్ని కౌగిలించుకుని, ముద్దాడి, అతనిని యువరాజుగా ప్రకటించాడు. అప్పటి నుండి ఉదయాదిత్య మహారాజు గారికి వాఘేలీరాణి యందు అసహ్యం కలిగి ఆయన సోళంకీరాణి గారినే ప్రేమతో చూస్తుండేవాడు. కాని వాఘేలేరాణిని కూడా సరిగ్గా చూడవలసిందిగా పతివ్రతాతిలకమైన సోళంకీరాణి భర్తకు చెప్తుండేది. ఉదయాదిత్యుని అనంతరం జగదేవుడు సింహాసనమెక్కి న్యాయంగా రాజ్యపాలన చేసాడు.

జగదేవునికి ముగ్గురు భార్యలున్నా వారందరిలో మొదటి నుంచి పతికి ప్రతి పనిలోను సహాయంచేసి అతని నీడలా తిరిగిన వీరమతే అతని ముఖ్యమహిషిగా ఉండింది. కాని ఆమె సద్గ్రంధాలను చదివింది కనుక కణ్వమహాముని శమంతలకు ఉపదేశించిన

శుశ్రూషస్వ గురూన్‌ కురు ప్రియ సఖీవృత్తిం సపత్నీ జనే

భక్తి ర్విప్రకృతా పిరోహణను యాస్మప్రతీ సంగమః

భూయిష్ఠం భవ దక్షిణౌ పరిజనే భాగ్యే ష్వమత్సేకినీ

యాంత్యవం గృహీణపదం యువతయో వామాః కులస్యాధయః

అను ఉపదేశాన్ననుసరించి సదాచారిణియై, గృహిణి అన్న సార్ధక బిరుదును వహించింది.

Share
This entry was posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.