భారతదేశ సమగ్రతనూ అభివృద్ధి మార్గాలనూ ఛిన్నాభిన్నం చేస్తున్న అంశాలు కుల పేదరికం, వనరుల అసమ పంపకాలు అనే కీలకమైన అంశాల పట్ల మన రాతలు మార్చేవాళ్లు అవగాహనా రాహిత్యంతో ఉండటమే. ఈ పునాది భావజాలపు సుడిలో పడి ఉన్నంతకాలం మన వ్యవస్థ కోలుకోకుండా రోగగ్రస్తమై కేవలం అభివృద్ధి నామ జపం చేస్తూ ఉంటుంది.
మన దేశంలో కులాల విభజనను అనుసరించి పేదరికం ఏర్పడినా కులంతోపాటు ఆ వర్గ పేదరికమే పెద్ద అంటరానితనం ఇప్పుడు. పేదరికం-అంటరానితనం జమిలిగా మానవ జీవన విధ్వంసానికీ, సమాజ అభివృద్ధి కుంటుపడటానికీ తిరుగులేని మారణాస్త్రాలుగా పనిచేస్తున్నాయి. ఈనాటికీ చిట్టెంగట్టిన చీకటిలో తచ్చాడుతూ వెలుతురులో కనిపించే అందాలనూ, లాభాలనూ వర్ణిస్తూ కాలక్షేపం చేస్తూ ముసుగుల్లో ఉంది పాలక-ప్రజా సమాజం.
ఈ సమాజానికి వేర్లనుండీ మార్పును తెచ్చే సంస్కరణ పథకాలు రూపుదిద్దుకోవాలి. అంటే వ్యవస్థ మూలాలనుండే సంస్కరణ పథకాలు రూపుదిద్దుకోవాలి. సమూల సాంఘిక విప్లవం రావాలనే, కావాలనే అందరి అంతరంగాల అట్టడుగున ఒక ఆకాంక్ష ఉంటుంది. దానికి కావాల్సిన అధ్యయనం, పరిశోధన, నిర్మాణం ముందడుగు మాత్రం తగినంత సత్తువ లేక కూలబడిపోతున్నది. విశాల ఉద్యమ లక్ష్యం ముందుకు కదలలేకపోతున్నది.
………… ………… …………
మహారాష్ట్రలో మహాత్మా జోతీరావు ఫూలే అనంతరం ఒక సంవత్సర కాలంలో జన్మించిన డా||బి.ఆర్.అంబేద్కర్ విద్యాధికుడై నిమ్నకుల వర్గాల కోసం చేపట్టిన సైద్ధాంతిక సమీకరణ వల్ల విదర్భలో ఆనాడు బౌద్ధ-మహర్ మహిళల్లో ఒక బలమైన ఆత్మవిశ్వాసం మొలకెత్తింది. ఆ ఆత్మవిశ్వాసంవల్ల తరువాతి కాలంలో దళిత మహిళలు తాము సమాజంలో తిరస్కృతులుగా, బహిష్కృతులుగా ఉండటాన్ని వ్యతిరేకిస్తూ ఆ భావనల్ని ఆత్మకథల రూపంలో వ్యక్తం చేశారు.
ఈ ఆత్మకథనాలన్నింటిలోను ఉమ్మడి అంశం, సాధారణ లక్షణం కుల, వర్గ, లైంగిక దోపిడీలకు సంబంధించిన విషయాలు, ఆధునిక అంబేద్కర్ గురించి రాయడమూ.
అంబేద్కర్ చేపట్టిన సైద్ధాంతిక, రాజకీయ, సాంఘిక ఉద్యమాల ప్రభావంతో దళిత పితృస్వామ్యం, సామాజిక పితృస్వామ్యం రెండింటివల్ల నలిగిపోతున్న మహిళలు ఆ స్వామ్యాల బాధాకరమైన పరిధులు దాటి వచ్చి రాజకీయ చొరవతో ఎదిరింపూ, నిరసనలు వ్యక్తం చేశారు. అంతేకాదు విశాల అనుభవంతో రాజ్యానికీ మార్కెట్‌కూ వాటి దోపిడీకి వ్యతిరేకంగా తమ వ్యక్తిగత కథనాలను అక్షరీకరించడం ఒక అవసరంగా ఏర్పడింది. వారి రచనలు దళిత సమాజపు దుష్ట సంప్రదాయాలను ప్రశ్నిస్తూ విమర్శనాత్మకంగా ఉంటాయి. దళిత వ్యతిరేక వైఖరిని ప్రశ్నించేవిగా ఉంటాయి. కారణం వారు దళిత పితృస్వామ్య ఆధిపత్యం నుండి మానసికంగా విముక్తమై స్వేచ్ఛగా రాస్తారు కాబట్టి.
దళిత మహిళలు తమపై హింసలకు మూలమైన దళిత పితృస్వామ్య కుటుంబ చెరసాలల గడపల్ని దాటి గోడల్నీ బద్దలు కొడుతూ ఉన్నది ఉన్నట్లుగా తమ జీవన వెతల్ని రాసారు. మహారాష్ట్రలోని దళిత మహిళలు రాసిన ఆత్మకథలను షర్మిలా రెగే ”వాంగ్మూలాలు” అంటారు.
అగ్రకుల మహిళల శరీరాలను ఆచారాలు ఆక్రమించడంవల్ల పితృస్వామికంగా అంతర్ముఖం అవుతాయి. కానీ దళిత మహిళ ఇంటి ప్రపంచం, బయటి ప్రపంచం మధ్య సులభంగా సంచరించగలుగుతుందని వాళ్ళు రాసిన ఈ వాంగ్మూలాత్మకమైన ఆత్మకథల ద్వారా స్పష్టమవుతోంది.
మహారాష్ట్ర సాహిత్య రంగంలో దళిత, ఆదివాసీ, డీనోటిఫైడ్ ట్రైబల్ పీడిత నేపథ్యం నుండి మహిళల ఆత్మకథలు రావడం మనం చూడగలుగుతాం. అయితే ఇతర ఉప-కులాలకంటే కూడా బౌద్ధ-మహర్ మహిళల నుండే ఆత్మకథలు ఎక్కువగా రావడం గమనించాలి. దానికి కారణం వీరిలో నెలకొన్న ఆత్మవిశ్వాసం,
అంబేద్కర్ సైద్దాంతిక సమీకరణలో భాగంగా ఆయన వారిని చదువుకొమ్మని ఇచ్చిన పిలుపూ, ఆ చదువువల్ల కలిగిన మనోవికాసం వల్ల జరిగింది.
ఈ కథనాల్లో ఆధునిక అంబేద్కర్ గురించి రాయడం ఒక అంశమైతే దోపిడీ, అవమానం, ఆకలికి సంబంధించిన కథనాలూ, పితృస్వామ్యాన్ని ప్రతిఘటించడమూ చోటుచేసుకున్నాయి.
………… ………… …………
డా||అంబేద్కర్‌తో కలిసి పనిచేసిన బేబీ కాంబ్లే ‘మా బతుకులు’ (జీనా అమూచ) ఆత్మకథ సంప్రదాయం, ఆధునికతల మధ్య ఉండే ఉద్రిక్తతలను అర్థం చేసుకోవడానికి ఉపకరించే ముఖ్యమైన పుస్తకం అంటారు గోపాల్ గురు. ఇంగ్లీష్ అనువాదం
ఁుష్ట్రవ ూతీఱరశీఅర షవ పతీశీసవఁ కి రాసిన ముందు మాటలో రోజువారీ దళితలు ప్రదర్శించే ప్రతిక్రియగా ఆధునికత వైపు ప్రయాణ మార్గాన్ని ఏర్పరచుకోవడం సంప్రదాయాలను వెనకనే విడిచిపెట్టడం అనేది బాబా సాహెబ్ అంబేద్కర్‌లో మూర్తీభవించినట్లుగా దళిత మహిళలు తమ ఆత్మకథలో వాంగ్మూలాల్లో రాసుకున్నారు.
బేబీ కాంబ్లే రాసిన కథ ఒక ఉపయోగపు విలువను ఉత్పత్తి చేస్తుంది. అది మనల్ని మనం ప్రశ్నించుకోవడానికీ, ఈ వ్యవస్థను ప్రశ్నించడానికీ మనందరికీ ఒక నైతిక విలువను అందిస్తుంది.
దళిత పితృస్వామ్యం, మహిళలపై కట్టుబాట్లు, వారి వెతలు, బాబాసాహెబ్ ఇచ్చిన సైద్ధాంతిక రాజకీయ స్థైర్యం వల్ల కలిగిన చైతన్యం, ఆనాటి ఉద్యమాలపై మాయ పండిట్‌కిచ్చిన ఇంటర్వ్యూలో బేబీ కాంబ్లే చెప్పిన విషయాల ప్రస్తావన: బేబీ కాంబ్లే ఆత్మకథలో తన వ్యక్తిగత అంశాలు తక్కువ, ఇతర స్త్రీల గురించిన అనుభవాలు, రాజకీయ విషయాలు ఎక్కువ రాసింది. అందుకు బేబీ తన చుట్టుపక్కల ఉన్నవాళ్ళ కష్టాలే తన కష్టాలయ్యాయనీ, వాళ్ళ అనుభవాలే తన అనుభవాలయ్యాయనీ అంటుంది. బాబాసాహెబ్ దళితులు తమ పిల్లల్ని చదివించాలని చెప్పారని, వాళ్ళ పిల్లల్ని చదివించడానికి మగవాళ్ళు ఇష్టపడకున్నా మహిళలు వాళ్ళకు తెలియకుండా పడిన కష్టాల గురించి చెప్తూ అప్పుడు బాబా ఏం చెప్తే మహిళలు అదే చేసేవాళ్ళనీ మహిళల వల్లే తనలాంటి వాళ్ళ చదువులు సాధ్యమయ్యాయనీ చెప్తుంది.
బాబాసాహెబ్ ”మీరు దేవుడ్ని నమ్మారు. ఎన్నో తరాలు అర్పించారు. ఇప్పుడు ఈ తరాన్ని నాకివ్వండి. ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక ఇరవై ఏళ్ళు త్యాగాలు చేయండి. మీ పిల్లల్ని స్కూళ్ళలో చేర్పించండి. పస్తులుండాల్సి వస్తే
ఉండండి. కానీ మీ పిల్లల్ని మాత్రం చదివించండి. దేవుడా? చదువా? ఏది మంచిదనేది 20 ఏళ్ళ అనంతరం మీరే నాదగ్గరికొచ్చి చెప్తారు”. ఆ మాటలు స్త్రీల హృదయాల్ని తాకాయని ఆమె చెప్తుంది. అంతేకాదు దళిత రాజకీయ ఉద్యమానికి మహిళలు సగానికి పైగా ఉండి దోహదపడ్డారనీ వాళ్ళు నాలుగైదు రోజులకు సరిపడేన్ని భాక్రీలు తయారుచేసుకుని దూర ప్రాంతాలలో జరిగే బహిరంగ సభల్లో, వాళ్ళు పిల్లల్నీ, ఇళ్ళనూ వదిలి ఊరేగింపుల్లో దేవాలయ ప్రవేశాలు, హోటళ్ళ ప్రవేశాలు లాంటి ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనేవారు.
తన అనుభవం పెద్ద పోరాటమనీ, అది నిరంతర ఘర్షణతో కూడుకున్నదనీ గ్రామంలో మహర్ల చైతన్యాన్ని అడ్డుకునేందుకు వారిని ఎక్కడా అడుగుపెట్టనీయకుండా అడ్డుకునేవాళ్ళు దైనందిన జీవితాన్ని కష్టసాధ్యంగా చేసేవారు. తాము బడికి పోవాల్సి వచ్చినప్పుడు నాయకులంతా తమ వెంట వచ్చేవారు. ”విద్య మీ హక్కు – మీరు బడికి పోవాలి” అన్న బాబా మాటలు హృదయాల్లో ముద్రించుకున్న మేము బడికి పోకుండా ఉండలేము కానీ అక్కడ పరిస్థితి దుర్భరం, మమ్మల్ని దూరంగా మూలన కూర్చోబెట్టి నిత్యం అత్యధిక శాతం ఉన్న బ్రాహ్మణుల పిల్లలు ఎక్కడ అపవిత్రం అయిపోతారో అన్నట్లుగా ఆందోళనగా శత్రువుల్లా చూస్తూ వేధించేవాళ్ళు. మేము కుష్టురోగులమన్నట్లుగా మావైపు కన్నెత్తి చూసేవాళ్ళు కాదు. అసహ్యకరమైన జంతువులమన్నట్లు చీదరించుకునేవాళ్ళు అని తమ చదువుల పోరాటం ఆ ప్రతికూల వాతావరణం గురించి చెప్తుంది.
………… ………… …………
ఇక పెళ్ళిళ్ళ సంగతికొస్తే సంప్రదాయ పద్ధతిలో బ్రాహ్మణ పురోహితుడిని పిల్చుకొని పెళ్ళికూతురు, పెళ్ళికొడుకులకు ముండావలి, బాసింగాలు కట్టబెట్టి సమయం, డబ్బులు వృథా చేసే తంతుతో కాకుండా గాంధర్వ పద్ధతిలో మీలో ఎవరో ఒకరు చేయండి, మీ చావడి దగ్గరే చేసుకోండి అని బాబాసాహెబ్ పిలుపు ఇవ్వడంతో ఆ పద్ధతిలో జరిగిన మొట్టమొదటి వివాహం తమదేననీ, అప్పటినుండీ తన భర్తతో కలిసి బాబాసాహెబ్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాననీ చెప్తూ బౌద్ధ దీక్షకు ముందు ఈ తరహా పెళ్ళిళ్ళు దీక్ష అనంతరం బౌద్ధ మత ఆచారాల ప్రకారం జరిగేవనీ బేబీ కాంబ్లీ చెప్తారు.
ఫల్టన్ గ్రామంలో రాజా మలోజీరాజే నింబాల్కర్, ఆయన భార్య లక్ష్మీబాయిలు మహిళా మండలిని ప్రారంభించారు. రాజా నింబాల్కర్ మంగళవారపు పేటలోని ప్రతి మహర్ కుటుంబంలోని ఒక మహిళను తప్పనిసరిగా మహిళా మండలిలోకి తీసుకునే నియమం పెట్టాడు. బేబీ, ఇతర మహిళలు ఆ మహిళా మండలి సభ్యులయ్యారు. వారు సంకోచాలనొదిలి కుర్చీల కోసం కొట్లాడి కూర్చుని మరీ చర్చల్లో పాల్గొన్నారు.
ఆ రోజుల్లో పితృస్వామ్యం పట్టు గట్టిగా ఉండి మహిళల్ని గడప కూడా దాటనియ్యకుండా ఉండటం మగతనానికి చిహ్నంగా భావించేవారు. గడపదాటని భార్యల భర్తలకు చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు. బేబీవాళ్ళ తల్లిని తండ్రి గడప దాటనివ్వలేదు, కానీ ఆమెను అన్నయ్యతో కలిసి బయటికి పోవడానికి అనుమతించేవాళ్ళు.
కాలం మారుతుండడం, డా||అంబేద్కర్ వల్ల కొత్త ఆచారాలు వస్తుంటే వాటిని ప్రజలు ఆచరించాల్సి రావడంతో పాటు రాజా నింబాల్కర్ మహర్ మహిళలుండాలని చెప్పడంవల్ల బేబీ, ఆమె భర్తా సమాజసేవ చేయడం జీవితంగా మారిపోయింది.
శూద్ర రాణి వృంద (తులసి) గురించి ఒక కథ చదివి శూద్ర స్త్రీ పురుషులపై అగ్ర కులాల అణచివేతను పురాణ కథలుగా మలచిన విధం తెలుసుకొని తాను కూడా అణచివేతకు గురయిన శూద్ర స్త్రీల గురించి రాయడం మొదలుపెట్టింది. అప్పుడు తనకు ఆ మహిళల బాధల తీవ్రత ఏమిటో అర్థమయ్యేది. తాము అనుభవించిందంతా ప్రపంచానికి తెలియాలన్న తపనతో రాసింది.
నూట యాభై ఏళ్ళ క్రితం మహాత్మా ఫూలే పాఠశాలలో చదివిన మాంగ్ అమ్మాయి ముక్తాబాయి స్త్రీల బాధల్ని ఒక వ్యాసంలా రాసింది. కానీ అప్పుడూ ఇప్పుడూ తమ మహిళల జీవితం ఏమీ మారలేదని బేబీ వాపోతుంది.
బాబాసాహెబ్ రాజకీయ, సంస్కరణ ఉద్యమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు 1956లో ఆయన నిర్యాణానంతరం చాలా తగ్గిపోయారు. కారణం ఆ రోజుల్లో జరిగిన వ్యతిరేక పరిణామాలు, నాయకత్వం దిగజారిపోవడం, ఎవరికి వారే నాయకత్వం కోసం పోటీపడడం.
………… ………… …………
ఆ రోజుల్లో గ్రామం దళితుల్ని దూరాన నిలువరించి మంచినీళ్ళు కూడా లేకుండా హింసించింది. ఇప్పుడు విద్యావంతులైన దళితులు కూడా అచ్చంగా అగ్రకుల గ్రామస్తులలాగే ప్రవర్తిస్తున్నారు. పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలు, పదవుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలూ మంచి జీవితాన్ని అనుభవిస్తూ పేద ప్రజలను పట్టించుకోవడం లేదు. పేద దళితులు ఉన్నచోటే ఉండిపోయారు… కనిపిస్తోంది ఇదే అంటారు ఆమె.
ఎంతగా కార్మికుల్లో, శ్రామికుల్లో జాగృతి పొడచూపుతున్నా అణచివేత, వ్యవస్థలోని క్రూరత్వం అన్ని హద్దులనూ దాటుతున్నది. బాబాసాహెబ్ బౌద్ధమతాన్ని స్వీకరించినప్పుడు మహర్ కులస్తులంతా ఆయనను అనుసరించారు. హిందూ మతాన్ని ఒదిలిపెట్టారు. కానీ మిగిలిన 12 బాలుతేదార్లు (పారిశుధ్యం పనిచేసే 12 కులాలు) హిందువులుగానే మిగిలిపోయారు. వాళ్ళు మారలేదు, మార్చుకోలేదు. బౌద్ధ మతస్తులు ఏకాకులయ్యారు. వారికి వ్యతిరేకంగా గ్రామం, పట్టణం, పూర్తిగా దేశమే నిలబడింది. బౌద్ధమతంలోకి వెళ్ళినవారిని ఏకాకుల్ని చేసి హిందూ మతం దూకుడుగా అణచివేసింది. మీడియా హిందూ సాంప్రదాయవాదుల చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని బాగా వాడుకున్నారు.
బాలుతేదార్లూ, మహర్లూ శూద్రులే. మరాఠీలు కూడా శూద్రులే. కానీ తెలివైన బ్రాహ్మణులు తమ అవసరాల మేరకు ఈ కులాలన్నింటినీ నిచ్చెన మెట్ల వ్యవస్థగా ఏర్పాటు చేసి గ్రామంలోకి తీసుకుపోయారు. సాహసవంతులైన మహర్లు బలపడకుండా వారిపై శాశ్వత అణచివేతను ప్రయోగించాలనుకున్నారు. మహర్లకంటే మాతంగులు నిమ్న కులాలుగా పరిగణింపబడతారు. వారిని గ్రామంలోకి అనుమతించలేదు. హిందూ మతాన్ని ఎదిరించే శక్తిలేని మాతంగులు బౌద్ధాన్ని తీసుకోకుండా హిందూ మతం పట్టులోనే ఉండిపోయారు.
అంబేద్కర్ అనంతరం ప్రజలు అసంఘటితమైపోయి గ్రూపులుగా విడిపోయారు. మా నాయకులు డబ్బు వెంట పరుగులు తీశారు. ఆనాటి సాహసాలు పోయాయి.
ఈ రోజు దళితుల ప్రధాన సమస్య గ్రామాల నుండి పట్టణాలకు వలసపోవడం. పని వెతుక్కుంటూ పట్టణాలకు వలస పోతున్నారు. విద్య, ఉద్యోగ అవకాశాలు అంతంత మాత్రమే. అందుకే మా ప్రజలు ఇప్పటికీ పేదవాళ్ళే. అందులోనూ ఎన్నో విభజనలున్నాయి.
రిజర్వేషన్లు వచ్చి రాజకీయ పాలనా భాగస్వామ్యానికి అవకాశాలు ఏర్పడినా నిరక్షరాస్యులైన మహిళలను అర్థవంతంగా పనిచేయనివ్వరు అగ్ర కుల గూండాలు. దళిత మహిళలే కాదు ఇతర మహిళలూ ఇప్పటికీ బానిసలే. మహిళలందరూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ మహిళలమీద అణచివేత, అత్యాచారాలు వెలుగు చూడవు. కుటుంబ మర్యాద, అగ్ర కులాల ఆధిపత్యం, రాజకీయ పార్టీల ఒత్తిడి వల్ల అత్యాచారాలు బయటికి రావు. ఆర్థికంగా కొంత మెరుగుదల సాధించినా సమస్యలు మాత్రం ఎన్నో రకాలుగా ఎదుర్కొంటున్నారు.
తను రాసిందంతా 20 ఏళ్ళపాటు భద్రంగా దాచిపెట్టిన బేబీ కాంబ్లే తన భర్త కూడా ఆ కాలం మగవాళ్ళలా మహిళలను హీనంగా చూసేవాడనీ, తనను వెర్రిముఖం అనేవాడనీ, ఒకవేళ తన రాతల గురించి తెలిస్తే సహించి ఉండేవాడు కాదనీ, ఆయనంటే భయంతో రాసిందంతా దాచిపెట్టానని చెబుతుంది. తన వ్యక్తిగత జీవితంలో అనేకమంది మహిళల్లాగే బాధలు పడింది. మగవాళ్ళు అనుమానంతో భార్యల్ని కొట్టేవాళ్ళు. తను కూడా భర్తచేత దెబ్బలు తిన్నది, రక్తం కారేట్టు పబ్లిక్‌లో కూడా కొట్టాడు. ఆమె జీవితాంతం ఆ హింసను భరించింది. ప్రతి మగవాడిలోనూ భార్యను అదుపుచేసి, అణచివేసి, హింసించే ”మొగుడుతనం” ఉంటుంది. ఎన్నో రకాలుగా భర్తకు విన్నవించుకున్నా అతడు మారలేదు. తన భర్తను వదలకుండా ఉండిపోయిన కారణం పురాణాల్లోని పతివ్రతల కథల ప్రభావం తనపై ఉండటమే అంటుంది. తను మాత్రం ఏదైనా నిర్మాణాత్మకమైన పని చేయాలనుకున్నది. భర్త చేసే హింసల వల్ల భయంతో స్త్రీలు రాజకీయంగా నాయకత్వ స్థానాల్లోకి రావడానికి దూరమైపోయారన్నదే నిజం అని ఆమె తెలుసుకుంది.
………… …………
భార్యను అనుమానించే భర్తకు ఏదో ఒక కారణం ఎప్పుడూ ఉంటుంది. అందుకే మన సమాజంలో స్త్రీలను అణచి ఉంచేది మగవాళ్ళే. స్వాతంత్య్రానంతర కాలంలోనూ స్త్రీలు ఎంతో హింసను అనుభవించారు. అదంతా అనుభవిస్తూ కూడా వాళ్ళు ఎంతో చేశారు. మగవాడికి ఉన్నదల్లా పురుషాహంకారమే. దానివల్ల ఆడదానికన్నా గొప్పవాడ్ని అన్న అహం. వాళ్ళలో ఉన్న ఉన్మాదం గ్రామం అంతా మమ్మల్ని హింసిస్తే మేము మా స్త్రీలను హింసిస్తాం అంటుంది. భార్య స్థానం భర్త పాదాల దగ్గర, భార్యను చెప్పుతో సమానంగా చూడాలని వారి తల్లిదండ్రులు వాళ్ళకు బోధిస్తుంటారు.
ఆమె వ్యక్తిగా అనుభవించిన బాధలకన్నా తామంతా ఒక కులంగా అనుభవించిన బాధలే ముఖ్యమైనవి అనుకుంటుంది బేబీ కాంబ్లే. అందుకే తను తన ప్రజలతో మమేకమవుతూ ఆ బాధల గాథలను ”మా బతుకులు”గా తన కులం వాళ్ళందరి ఆత్మకథగా రాసానంటుంది. ఆ ఇంటర్య్యూలో అస్పృశ్యులైన ఆ పేదల బతుకు చితుకుల పొగమంటలే ఒక దళిత స్త్రీ ఆత్మకథగా, మొదటి దళిత స్త్రీవాద ఆత్మకథగా వెలుగుచూసింది. ఆధునిక భారతీయులకు తమ దేశం, తమ సమాజం, తమ జనం, తమను తాము తెలుసుకునే విషయోత్పత్తినీ పరిజ్ఞానపు వాస్తవికతను అందించింది.