ఏ ఇజం… ప్రజలకవసరం – నంబూరి పరిపూర్ణ

మన భారతాన్ని దీర్ఘకాలం పాలించిన బ్రిటిషర్ల ద్వారానో, పాశ్చాత్య సంస్కృతితో మనకేర్పడ్డ సంపర్కం వల్లనో ‘ఇజం’ అనే ఒక సంస్కృతీ సంబంధ పదం భారత మేధావి, రాజకీయ వర్గాల్లో విస్తృత వాడుకకు వచ్చింది.

పూర్వం ‘ఇజం’ అనేది మతపర జీవనరీతికీ, మతాచారాలకూ ఒక నిర్దిష్ట నిర్వచనంగా ఉండేది. ఉదాహరణలు – మనకు సుపరిచితాలయిన బుద్ధిజం, హిందూయిజంలు. ఈ మత సంబంధ ఇజాలు మనిషి మనుగడ సవ్యంగా సాగడానికి ఏయే నిబంధనలు, ఏ ధర్మాలు పాటించి అనుసరించాలి అన్న అంశాలను నీతి ధర్మ సూత్రాలుగా ప్రవచించి, అనుష్టింపచేస్తుండేవి మన సంబంధిత ‘ఇజాలు’.

బుద్ధిజానికి ప్రధానమైనవి ‘పంచశీల నియమాలు’. అవి పూర్తిగా మానవతా ధర్మాన్ని ప్రవచించినవి. సృష్టిలోని ప్రాణులన్నింటిపట్ల దయ, ప్రేమ చూపుతూ, ఎట్టి హింసకు తావివ్వరాదన్నది బుద్దిజం యొక్క నిబద్ధ సూత్రం. దాని అత్యున్నత ఆదర్శాలయిన ‘భూత దయ, ‘అహింస’ – బుద్ధిజాన్ని ప్రపంచవ్యాప్తం చేశాయి.

‘హిందూ యిజ’ మతతత్వం మానవుడి ఇహలోక జీవితం పట్ల కంటే పరలోక జీవన సుఖాల గురించి, స్వర్గలోకంలో నిర్వికల్పంగా ఉండి సమస్త సృష్టినీ రక్షిస్తుంటాడనే భగవంతుని అస్థిత్వం గురించీ బోధిస్తుంది. పరలోకాన్నీ, భగవంతుణ్ణి చేరుకోవడానికి మానవుడు నిబద్ధతతో అనుసరించాల్సిన ధర్మాల్నీ, అనుష్టించాల్సిన పూజలు, వ్రతాలు, యజ్ఞయాగాల్ని సూత్రాలుగా ప్రవచించింది. ఈ ప్రక్రియల్ని మనుషులు పూర్తిగా విశ్వసించి, ఆచరించేందుకు వేదోపనిషత్తులు, ఆరణ్యకాలు, సంహితలు ఎంతో సహాయపడ్డాయి.

హిందూయిజం భారతీయులకు అందించిన మేళ్ళలో ఒకటి – చాతుర్వర్ణ వ్యవస్థ! వృత్తి సంబంధ విభజన చిహ్నాలుగా వర్ణాలు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. అయితే ఒక రకపు వృత్తులవారు అధికులనీ, మరో విధమైన వృత్తిదారులు హీనులనీ విభజించడమెందుకు? తమ తమ వృత్తి నిర్వహణలతో సమాజపు అవసరాలన్నిటినీ తీర్చుతున్నవారి శ్రమను ఓ ప్రక్కన దోచుకోవడం, మరోపక్కన వారిని హీనవర్ణులనడం… భగవత్సేవలో భాగమవుతుందా యిదంతా?

ప్రప్రథమంగా 16వ శతాబ్దంలో ఫ్రాన్సులో ప్రారంభమయిన పారిశ్రామిక విప్లవం క్రమంగా వృద్ధి కాసాగింది. అయితే ఈ అభివృద్ధి క్యాపిటలిజానికి ఊపిరులూదింది. ఏమైనప్పటికీ ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ తన ముందున్న భూస్వామ్య వ్యవస్థకంటే కొన్ని విధాలుగా మెరుగైనది. క్యాపిటలిజం బలపడి వృద్ధి చెందడానికి లక్షలాది పారిశ్రామిక కార్మికుల నిరంతర శ్రమ కారణభూతమవుతూ, అదే సమయాన నిరంతర దోపిడీకి గురికాసాగింది. తీవ్ర అసమానతలకు, శ్రమ దోపిడీ, దారిద్య్రాలకూ గురవుతూ ఆగ్రహించిన బడుగు వర్గ ఫ్రెంచి ప్రజలు ఒక్కసారిగా పిడికిళ్ళెత్తి ఫ్రెంచి విప్లవానికి దిగారు. విప్లవం విజయమివ్వలేకపోయినా అసమానతా వ్యవస్థల మీదికీ, దోపిడీ విధానం మీదికీ మొట్టమొదటిదిగా ప్రపంచ ప్రజల దృష్టిని మరల్చింది. అవి రూపుమాపడం కోసం పోరాటం జరపాలన్న సంకల్పాన్ని ఖచ్చితంగా కలిగించింది.

పైన చెప్పినవాటికి మించిన దుర్భర పరిస్థితులున్న రష్యా దేశంలో కామ్రేడ్‌ లెనిన్‌ నాయకత్వంలో అనుచర కార్యకర్తలందరూ ఏకమయ్యారు. అద్భుత దార్శనిక శక్తితో (విజన్‌), కార్యాచరణతో, ప్రజా సందోహాలను పోరాట బాట పట్టించారు. 1917 అక్టోబర్‌లో ప్రజా విప్లవం విజయమైన వెంటనే సోషలిస్టు సమాజ నిర్మాణానికి పునాదులు వేశారు. క్రమరీతిని శ్రమిస్తూ, సమసమాజ సంకల్పాన్ని ‘నిజం’ చేశారు. అలా, అప్పుడు రూపుగట్టిన సమసమాజ నిర్మాణానికి పునాదిరాయి అయినదే మార్క్సిజ సిద్ధాంతం! విశేష విషయం ఏమిటంటే – లెనిన్‌, కార్ల్‌మార్క్స్‌ సమకాలికులవ్వడం. ఇద్దరూ రహస్యంగా  వీలయినంత తరచుగా కలిసి చర్చలు సాగిస్తుండేవారు. నాటి సమాజ అంతర్గత వైరుధ్యాలను పరిశీలించి, గమనించి ఆ వైరుధ్యాల ఆసరాతోనే అసంతృప్త ప్రజా బాహుళ్యాలను పోరాట స్థాయికి ఎదిగేలా చేయగల పద్ధతుల గురించి చర్చిస్తుండేవారు.

మానవ జాతుల, సమూహాల అవతరణ ప్రారంభమయిన కాలంనుండీ నేటివరకూ మానవులు అవలంబిస్తూ వచ్చిన జీవన విధాలను గురించి, అందుకు వారు జరిపిన పోరాట విధానాల గురించి విశ్లేషణాత్మక చర్చలు సాగిస్తుండేవారు.

రష్యా సమసమాజ అవతరణకు మూలమైన మార్క్సిజం ప్రస్తుత కాలం వరకూ మార్పు చెందుతూ వచ్చిన సంఘ వ్యవస్థల విశ్లేషణల ఫలితమే. ఆదిమ మానవుడు మొదలు ఆధునిక మానవుడి వరకూ ఒకటి తర్వాత ఒకటిగా కొత్త రీతి సంఘ వ్యవస్థలను నిర్మించుకుంటూ వస్తున్నాడు. ఒక్కో వ్యవస్థ, ముందు దానికంటే మెరుగైందిగా పరిణామం చెందుతోంది. ఆదిమ సమాజం విచ్ఛిన్నమైన తర్వాత భూస్వామ్య వ్యవస్థ, దాని తర్వాత క్యాపిటలిస్టు వ్యవస్థ… అలా ఒకటి తర్వాత మరొకటి కొంత మెరుగైన రీతిలో

ఉనికిలోకొచ్చాయి. పరిణామ క్రమం పరిస్థితుల్ని మెరుగుపరుస్తుంటుంది.

క్యాపిటలిజం ఫ్యూడల్‌ వ్యవస్థకంటే బాగా మెరుగైన ఆర్థిక సాంకేతికాభివృద్ధిని తెచ్చినప్పటికీ దాంతోపాటు శ్రామిక వర్గాల శ్రమను పూర్వంకన్నా అనేక రెట్లు దోపిడీ చేయడం ప్రారంభించింది. కొంతమంది పెట్టుబడిదారులు అతి చౌకగా శ్రమ జీవుల శ్రమశక్తిని దోచుకుంటూ ఆర్థిక రంగ గుత్తాధిపతులు కాసాగారు. లక్షలాది శ్రామికులకు అంతులేని శ్రమ! కొంతమంది సోమరులకు అష్టయిశ్వర్యాలు, ఆర్థిక రంగ గుత్తాధిపత్యాలు! ఏ ఉత్పత్తి క్రియలతోనూ సంబంధం లేని నిష్క్రియాపరులు కోటీశ్వరులు, మిలియనీర్లు, దేశ సహజ వనరుల స్వంతదార్లు.

అసమానతలను, అన్ని రకాల దోపిడీలను అంతమొందించే సిద్ధాంతాలుగా యూరప్‌లో సోషలిజం, మార్క్సిజం పురుడుబోసుకున్నాయి. వీటి అభ్యుదయ సమతా గుణాలను స్వీకరించి, ఆచరణలో విజయవంతం చేసి చూపించింది సోవియట్‌ రష్యా. ఈ సందర్భంలో సమాజ పరిణామ క్రమం గురించి మార్క్సిజం చెప్పిన సింపుల్‌ ఉదాహరణనొకదాన్ని గుర్తు చేయడం అవసరమనిపిస్తోంది.

అదేమిటంటే… ఒక మొక్క పుట్టి పెద్దదవడానికి కారణమైన విత్తనాలు ఆ మొక్క బీజాల్లో

ఉన్నట్లుగానే, ఒక సాంఘిక వ్యవస్థ దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా కాక, గత వ్యవస్థలోనే అంతర్గతమై ఉంటాయంటుంది మార్క్సిజం. ఈ సిద్ధాంతాన్ని ఆంగ్లంలో హిస్టారికల్‌ డైలెక్టికల్‌ మెటీరియలిజమనీ, తెలుగులో చారిత్రక, గతితార్కిక భౌతికవాదమనీ వ్యవహరిస్తున్నారు.

అయితే ఇంతటి సర్వ సమతా వ్యవస్థను నిర్మించి సుదీర్ఘకాలం ఎంతో ఆదర్శనీయంగా నడిపించిన సోవియట్‌ దేశం ఎందుకిలా కుప్పకూలిందన్న ప్రశ్న అభ్యుదయ కాముకులను కలచివేస్తోంది. కర్ణుడి చావుకున్నట్లే రష్యా పతనానికీ అనేక దుష్ట కారణాలు తోడ్పాటయ్యాయి.

మొదటినుండీ అమెరికా, యూరప్‌లు రష్యా విచ్ఛిన్నత కోసం చెయ్యని కుట్ర అన్నది లేదు. రష్యాతో దశాబ్దాల తరబడి కోల్డ్‌వార్‌ సాగించాయి. ఉపగ్రహ ఆవిష్కరణల్లో, ఆధునిక యంత్ర ఆయుధాల తయారీలో రష్యాతో వాటికి ఎడతెగని పోటీ. ఆ దేశంలోని ప్రజలకు, వ్యక్తిగత స్వేచ్ఛ అన్నది లేదనీ, వారికి ప్రపంచంతో సంబంధం లేని విధంగా ఐరన్‌ కర్టన్‌ అమలవుతోందనీ ఒకటే దుష్ప్రచారం.

రష్యాలో ఏర్పడిన కొన్ని పరిస్థితులు ఈ విధమైన ప్రచారానికీ, వ్యతిరేక తీవ్రతకూ ఆస్కారమిచ్చాయి. సమ సమాజమేర్పడిన అనంతరం దేశంలోని అన్ని వ్యవస్థలు, వ్యవసాయ, పరిశ్రమ రంగాలూ వ్యష్టిస్వామ్యం నుంచి సమిష్టి స్వామ్యంగా మారాయి. ఇందుకు ఉదాహరణలు – మొదటివి సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు. సమైక్య కృషికి, ఆధునిక వ్యవసాయ పద్ధతుల అవలంబనలతో కొత్త రంగం మున్ముందుకు పోసాగింది. విద్యా సాంకేతిక నైపుణ్యాలలో మహిళలు చొరబడని చోటు అన్నది లేదు. కొత్త కొత్త కల్పనలతో, ఆవిష్కరణలతో పరిశ్రమల రంగం పరుగులు తీస్తోంది. పురుషులు మాత్రమే ఇంతవరకూ చేస్తున్న అన్నిరకాల పనులను మరింత సమర్ధంగా చేయసాగారు రష్యన్‌ వనితలు. బస్సు డ్రైవర్లు, లారీ డ్రైవర్ల స్థాయి నుంచి పైలెట్లుగా, అంతరిక్ష వ్యోమగాములుగా ఆకాశమ్మీదికి ఎగిరివెళ్ళి సురక్షితంగా తిరిగొచ్చేశారు. ప్రపంచ దేశాల్లో ప్రప్రథమంగా అంతరిక్ష యాత్రను జయప్రదంగా నిర్వహించిన ఖ్యాతి రష్యాదే. స్త్రీలలో ‘వాలెంటినా ధెరిస్కోవా’, పురుషుల్లో ‘గగారిన్‌’లు అంతరిక్ష మొదటి యాత్రికులు.

సమసమాజ అవతరణ తర్వాతి ఐదు దశాబ్దాల కాలం వరకూ రష్యన్‌ సోవియట్‌లు అన్ని రంగాల్లోను నెరిపిన అభివృద్ధి కృషికి మరే దేశమూ ధీటు కాలేకపోయిన మాట అక్షరాలా నిజం.

విచిత్రమూ, విషాదకరమేమిటీ అంటే 1990ల నాటి కాలానికి అంతటి ఆ అపూర్వ అభివృద్ధి క్రమమూ తిరుగు ముఖం పట్టడం! ఆదిలో పౌరులలో పెల్లుబికిన సమైక్య భావన, సమష్టి బాధ్యతా స్పృహ క్రమంగా బలహీనపడసాగాయి. ఉమ్మడి బాధ్యత’ వ్యక్తిగత బాధ్యతనీ, శ్రద్ధాసక్తుల్నీ తగ్గించడం మొదలుపెట్టింది. బాధ్యతారాహిత్య ధోరణి పెరుగుతూ, ఉత్పత్తి రంగాల్ని దెబ్బతీస్తుండడంతో దేశ ఆర్థిక స్థితి క్షీణించసాగింది. ఈ పరిస్థితులు, ధోరణుల కారణంగానే సమ సమాజ విచ్ఛిత్తి జరిగిపోయిందన్నది ప్రముఖ ఆర్థికవేత్తలందరి అభిప్రాయం.

లోతుగా, దూరదృష్టితో యోచించాల్సిన మరొక విషయం సమసమాజ విశిష్ట ప్రయోజనాల పరిజ్ఞానం ప్రజలకందడం. దీనిపట్ల పాలకులు ఏ మాత్రం శ్రద్ధ వహించలేదని తెలుస్తోంది. ఇందుకు బదులు ప్రజలపై పూర్తిగా రూళ్ళకర్రతో క్రమశిక్షణ రుద్దబడినట్లుగా తెలియవచ్చింది. ప్రజల ఈ చైతన్య రహిత స్థితి సమసమాజపు ఉనికిని దెబ్బతీసి ఉంటుంది.

సోవియట్‌ రష్యా పతనం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న పెట్టుబడిదారీ దేశాల ఆకాంక్షలు నెరవేరేందుకు ఇటీవల రష్యన్‌ పాలకుల విధానాలు బాగా తోడ్పడ్డాయి. స్టాలిన్‌ తర్వాత పాలకులలో అంతర్గత విభేదాలు, అధికార వ్యామోహాలు, అక్రమ సంపాదనలు, బంధుప్రీతి మొదలైన నికృష్ట పరిణామాలు వచ్చి చేరాయి. శత్రు రాజ్యాల దుష్ప్రచారాలను ఇవి నిజం చేశాయి. ఈ దుర్లక్షణాలు బ్రెజ్నేవ్‌ హయామునుంచే మొదలై రాన్రాను అధికమయ్యాయి. ఇంక ఆ తర్వాత ఎల్సిన్‌, గోర్బచేవ్‌ల లాంటి విభీషణులు క్యాపిటలిస్టు శక్తులకు పూర్తిగా దాసోహమయ్యాయి.

ఈ సందర్భంగా గమనించవలసిన ముఖ్య విషయం ఒకటుంది. డెబ్భయ్‌ ఏళ్ళ అపూర్వ సమత, సమైక్యతతో పురోగమించిన రష్యన్‌ సమాజం పతనమవడానికి మార్క్సిస్టు సిద్ధాంతపర లోపం అనడం ఎంత మాత్రమూ సరికాదు. ప్రజా జీవన ప్రగతి పట్ల అంకిత భావం కొరవడిన కుక్కమూతి పిందెలు కొందరు భ్రష్టుపట్టించారు.

కొందరు మన ప్రభుత్వ నేతలూ, మరికొందరు రాజకీయ దళారులూ మార్క్సిజం, దాని సమతా సిద్ధాంతం విఫలమయిందనీ, ప్రజలకిప్పుడు ఏ ఇజంతో పనిలేదనీ, పనికిరాదనీ ఒకటే విధంగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. వీళ్ళందరి ఉద్దేశ్యం రష్యన్‌ విప్లవ యోధులు, కోట్లాది పీడిత ప్రజలను చైతన్యపరచి, విప్లవ పోరాట బాటకు నడిపించిన ఉదంతం నిజంకాదు అబద్ధమనా? నిరంకుశ నియంతలపై విజయం సాధించడం నిజం కాదనా? ప్రగతిశీల సమతా జీవనరీతిని సుదీర్ఘకాలం ఆచరణాత్మకం చేసిన మార్క్సిజం పనికిమాలినదనీ, ప్రజాస్వామ్యం పేరుతో చెలామణి అవుతున్న ఆధిపత్య ధనస్వామ్యమే గొప్ప ప్రయోజనకారి సుమా అని బోధించడమా? ఈ దేశం నాది, ఈ నేల నాది, దీని సహజ వనరులూ, సంపదలన్నీ నావి అంటూ పిడికిళ్ళెత్తి వాటిని లూటీ చేస్తున్న బకాసురులపై, ప్రజలు పిడికిళ్ళెత్తడం నిష్ప్రయోజనమనా?

ప్రజాస్వామ్య పాలనంటూ మోతమోగుతూ, నేలహంతక ముఠాలు ప్రజాప్రతినిధులై కుట్రలూ, కుహకాలతో దేశాన్ని పూర్తిగా దోచుకోవడమే ప్రజలకుపకారమూ, ప్రయోజనకరమా? ఇవి మొత్తం ప్రజల చైతన్య సమైక్యతలను అణగద్రొక్కే ప్రేలాపనలు. దేశప్రజల పోరాట పటిమను నీరుగార్చి, అణగద్రొక్కి విదేశీ బహుళ కార్పొరేట్‌ సంస్థలకు సకల సదుపాయాలు సమకూర్చుతూ, దేశ సహజ వనరులు, సంపదలన్నింటినీ అప్పగించి, జాయింటు దోపిడీలకు పూనుకునే పథక రచనలకు  వ్యతిరేకంగా పోరాడడమే ఈనాటి అవసరం.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.