గృహిహింస నిరోధక చట్టం 2005 అమల్లోకి వచ్చి పది సంవత్సరాలు కావస్తోంది. భారతదేశంలో అనూహ్యంగా పెరుగుతున్న గృహహింస, రూపాలను మార్చుకుంటూ స్త్రీల జీవితాలను సంక్షోభమయం చేస్తోంది. పోలీస్ స్టేషన్‌లకు, రక్షణాధికారి కార్యాలయానికి వస్తున్న బాధిత మహిళల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తన ఇంట్లోనే, తన వారివల్లే, ముఖ్యంగా భర్తలవల్ల హింసించబడుతున్న స్త్రీలు పరిహారాల కోసం, సమస్యల పరిష్కారాల కోసం పోలీస్ స్టేషన్‌ల చుట్టూ, రక్షణాధికారుల ఆఫీసుల చుట్టూ తిరుగు తున్నారు. కేసు కోర్టులకెళ్ళాక న్యాయం కోసం అక్కడ పడిగాపులు గాస్తున్నారు. గృహి హింస నిరోధక చట్టం 2005 ప్రకారం ఆయా కేసులమీద తీర్పులు 60 నుండి 90 రోజుల్లో ప్రకటించాల్సి ఉండగా రకరకాల కారణాల వల్ల సంవత్సరాల తరబడి ఈ కేసులు కోర్టుల్లో మగ్గుతున్నాయి. న్యాయ వ్యవస్థలో
ఉన్న జెండర్ ఇన్సెన్సిటివిటీ, స్త్రీల అంశాల పట్ల అవగాహనా లేమి వల్ల గృహ హింస నిరోధక చట్టం 2005 అందిస్తున్న తక్షణ పరిహారాలేవీ సకాలంలో బాధిత స్త్రీలకు అందడంలేదు.
ఈ అంశాలన్నింటినీ పరిగణన లోకి తీసుకుంటూ చట్టం అమలులోకి వచ్చి దశాబ్ద కాలం గడిచిన సందర్భాన్ని కూడా గుర్తిస్తూ భూమిక గృహ హింస నిరోధక చట్టం అమలు తీరు ఎలా ఉంది? ఏ పద్ధతిలో అమలవుతోంది అనే అంశాన్ని తీసుకుని 2016 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల (అప్పట్లో)లోను ఒక అధ్యయనం జరిపింది. చట్టం అమలులో భాగస్వామ్య మున్న సంస్థల్ని, వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. పోలీసులు, రక్షణాధి కారులు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థలు, న్యాయ సేవాధికారులు, బాధిత మహిళలు – వీరందరినీ ఇంటర్వ్యూ చేసి విషయాలను రాబట్టి, వాటిని క్రోడీకరించి అధ్యయన నివేదికను తయారు చేయడం జరిగింది.
సంబంధిత భాగస్వాములందరి సమక్షంలో అధ్యయన నివేదికను విడుదల చేయాలని భావించి 2017 ఫిబ్రవరి 14వ తేదీన (One Billion Rising Campaign సందర్భంలో) రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించాం. యూసఫ్‌గూడాలోని ”నిమ్స్‌మే” (నిస్సియట్)లో ఈ సమావేశం జరిగింది. చట్టం అమలులో కీలకపాత్ర పోషిస్తున్న మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి, డైరెక్టర్‌లను, పోలీసు అధికారులను, న్యాయ సేవాధి కారుల్ని, డి.వి.కేసుల్ని విచారించే న్యాయమూర్తుల్ని ఆహ్వానించాం. అందరూ వస్తామని నమ్మబలికారు. కానీ ఒక్కరూ రాలేదు. వేదిక మొత్తం ఖాళీగా ఉండిపోయింది. ఎవరిముందైతే అధ్యయన నివేదికను విడుదల చేద్దామనుకున్నామో వారెవరూ లేకుండానే ఖాళీ వేదిక సాక్షిగా రిపోర్ట్‌ను విడుదల చేశాం. వేదిక ఖాళీగా ఉన్నప్పటికీ వేదిక ముందు మాత్రం మేము ఆహ్వానించిన వారందరూ ఉన్నారు. స్వచ్ఛంద సంస్థలు, యాక్టివిస్ట్‌లు, న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.
సమావేశం ప్రారంభిస్తూ సత్యవతి గృహహింస నిరోధక చట్టం అమలు గురించి చేసిన అధ్యయన నివేదికను అందరికీ తెలియచేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. భూమిక హెల్ప్‌లైన్, గృహహింస నిరోధక చట్టం 2005 మొదలై పదిసంవత్సరాలైన సందర్భంగా భాగ్యస్వామ్య సంస్థల అందరి అభిప్రాయాలు తీసుకుని ఏ మార్పులు వచ్చాయి, ఎలా అమలు జరుగుతోందనే విషయంపై జరిగిన ఈ అధ్యయనం మొత్తంగా ఎలా జరిగిందో ప్రశాంతి వివరించారు.
అధ్యయన నివేదికను సరిత పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అందరికీ వివరించారు. అంతే కాకుండా అధ్యయనం ఎక్కడ, ఎవరితో, ఎలా జరిగిందో చెప్పారు. ఎవరెవరు ఎలా స్వందించారో వివరంగా చెప్పారు సరిత.
ప్రశాంతి మాట్లాడుతూ ”పోలీసులకు డి.వి.చట్టం గురించి వివరాలు తెలియదు. వాళ్ళ పాత్ర ఏంటో వాళ్ళకే స్పష్టంగా లేదు. ఈ వైఖరితో బాధితులు గందరగోళంలో పడుతున్నారు. కుటుంబంలో హింసను భరిస్తూ సర్దుకుపోవడమో లేక పూర్తిగా విడిపోవడమో చేస్తున్నారు. ఇది మంచి విషయం కాదు. ఈ చట్టం అమలుకి నోడల్ సంస్థ అయిన స్త్రీ, శిశు అభివృద్ది శాఖ వారు చట్టం అమలులో భాగస్వామ్య సంస్థలైన వారందరికీ – పోలీసులు, జడ్జిలు, సర్వీసు ప్రొవైడర్లు అందరికీ శిక్షణనివ్వాలని అన్నారు. సత్యవతి మాట్లాడుతూ ”యాక్ట్ వచ్చిన కొత్తలో సర్వీస్ ప్రొవైడర్లను నియమించారు. ప్రారంభంలో వారు బాగా యాక్టివ్‌గా పనిచేసినప్పటికీ డిపార్ట్‌మెంట్ వైఖరితో వారు కూడా పనిచేయడం మానేశారు. ప్రస్తుతానికి వారిని ఉంచుతారో లేదో ప్రశ్నార్ధకమైపోయింది. సర్వీస్ ప్రొవైడర్ ఎంత బాగా పనిచేస్తే ఈ చట్టం అంత బాగుంటుంది.
ఉదాహరణకు కేరళలో ‘భూమిక సెంటర్’ పేరుతో వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్లు (OSCC) చాలా బాగా నడుస్తున్నాయి. డి.వి. సెల్‌ను, శీరషషను వేరు చేయాలి. సర్వీస్ ప్రొవైడర్ల వ్యవస్థను కొనసాగించాలి” అన్నారు.
లాయర్ ముజీబ్ కుమార్ మాట్లాడుతూ ”యాక్ట్ వచ్చిన కొత్తలో చాలా ఉత్సాహం ఉండేది. బాధితురాలు రాగానే అదే రోజు కోర్టు నుండి ఆర్డర్ తెచ్చేవాళ్ళం. ఇప్పుడు నెల రోజులు పడుతోంది. శాఖల మధ్య సమన్వయం లేదు. కోర్టులలో పని భారం పెరిగింది. అందుకే ప్రత్యేక కోర్టులు కావాలి. రక్షణాధికారులకు, కోర్టులకు మధ్య సమన్వయం లేదు. ఒక్కో కేసు ఐదు సంవత్సరాలు తీసు కుంటున్నారు. దీనివల్ల బాధిత మహిళలకు చట్టంమీద నమ్మకం పోతోందని” అన్నారు.
లాయర్ శేషవేణి మాట్లాడుతూ ”మధ్యంతర ఉత్తర్వులు, మెయింటెనెన్స్, రెసిడెన్షియల్ ఆర్డర్లు తెచ్చుకోవడం చాలా కష్టంగా
ఉంది. 2013లో రిజిస్టరయిన కేసులో ఆమె 13 సార్లు కోర్టుకు వస్తే కానీ మెయింటనెన్స్ ఆర్డర్స్ రాలేదు, అదీ చాలా పరిమితంగా ఇచ్చారు. బాధితులను అనుమానంగా చూడడం, ఆర్డర్స్‌పై హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం, జడ్జిల నిర్లక్ష్య ధోరణి మనకున్న ప్రస్తుత సవాళ్ళు. దీనికిగాను ప్రత్యేక కోర్టులు కావాలి. జడ్జిలకు, లాయర్లకు సెన్సిటివిటీని పెంపొందించే విధంగా శిక్షణ ఉండాలి. సామాజిక దృక్కోణంలో భాగంగా వారికి సమాజం పట్ల, బాధితుల పట్ల సరైన అవగాహన పెంపొందేలా శిక్షణ అవసరం” అని అభిప్రాయపడ్డారు.
విజయభాస్కర్, శాంతిప్రియ, నీరజ… వీరంతా భోపాల్‌లోని శీరషషను సందర్శించి వచ్చారు. ఈ సందర్భంగా వారి అనుభవాలను పంచుకుంటూ ఈ కేంద్రంలో జ్యూరిస్‌డిక్షన్‌తో సంబంధం లేకుండా కేసు రిజిస్టర్ చేసుకోవడం అన్నది చాలా ఉపయోగకరంగా ఉందన్నారు. భోపాల్ సెంటర్‌లో మెటీరియల్ దగ్గర నుండి విధివిధానాలు, సమాచారం మొత్తం చాలా వివరంగాను, బాధ్యతాయుతంగానూ ఉన్నాయి. ఈ మొత్తంలో అక్కడ సమన్వయకర్త అంటే కో-ఆర్డినేటర్ పాత్ర చాలా ఉందని చెప్పారు.
ఎన్‌సిఆర్‌బిలో డి.వి. కేసులు నమోదు కావట్లేదన్న విషయంపై చర్చిస్తూ వీటిని ఎన్‌సిఆర్‌బి రికార్డుల్లో ఏ విధంగా రికార్డు చేస్తున్నారనేది చూడాలని, అన్ని కేసులు రికార్డయ్యేలా ఎన్‌జివోలు అందరూ కలిసి కృషి చేయాలని కళామణి అన్నారు.
గోపరాజు సుధ మాట్లాడుతూ ”డి.వి. బాధిత మహిళల నేపథ్యమేంటి? కులం, వర్గం, చదువు వంటివన్నీ చూడాలి. యస్‌సి, యస్‌టి సబ్‌ప్లాన్‌లలో ఈ చట్టానికి సంబంధించి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. మైనారిటీ కమిషన్‌లో వాళ్ళకి న్యాయ సహాయం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేయాలి. జెండర్ బడ్జెటింగ్ ఏమైనా వుందా అనేది చూడాలని అన్నారు.
అమన్‌వేదిక నుండి వచ్చిన అనూరాధ మాట్లాడుతూ ”గర్భిణి మహిళలు, ప్రసవానంతర మహిళల కోసం డి.వి. చట్టంలో మార్పు గురించి చూడాలి. అనాధ, ఒంటరి మహిళలకు సంబంధించిన సమస్యల గురించి కూడా ప్రస్తావించాలి. శీరషషలో సంరక్షణ గృహాలను కలిపి ఉంచాలని” అన్నారు.
సి.డబ్ల్యు.ఎస్ నుండి మందాకిని మాట్లాడుతూ ”డి.వి. సెల్స్‌కి వచ్చే అన్ని కేసులలో డి.ఐ.ఆర్ చెయ్యాలి కానీ చెయ్యట్లేదు. డి.ఐ.ఆర్ చేసిన కేసులనే కోర్టులకు పంపుతున్నారు. 2004 తర్వాత డేటా అందుబాటులో లేదు. రివ్యూ మీటింగులు జరగడంలేదు. సర్వీస్ ప్రొవైడర్లను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వానికి తెలియదు. రాష్ట్ర విభజన తర్వాత సర్వీస్ ప్రొవైడర్ల విభజన జరుగలేదు. ప్రస్తుతం వీరు యాక్టివ్‌గా కూడా లేరు. దీనంతటి వల్ల బాధితులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్‌జివోలను ప్రభుత్వం చూసే దృష్టి కోణం మారాలి. కన్వర్జెన్స్ మీటింగులకు మహిళా, శిశు అభివృద్ది శాఖ వారు రావాలి. వారితో కలిసి మనం పనిచేయాలనుకున్నపుడు మనకు సమాన బాధ్యత, గౌరవం ఇవ్వకపోగా, సరైన సమయంలో సహాయం కూడా చేయడంలేదు. వారితో కలిసి ఎలా ప్రయాణం చేయాలో అర్థం కావడం లేదు” అని అన్నారు.
సామాజిక కార్యకర్త దేవి మాట్లాడుతూ ”ఇప్పుడు చేసిన స్టడీలాంటిది మండలానికి పది శాంపిల్స్ చొప్పున అన్ని మండలాల నుండి తీసుకుంటే కానీ చట్టం అమలు స్థితిపై సరైన అవగాహన రాదు. స్త్రీలపై జరిగే హింసపట్ల సమాజానికి సరైన అవగాహన లేదు. ప్రతికూల పరిస్థితుల మధ్య మనం పనిచేస్తున్నాం. కుటుంబ హింస కొత్త కొత్త పద్ధతులలో జరుగుతోంది. Marital Rape అనేది సమాజం దృష్టిలో ఒక సమస్య కాదు. ఇది చాలా ఎక్కువగా జరుగుతోంది. ఇది స్త్రీలకి సంబంధించి ఎవరికీ చెప్పుకోలేని నరకం. దీని వల్ల భర్త దగ్గరకు వెళ్ళం అన్నప్పుడు కౌన్సిలర్లు వారితో మరింత జాగ్రత్తగా మాట్లాడి కేసు నమోదు చేయాలి. అయితే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడం ప్రభుత్వానికి ఇష్టముండదు. దేశంలోని 316 స్వదార్ హోమ్స్‌కు ప్రభుత్వం 13 కోట్లు ఇచ్చింది. కొత్తవి లేవు కానీ ఉన్నవాటికి బడ్జెట్ పెంచాలి” అని అన్నారు.
చివరగా ప్రశాంతి మాట్లాడుతూ ”సాంప్రదాయ వివాహ వ్యవస్థను డి.వి. చట్టం విచ్ఛిన్నం చేస్తోంది, అలా జరక్కూడదు అన్నట్లుగా అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి కానీ స్త్రీ పట్ల సహానుభూతితో సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు. IAS, IPS, Judiciary శిక్షణ సిలబస్‌లో Gender sensitivityను భాగం చేయాలని మనం కోరుతున్నాం. సఖి (OSCC) సెంటర్లను, డి.వి. సెల్స్‌ను విడివిడిగానే ఉంచాలి. ప్రభుత్వం పూర్తిస్థాయి రక్షణాధికారుల్ని నియమించాలని అన్నారు. ఈ రోజు మన మధ్య జరిగిన చర్చ ఆలోచింపచేసే విధంగాను, స్ఫూర్తిదాయకంగాను ఉంది. రాష్ట్ర స్థాయిలో సర్వే చేయాలని ప్రభుత్వాన్ని కోరదామని అన్నారు.
సమావేశంలో చాలా చక్కటి చర్చ జరిగింది. భూమిక నివేదిక ద్వారా సభ ముందుంచిన తీర్మానాలు, రికమండేషన్స్‌కి అదనంగా మరికొన్నింటిని సభలో పాల్గొన్నవారు జత చేయడంతో సమగ్రమైన తీర్మానాలు రూపొందాయి. సభలో ఆమోదించిన తీర్మానాలను కూడా అధ్యయన నివేదికకు జోడించి, పూర్తి నివేదికను సంబంధిత అధికారులకు ఇవ్వాలని తీర్మానించాం.
ఆద్యంతం ఎంతో స్ఫూర్తివంతంగా సాగిన ఈ సభలో సత్యవతి సమావేశానికి రాని అధికారులందరికీ పేరుపేరునా కొంచెం కోపంగాను, కొంచెం హాస్యంతో కూడిన కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణాకి సఖి సెంటర్లు తొమ్మిది మంజూరయ్యాయని, వాటి నిర్వహణ బాధ్యత TISS వారికి ఇస్తారని తెలిపారు. ప్రభుత్వ వైఖరి ఎలా ఉన్నా, తోడ్పాటును ఇచ్చినా, ఇవ్వకున్నా మనం నిరాశపడకుండా మరింత ఉత్సాహంగా మనం ఈ అంశాలను ముందుకు తీసుకువెళ్తూ మరింత శక్తివంతంగా అందరూ పనిచేద్దామని అన్నారు. ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియచేశారు.
స్త్రీల అంశాల పట్ల, వారి సమస్యల పట్ల ప్రభుత్వాధికారుల వైఖరి ఎలా ఉందో ఈ సమావేశం అద్దం పట్టింది. ప్రభుత్వ సంస్థలకి, వ్యవస్థలకి జెండర్ సెన్సిటివిటీ మీద ఎంత పెద్ద ఎత్తున శిక్షణనివ్వాలో అర్థమైన సందర్భమది. ప్రభుత్వాధికారులు రాకపోయినప్పటికీ సమావేశం అత్యంత ఉత్తేజపూరితంగా, విశ్లేషణాత్మకమైన చర్చల మధ్య జరిగింది. స్త్రీలపై హింసని వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ”శతకోటి ప్రజాగళం” One Billion Rising సందర్భంలో ఈ సమావేశం జరగడం సందర్భోచితంగా ఉంది. ఈ సమావేశానంతరం అందరం ”శతకోటి ప్రజాగళం” కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడానికి నెక్లెస్ రోడ్‌కి ప్రయాణమవ్వడంతో ‘నిమ్స్‌మేలో’ సమావేశం ముగింపు కొచ్చింది.
చాలా బాగుంది