తెలతెలవారుతోంది. కాంతి లేచి అప్పటికే గంటయింది. అత్తగారు లేచేసరికి పనంతా పూర్తి చేయాలని హడావుడి పడుతోంది. తన పనిలో నిమగ్నమై ఉండగానే అత్తగారు వచ్చిందని గట్టిగా అరిచేవరకు తెలియలేదు. ఏమీ చూడనట్లు కూర్చున్నావు, టీ ఇవ్వాలని తెలియదా అంది అత్త. కన్నీళ్ళను దిగమింగుకుంటూ అత్తగారికి టీ చేసి ఇచ్చింది. రోజూ ఇదే తంతు. ఈ హింస రోజురోజుకీ పెరుగుతోంది కానీ తగ్గడంలేదు. ఇది తన సహనానికి పరీక్ష. ఈ రోజు ఎన్ని దెబ్బలైనా, తిట్లయినా భరించాలనుకుంది. ఏదో ఒకవిధంగా పక్కింట్లో ఉంటున్న పిన్ని ఇంటికి పెళ్ళికి వెళ్ళాలనుకుంది. ఈలోగా భర్త లేచి ఒళ్ళు విరుచుకుంటూ, తన పోలీసు దర్పం ఒలకబోసుకుంటూ గదిలోంచి బయటకు వచ్చాడు. ఆయనకు సపర్యలు మొదలుపెట్టింది కాంతి. ఇంటిపని, వంటపని త్వరగా పూర్తి చేసి మూడేళ్ళ బాబుని తయారుచేసి, తానూ తయారై అత్తగారి అనుమతి కోసం చూస్తోంది కాంతి. ఏ మూడ్‌లో ఉందో కానీ ఆమె ‘ఫో’ అని అనుమతి ఇచ్చింది. రానున్న ఉపద్రవం తెలియని కాంతి బిడ్డని చంకనెత్తుకుని పిన్ని ఇంటికి పెళ్ళికి వెళ్ళింది. అక్కడ పండగ వాతావరణం చూసి తన బాధలన్నీ మర్చిపోతున్న తరుణంలో ఆమె భర్త వచ్చాడు. అందరిముందూ కాంతి తల్లిదండ్రులను దుర్భాషలాడుతూ, కాంతి జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ ఇంటికి లాక్కెళ్ళాడు. ఈ హింస ఇక చాలు, ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకున్న కాంతి తనకు తెలిసిన ఒక మహిళా సంఘాన్ని ఆశ్రయించింది. వారు తన భర్తకు కౌన్సిలింగ్ ఇస్తారని, అతను మారతాడని అనుకుంది. మహిళా సంఘం వారు ఒక తేదీని చెప్పి ఆ రోజు భర్తను తీసుకుని రమ్మన్నారు.
కౌన్సిలింగ్ కోసం బయల్దేరిన కాంతికి గత స్మృతులు ఒక్కొక్కటి గుర్తుకొచ్చాయి. నాలుగేళ్ళ క్రితం పిన్ని ఇంట్లో తనకి పెళ్ళి చూపులు జరిగాయి. ఆ రోజే తాంబూలాలు తీసుకున్నారు. ఏ యింట తన వైవాహిక జీవితానికి నాంది పడిందో ఆ యింటే తన భర్త చేతిలో అంతులేని హింసకు, అవమానానికి గురైంది. తన తల్లిదండ్రులు రెండెకరాలు అమ్మి రెండు లక్షల కట్నమిచ్చి లక్ష రూపాయలతో ఇంటి సామగ్రి కొని, వారి స్థోమతకు మించి ఘనంగా పెళ్ళి చేశారు. అయితే ఆ పెళ్ళి మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. పెళ్ళిపందిరిలోనే అత్తగారి నిజస్వరూపం బయటపడింది. పెళ్ళికి ముందు మెత్తగా మంచిగా మాట్లాడిన ఆమె పెళ్ళి జరుగుతుండగానే ఏర్పాట్లు బాగోలేదని, తగినట్లుగా లేవని అలిగి వెళ్ళిపోయింది. తాను చూసుకుంటానని చెప్పి భర్త తనను ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇక అక్కడినుంచి కాంతికి కష్టాలు మొదలయ్యాయి. ఎన్నో ఆశలు, కలలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన కాంతికి చేదు అనుభవం ఎదురైంది. కాపురానికి వచ్చిన కొద్దిరోజుల్లోనే అత్త, భర్త హింసించడం మొదలుపెట్టారు. కొట్టడం, బూతులు తిట్టడం.. భరించలేకపోయింది. పెద్దల దగ్గర తన గోడు వెళ్ళబోసుకుంది. దీంతో పెద్దలు పంచాయతీకి పిలిచారు. అక్కడ తన భర్త తనను క్షమించమంటూ కాళ్ళావేళ్ళా పడ్డాడు. పొరపాటు సరిదిద్దుకుంటానన్నాడు. ఇక తనకు మంచి జరుగుతుందని భావిస్తూ మళ్ళీ కాపురానికి వచ్చింది. తన ఆశలు అడియాసలే అయ్యాయి. కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి. పోలీసుననే దర్పంతో హింసను రెట్టింపు చేశాడు. ఇంతలో తాను తల్లిని కాబోతున్నానని తెలుసుకుంది కాంతి. బాబు పుట్టిన తర్వాత భర్త మారతాడనుకుంది కానీ బాబుతోపాటు ఇంకో రెండు లక్షలు కావాలన్నాడు. దీపావళికి కానుకలు కావాలన్నాడు. అత్త, భర్త కలిసి వేరే సంబంధమైతే పది లక్షలు వస్తాయంటూ రోజూ హింసించడం మొదలుపెట్టారు. ఏదో ఒక వంకన కొట్టడం, తల్లిదండ్రులను తిట్టడంతో శారీరకంగా, మానసికంగా అలసిపోయింది.
మహిళా సంఘానికి కౌన్సిలింగ్ కోసం భర్తను తీసుకుని తమ్ముడితో పాటు వెళ్ళింది. వారు కాంతికి, ఆమె భర్తకి కౌన్సిలింగ్ ఇచ్చారు. తన భర్త అన్నింటికీ ఒప్పుకున్నాడు. కాంతి తన తమ్ముడి ద్విచక్ర వాహనంపైన, ఆమె భర్త మరో వాహనంపైన తిరిగి ఇంటికి బయల్దేరారు. దారిమధ్యలో కాంతి, ఆమె తమ్ముడు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆమె భర్త బలంగా ఢీకొట్టాడు. దాంతో ఇద్దరూ కింద రోడ్డుమీద పడిపోయారు. చాలా దెబ్బలు తగిలాయి. కౌన్సిలింగ్‌కి తీసుకువెళ్ళినందుకు నానా బూతులు తిడుతూ కాంతి భర్త ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ, తన్నుకుంటూ లాక్కెళ్ళాడు. చుట్టూ ఉన్న జనం అతనికి అడ్డుపడి కాంతిని, ఆమె తమ్ముడ్ని రక్షించారు.
ఏం చెయ్యాలి? తనకు ఎవరు అండగా ఉంటారు అని మధనపడుతుంటే తనకు తెలిసిన వాళ్ళు భూమిక హెల్ప్‌లైన్ గురించి చెప్పగా ధైర్యం చేసి కాల్ చేసింది. వారు ఆ కాల్‌ని నాకు ట్రాన్స్‌ఫర్ చేశారు. భూమిక కలెక్టివ్ ఇచ్చిన ధైర్యంతో, నేనిచ్చిన శేషవేణి అడ్వకేట్ సలహాతో కాంతి న్యాయపోరాటం చేస్తోంది. భర్తపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
2013లో గృహ హింస చట్టం క్రింద కేసు పెట్టింది. కాంతికి, ఆమె బాబుకి ఐదు వేల రూపాయల ఇన్టెరిమ్ మెయింటెనెన్స్‌ను కోర్టు గ్రాంట్ చేసింది. దానిపై భర్త అప్పీలు వేశాడు కానీ పై కోర్టు దాన్ని కొట్టేసింది. ణహజ ఇంకా నడుస్తోంది. క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది కానీ పోలీసులు ఇంకా ఛార్జిషీట్ ఫైల్ చేయవలసి ఉంది.
కాంతి లాగా కుటుంబాల్లో హింసని ఎదుర్కొంటున్న స్త్రీల కోసం, వారి రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమే గృహహింస నిరోధక చట్టం 2006. ఈ చట్టం 2006లో అమలులోకి వచ్చినా చాలా మందికి దీని గురించిన అవగాహన లేక ఇళ్ళల్లో తీవ్రమైన హింసని భరిస్తున్నారు. ఈ చట్టం కింద బాధిత స్త్రీలకి ఎన్నో పరిహారాలున్నాయి. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళక్కర లేదు. ఈ చట్టం అమలు కోసం స్త్రీ శిశు అభివృద్ధి శాఖ ఒక వ్యవస్థను రూపొందించింది. అక్కడ ఒక రక్షణాధికారి, ఇద్దరు కౌన్సిలర్‌లు ఉంటారు. బాధిత స్త్రీ అక్కడికెళ్ళి పిటీషన్ ఇస్తే చాలు ఆమె తరుపున రక్షణాధికారి కోర్టులో కేసు ఫైల్ చేసి ఆమెకు రావల్సిన పరిహారాలను ఇప్పిసారు. బాధిత స్త్రీ ఇంట్లో జరిగిన హింసకు సంబంధించి ”డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్” (డి.ఐ.ఆర్) ఫైల్ చేస్తారు. కోర్టు విచారించి ఆమె రక్షణకు సంబంధించిన ఆర్డర్‌తోపాటు, పిల్లల కస్టడి, మెయింటెనెన్స్ తదితర ఆర్డర్లను కూడా ఇస్తుంది. ముఖ్యంగా ఈ చట్టం కల్పించిన నివాస హక్కుకు సంబంధించిన ఆర్డర్‌ను కూడా ఇస్తారు. అంటే ఆమె భర్తతో కలిసి ఉన్న ఇంట్లోనే ఉండే విధంగా ఆమెకు ‘నివాసహక్కు’ (Right to Residence)ను కల్పించారు.
గృహహింసను ఎదుర్కొంటున్న స్త్రీల కోసం ఇంత చక్కటి చట్టం అమలులో ఉన్నప్పటికీ సరైన ప్రచారం లేక బాధిత స్త్రీలు దీనిని ఉపయోగించుకోలేకపోతున్నారు. అందుకే తాము చేసిన చట్టాల గురించి పెద్దస్థాయిలో ప్రచారం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.