1. నువ్వు నవ్వుకుంటావని తెలుసులే నాకు
అయినా నేను ఊహించుకొనటాన్ని ఆపను
చచ్చిపడ్డ డేగరెక్కలు నా భుజంపై అతికించుకున్నట్లు,
మా ఇంటిపై నేను గాలిలో గిరికీలు కొట్టినట్టు ఊహించటం నాకెంత ఇష్టమో
నేను మరింతగా ఊహించగలను తెలుసా
చిన్నప్పుడు మా అమ్మ వెలిగించే పొయ్యిలో సూర్యుణ్ణి తెచ్చి ఉంచాలనుకున్నాను
మరి అప్పుడు
ఆమె పొగగొట్టంతో గాలి ఊది అలసిపోదు కదా
2. మా చూరుకు వేళ్ళాడే లాంతరులో
ఒక చంద్రుణ్ణి ఉంచితే ఎంత బాగుండుననుకున్నా
గులేరు దెబ్బకి ఒక్క చంద్రుణ్ణి కూడా పడగొట్ట లేకపోయేవాన్ని
ఇంటి ఎదురుగా డబల్ రొట్టె చెట్టు మొలిచినట్టు,
నాన్న చొక్కా మరిప్పుడు చిరగనిదై ఉండేట్టు ఊహించగలిగాను…
ఇంకా
బడి ముందు జామకాయలమ్మే ముసలమ్మ
మళ్ళీ బతికి వచ్చినట్టు కూడా
3. నిజమే చిన్నప్పుడు ఊహించుకోవటం
ఎంత బాగుండేదో తెలుసా…
చీకటిలో భయపడనట్టు,
మరణం తర్వాత దేవుణ్ణి కలిసినట్టు..
గాలిపటం అంచులు పట్టుకొని దిగంతాల దాకా కొంగలబారుతో ముచ్చటిస్తూ ఎగిరినట్టూ
మరింతగా…!
నాన్నని సైకిలెక్కించుకుని బజారంతా తిప్పినట్టు…
ఒకనాడైతే నేను నా జేబులనిండా డబ్బులున్నట్టు, తినటానికి ప్రతీరోజూ అన్నం ఉన్నట్టుగా ఊహించాను
ఆనాడైతే ఎంత ఆశ్చర్యమో…!
మరి ఊహ ఎంత బావుండేదో కదా
4. ఇప్పుడు కూడా నేను ఊహించగలుగుతున్నాను
ఈ రాతిరి వేళ రోడ్డు పక్క చెట్టుకింద కూచుని నాతో నువ్వు మాట్లాడినట్టు
ఆ చెక్కిలి మీద ఒక రక్తం మరకని,
నీ భుజాన ఉన్న తుపాకీని తాకినట్టు
తడిలేని నది ఒడ్డున
ఒకానొక నిశ్శబ్ద సమయాన
నా సమాధి నిద్దురలోనుంచి నువ్వు నన్ను మేల్కొలిపినట్టు ఊహించుకుంటాను
ఊహ ఉత్తదే అంటావు గానీ…
మరి నీకు తెలుసా? అతి చిన్నదే అయినా ఊహ నిజమైతే కలిగే ఆనందం ఏమిటో…
ఇప్పుడు నేనేం ఊహిస్తున్నానో
మరి తెలుస్తోందా నీకు… గ్రహించగలిగావా నువ్వు…