మగువ చేయలేని పని మరి ఎక్కడ లేదంట
అవకాశాలన్నింటిని అందిపుచ్చుకుంటు
ఆకాశంలో సగమైనా అహరహం శ్రమిస్తూ
నవచైతన్యానికి ‘అతివ’ నాందియై నిలుస్తోంది
కుటుంబ విలువలను కూర్మితో కాపాడుతు
ఆత్మవిశ్వాసంతో అందనంత ఎదుగుతూ
మంచి, చెడులలోని మర్మ మెరిగి మసలుతూ
మనసుకు నచ్చిన వ్యాపకంతో ‘వనిత’ అధిగమిస్తోంది
మమకారం, మానవత్వం మహిళ సొంతమే కదా!
రాబోయే తరాలకు రాజీలను నేర్పుతూ
అవనిలా, సివంగిలా అలవోకగ మారుతూ
మారుతున్న కాలానికి మార్గమై వెళుతోంది
ఇష్టా అయిష్టాలను ‘ఇల’ లా భరిస్తూ
నిష్టూరపు మాటలు నీడలా, వెంటాడినా
పెడసరపు మాటలన్ని పెళ్ళలై పడినా
గుప్పెడంత గుండె తోడుతో నిలుస్తోంది
కష్టాలు, కన్నీళ్ళు కవలల్లా వెంటాడినా
బుజ్జగిస్తు, భుజం చరుస్తు అన్నీ తానై నిలుస్తూ
మునుముందు చూపులతో ముదిత ముందుకెల్తోంది
అవకాశాలు వెతుక్కుంటు అహర్నిశలు శ్రమిస్తూ
అందనంత ఎత్తుకెదగాలను ఆలోచనలతో
కదం, కదం కదుపుతూ, అసమానతల నధిగమిస్తూ
ఆలంబన కల్పిస్తూ, నిత్యాన్వేషణతో నీరెండలా సాగుతోంది
అడుగడుగున మగవాడు ఆటంకాలు కల్పించినా
స్వప్రయోజనాలకు సమిధలా వాడినా
ఒంటరిగా కనపడితే తుంటరి వేషాలు వేసినా
తనను తాను నిలుపుకొంటు తగిన బుద్ధి చెబుతూ
పడిలేచే కెరటంలా పయనిస్తోంది నిత్యము