అసలు నీవేం అనుకుంటున్నావ్?
ముఖం మీద నీవు చేసిన గాయం
మేకప్ తోనో మాస్క్ తోనో మాయంచేయొచ్చు
ఒంటిమీద కమిలిపోయిన చర్మాన్ని
చీరతోనో, దుప్పటితోనో కప్పుకొని మరల్చవచ్చు
కాళ్లకో చేతులకో అంటిన నెత్తుటి మరకల్ని
ఎక్కడో తగిలిన దెబ్బలని అబద్ధాలు ఆడవచ్చు
కానీ… కళ్ళకు కనబడని నా లోపలి హృదయానికి
తగిలిన గాయానికి ఏ లేపనాలు పూసి ఏమరల్చగలను?
అకారణంగా మీదకు ఉరికివచ్చే పిడిగుద్దులు
విచక్షణను కోల్పోయి తన్నుకువచ్చే బూతుపురాణాలు
నన్ను అత్యంతంగా ప్రేమించానని చెప్పిన నీ ప్రేమైక
మూసీ నోటినుండి ధారాళంగా రాలి పడటం…
నా మెదడుకు హైఓల్టేజి షాక్ నిచ్చింది
మౌనంగా ఉంటున్నానని
మారు మాట్లాడటం రానిదాన్నని
ఎప్పటికీ నీ కసాయితనాన్ని నమ్మే గొఱ్ఱెనని
నీవు బాగానే ఊహించగలవని తెలుసు
మను గీతలు గీసుకున్న నక్కవని కూడా తెలుసు
అయినా… నువ్వు కథలల్లినట్లుగా
పరువు కోసమో! మర్యాద కోసమో!
అమ్మా, నాన్నలు దుఃఖిస్తారనో!
అక్కా, చెల్లెళ్ళ పెండ్లిళ్లు కావనో!
వెక్కెక్కి ఏడుస్తూ కాళ్ళు పట్టుకొని
నీవు ఛీ!.. పొమ్మని తన్ని నెట్టివేసినా…
చూరు పట్టుకొని వెళ్లాడుతానని
పురుషహంకారంతో ఇన్నాళ్లు
విర్రవీగుతూ వస్తున్నావ్!…
పిల్లల్ని మోయలేక… బలహీనమై
నీ హింసోన్మాదంలోనే మిగిలిపోతానని
పాపం… భ్రమల్లో ఉన్నట్లున్నావ్?
ఓ శక్తివంతమైన ఆలోచన నుండి ఎదుగుతూ
నిన్ను తిరస్కరిస్తూ ప్రశిస్తున్నాను?
నీవేం చేసినా పడివుండే కట్టు బానిసను కాను
నేనిప్పుడు పడిలేచిన కెరటాన్ని!
ముళ్ల సంకెళ్లను తెంచుకున్న విహంగాన్ని!
ఆది అంతాలను కలిపే ఓ సరళరేఖను!
భవబంధాలను తెంపుకున్న స్వేచ్ఛాగీతాన్ని!
ముట్టుకోవాలని చూడకు… మాడి మసైపోగలవ్!