ఈ నెల 14న శ్రీమతి వకుళాభరణం లలిత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడంతో తెలుగు సమాజం, ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లోనూ అణగారిన వర్గాలకు చెందినవాళ్ళంతా ఒక శ్రేయోభిలాషినీ, సంస్కర్తనీ, స్నేహితురాలినీ కోల్పోయారు. పదిహేనేళ్ళకు పైగా ఆమె నిర్విరామ కృషిని చాలా దగ్గరగా చూసిన నాలాంటి వాళ్ళకి ఆమె మన మధ్య లేకపోవడం వల్ల ఏర్పడే వెలితి ఎంత తీవ్రమైనదో అర్థమవుతూ ఉంది. ఆ వెలితి త్వరలో పూడగలిగేది కాదని కూడా తెలుస్తూనే ఉంది.
డాక్టర్ వకుళాభరణం లలిత 1937లో ప్రకాశం జిల్లా వెంకంపాడు అనే కుగ్రామంలో పుట్టారు. అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎమ్మే, ఆంత్రొపాలజీలో డాక్టరేట్ చేశారు. కావలి జవహర్ భారతిలో రాజనీతి శాస్త్రం బోధించారు. మధ్యలో కొన్నాళ్ళు తెలుగు అకాడమీలో కూడా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత సెంట్రల్ యూనివర్శిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు. ప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు వకుళాభరణం రామకృష్ణ గారితో అరవై ఏళ్ళ కిందట ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి 55 ఏళ్ళ ఆదర్శ దాంపత్యంగా కొనసాగింది.
డాక్టర్ లలిత జీవితకాల కృషి ఏ ఒక్క రంగానికో పరిమితమయింది కాదు. ఆమె కృషి చేసిన ప్రతి ఒక్క రంగంలోనూ ఆమె చేసిన ప్రయత్నాల్ని, సమాజానికి ఆమె అందించిన ఉపాదానాన్నీ మనమింకా అంచనా వేసుకోనేలేదు. అట్లాంటి అంచనా వెయ్యడం మొదలుపెడితే, అన్నింటికన్నా ముందు కలిగేది ఆశ్చర్యమే. ఒక్క మనిషి తన జీవితకాలంలో ఇంత బాధ్యత ఎట్లా నిర్వహించగలిగారా అని. ఉదాహరణకి, ప్రసిద్ధ రచయిత్రి జ్ఞానపీఠ పురస్కార స్వీకర్త మహాశ్వేతాదేవి తన జీవితం ఉత్తరార్థంలో బెంగాల్లో డీనోటిఫైడ్ తెగల గురించి కృషి చేశారని మనకు తెలుసు. డాక్టర్ లలిత ఆంధ్రప్రదేశ్లో విముక్త జాతులమీద చేసిన పరిశోధన, వెలువరించిన పుస్తకాలు, తక్కిన సమాజంలో వారిపట్ల రేకెత్తించిన జాగృతిని అంచనా వేసుకుంటే, ఆమె మహాశ్వేతీదేవి కృషికి సమానమైన, ఇంకా చెప్పాలంటే ఒక పాలు ఎక్కువే కృషి చేశారని అనిపిస్తోంది. పూర్వపు మద్రాసు రాష్ట్రంలోనూ, నైజాంలోనూ, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ విముక్త జాతుల కోసం నిర్వహించిన పునరావాస కేంద్రాలు కప్పరాళ్ళతిప్ప, సీతానగరం, సిద్ధాపురం, బిట్రగుంట, లింగాల, స్టువర్ట్పురాలను ఆమె స్వయంగా అధ్యయనం చేసి నేరస్థులుగా ముద్రపడ్డ 300 మందిని ఇంటర్వ్యూ చేసి, 1871 నుంచి పాత రికార్డులు తవ్వి తీసి, ఆ జాతుల మీదా, వారి సమస్యల మీదా ఆమె ప్రసరించిన వెలుతురు అసామాన్యమైనది. ఒక ప్రభుత్వ శాఖనో, లేదా ఒక విశ్వవిద్యాలయమో చేపట్టవలసిన పని ఆమె ఇద్దరు విద్యార్థుల్ని వెంటబెట్టుకుని చేశారంటే అనూహ్యంగానూ, ఆశ్చర్యంగానూ ఉంటుంది.
బహుశా ఆ కృషిలో ఆమెలో పూర్వ మహా సంస్కర్తల రక్తం ప్రవహిస్తూ ఉందనుకుంటాను. ఒక వీరేశలింగం, ఒక వెన్నెలకంటి రాఘవయ్య, ఒక దుర్గాబాయి దేశ్ముఖ్లతో మాత్రమే లలిత గారిని పోల్చగలననిపిస్తోంది. విముక్త జాతులతో పాటు, ఆమె దేవదాసీల పైనా, జోగినులు, బసివి, ఆడపిల్లలపైన, దొమ్మరిసానుల పైన, వేశ్యావృత్తిపైన కూడా మౌలికమైన, విశ్వసనీయమైన క్షేత్ర పరిశోధన చేశారు. నటరాజ రామకృష్ణ కృషిపైన సమగ్ర రచన చేశారు. ఇవన్నీ ఒక ఎత్తూ, ఆమె పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజనులపైన చేసిన పరిశోధన ఒక ఎత్తూ. అసలు ఆమె నాకు పరిచయం కావడమే ఆ పరిశోధనల సందర్భంగా. అటు శ్రీకాకుళం సవర వారి నుండి, ఇటు ఆదిలాబాద్ గోండుల దాకా ఆమె 18 గిరిజన తెగల నృత్యరీతుల మీద పరిశోధనలు చేయించారు. అది కూడా మెడికల్ లీవ్ పెట్టుకుని, ఎర్న్డ్ లీవ్ ఖర్చు పెట్టుకుని.
ఆమె గొప్ప గురువుల దగ్గర చదువుకున్నారు. కావలి విశ్వోదయంలో డి.ఆర్., యస్వీ భుజంగరాయ శర్మ, వేదుల సత్యనారాయణ శాస్త్రి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి, కె.వి.రమణారెడ్డి వంటి వారి దగ్గర. ప్రసిద్ద మానవ శాస్త్రవేత్త పి.కె.భౌమిక్ పర్యవేక్షణలో ఆమె పీహెచ్డీ చేశారు. ఇవికాక ఆమె ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యురాలు. ఆమెకీ, రామకృష్ణ గారికీ ఆ సంస్థతో జీవితకాల అనుబంధం. ఇవికాక అస్మిత, నవవికాస్ వంటి సంస్థల్లో ఆమెది క్రియాశీల పాత్ర. నిర్యాలో ఆదివాసీ విభాగానికి గౌరవాధ్యక్షురాలు. రొమిలాథాపర్, బిపిన్ చంద్ర వంటి చరిత్రకారులతో లవణం దంపతులు, ఎస్.ఆర్.శంకరన్, వెన్నెలకంటి రాఘవయ్య వంటి సంఘ ప్రేమికులతో కలిసి పనిచేసిన కృషి ఆమెది. ఒక స్త్రీని చదివిస్తే ఒక కుటుంబాన్ని చదివించినట్టనేది పాత మాట. ఒక స్త్రీని చదివిస్తే ఒక సమాజాన్ని చదివించినట్టనేది లలిత గారి జీవితం చెప్పే కొత్త మాట.
‘నా జ్ఞాపకాలు’ (2012) పేరిట ఆమె రాసుకున్న అనుభవ కథనం హైస్కూలు విద్యార్థులకి పాఠ్యగ్రంథంగా పెట్టవలసిన పుస్తకం. ఆమె ఇంగ్లీషులో మాట్లాడుతుండగా విని ఒక రాష్ట్ర గవర్నర్ ఆమెని ఐఎఎస్ ఎందుకు చేయలేదని అడిగాడట. ఆమె తల్లి విశాలాక్షమ్మ ఆమె డాక్టర్ కావాలనుకుంది కానీ డాక్టర్ లలిత తానొక పూర్తికాలపు సంఘ సేవకురాలు కావాలనే అనుకున్నారు. ఆమె ఒకచోట ఇలా రాసుకున్నారు. ‘సంఘసేవనే జీవిత పరమావధిగా ఎంచుకోలేకపోవడానికి కారణం ఒకవైపు కుటుంబ బాధ్యత, ఇంకోవైపు ఉద్యోగ బాధ్యత. అయినా వీథిలో అరుచుకుంటూ తిరుగుతున్న బుడబుక్కలవారు, ఒంటికి సరైన వస్త్రాలు లేక వేళకు తిండిలేక అలమటిస్తున్న యానాదులు, అలాగే సఫాయి కర్మచారులుగా వీథివీథినా తిరుగుతున్న చల్లా యానాది స్త్రీలు వీరందరూ నా దృష్టినుంచి ఏనాడూ తప్పించుకోలేదు… వేశ్యావృత్తిలో ఉన్న స్త్రీలు, వారు చూపిన మానవతా విలువలు నాలో ఇంకా ఇంకిపోలేదు.’ కానీ మన కాలంలో ప్రభుత్వమూ, సాంఘిక సేవా సంస్థలూ చేస్తున్న కృషికి డాక్టర్ లలిత చేసిన కృషి ఏ మాత్రమూ తక్కువ కాకపోగా, చాలాసార్లు, నాబోటి ప్రభుత్వోద్యోగులకు ఆ కృషి నుంచి ప్రభుత్వం నేర్చుకోవలసిందే చాలా ఉందని అనిపిస్తున్నది కూడా.
తన జ్ఞాపకాలు తలుచుకుంటూ ఆమె ఒకచోట ఇలా రాశారు. ‘ఆనాటికీ, ఈనాటికీ అదే జీవితం, విశ్రాంతి లేని జీవితం, సుసంపన్నమైన జీవితం. ఆనాడు విశ్రాంతి లేని జీవితం గడపబట్టే ఈనాటికీ విశ్రాంతి లేని జీవితం అలవడింది. అందుకే ఒకరకంగా నాది సుసంపన్నమైన జీవితం అని చెప్పుకోవాలి’ అని.
బహుశా హాస్పిటల్లో ఉన్న ఈ చివరి మూడు వారాలూ విశ్రాంతి అనుకుందామా అంటే, రెండు రోజుల క్రితం రామకృష్ణ గారితో అన్నారట. ‘ఇక్కడ్నుంచి తొందరగా డిశ్చార్జి అయిపోతే, నేను స్త్రీల సమస్యల గురించి రాద్దామనుకున్న ‘వూంబ్ టు టూంబ్’ తొందరగా పూర్తి చేయాలి’ అని. ఆ పుస్తకమే కాదు, ఎరుకల వారిపైన ఒక బృహద్గ్రంథం కూడా ఆమె రాయాలనుకున్నారు. ఇంకా అంతకన్నా బృహత్ప్రణాళిక, తెలుగు రాష్ట్రాల్లోని 35 గిరిజన తెగలకు చెందిన స్త్రీల పైనా ఆమె ఒక సమగ్ర రచన తేవాలనుకున్నారు. మేమెప్పుడు కలుసుకున్నా ఆ పుస్తకం గురించే మాట్లాడేవారు. ఆ మాటలు వింటుంటే, యాంత్రొపాలజీలో ఏమ్మే చదువుతున్న ఒక యువతిని చూస్తున్నట్లుండేది.
‘ఊంబ్ టు టూంబ్’ సార్థకంగా జీవించిన అరుదైన మనిషి డాక్టర్ వకుళాభరణం లలిత.