గుజరాత్‌ ఫైల్స్‌ – రాణా అయూబ్‌ ఉమా నూతక్కి

గోధ్రా మారణహోమం జరిగి ఈ ఫిబ్రవరికి 15 సంవత్సరాలు. ఆర్తనాదాలకు పదిహేనేళ్ళు. నిస్సహాయ జీవుల కన్నీళ్ళకు పదిహేనేళ్ళు. సర్వం కోల్పోయి రోడ్డున పడిన బతుకులకు పదిహేనేళ్ళు. అహింస, శాంతి, పరమత సహనం ప్రబోధించిన జాతిపిత పుట్టిన రాష్ట్రంలో మానవతకే మచ్చగా మిగిలిన అమానవీయ మతోన్మాద శక్తుల పదఘట్టనకు పదిహేనేళ్ళు. భిన్న భాషలు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులతో విరాజిల్లుతూ సెక్యులర్‌ వ్యవస్థకు ప్రపంచ మార్గదర్శిగా ఉన్న భారతావని మహోన్నత చరితకు కళంకం మిగిల్చిన సంఘటన అది. ఆ హింసాకాండ తాలూకు గాయాలు ఇంకా మండుతూనే ఉన్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, కమిటీలు, కమిషన్లు, కోర్టులు, కేసులు, నివేదికలు… ఇవేవీ నిజమైన బాధ్యులెవరో తేల్చకుండానే ఒకటిన్నర దశాబ్దం గడిచిపోయింది. ఈ నేపధ్యంలో వచ్చిన సంచలనాత్మక పుస్తకం ఈ నెల మీకు పరిచయం చేయబోతున్న ‘గుజరాత్‌ ఫైల్స్‌’. అత్యంత సాహసోపేతమైన ఇన్వెస్టిగేషన్‌ జర్మలిజంలో సాహసాలు చేస్తూ తన పరిశోధనలను ప్రపంచం ముందుంచింది రాణా అయూబ్‌.

”గుజరాత్‌ ఫైల్స్‌” ఇటీవలి దేశ చరిత్రకు సంబంధించిన అతి కీలకమైన పరిణామాలను విస్ఫోటనాత్మకంగా స్పృశించింది. 2002లో గుజరాత్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లు, వాటితో ప్రమేయం

ఉన్న రాజకీయ వ్యక్తులు జాతీయ నాయకులుగా ఎదగడం వీటిని ఈ పుస్తకం ఒక ప్రత్యేక దృక్కోణంలో కథనం చేసింది.

పరిశోధనాత్మక కథనాలకు ప్రసిద్ధి చెందిన తెహల్కా ఉద్యోగిగా రాణా అయూబ్‌ పాఠకలోకానికి సుపరిచితమే. అమిత్‌ షా జైలుకు వెళ్ళడానికి కారణమైన కథనాలు కూడా ఆమెవే. గుజరాత్‌ ఫైల్స్‌లో ప్రత్యేకంగా ఆకర్షణీయమైన కథాంశం కానీ, రచన శైలి కానీ మనకు కనిపించదు. కథనం కూడా దాదాపుగా పదిహేనేళ్ళుగా మనం చదువుతున్నవే. అయితే పుస్తకంలో రాణా అయూబ్‌ పొందుపరచిన అనేక చిన్న చిన్న సంగతులు, అధికారులతో జరిపిన ముచ్చట్లు, వాటంతట అవే కొత్త కోణాలను, ఆసక్తికరమైన సంఘటనలను మన ముందు తేటతెల్లం చేస్తాయి. రాణా అయూబ్‌ జరిపిన స్టింగ్‌ సంభాషణలే ఈ పుస్తకానికి ప్రాణం.

గుజరాత్‌ హింసాకాండ సమయంలో దుండగుల మూకకు నాయకత్వం వహించినట్లు అభియోగం ఉన్న మాయా కొడ్నాని, గుజరాత్‌లో ఎటిఎస్‌ చీఫ్‌గా పనిచేసిన జి.ఎల్‌.సింఘాల్‌, 2002లో అహ్మదాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న పి.సి.పాండే, అప్పటి రాష్ట్ర డీజీపీ చక్రవర్తి… వీరందరితో జరిపిన సంభాషణలు, వాటిలో బయటపడిన వాస్తవాలు మన వెన్నులో వణుకు పుట్టిస్తాయి.

గుజరాత్‌లో జరిగిన నరమేధం దేశం ఎప్పటికీ మరచిపోదు. అక్కడ జరిగిన నకిలీ ఎన్‌కౌంటర్‌లు సంచలనాత్మకంగా నిలిచాయి. వీటన్నింటినీ కార్పొరేట్‌ మీడియా శక్తులు ఒకలా చిత్రీకరిస్తే, ప్రగతిశీల భావాలు కలిగిన కొన్ని పత్రికలు ఆ అల్లర్ల వెనుక ఉన్న చీకటి కోణాలను వెలికితీసే ప్రయత్నం చేశాయి. అదే బాటలో కఠినమయిన టాస్క్‌ని సాహసోపేతంగా పూర్తి చేశారు రాణా అయూబ్‌.

ఈ పరిశోధన పూర్తి కావడానికి రాణా తీసుకున్న సాహసం మాటల్లో చెప్పలేం. గుజరాత్‌లో అప్పటి పరిస్థితిలో ముస్లిం మహిళగా వెళ్ళడంలో ఉన్న సున్నితమయిన అంశాల్ని అధిగమించేందుకు మైథిలీ త్యాగిగా అవతారమెత్తారు రానా అయూబ్‌. తనని తాను ఒక సంస్కృత టీచర్‌ కూతురిగా పరిచయం చేసుకుంటూ ”మాయా కొడ్నాని” ఇంటికి వెళ్ళినప్పుడు అంతే అలవోకగా కొన్ని సంస్కృత పద్యాలను వల్లెవేయడం మనకు ముచ్చటగా అనిపిస్తుంది.

మైథిలీ త్యాగి పేరులో ఇంకా సహజత్వం కోసం మైక్‌ అనే ఒక అమెరికన్‌ విద్యార్థిని తన సహాధ్యాయిగా నియమించుకుని తనని తాను ఒక ఇండో అమెరికన్‌ ఫిల్మ్‌ మేకర్‌గా పరిచయం చేసుకుని ఎనిమిది నెలలపాటు సాగించిన ఒక అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ ఎన్నో సంచలనాత్మక విషయాలను ప్రపంచం ముందుంచుతుంది.

మోడీ హయాంలో జరిగిన ఎన్‌కౌంటర్లపై కొత్త కోణాలు బయటకు తెచ్చింది. సర్కారీ దౌర్జన్యాలతో పోలీస్‌ వ్యవస్థ ఎలా భాగస్వామ్యమయిందీ కళ్ళకు కడుతుంది.

వైబ్రెంట్‌ గుజరాత్‌పై డాక్యుమెంటరీ తీయడానికి వచ్చినట్లుగా చెప్పుకుంటూ అహ్మదాబాద్‌లో ఉంటూ అధికారులు, రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకుంటూ ఆమె ఈ అద్భుత పరిశోధన సాగించారు.

ఈ సంభాషణల ప్రకారం గుజరాత్‌ అల్లర్ల వెనుక అమిత్‌ షా ప్రమేయం ఉందని స్వయంగా హోం శాఖ కార్యదర్శే చెప్పారు. గెస్ట్‌హౌస్‌లో బందీగా ఉన్న కొంతమందిని హోం మంత్రి అమిత్‌ షా స్వయంగా ఎన్‌కౌంటర్‌ చేయించారని ఒక పోలీస్‌ అధికారి చెప్పారు. గుజరాత్‌ నరమేధంపై పలు దిగ్భ్రాంతికర సాక్ష్యాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. మైనారిటీలపై సంఘ్‌ పరివార్‌కి ఉన్న విద్వేషం ఈ సంభాషణల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటి రాజకీయ ప్రముఖుల్లో చాలామంది నుంచి, పోలీసు అధికారుల నుంచి పలు సాక్ష్యాలు సేకరించిన రాణా అయూబ్‌ చివరికి అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ

పేషీకి వెళ్ళడంతో పుస్తకంలో చివరి అంకం మొదలవుతుంది. ఆ తరువాత రోజే తనకు తెహల్కా నుంచి పిలుపు వచ్చిందని అంటారు రాణా. పరిశోధనను ఇక నిలిపివేయ వలసిందిగా స్పష్టమయిన ఆదేశాలు ఆమెకు ఇవ్వబడ్డాయి.

తెహల్కా లాంటి చిన్న పత్రిక అప్పటికే తన తాహతుకు మించి అనేక పరిశోధనాత్మక కథనాలను అందించింది. కానీ మైథిలీ త్యాగి అలియాస్‌ రాణా అయూబ్‌ చేసిన పరిశోధన చివరి అంకంలో తెహల్కా తన నిస్సహాయతతో ఆమెను వెనక్కి పిలిపించుకుంది.

చేసేదిలేక రాణా అయూబ్‌ తన పరిశోధనని తానే పుస్తకంగా వ్రాసి తానే ప్రచురించుకున్నారు. అయినా ”గుజరాత్‌ ఫైల్స్‌” పుస్తకాన్ని గుజరాత్‌ ప్రభుత్వం తొక్కేయాలని చూసింది. విడుదల కాకుండా చాలా ప్రయత్నాలు చేసింది. మెయిన్‌స్ట్రీం మీడియా ఈ పుస్తకం కవరేజ్‌ ఛాయలకి కూడా పోలేదు. అందులో కథనాలు సర్కారు కూసాలను కదిలిస్తాయని ప్రభుత్వం భయపడింది. అయినా ”గుజరాత్‌ ఫైల్స్‌” పుస్తకం మన దేశంలో ఇప్పుడు బెస్ట్‌ సెల్లర్స్‌లో ఒకటి.

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పుస్తకం చదవడం ఒక హింసాత్మక అనుభవం. వాక్యాల వెంట నడుస్తుంటే మన పెదవులు వణుకుతాయి. అంతులేని నిస్త్రాణ ఆవహించి పుస్తకం పూర్తయ్యేసరికి భయభ్రాంతులవుతాం. స్వయంగా అశ్వాల నోట్లోంచి వచ్చిన నిజాలు మనల్ని నిశ్చేష్టుల్ని చేస్తుంది. ఇందులోని విషయం 15 సంవత్సరాలుగా వింటున్నదీ, చదువుతున్నదీ అయినా మళ్ళీ మళ్ళీ మనల్ని కదిలించి వేస్తుంది.

“Truth is stranger than fiction, but it is bccause fiction is obliged to stick to possibilities, truth is not” అంటాడు మార్క్‌ ట్వైన్‌. నిజమే సత్యం కల్పనకన్నా చిత్రమైనది. నిజమెప్పుడూ అబ్బురపరుస్తూనే ఉంటుంది, అచ్చం గుజరాత్‌ ఫైల్స్‌లా…

 

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.