ఎర్ర సూరీడు గోదాలోకి దిగే ముందే
ఏదో ఒక అస్పష్టపు నీడ దుస్వప్నంలో కనపడి
అలజడి రేపుతోంది!
కోట్ల సంవత్సరాల పాత కథను
కొత్తగా మొదలు పెట్టడానికి సూర్యోదయాన్ని
పావుగా వాడుకుంటోంది.
సత్యాన్ని అసత్యం వేెపుగా
నాగరికాన్ని అనాగరికం వేపుగా
ముసుగు వేసుకుని మరీ, లిపి లేని చరిత్రని లిపిబద్దం చేస్తోంది!
ఒదిగిపోలేని మనస్తత్వాన్ని
కమ్మరి కొలిమిలో అచ్చు తీయాలని చూడటం
లోకం తీరింతేనని ఊసుపోని తనపు ఫర్మానాలను తిరిగి రాయడం
ఒక మోసపూరిత చక్రాన్ని ఎదుటి వాళ్ళ జీవితాల్లో
ప్రవేశ పెట్టడం ఇవాళ కొత్త కాదు.
నిశ్శబ్దానికి తంత్రుల కూర్పు అమర్చారేమో
విశ్వాసపు కుక్కలాగా ట్యూన్ చేసిన
అబద్ధాలనే చలికాలపు రాత్రులలో సాలెపురుగులా అల్లేస్తోంది!
కొత్తగా నిర్మించిన అబద్ధాల చరిత్రలన్నీ
విధ్వంసంలోంచి పుట్టినవే!
నాగులు దాక్కున్న మొదలి పొదలు
ఎంత సువాసనలు వెదజల్లినా
నాగుని విడిచి విషం ఎక్కడికి పోతుంది?
పలికించే మంత్రాలు పెదవులను కదిలించగలవేమో
కనిపించని అవమానాల గాయాల్ని
మచ్చ కాకుండా కాపాడగలవా!
అండ పిండ బ్రహ్మాండాల్ని వాకిట్లో పాతుకుని
అహం బ్రహ్మాస్మి అంటూ నీళ్ళు చల్లుకుని నిపమిలు దాచుకోగలమా!
బ్రతుకు భయంతోని గుండె పగుళ్ళిచ్చినట్టు
ఇంకా ఒణికిపోవద్దు… దీర్ఘ నిద్ర నుండి లేస్తేనే
అనంతం అంతమవని తనాన్ని
ఉరుములు మెరుపుల భీతావహాన్ని
చేజారకుండా పట్టుకోగలం ఆకాశం అంచులెంబడి నడుస్తూ!!